వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
అగ్ని ప్రమాదం 300 కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది
వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల నష్టం జరిగింది
వేటకు వెళ్తే గాని ఇల్లు గడవని కుటుంబాలవి..
చంద్రబాబూ.. ఆ కుటుంబాలను ఆదుకోండి
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లించాలి
లేదంటే మా ప్రభుత్వం వచ్చాక ఆదుకుంటాం
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా కె.పల్లెపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని.. వలలు, వేట సామగ్రి కళ్లముందే కాలిపోయాయంటూ మత్స్యకారులు చెప్పిన మాటలు తనను కలిచివేశాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనతో 300 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని.. వేటకు వెళ్తే గాని ఇల్లు గడవని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను పలువురు మత్స్యకారులు కలిశారు.
అగ్నిప్రమాదం వల్ల భారీగా నష్టపోయామంటూ తమ సమస్యలు చెప్పుకున్నారు. వారికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పి.. భరోసా కల్పించారు. దీనిపై వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
పూర్తి నష్టపరిహారం చెల్లించాలి..
చంద్రబాబూ.. రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.


