పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లకు విఘాతం కలగకూడదు
పోలీసులు, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వినతి పత్రాలపై తగిన చర్యలకు నిర్దేశాలు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), కడప జిల్లా ఎస్పీకి హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్లకు ఎటువంటి విఘాతం కలగకూడదని స్పష్టంచేసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సమర్పించిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల, చక్రాయపేట, లింగాల, వేల్పుల, తొండూరు మండలాల పరిధిలోని 21 గ్రామాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో బుధవారం అత్యవసరంగా పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది తప్పుట నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘నామినేషన్ల దాఖలు సందర్భంగా తగిన భద్రత కల్పించాలని అభ్యర్థిస్తూ ఎన్నికల సంఘానికి, జిల్లా ఎస్‌పీకి పిటిషనర్లు వినతి పత్రాలు ఇచ్చారు. అయితే వీటిపై ఎటువంటి స్పందనా లేదు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు హింసకు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పోటీ చేసే అభ్యర్థులను, వారి అనుచరులను భయభ్రాంతులకు గురిచేయడం, నామినేషన్ కేంద్రాల వద్ద అలజడి సృష్టించడం ద్వారా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడానికి బయటి ప్రాంతాల నుంచికొంతమంది వ్యక్తులను పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి తరలించారు. అక్రమాలతో ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారు’ అని విన్నవించారు.
ఆ ఎంపీటీసీలకు తగిన భద్రత కల్పించండి
కడప జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పుల్లంపేట మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఇతర సభ్యుల పదవులకు జరగనున్న పరోక్ష ఎన్నికల్లో పాల్గొనే వారికి తగిన భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. భద్రత నిమిత్తం పిటిషనర్లు ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి ఉత్తర్వులు జారీ చేశారు. భీమిశెట్టి కళ్యాణి, ఆరగ వైష్ణవి, కొండేటి చంద్రకళ, పల్లెపు సుబ్రహ్మణ్యం, బోదనపు మహమ్మద్ వలీ, చంగనపల్లి సుజాత పుల్లంపేట మండలంలోని వివిధ ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
గురువారం నిర్వహించనున్న పుల్లంపేట మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఇతర సభ్యుల పదవుల పరోక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యాయి. అయితే అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో వీరు తగిన భద్రత కోసం పోలీసులకు వినతి పత్రాలు ఇచ్చారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఎన్నికల ప్రక్రియలో తాము స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా పాల్గొనేందుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, పోలీసులు తమ బాధ్యతలను నిర్వర్తించడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్లకు తగిన భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.


