ఆకుల భవానికి షాక్‌.. మేయర్‌గా ఎన్నారై కసిరెడ్డి వినూష! | Akula Bhavani Shocked NRI Kasireddy Vinusha as Mayor | Sakshi
Sakshi News home page

ఆకుల భవానికి షాక్‌.. మేయర్‌గా ఎన్నారై కసిరెడ్డి వినూష!

Nov 18 2026 9:01 AM | Updated on Nov 18 2026 9:07 AM

Akula Bhavani Shocked NRI Kasireddy Vinusha as Mayor

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నగర మేయర్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేనలోనే అసమ్మతి అగ్గిని రాజేస్తోంది. ఇప్పటికే ఆకుల భవాని పేరును ఆ పార్టీ అధినేత పవన్‌ ప్రకటించారు. ఆమె నామినేషన్‌ సైతం దాఖలు చేశారు. ఇంతలోనే ఒక్కసారిగా రాజకీయం మారింది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం పునరాలోచన చేయడం.. మరో పేరు తెర పైకి తెస్తుండటంతో ఆకుల వర్గంలో ఆందోళన నెలకొంది. కాకినాడ నగర పాలక సంస్థ మేయర్‌ అభ్యర్థిగా ఆకుల భవాని స్థానంలో ఎన్నారై కసిరెడ్డి వినూషను బరిలోకి దింపేందుకు జనసేన పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. 

టీడీపీ, జనసేన ముఖ్య నేతల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చివరి రోజున ఆమె మేయర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా.. జెడ్పీ చైర్మన్‌ జనసేనకు, మేయర్‌ టీడీపీకి కేటాయించనున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. జనసేన ప్రతిపాదనపై చివరి క్షణంలో సీఎం చంద్రబాబు అభ్యంతరం తెలపడంతో ఆకుల భవాని పేరును పవన్‌ కల్యాణ్‌ ప్రకటించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెను సైతం తప్పించే యోచన చేస్తుండటంపై జనసేనలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మేయర్‌ అభ్యర్థి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటం గ్లాసు పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. అసలు అభ్యర్థి ఎవరు.. ఎప్పుడు స్పష్టత ఇస్తారు.. ఎవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
 
సర్వత్రా గందరగోళం 
మేయర్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పటికే భారీ సంఖ్యలో జనసేన నేతలు ఈ పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. అన్నిపార్టీలూ కలిపి 28 నామినేషన్లు సమరి్పంచగా.. వీటిలో జనసేన నుంచే అత్యధికంగా 12 ఉన్నాయి. దీనినిబట్టి చూస్తే ఆపార్టీలో గందరగోళం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అభ్యర్థి మార్పు వార్తల నేపథ్యంలో పార్టీ అధికారికంగా ఎవరి పేరు ప్రకటిస్తుందో తేలకపోవడంతో పలువురు ముందుజాగ్రత్తగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఆకుల భవానీని మార్చే ఆలోచన చేస్తుండటంతో మిగిలిన ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎలాగైనా మేయర్‌ స్థానం దక్కించుకునేందుకు ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్‌ ప్రారంభించారు. 

అసమ్మతి భయంతో రహస్యంగా.. 
కాకినాడ శ్రీనగర్‌కు చెందిన కసిరెడ్డి వినూష జనసేన ఎన్నారై విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినట్లు చెబుతున్నారు. దాదాపు ఆమె పేరే ఖాయమనే సంకేతాలు ఆ పార్టీ నేతల నుంచే వెలువడుతున్నాయి. అయితే, మేయర్‌ అభ్యర్థి మార్పు విషయం బహిరంగంగా తెలిస్తే అసమ్మతి భగ్గుమనే పరిస్థితి ఉండటంతో అధిష్టానం రహస్యంగా మొత్తం కథ నడుపుతున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన ఆకుల భవానీనే కొనసాగిస్తారా లేదా కసిరెడ్డి వినూషకు అవకాశం ఇస్తారా లేక మరో పేరు తెర పైకి తెస్తారా.. దాఖలైన నామినేషన్లలో ఎవరికి అధిష్టానం మద్దతు లభిస్తుందనే చర్చ జరుగుతోంది. 

నేటి సమావేశంలోనైనా స్పష్టత వచ్చేనా? 
కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన అంశాలతో పాటు పలు కీలక విషయాలపై చర్చించేందుకు జిల్లాకు చెందిన కూటమి నాయకులు బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ బాబుకు చెందిన కొప్పవరంలోని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగానైనా మేయర్‌ అభ్యర్థి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతారా లేక సస్పెన్స్‌ కొనసాగిస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. 

పిఠాపురం బాటలోనే.. 
అనాలోచిత నిర్ణయాలకు జనసేన అధిష్టానం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తి స్థాయి ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్వయంగా అధినేత ప్రకటించిన అభ్యర్థులనే ఇష్టానుసారం మార్చేయడం ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఇందుకు ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం మార్పు రాజకీయాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పిఠాపురం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ బి.విజయశేఖర్‌ను ప్రకటించారు. అనంతరం దానం లాజర్‌బాబును ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. కాకినాడ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి విషయంలోనూ అదే పంథా అవలంబిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.  

ఇదీ చదవండి: బలపడుతున్న టీవీకే – కాంగ్రెస్‌ బంధం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement