‘‘చంద్రబాబు కుట్రలు ఎలా ఉంటాయంటే కుటుంబాల్లో కూడా చిచ్చులు పెడతారు’’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ‘‘సాక్షి’’లో వచ్చిన ‘‘చెట్టపట్టాల్’’ అన్న పదంపై లోకేశ్, షర్మిల అనవసర రాద్ధాంతం చేస్తూ ట్వీట్లు చేసిన వేళ దీనిపై కారుమూరి వెంకటరెడ్డి స్పందించారు.
‘‘రాష్ట్రంలో 3 అంశాలపై చర్చ నడుస్తోంది. ఒకటి స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేసి 40 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. రెండోది.. పవన్ కల్యాణ్ మూడో విడాకుల విషయంలో స్పందించవద్దని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ట్విటర్ స్పేస్‌లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను కొందరు తిట్టించారు. ఈ టాపిక్‌లను డైవర్ట్ చేయడానికి షర్మిలను ఇప్పుడు చంద్రబాబు ముందుకు తీసుకొచ్చారు.
ఎప్పుడైనా గమనించండి. డిఫెన్స్ మోడ్‌లో పడినప్పుడు తల్లి, చెల్లి అని డైవర్షన్ చేస్తుంటారు. ట్విటర్ స్పేస్ గురించి మాట్లాడలేదు కానీ, చంద్రబాబును కలిశారు. వారు ‘‘చెట్టపట్టాలు’’ వేసుకుని అంటూ ‘‘సాక్షి’’లో రాస్తే మళ్లీ దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం షర్మిలతో చేస్తున్నారు. నారా లోకేశ్ చదువును కొనుకున్నారు. షర్మిల మాత్రం చదువుకున్నారు కదా? ఆమె కూడా ఈ పదాలను వక్రీకరించడం ఏంటి? ఇలాంటి ట్వీట్ పెట్టి షర్మిల మరోసారి దిగజారారు.
చెట్టపట్టాల్ అని సాక్షి రాస్తే షర్మిలతో ట్వీట్ చేశారు. ఎల్లో మీడియాలో డిబేట్లు పెడుతున్నారు. మేమెక్కడా తప్పుగా మాట్లాడడం లేదు. మళ్లీ మహిళల గౌరవం గురించి నారా లోకేశ్ మాట్లాడుతున్నారు. షర్మిల.. మనుషులు దిగజారవచ్చుగానీ మరీ ఇంతగానా? ట్విటర్ స్పేస్‌లో ఎన్నో మాటలు తిట్టిస్తారు. మళ్లీ డైవర్ట్ చేయడానికి ఇటువంటివి ముందుకు తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు, షర్మిల వీళ్లందరూ ఒకటేనని ప్రజలకు అర్థమైంది’’ అని తెలిపారు.


