వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల కొత్తపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ గూండాల దాడి
చంద్రబాబు డైరెక్షన్‌లో చెలరేగిపోతున్న పచ్చమూకలు
ఓటమి భయంతో బరితెగింపు.. అభ్యర్థులపై టీడీపీ గూండాల దౌర్జన్యం
పులివెందులలో పచ్చమూకల స్వైరవిహారం
రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో దాడులు.. వాహనాల ధ్వంసం
పల్నాడులో మహిళలపై పోలీసుల ప్రతాపం
బూటుకాలితో తన్ని, జుట్టు పట్టి ఈడ్చిన వైనం
పుంగనూరులో కార్లు ధ్వంసం.. నామినేషన్ పత్రాల చించివేత
రొంపిచెర్లలో కేంద్రం గేట్లకు తాళాలు.. దర్శిలో అభ్యర్థులకు బెదిరింపులు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: ప్రజాక్షేత్రంలో పెరుగుతున్న వ్యతిరేకతను స్థానిక ఎన్నికలు ప్రతిబింబిస్తాయనే భయంతో, ఎలాగైనాసరే దానిని కనబడనీయకుండా చేయాలన్న దుష్ట పన్నాగంతో చంద్రబాబు సాగిస్తున్న అరాచకాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. పురపాలక, పరిషత్ ఎన్నికల మాదిరిగానే ప్రజాస్వామ్యానికి పాతరేసి పల్లెలను కూడా కిరాయి ముఠాలు, టీడీపీ గూండాలు అతలాకుతలం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లే వేయకుండా నిలువరించాలని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం కూడా అనేక ప్రాంతాల్లో హింసాత్మకంగా మారింది.
పులివెందులలో పచ్చమూకల బీభత్సం!
వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో టీడీపీ గూండాలు పేట్రేగిపోయారు. వేముల మండలం చాగలేరు క్లస్టర్‌లో వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులను నామినేషన్ కేంద్రంలోకి వెళ్లనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుని రాళ్ల దాడికి దిగారు. వేములలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న సర్పంచ్ అభ్యర్థులను డీఎస్పీ మురళీనాయక్ అడ్డుకున్నారు. ఆయన సమక్షంలోనే టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి.

వైఎస్సార్ కడప జిల్లా వేములలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అడ్డుకుంటున్న డీఎస్పీ మురళీ నాయక్, వేంపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై పోలీసుల దాష్టీకం, చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ మూకల దాడి
వేంపల్లెలో బిడాలమిట్ట రోడ్డు వద్ద పోలీసులు అభ్యర్థులను నిలువరించడంతో మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ధర్నాకు దిగారు. కొత్తపల్లిలో టీడీపీ నేత పుష్పనాథ్‌రెడ్డి, ఆయన అనుచరులు నామినేషన్లను అడ్డుకున్నారు. సింహాద్రిపురం, బలపనూరు, మడ, లింగాల ప్రాంతాల్లోనూ ఇదే దౌర్జన్యం. బలపనూరులో అంకాలమ్మగూడూరు సర్పంచ్ అభ్యర్థిని అసభ్య పదజాలంతో దూషించారు. వేంపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది టీడీపీ రౌడీలు సచివాలయంలో తిష్టవేసి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్లకు రాకుండా అడ్డుకున్నారు.

మరోవైపు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డిలను పోలీసులు బయటకు రానీయకుండా నిర్బంధించారు. తొండూరు మండలం మడూరులో సర్పంచ్ అభ్యర్థి భర్త శంకర్‌ను, సింహాద్రిపురంలో పలువురు అభ్యర్థులు, ప్రతిపాదకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కణంపల్లి మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి పోలీసులు వేధింపులకు దిగారు.
పెట్రోల్ బాంబులతో దాడులు
కమలాపురం మండలం పాచులపాడులో వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాదరెడ్డిపై టీడీపీ నేత యల్లారెడ్డి, అనుచరులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంబటూరు పంచాయతీ అభ్యర్థి నామినేషన్‌ను బలపరిచేందుకు వెళ్లిన ప్రసాదరెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. చక్రాయపేట మండలం సురభి నామినేషన్ కేంద్రం వద్ద రాళ్ల దాడిలో మహదేవపల్లెకు చెందిన హనుమంతు, బ్రహ్మదేవుని ఆనందరెడ్డి గాయపడ్డారు. చక్రాయపేట కేంద్రం వద్ద పెట్రోల్ బాంబులు, సీసాలతో దాడులకు తెగబడ్డారు. దేవరగుట్టపల్లిలో సాయి అనే కార్యకర్తపై దాడి చేశారు.

ఫ్యాక్టరీపై దాడి.. వాహనాల ధ్వంసం
తొండూరు మండలం ఉదవగండ్లలో కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో రాత్రంతా స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశారు. నాగలగుట్టపల్లెలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీపీ మాధవి బాలకృష్ణకు చెందిన ఇటుకల ఫ్యాక్టరీపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేశారు. షెడ్డు తలుపులు పగలగొట్టి 20కిపైగా ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి వెంట వచ్చిన మూకలు కర్రలు, రాడ్లతో బహిరంగంగా స్వైరవిహారం చేశాయి. నామినేషన్ కేంద్రానికి వెయ్యి మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజనాల క్యాంపుపై పచ్చమూకలు విరుచుకుపడ్డాయి. ఐదు గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యులపై దాడి చేశాయి. బొలేరో, బియ్యం పంపిణీ ఆటోలతో పాటు 40 ద్విచక్ర వాహనాలు, ప్లాస్టిక్ కుర్చీలు, సీసీ కెమెరాలు, తలుపులను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రాయచోటి ఆసుపత్రికి తరలించారు.
పుంగనూరులో టీడీపీ దౌర్జన్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బండ్లపల్లె, మంగళంలో వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థులపై టీడీపీ మూకలు దాడి చేసి, కార్లను ధ్వంసం చేయడంతోపాటు నామినేషన్ పత్రాలను లాక్కెళ్లి చించివేశారు. రొంపిచెర్లలో నామినేషన్ కేంద్రానికి తాళాలు వేసి అభ్యర్థులను అడ్డుకున్నారు. దాడుల్లో మాజీ జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రసాద్‌నాయుడు గాయపడ్డారు. పులిచెర్ల మండలం రాయవారిపల్లెలో నామినేషన్ల అడ్డగింతపై వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నాకు దిగారు.
ప్రకాశం జిల్లాలో టీడీపీ గూండాల దాడులు
ప్రకాశం జిల్లా అద్దంకి, దర్శి, మార్కాపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దర్శి నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లో నామినేషన్ పత్రాలను చించివేయడంతోపాటు అభ్యర్థులను బెదిరించారు. రామచంద్రాపురంలో వైఎస్సార్‌సీపీ బీసీ నేత పీట్ల నాగేశ్వరరావుపై దాడి చేశారు. పాపిరెడ్డిపాలెంలో ఎస్టీ అభ్యర్థులను, తుమ్మిదలపాడులో మహిళలను సైతం అడ్డుకుని బెదిరించారు. అద్దంకి నియోజకవర్గం ఏల్చూరులో అభ్యర్థి ఓరుగంటి కోటిరెడ్డిని పోలీసులు స్టేషన్‌కు తరలించి రాజీకి ఒత్తిడి తెచ్చారు. మార్కాపురం ప్రాంతంలోని పలువురి నామినేషన్లు చింపేశారు.

పల్నాడు జిల్లా నాచాయపాలెంలో నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు రాకుండా ముళ్ళ కంపలతో దారిని మూసివేసిన దృశ్యం
గడువు ముగిశాక నామినేషన్ల స్వీకరణ
కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం తుమ్మలపల్లిలో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత టీడీపీ మాజీ సర్పంచ్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే కోసం అర్ధరాత్రి ఆర్వో అక్రమాలు!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ మల్లికార్జున ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ కోసం నిబంధనలను తుంగలో తొక్కారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అర్ధరాత్రి వరకు పరిశీలన పేరుతో పెండింగ్‌లో ఉంచి, చివరకు తిరస్కరించారు.
నామినేషన్ ఉపసంహరించకపోతే గంజాయి కేసులు, రౌడీషీట్!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నేత మన్నేపల్లి శ్రీనివాసులు భార్య బొచ్చు దుర్గమ్మ నామినేషన్ దాఖలు చేసింది. దీంతో శ్రీనివాసులను స్టేషన్‌కు పిలిపించిన నెల్లూరు జిల్లా కావలి రూరల్ సీఐ శివశంకర్.. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే గంజాయి కేసులు పెట్టడంతోపాటు రౌడీషీట్ తెరిచి కుటుంబాన్ని రోడ్డున పడేస్తానని రెండు రోజులుగా బెదిరించినట్లు బాధితుడు పార్టీ స్థానిక నేతల వద్ద వాపోయాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నెల్లూరుకు తీసుకెళ్లాలని సూచించారు.

తింటున్న భోజనాన్ని లాగేశారు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. తుమ్మలపెంట అభ్యర్థి తోట మల్లేశ్వరరెడ్డిని మాట్లాడాలంటూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. సున్నిపెంటలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు నామినేషన్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన భోజనాలను పోలీసులు సీజ్ చేశారు. అన్నం వండిన గంగాళాలు, నీటి డ్రమ్ములను స్వా«దీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
పల్నాడులో మహిళలపై పోలీసుల ప్రతాపం
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై నిరసన తెలిపిన మహిళలపై ఎస్‌ఐ రవికుమార్ విచక్షణారహితంగా వ్యవహరించారు. అన్నపురెడ్డి సీతారావమ్మను బూటుకాలితో తన్ని, జుట్టు పట్టి ఈడ్చడంతో ఆమె స్పృహ కోల్పోయారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు మహిళలు గాయపడ్డారు. బాధితులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పరామర్శించారు. దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న శంకరరావును ముప్పాళ్ల వద్ద అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు.

వైఎస్సార్ కడప జిల్లా రామిరెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై ఖాకీల దాష్టీకం
ఊటుకూరులో మాజీ ఎంపీపీ పెరుమాళ్లపల్లి కోటయ్యపై కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. అమరావతి మండలం మునుగోడులో టీడీపీ వర్గీయుల దాడిలో ఆరుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడగా, బంకా విష్ణు పరిస్థితి విషమంగా మారింది. బెల్లంకొండలో ఎస్సీ మహిళలను నామినేషన్లకు తీసుకెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేత దండా సత్యనారాయణరెడ్డిపై దాడి చేశారు. బెల్లంకొండ మండలం నాచాయపాలెంతో పాటు పలు గ్రామాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు ముళ్ల కంపలను అడ్డం వేశారు.

పల్నాడు జిల్లా అనంతవరంలో పోలీసుల లాఠీచార్జి


