breaking news
Tatipaka
-
బొమ్మలే బువ్వపెడుతున్నాయి
సాక్షి, రాజోలు (తూర్పు గోదావరి): నిరుపేద కుటుంబం.. రోజువారీ పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి. బొమ్మలు గీస్తూ ఇరుగుపొరుగు, స్నేహితుల మన్ననలు పొందుతూ చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకుని దానినే జీవనాధారంగా మలచుకున్నాడు తాటిపాకకు చెందిన గొల్లపల్లి శ్రీనివాస్. చిన్న చిన్న సైన్‌బోర్డులు, స్టిక్కరింగ్ చేయడం వంటి పనులు చేస్తూ నాలుగేళ్ల క్రితం క్రాఫ్ట్ టీచర్‌గా సర్వశిక్షాభియాన్‌లో కూనవరం ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్ కొలువు పొందాడు. చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తికి డ్రాయింగ్ టీచర్ పోస్టు తోడు కావడంతో విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దేందుకు నిరంతర శ్రామికుడిగా మారాడు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ఆసక్తిని గమనించి వాటిపై చిత్రాలను గీయడం నేర్పిస్తున్నాడు. చిత్రలేఖనం పోటీలు ఎక్కడ జరిగినా విద్యార్థులను వాటిలో పాల్గొనేలా తర్ఫీదు ఇచ్చి ప్రొత్సహిస్తునాడు. అచ్చుగుద్దినట్టు ‘పెన్సిల్ చిత్రాలు’ పెన్సిల్‌తో శ్రీనివాస్ గీచిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాస్‌పోర్టు సైజు ఫొటో ఇస్తే చాలు శ్రీనివాస్ తన పెన్సిల్‌కు పని చెప్పి అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తాడు. అలా చిత్రలేఖనంలో బహుమతులు పొందిన విద్యార్థినులు, స్నేహితుల చిత్రాలను పెన్సిల్‌తో ఇట్టే చిత్రీకరించాడు. ఓపిగ్గా కదలకుండా కూర్చుంటే లైవ్ చిత్రాన్ని కూడా తన పెన్సిల్‌తో గీస్తానని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. శ్రీనివాస్ గీచిన చిత్రాలను కూనవరం ఉన్నత పాఠశాలలో ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థుల్లో చిత్రలేఖనంపై ఆసక్తి పెంచడం ద్వారా చేతిరాత చక్కదిద్దవచ్చునని, నిరంతరం చదువుతో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులకు చిత్రలేఖనం ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే ఎంఈఓ జొన్నలగడ్డ గోపాలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు పట్టా భాస్కరరావుల ప్రోత్సాహంతో విద్యార్థులకు చిత్రలేఖనంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. -
యువతి అనుమానాస్పద మృతి : యువకుడు పరార్
రాజమండ్రి: యువకుడితో వచ్చిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమెతో వచ్చిన యువకుడు మాత్రం పారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాకలో ఈ ఘటన జరిగింది. యువతీయువకులు ఇద్దరూ కలసి తాటిపాకలోని ఓ హోటల్‌కు వెళ్లారు. యువతి మృతి చెందింది. ఆ యువకుడు పరార్ అయ్యాడు. దాంతో యువతి మృతి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోస్ట్ మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఆస్సత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తేగానీ ఆ యువతి ఎలా మృతి చెందిందో తెలియదని పోలీసులు చెబుతున్నారు. -
తాటిపాకలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ లీకేజీ
కాకినాడ: నగరం విషాదం మరవక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తాటిపాక ఓఎన్జీసీ రిఫైనరీలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ లీకేజితో స్థానికులు బెంబేలెత్తారు. లీకేజీని ఆపేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, నగరం వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి పొగవస్తున్న ప్రాంతాన్ని తాటిపాక ప్లాంట్ ఇంచార్జ్ విక్రాంత్ పరిశీలించారు. పైప్‌లైన్ తుప్పుబట్టి ఉండడంతోనే గ్యాస్ లీకవుతుందని ఆయన తెలిపారు. నిప్పు ఉంటే ప్రమాదమేనని ఆయన హెచ్చరించారు. నగరం గ్యాస్ పైపు పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తాటికాయల రాజ్యలక్ష్మి(25) ఆదివారం మృతి చెందింది.