ట్రంప్‌కు డెమోక్రాట్ల తొలి దెబ్బ.. కీలక అధికారి అవుట్‌ | White House Cybersecurity Chief Resign For Recent Outages | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు డెమోక్రాట్ల తొలి దెబ్బ.. కీలక అధికారి అవుట్‌

Nov 20 2026 7:50 AM | Updated on Nov 20 2026 7:59 AM

White House Cybersecurity Chief Resign For Recent Outages

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మధ్యంతర ఎన్నికల ఫలితాలు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఇప్పటికే ప్రతినిధుల సభ, సెనేట్‌లో మెజారిటీ కోల్పోయిన రిపబ్లికన్ పార్టీకి ఇప్పుడు కీలక పదవుల భర్తీ విషయంలోనూ చిక్కులు ఎదురుకానున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా నేషనల్ సైబర్ డైరెక్టర్ సీన్ కైర్‌క్రాస్ తన పదవి నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. తొలుత ఆయన స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, అనంతరం ట్రంప్ ఆయనను తొలగించినట్లు వైట్‌హౌస్‌కు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పులు, అధికార సమీకరణాలపై చర్చ మొదలైంది.

నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించి ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ సాధించారు. దీంతో జనవరిలో కొత్త కాంగ్రెస్ కొలువుదీరిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయిలో సవాళ్లు పెరగనున్నాయి. ముఖ్యంగా కీలక ప్రభుత్వ పదవులకు అధ్యక్షుడు ప్రతిపాదించే అభ్యర్థులకు సెనేట్ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే నేషనల్ సైబర్ డైరెక్టర్ పదవికి కొత్త వ్యక్తిని నియమించడం ట్రంప్ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. డెమోక్రాట్లు సెనేట్‌పై పట్టు సాధించేలోపే కొత్త అధిపతికి ఆమోదం పొందాలనే ఉద్దేశంతో కైర్‌క్రాస్ ముందుగానే వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తొలుత యాక్సియోస్ కథనం వెల్లడించింది.

ట్రంప్ అసంతృప్తే కారణమా?
అయితే ఈ పరిణామంపై మరో ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. కైర్‌క్రాస్‌కు ఈ పదవిని నిర్వహించేందుకు తగిన అర్హతలు లేవని ట్రంప్ భావించినట్లు వైట్‌హౌస్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఏఎఫ్‌పీకి వెల్లడించారు. ఆయనను తొలగించాలన్న నిర్ణయానికి ట్రంప్ పూర్తి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో విమానయానం, బ్యాంకింగ్, మైక్రోసాఫ్ట్ సేవలు, జాతీయ భద్రతా వ్యవస్థలకు సంబంధించిన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో వరుస సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ సైబర్ భద్రతా వ్యవస్థపై విమర్శలు, ప్రశ్నలు పెరిగాయి. అదే సమయంలో సైబర్ విభాగంలో కీలక మార్పు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కిర్‌స్టెన్ డేవిస్‌కు బాధ్యతలు..
కైర్‌క్రాస్ స్థానంలో రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్‌స్టెన్ డేవిస్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సంబంధిత రంగంలో మెరుగైన అర్హతలు ఉన్నాయని, ఇప్పటికే సెనేట్ ఆమోదం కూడా పొందారని అధికారులు తెలిపారు. అయితే శాశ్వత నేషనల్ సైబర్ డైరెక్టర్ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం. జనవరి నుంచి సెనేట్ డెమోక్రాట్ల ఆధీనంలోకి వెళ్లనున్న నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదించే అభ్యర్థి ఆమోదం పొందడం కీలకంగా మారనుంది.

ట్రంప్‌కు ముందున్న సవాళ్లు ఇవే..
సైబర్ డైరెక్టర్ నిష్క్రమణ ఒక్కటే కాదు.. ట్రంప్ ప్రభుత్వానికి మరికొన్ని కీలక నియామకాల విషయంలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) అధిపతిగా ట్రంప్ ప్రతిపాదించిన మైఖేల్ లోసాపియో నియామకం కూడా సెనేట్‌లో ప్రశ్నలను ఎదుర్కొంటోంది. జనవరి నుంచి డెమోక్రాట్ల చేతికి సెనేట్ పగ్గాలు వెళ్లనున్న నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదించే కీలక నియామకాలపై వారి వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ విధానాలపై పర్యవేక్షణ, విచారణలు, నిధుల కేటాయింపులు వంటి అంశాల్లోనూ కొత్త కాంగ్రెస్‌తో ట్రంప్‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి.. మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పులు మొదలయ్యాయి. 

ఇదీ చదవండి: భారతీయులకు జనవరి 1 నుంచి వీసా–ఫ్రీ ఎంట్రీ బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement