సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసిన ఐతేపల్లి మాజీ సర్పంచ్ ఫాజియా, ఆమె భర్త అంజాద్‌పై దాడి ఘటన కలకలం రేపింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వారిని చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితులు సర్పంచ్‌గా పోటీ చేయడానికి ముందుకొస్తేనే అడ్డుకునే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత గ్రామమైన నారావారిపల్లెకు సమీపంలో ఉన్న ఐతేపల్లిలోనే టీడీపీ నాయకులు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో దళితులు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని మోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఫాజియా కుటుంబంపై దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేత రమణమూర్తితో పాటు దాడికి పాల్పడిన ఆయన అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ తరఫున పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి హెచ్చరించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు తీసుకునే చర్యలు, ఇరువర్గాల నుంచి వచ్చే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: సిద్దిపేట వేదికగా కీలక పథకం.. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!


