విదేశీయుల అవకాశాల నిబంధనలు మరింత కఠినతరం
పీఈఆర్‌ఎం సర్టిఫికేషన్ నియమాలు కూడా..
కార్మికుల నియామక ప్రక్రియలో మార్పులు
అమెరికా నిపుణులు లేకపోతేనే విదేశీయులకు అవకాశాలు
అమెరికా కార్మిక శాఖ ప్రతిపాదన
సాక్షి, అమరావతి: విదేశీయుల అమెరికా డాలర్ డ్రీమ్స్‌కు డోనాల్డ్ ట్రంప్ సర్కారు మరిన్ని బ్రేకులు వేస్తోంది. ప్రధానంగా అమెరికాలో వృత్తి నైపుణ్యంతో కూడిన ఉద్యోగాల్లో విదేశీయులకు అవకాశాల నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా ఫిజికల్ థెరపిస్ట్‌లు, నర్సుల నుంచి సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లో అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ వరకు వివిధ కేటగిరీల ఉద్యోగాలకు ఈ నిబంధనలను వర్తించనున్నాయి. ఈ మేరకు గ్రీన్‌కార్డ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనలను రూపొందించింది.
ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ (పీఈఆర్‌ఎం) కింద ఇమిగ్రేషన్ వీసా ప్రక్రియను సవరించాలని ప్రతిపాదించింది. పీఈఆర్‌ఎం నిబంధనలను ఇరవై ఏళ్ల తరువాత సవరించాలని నిర్ణయించడం గమనార్హం.
సవరణల్లోని ప్రధాన అంశాలు..
» టైలరింగ్ సంబంధిత ఉద్యోగాల్లో విదేశీయులకు ఇక నుంచి అవకాశాలు ఇవ్వరు.
»ఎక్కువ నైపుణ్యం, ఎక్కువ పారితోషకాలు లభించే ఉద్యోగాల్లో అమెరికన్లకే పెద్దపీట వేయాలని నిర్ణయించింది. అందుకే ఆ ఉద్యోగాలను అమెరికన్లతోనే భర్తీచేసేందుకు కాల వ్యవధిని పెంచారు. ఇప్పటివరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం అమెరికన్లు దరఖాస్తు చేసేందుకు 30 రోజుల గడువుతో నోటిఫికేషన్లు జారీచేస్తున్నారు. ఆ గడువులోగా అర్హులైన అమెరికన్లు లభించకపోతే విదేశీయులను ఆ ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. ఈ 30 రోజుల గడువును 90 రోజులకు పెంచాలని ప్రతిపాదించారు. ఆ తర్వాతే ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో విదేశీయులకు అవకాశం కల్పించవచ్చు.
» ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కంపెనీల యాజమాన్యాలకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును రద్దుచేయాలని నిర్ణయించారు. కొన్ని ఉద్యోగాల భర్తీకోసం విదేశీయులు ఉత్తీర్ణత సాధించాల్సిన లేబర్ మార్కెట్ టెస్ట్‌ను కంపెనీల యాజమాన్యం అవసరమైతే రద్దుచేసేందుకు ఇప్పటివరకు అవకాశం ఉంది. దీంతో లేబర్‌మార్కెట్ టెస్ట్ నిర్వహించకుండానే విదేశీయులకు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. అయితే, ఇక నుంచి లేబర్ టెస్ట్‌ను రద్దుచేసేందుకు అవకాశంలేదు. విదేశీయులు ఇక నుంచి కచ్చితంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిందే.
» కంపెనీల యాజమాన్యాలు అమెరికాలో విదేశీ కార్మికులకు శాశ్వత నివాసం కోసం స్పాన్సర్ చేసేందుకు అవకాశం కల్పించే పీఈఆర్‌ఎం సర్టిఫికేషన్ నిబంధనలను కూడా కఠినతరం చేశారు. విదేశీ ఉద్యోగులను నియమించే ముందు తగిన అర్హతలున్న ఔత్సాహికులైన అమెరికా నిపుణులు అందుబాటులో లేరని ముందుగా తగిన ఆధారాలతో స్పష్టతనివ్వాలి. ప్రధానంగా గత రెండేళ్లలో అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిన కంపెనీలు కచ్చితంగా ఆ నిబంధనను పాటించాలి. అనంతరమే విదేశీ కార్మికుల కోసం పీఈఆర్‌ఎం సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలి.
» కంపెనీలు తమ సొంత నియామక ప్రక్రియను నిర్వహించేందుకు అవకాశం ఉండదు. అమెరికాలోని అన్ని కంపెనీలు విదేశీ ఉద్యోగులు, కార్మికుల నియామకం కోసం విధానపరమైన నియామక ప్రక్రియను పాటించాలి.


