షెన్‌జెన్ నగరంలో డొనాల్డ్ ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌ల త్రైపాక్షిక సమావేశం
అణ్వాయుధాల నియంత్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోని నేతలు
పశ్చిమాసియా పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇంధన భద్రతపై సంప్రదింపులు
అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని నిర్మించాలని జిన్‌పింగ్ పిలుపు
అంతర్జాతీయ శాంతిని కాపాడటంలో మూడు దేశాలకు బాధ్యత ఉందన్న పుతిన్
ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకురావాలని తేల్చిచెప్పిన ముగ్గురు నేతలు
బీజింగ్/షెన్‌జెన్: ‘‘మేము నిజంగా చరిత్ర సృష్టిస్తున్నాం’’అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భూమిపై ఉన్న అణ్వాయుధాల సంఖ్యను ఎలా తగ్గించాలి? ఆ ఆయుధాలను ఉపయోగించే పరిస్థితులను ఎలా నివారించాలి? అనే దానిపై తాము చర్చిస్తున్నామని తెలిపారు. గురువారం మధ్యాహ్నం చైనాలోని షెన్‌జెన్ నగరంలో డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్ సమావేశమయ్యారు.
ముగ్గురు నాయకుల మధ్య మొట్టమొదటిసారిగా జరిగిన ఈ చరిత్రాత్మక త్రైపాక్షిక భేటీ 90 నిమిషాలపాటు కొనసాగింది. అణ్వాయుధాల నివారణతోపాటు పశ్చిమాసియా పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ ఇంధన భద్రతపై చర్చించారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అభిప్రాయాలు పంచుకున్నారు. అయితే, అణ్వాయుధాల విషయంలో చర్చలకే పరిమితమయ్యారు. వాటిని నియంత్రించడంపై స్పష్టమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అమెరికా, చైనా, రష్యాలు అణుశక్తి సంపన్న దేశాలే కావడం గమనార్హం. ‘‘ప్రపంచ శాంతిని ప్రోత్సహించే అంశంపై చర్చలు జరపబోతున్నాం’’అని త్రైపాక్షిక సమావేశం ప్రారంభంలో జిన్‌పింగ్ అన్నారు.
ప్రాణాంతక అణ్వాయుధాలను నిషేధించాలని, వాటిని నిర్మూలించాలని తాను భావిస్తున్నట్లు జిన్‌పింగ్ తన సహచర నాయకులతో చెప్పారని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ ‘సీసీటీవీ’పేర్కొంది. అంతేకాకుండా, అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శాంతిని కాపాడటంలో మూడు దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని పుతిన్ తేల్చిచెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజేతలుగా నిలిచిన అమెరికా, రష్యా, చైనాలు ఈ బాధ్యతను తీసుకోవాలని, కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని ముగ్గురు నేతలు స్పష్టంచేశారు.
తైవాన్‌పై ట్రంప్, జిన్‌పింగ్ చర్చ
ముగ్గురు దేశాధినేతల త్రైపాక్షిక సమావేశంలో ప్రపంచ శాంతి, స్థిరత్వంతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముగ్గురి మధ్య ఏకాంతంగా జరిగిన ఈ భేటీ వివరాలను అధికారికంగా బయటకు వెల్లడించలేదు. అంతకంటే ముందు ట్రంప్‌తో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఏడాది వారిద్దరి మధ్య ఇది మూడో సమావేశం. ఇరాన్ యుద్ధంలో దాడులకు కేంద్రంగా మారిన హార్మూజ్ జలసంధి గుండా చమురును రవాణా చేయడంలో ఉమ్మడి ప్రయోజనాలను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా నుంచి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా జిన్‌పింగ్‌పై ఒత్తిడి తెస్తానని పేర్కొన్నారు. ట్రంప్ పాలనలో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ‘స్థిరంగా, మెరుగ్గా’ఉన్నాయని జిన్‌పింగ్ చెప్పారు. తైవాన్ అంశంపై ట్రంప్‌తో జిన్‌పింగ్ చర్చించారని, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాలు సంప్రదింపులు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.
సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలి
పుతిన్‌తోనూ ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ఏడాది అలాస్కాలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని నిలిపివేసేలా ఒప్పందానికి రాలేకపోయారు. ఆ చర్చలు విఫలమైన తర్వాత ఇరువురు నేతలు మళ్లీ సమావేశం కావడం ఇదే మొదటిసారి. దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘పుతిన్ నాకు మంచి మిత్రుడు. మా మధ్య చాలా ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి’’అని చెప్పారు. త్రైపాక్షిక భేటీ ప్రారంభానికి ముందు కూడా ట్రంప్ స్పందించారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వంటి దుష్ట ప్రపంచ సంస్థల నుంచి దేశాల సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకొనే మార్గాలపై తాము సంప్రదింపులు జరుపబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, త్రైపాక్షిక సమావేశం ఆశించిన స్థాయిలో జరగలేదని స్థానిక మీడియా పేర్కొంది. ట్రంప్ నిద్రమత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఒక వీడియోను చైనా టీవీ ప్రసారం చేసింది. ఎస్కలేటర్ పైకి ఎక్కడానికి జిన్‌పింగ్‌కు ట్రంప్ సహాయం చేస్తున్న వీడియో క్లిప్‌ను వైట్‌హౌస్ పోస్టుచేసింది. త్రైపాక్షిక భేటీని సానుకూలమైన, నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన సమావేశంగా జిన్‌పింగ్ అభివరి్ణంచారు.
టార్గెట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు
ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలను తీసుకురావడానికి, చమురు సరఫరాను పెంచడానికి, అణ్వాయుధ ముప్పులను తగ్గించేందుకు చర్చల్లో పాల్గొనడానికి చైనా, రష్యా, అమెరికాలు అంగీకరించాయని చైనా, రష్యాలు తెలిపాయి. త్రైపాక్షిక భేటీకి సంబంధించిన సారాంశాన్ని చైనా, రష్యా మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును మూడు దేశాలూ లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ కోర్టు విచారణల నుంచి ప్రభుత్వాధినేతలకు మినహాయింపు ఉండాలని, అలాగే అది తన అధికార పరిధిని దురి్వనియోగం చేయకూడదని అమెరికా, చైనా, రష్యాలు తేల్చిచెప్పాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్‌కోర్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసింది. ఇటీవల ఆ కోర్టుపై అమెరికా భారీ ఆంక్షలు విధించింది.
శాంతి దిశగా ఉమ్మడి ప్రకటన
త్రైపాక్షిక సమావేశం ముగిసిన అనంతరం అమెరికా, చైనా, రష్యా అధినేతలు ‘శాంతి దిశగా ఉమ్మడి ప్రకటన’ను జారీ చేశారు. ప్రపంచానికి నేడు ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకు రావాలని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, సరఫరాను పెంచాలని సూచించారు. నాలుగు సూత్రాల ఈ ప్రకటనలో.. అణు ప్రమాదాలను తగ్గించడం, అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడంపై చర్చలు జరపడానికి ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ అంగీకారానికి వచ్చారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుతోపాటు అటువంటి ఇతర సంస్థలు తమ పరిధిని దురి్వనియోగం చేయకూడదని తేల్చిచెప్పారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై లోతుగా చర్చించామని, వ్యూహాత్మక స్థిరత్వాన్ని, అంతర్జాతీయ భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. అణు యుద్ధంలో ఎవరూ గెలవలేరని, అలాంటి యుద్ధం ఎన్నటికీ చేయకూడదని ముగ్గురు నాయకులు స్పష్టంచేశారు. అణు ప్రమాదాలను తగ్గించడం, అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడంపై మూడు దేశాలు చర్చలు జరుపుతాయని జాయింట్ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచి్చనందుకు ట్రంప్, పుతిన్‌లు చైనాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, ఉక్రెయిన్–రష్యా యుద్ధం గురించి జాయింట్ డిక్లరేషన్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.


