సాక్షి, అమరావతి: ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన 659 మండలాల పరిధిలో గురువారం మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతోపాటు కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం మొత్తం 28 జిల్లాల్లో జెడ్పీ చైర్‌పర్సన్, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కొనసాగనున్నాయి. గురువారం మండల పరిషత్ కార్యాలయాల్లో జరిగే సమావేశాల్లో తొలుత ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత చేతులెత్తే విధానంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీని ఎన్నుకుంటారు.
అలాగే శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జరిగే సమావేశాల్లో ముందుగా జెడ్పీటీసీలు ప్రమాణస్వీకారంచేస్తారు. ఆ తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ముందుగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనవచ్చని అయితే, వారికి ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఉదయం 10 కల్లా నామినేషన్లు పూర్తి
మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి మండలాల్లో గురువారం ఉదయం 10 గంటల కల్లా నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుంది. 10 నుంచి 12 గంటల మధ్య రెండు గంటల పాటు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఒంటి గంట లోపు ఉపసంహరణకు వీలు కల్పిస్తారు. అన్ని మండలాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారు.
అనంతరం కో–ఆపె్టడ్ సభ్యుని ఎన్నికను నిర్వహించి సమావేశం వాయిదా వేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశాలు కొనసాగించి మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేదా ఇతర కారణాలతో ఎక్కడైనా కో–ఆపె్టడ్ సభ్యుని ఎన్నిక వాయిదా పడిన పక్షంలో 20న ఆయా ఎన్నిక చేపడతారు. జిల్లా పరిషత్‌లో శుక్రవారం(20వ తేదీ) జరిగే జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికల్లోనూ ఇదే టైం షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.


