సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ జిల్లా రైతు అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ రెడ్డి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రిమ్స్‌కు చేరుకుని ఆయనను పరామర్శించారు. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూడా ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలన సరిగా లేకపోవడంతో ఓడిపోతామనే భయంతోనే దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కడప జిల్లాలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడులు చేయడం కాకుండా, నామినేషన్లు వేసి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకోవాలని టీడీపీ నేతలకు అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేతపై వివాదం


