కోనసీమలో గ్యాస్‌ బ్లో అవుట్‌ | Konaseema ONGC Gas Blowout Incident Mamidikuduru Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోనసీమలో గ్యాస్‌ బ్లో అవుట్‌

Nov 18 2026 6:18 AM | Updated on Nov 18 2026 6:18 AM

Konaseema ONGC Gas Blowout Incident Mamidikuduru Andhra Pradesh

నగరం గ్రామం వద్ద డీప్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆర్‌ ఐ జి డి ఆర్‌ 31 బావి నుంచి గ్యాస్‌ లీకేజ్‌

నగరం గ్రామంలోని తాటిపాక–7 బావిలో ప్రమాదం

తెల్లవారుజామున భారీ శబ్దాలతో 10 మీటర్ల ఎత్తున ఎగసిపడిన గ్యాస్‌

బావి రీ డ్రిల్లింగ్‌ పనులు చివరి దశలో ఉండగా బ్లో అవుట్‌

పరిసర ప్రాంతాలను కమ్మేసిన గ్యాస్‌.. పరుగులు తీసిన ప్రజలు

పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు

మధ్యాహ్నానికి అదుపులోకి తెచ్చి, బావిని మూసివేసిన నిపుణులు

వారం రోజులుగా ప్రమాద సంకేతాలున్నా పట్టించుకోని కంపెనీ

మూసివేసిన బావులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తున్న ఓఎన్జీసీ

వారి అనుభవరాహిత్యమే ప్రమాదాలకు కారణం!

వరుస లీకేజీలతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

నెల రోజుల వ్యవధిలో రెండో ప్రమాదం

నగరం గ్రామంలోనే 2014 జూన్‌ 27న గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలి 23 మంది మృత్యువాత

సాక్షి, అమలాపురం/మామిడికుదురు: ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ఏ మూల నుంచి గ్యాస్‌ బుసలు కొడుతుందోనన్న భయంతో కోనసీమ వణికిపోతోంది. ఇటీవలే రెండు తుపాన్లు ఈ ప్రాంతంలోని పంటలు, ఆస్తులకు తీవ్ర నష్టం కలగజేయగా, మంగళవారం తెల్లవారుజామున మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారిపుంత వద్ద ఓఎన్జీసీకి చెందిన తాటిపాక–7 బావి నుంచి గ్యాస్‌ బ్లో అవుట్‌ జరిగింది.

తెల్లవారుజామున భారీ శబ్దాలతో 10 మీటర్ల ఎత్తున గ్యాస్‌ ఎగజిమ్మడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అధికారులు పరిసర ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో గ్యాస్‌ బ్లో అవుట్‌. నగరం గ్రామంలోనే 2014 జూన్‌ 27న జరిగిన గ్యాస్‌ పైప్‌లైన్‌ భారీ విస్ఫోటనంలో 23 మంది మృత్యువాత పడిన సంఘటన స్థానికులను నేటికీ కలవర పెడుతూనే ఉంది. అయినప్పటికీ ఓఎన్జీసీ ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోవడంలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.

తెల్లవారుజాము నుంచే లీకేజీ 
తాటిపాక–7 బావి వద్ద డీప్‌ కంపెనీకి చెందిన డీఆర్‌–31 రిగ్గు రీ– డ్రిల్లింగ్‌ చివరి దశలో ఉండగా  తెల్లవారుజామున 4 గంటల నుంచే గ్యాస్‌ లీకేజీ ప్రారంభమైంది. అది మరింత పెరిగి ఉదయం 5 గంటల సమయానికి తీవ్రరూపం దాల్చింది. భారీ శబ్దాలతో గ్యాస్‌ ఎగసిపడటంతో పాటు పరిసర ప్రాంతాలను గ్యాస్‌ కమ్మేయడంతో స్థానికులు పరుగులు తీశారు.

జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు సైతం భయాందోళనలకు గురయ్యారు. గ్యాస్‌ బ్లో అవుట్‌ విషయం తెలియగానే జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. నిప్పు రాజేయవద్దని మైకు ద్వారా హెచ్చరించింది. టెలీ కమ్యూనికేషన్‌ నిలిపివేశారు. సమీపంలోని స్కూల్స్‌ను మూసివేయించారు.

ఈ బావి సమీపంలోని ఆరు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి నగరం, మామిడికుదురు ఉన్నత పాఠశాలల్లో పునరావాస శిబిరాలకు తరలించారు. నరసాపురం నుంచి వచ్చిన నిపుణుల బృందం వాటర్‌ అంబ్రెల్లా ఆపరేషన్‌ కొనసాగిస్తూనే బావిలోకి మడ్‌ను పంప్‌ చేసి బ్లో అవుట్‌ ప్రివెంటర్‌ (బీఓపీ) ద్వారా బావిని మూసివేశారు. దీంతో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో గ్యాస్‌ లీకేజీ అదుపులోకి వచ్చింది.  రాజమండ్రి అసెట్‌ ఈడీ హేమంత్‌ రాములు ముల్కా దగ్గరుండి వెల్‌ క్యాపింగ్‌ పనులను పర్యవేక్షించారు.

రీ డ్రిల్లింగ్‌ సమయంలో ప్రమాదం
తాటిపాక–7 బావిలో సహజ వాయువు పుష్కలంగా ఉంది. మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్‌ ఉత్పత్తి చేస్తోంది. ఈ బావిలో ఇటీవల సహజ వాయువు ఉత్పత్తి తగ్గడంతో బావిని పూర్వపు స్థాయికి తీసుకొచ్చేందుకు ఓఎన్జీసీ ఆధ్వర్యంలో రీ–డ్రిల్లింగ్‌ చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ బాధ్యతను డీప్‌ కంపెనీకి అప్పగించారు. ఆగస్టు నుంచి డీప్‌ కంపెనీ రీ–డ్రిల్లింగ్‌ చేపట్టింది.

సుమారు 2,300 మీటర్ల వరకు భూ అంతర్భాగంలోకి రీ –డ్రిల్లింగ్‌ చేసి, 3,500 పీఎస్‌ఐ (పౌండ్స్‌ పర్‌ స్క్వేర్‌ ఇంచెస్‌) పరిమాణంలో గ్యాస్‌ నిక్షేపాలను గుర్తించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి 10 రోజుల్లో బావిని ఓఎన్జీసీకి అప్పగించాల్సి ఉంది. చివరి మజిలీలో ప్యాకింగ్‌ పనులు జరుగుతుండగా సాంకేతిక లోపంతో గ్యాస్‌ ఒక్కసారిగా కిక్‌ ఇచ్చి బ్లోఅవుట్‌ ఏర్పడింది.

ఈ బావి వద్ద కొన్ని రోజులుగా ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. తొలుత గ్యాస్‌ కిక్‌ ఇవ్వడంతో దాన్ని అతికష్టం మీద అదుపు చేశారు. తర్వాత పరిణామాలు తీవ్రరూపం దాల్చి, బ్లోఅవుట్‌కు దారితీసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా,  ఓఎన్జీసీతో పాటు దాని ఆధ్వర్యంలో పని చేస్తున్న ప్రైవేట్‌ కంపెనీలు బావుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, నిరంతర పర్యవేక్షణపై తగిన శ్రద్ధ చూపడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.

కోనసీమకు ముప్పుగా ‘ప్రైవేట్‌’ డ్రిల్లింగ్‌
గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత కోనసీమ అభివృద్ధికి తోడ్పడి, జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాల్సిందిపోయి.. ప్రాణాల మీదకు తెస్తోంది. మూసివేసిన బావులను తిరిగి తెరిచి నిక్షేపాలు వెలికితీసే ప్రయత్నాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక్కడ రీ డ్రిల్లింగ్‌ పనుల అప్పగింత, భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణపై సమగ్ర సమీక్ష లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓఎన్జీసీ సాధారణంగా బావుల్లో 2600 మీటర్ల లోతు వరకు తవ్వి చమురు, సహజ వాయువులను వెలికితీస్తోంది.

వాటిలో ఉత్పత్తి తగ్గినా, లేదా నిలిచిపోయిన మూసివేస్తోంది. కొంతకాలం తర్వాత వాటిని మరింత లోతుగా తవ్వి నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తోంది. అయితే, తగిన అనుభవం, సాంకేతిక సామర్థ్యం లేని సంస్థలకు పనులు అప్పగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రిల్లింగ్‌ సమయంలో భూగర్భ పీడనాన్ని నియంత్రించలేకపోవడం వంటి సమస్యలు బ్లో అవుట్‌లకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

2020లో కాట్రేనికోన మండలం ఉప్పూడిలో కోల్‌కతాకు చెందిన పీఎఫ్‌హెచ్‌ సంస్థ డ్రిల్లింగ్‌ చేస్తున్న సమయంలో బ్లో అవుట్‌ జరిగింది. మంటలను అదుపు చేసేందుకు 48 గంటలు పట్టింది. ఈ ఏడాది జనవరి 5న ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ మోరి–5 బావిలోనూ భారీ ప్రమాదం జరిగింది. 12 ఏళ్ల క్రితం ఈ బావిని మూసివేశారు. ఈ బావిని తెరిస్తే బ్లో అవుట్‌ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు గతంలోనే హెచ్చరించినట్టు సమాచారం. అయినప్పటికీ గుజరాత్‌కు చెందిన డీప్‌ ఇండస్ట్రీ సంస్థకు డ్రిల్లింగ్‌ పనులు అప్పగించారు. ఆ సంస్థ పనులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. తాజాగా తాటిపాక–7 బావిలోనూ డీప్‌ సంస్థ రిగ్గుతో రీ డ్రిల్లింగ్‌ చేస్తుండగా గ్యాస్‌ బ్లో అవుట్‌ జరిగింది.

ఇదీ చదవండి: వైఎస్సార్‌ కుటుంబంపై కుట్రలు చేసిన చంద్రబాబుతో చెలిమి ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement