‘‘టీడీపీ నాయకులు రాజయ్యపేటలో రూ.1.30 కోట్లకు అవినీతికి పాల్పడ్డారు. పరిశ్రమల కోసం నివాస ప్రాంతాలు ఖాళీ చేయించే సమయంలో ఇళ్లు లేకుండానే ఉన్నట్లు నష్టపరిహారం పొందారు. ఇప్పటికే పీజీఆర్‌ఎస్‌లో పది సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం.’’
– జనసేన నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి అయిన పిక్కి స్వామి
‘‘హెటెరో కంపెనీకి వారు సముద్రంలోకి పైపులైను వేసే సమయంలో జనసేన సర్పంచ్ అభ్యర్థి ఏడాది పాటు నిరాహారదీక్షలు చేపట్టారు. అనంతరం కంపెనీవారితో కుమ్మక్కై కోట్లు మామ్మూళ్లు తీసుకుని ఉద్యమాన్ని నీరుగార్చారు. రాజయ్యపేట గ్రామస్తులను మోసం చేశారు. ’’
– టీడీపీ నాయకులు
ఇదీ రాజయ్యపేటలో టీడీపీ, జనసేన నాయకుల బాగోతం. ఈ రెండు పార్టీల నాయకులు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తుండడంతో ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకుంటూ కరపత్రాలు ముద్రించి, సోషల్ మీడియా వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, అక్రమాలను బయటపెడుతుండడంతో స్థానికులు విస్తుపోతున్నారు. తాము ఇంతలా మోసపో యామా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి: నక్కపల్లి మండలంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన రాజయ్యపేటలో కూటమి పార్టీల కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. రాజయ్యపేటలో సర్పంచ్ ఎన్నికలు కూటమి పార్టీల నాయకులకు తలనొప్పిగా మారాయి. ఇక్కడ టీడీపీ నుంచి పిక్కి కోదండరావు, జనసేన నుంచి పిక్కి స్వామి సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు.
అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఆరు నెలల ముందునుంచే ఇరుపార్టీల మద్దతుదారులు ఎవరికి వారే ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. కరపత్రాలను ముద్రించి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. ఇలా సర్పంచ్ అభ్యర్థులిద్దరూ పరస్పరం తమ బాగోతాలు బయటపెట్టుకుంటున్నారు.
టీడీపీ బలపరచిన అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపిస్తే ఇప్పటి వరకు కొంతమంది ఇళ్లనే అమ్మేసి కోట్లు స్వాహా చేశారని, గెలిచిన తర్వాత ఊరినే అమ్మేస్తారంటూ జనసేన అభ్యర్థి ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థిపై ఎదురుదాడికి దిగుతున్నారు. మరో విశేషమేమిటంటే ఇరువురు అభ్యర్థులు హోంమంత్రి చుట్టూ తిరుగుతున్నారు. జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ ఫొటోతోను, టీడీపీ నాయకులు హోంమంత్రి అనిత ఫొటోతోను ప్రచారం ప్రారంభించారు.
వలస ఓటర్ల వద్ద అదే తీరు
రాజయ్యపేటలో సగానికి పైగా ఓటర్లు పూరీ, పారాదీప్, కోణార్క్, శ్రీశైలం, నందికొండ, మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. అభ్యర్థుల గెలుపోటములపై వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇరువురు అభ్యర్థులూ వలస ఓటర్ల వద్దకు వెళ్లి కూడా ఇదే ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మొత్తంమీద రాజయ్యపేటలో ఇరుపార్టీ ల అభ్యర్థులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పార్టీల పరువు బజారున పడేస్తున్నారు.
కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగాల కోసమే...
రాజయ్యపేట సమీపంలో రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్, మరో రెండు వేల ఎకరాల్లో ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నాయి. బల్క్ డ్రగ్ పార్కులో వందల సంఖ్యలో చిన్నాచితక రసాయన పరిశ్రమలు రాబోతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అలాగే స్థానిక చోటామోటా నాయకులకు కాంట్రాక్ట్ పనులు దక్కే అవకాశాలున్నాయి. దీంతో సర్పంచ్ పదవిని అడ్డంపెట్టుకుని డబ్బు సంపాదించవచ్చనే ఆశతో అభ్యర్థులు కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అమలుసాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారు. జనసేన అభ్యర్థి పిక్కి స్వామి అయితే హామీల్లో ముందంజలో ఉన్నారు. రేషన్ కార్డు కలిగిన వారికి రెండు సెంట్ల ఇంటిస్థలం ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. కూటమి పరువు ఇరువర్గాల నేతలు బజారున పడేస్తుంటే మంత్రితోపాటు జనసేన నేతలెవరూ నోరుమెదపకపోవడం చర్చనీయాంశమైంది.


