సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ప్రశాంతత, పచ్చదనం, మెరుగైన జీవన ప్రమాణాలకు కేంద్ర బిందువుగా కాకినాడ నగరం విరాజిల్లుతోంది. ఆ ప్రత్యేకతను కాపాడుకుంటూనే ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. ప్రజలు ఆశీర్వదించి, అవకాశం కల్పిస్తే కాకినాడ నగర అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు, సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తాను’ అని కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాద సత్య శ్రీ అన్నారు. ప్రధానంగా నాలుగు అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రోడ్లు, పారిశుద్యం, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలు కల్పనే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ‘సాక్షి’కి ఇ చ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
విద్య, వైద్యానికి పెద్దపీట
కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫరి్నచర్, తరగతి గదు ల వంటి కనీస సదుపాయాలను మెరుగుపరుస్తాం. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, ప్రాథమిక వైద్య పరీక్షల సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తాం. మహిళలు, పిల్లలు, వృద్ధులు సురక్షితంగా, సౌకర్యవంతంగా జీవించే వాతావరణం కల్పిస్తాం. ఇందులో స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తాం. ఇప్పటికే నగరంలో పచ్చదనం, పరిశుభ్రత కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో కాకినాడను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
వర్షపు నీరు నిలిచిపోవడంపై అధ్యయనం
కొద్దిపాటి వర్షానికే కాకినాడ రోడ్లపై నీరు నిలిచిపోతోంది. ఈ సమస్య ఎందుకు తలెత్తుతోంది, ఎక్కడెక్కడ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదనే విషయమై ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలిస్తాం. తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా, నగరంలోని మొత్తం వర్షపు నీటి ప్రవాహ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి, దీర్ఘకాలిక పరిష్కారాలు చేపడతాం. వాన నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలను, సమస్యకు కారణాలను గుర్తించి, అవసరమైన మార్పులు చేపడతాం. కొత్త రహదారులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ సమయలో వర్షపు నీరు సహజంగా భూమిలోకి ఇంకిపోయేలా చర్యలు తీసుకుంటాం. కాలువల్లో పూడిక, చెత్త పేరుకుపోకుండా నిరంతర నిర్వహణ చేపడతాం. అవసరమైనచోట్ల డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తాం.
యువతకు ఉపాధి
యువతకు ఉద్యోగావకాశాలు పెంచడంతో పాటు, అందుకు అవసరమైన నైపుణ్యాలను కూడా అందించాలి. కాకినాడలోని పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలకు ఎలాంటి నైపుణ్యాలు కలిగిన సిబ్బంది అవసరమో గుర్తించి, అందుకు అనుగుణంగా స్థానిక యువతకు శిక్షణ అందిస్తాం. కెరీర్ గైడెన్స్, ఉద్యోగ సమాచారం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను యువతకు అందుబాటులోకి తెస్తాం.
మాదకద్రవ్యాల నివారణకు..
కాలేజీల్లో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువత భవిష్యత్తును దెబ్బతీసే ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తాం. పోలీసు శాఖ, కళాశాలల యాజమాన్యాలు, వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణులతో కలిసి నగరంలోని కళాశాలల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవసరమైన వారికి కౌన్సెలింగ్, వైద్య సహాయం అందిస్తాం.
ప్రజల సేవకే..
మా కుటుంబం మూడు దశాబ్దాలుగా వైద్య నిర్ధారణ రంగంలో ప్రజలకు సేవలందిస్తోంది. సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థుల చదువుకు సాయం చేస్తున్నాం. సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనకు మా అత్తయ్య, మావయ్య స్ఫూర్తి. మా మామయ్య సర్పంచ్, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఈ అనుభవాల నేపథ్యంలో ప్రజలకు మరిన్ని సేవలందించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. వైద్యరంగంలో ఉంటూనే ప్రజాసేవ చేయవచ్చు. అది పరిమిత స్థాయిలోనే ఉంటుంది. రాజకీయాల్లో మరింత ఎక్కువ మందికి, విస్తృతమైన సేవలు అందించగలం.
వైఎస్సార్ సీపీతో ప్రజలకు మరింత చేరువ
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, మా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అందించిన ఘనత జగన్ సొంతం. వైఎస్సార్ సీపీ ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, కాకినాడ అభివృద్ధికి కృషి చేసే ఉద్దేశంతోనే పారీ్టలో చేరా. మా వారికి, మా పెద్దబ్బాయికి రాజకీయాలు, సామాజిక సమస్యలపై ఆసక్తి, అవగాహన ఉన్నాయి. రాజకీయాల్లోకి రావాలనేది మా వారి బలమైన అభిప్రాయం. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నన్ను ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహం, నమ్మకం, వైఎస్ జగన్ ఆదరణ ధైర్యాన్నిచ్చాయి. కాకినాడ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలి. నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ఓటు వేసి, ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా.


