షర్మిల పోస్టుపై లోకేష్‌ పూనకాలు.. నెటిజన్ల కౌంటర్‌! | Netizens Question Nara Lokesh Over Sharmila Tweet Issue | Sakshi
Sakshi News home page

షర్మిల పోస్టుపై లోకేష్‌ పూనకాలు.. నెటిజన్ల కౌంటర్‌!

Nov 18 2026 12:28 PM | Updated on Nov 18 2026 12:40 PM

Netizens Question Nara Lokesh Over Sharmila Tweet Issue

సాక్షి, తాడేపల్లి: తెలుగులోని ఓ సాధారణ నుడికారానికి రాజకీయ రంగు పులిమి వివాదం సృష్టిస్తున్నారా? ‘చెట్టపట్టాల్‌’ అనే పదం ఏదో వినకూడని, రాయకూడని పదమైనట్లు షర్మిల అభ్యంతరం వ్యక్తం చేయడం.. వెంటనే మంత్రి నారా లోకేశ్‌ ఆమెకు మద్దతుగా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ‘చెట్టపట్టాల్‌’ అనే పదానికి ఉన్న అర్థమేంటి? దాన్ని సాక్షి కథనంలో ఉపయోగిస్తేనే అభ్యంతరం ఎందుకు? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

‘చెట్టపట్టాలేసుకుని నడవడం’ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసిమెలిసి, స్నేహంగా, ఐకమత్యంతో ముందుకు సాగడం. ఇందులో ఎలాంటి అసభ్యమైన లేదా ద్వంద్వార్థం లేదు. తెలుగు భాషలోని సాధారణ నుడికారాన్ని రాజకీయ వివాదంలోకి లాగడం కంటే, ఆ పదం ఉపయోగించిన సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘చెట్టపట్టాల్‌’ అనే పదంపై మొదలైన చర్చ.. ఇప్పుడు చంద్రబాబు, షర్మిల రాజకీయ సాన్నిహిత్యంపై చర్చకు దారితీసింది.

ఇటీవలి కాలంలో రాజకీయంగా చంద్రబాబుకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా షర్మిల ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు కాంగ్రెస్‌ నేతలు, మాజీలు సైతం ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల.. ఇప్పుడు ఆయనకు రాజకీయంగా మద్దతుగా నిలుస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒకప్పుడు చంద్రబాబును ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలూ ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ‘కళ్లు ఆర్పకుండా అబద్ధాలు ఆడుతాడు’, ‘నిజం చెబితే తల వేయి ముక్కలవుతుందని ముని శాపం ఉంది’, ‘చంద్రబాబు ఉన్నంతకాలం రాష్ట్రం బాగుపడదు’, ‘కుట్రల బాబు చంద్రబాబు’ అంటూ గతంలో ఆమె చేసిన విమర్శలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే.. ఆ కేసు నుంచి బయట పడేందుకు మానసిక స్థిమితం లేదంటూ బాలకృష్ణ ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. అప్పట్లో చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడిన షర్మిల.. ఇప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉండటంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

బాబును అడిగితే బాగుండేది..
ఇక ‘చెట్టపట్టాల్‌’ వివాదంపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ పదంపై అభ్యంతరం వ్యక్తం చేసే ముందు గతంలో జరిగిన ఘటనలను కూడా గుర్తు చేసుకోవాలని అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం సమయంలో జనసేనకు చెందిన కొందరు సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు, షర్మిల, జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్య, అల్లు అర్జున్‌ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి సందర్భాల్లో కూటమి నేతలను ప్రశ్నించకుండా, సాక్షి కథనంలోని ఒక పదాన్ని పట్టుకుని వివాదం చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును కలవడానికి షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందించడం తప్పు కాదని, అయితే ఆ సందర్భంలో తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల విషయంలో కూడా ఆమె స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరితే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన కొందరు సోషల్‌ మీడియా కార్యకర్తల వ్యాఖ్యలపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు.

లోకేష్‌.. అవి కనిపించవా?
షర్మిల పెట్టిన ఎక్స్‌ పోస్టును రీట్వీట్‌ చేస్తూ లోకేశ్‌ స్పందించడంపైనా నెటిజన్లు కౌంటర్‌ ఇస్తున్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న లోకేశ్‌.. గతంలో మహిళలపై జరిగిన అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. జనసేన కార్యకర్తలు వైఎస్‌ భారతి, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఎక్స్‌లో స్పందించారా అని నిలదీస్తున్నారు. బాలకృష్ణ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. మహిళల గౌరవం విషయంలో ఒకే విధమైన వైఖరి ఉండాలని, రాజకీయ అవసరాలకు అనుగుణంగా స్పందించడం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే, విద్యార్థుల సమస్యలపై కూడా మాట్లాడే సమయం లేదా? అని ఎక్స్‌ వేదికగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: ‘రామోజీ జయంతిని రాష్ట్ర పండుగ చేస్తారా?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement