దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..! | Indian Loco Pilot Forced to Expose Surgical Injury to Get Leave, Union Alleges | Sakshi
Sakshi News home page

దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!

Mar 4 2026 9:24 AM | Updated on Mar 4 2026 12:15 PM

Indian Loco Pilot Forced to Expose Surgical Injury to Get Leave, Union Alleges

న్యూఢిల్లీ: ఒక లోకో పైలట్‌ తనకు పైల్స్‌ (మొలలు) సర్జరీ అయ్యిందని, ఆ గాయం మానలేదని మొరపెట్టుకున్నా సంబంధిత అధికారి సెలవు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో, తన పరిస్థితిని నిరూపించుకోవడానికి చివరికి లోకోపైలట్‌ దుస్తులు విప్పి తన గాయాన్ని చూపించినా ఫలితం లేకపోయిందని లోకో స్టాఫ్‌ యూనియన్‌ ఆరోపించింది. లక్నో రైల్‌ డివిజన్‌లో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై విచారణ జరిపి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం డిమాండ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఘటనకు సంబంధించిన వీడియో రైల్వే ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. 

ఆ అధికారి తీరును ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నో రోజులుగా పైల్స్‌ సమస్యతో బాధపడుతున్న రాజేశ్‌ మీనా అనే లోకో పైలట్‌ ఇండోర్‌లో చికిత్స చేయించుకున్నారు. ఫలితం కని్పంచకపోవడంతో లక్నోలో ఫిబ్రవరి 22వ తేదీన సర్జరీ చేయించుకున్నారు. వారం రోజులైనా శస్త్రచికిత్స చేసిన ప్రాంతంలో నొప్పులు తగ్గడంలేదు. దీంతో, ఆయన చీఫ్‌ క్రూ కంట్రోలర్‌(సీసీసీ)రతన్‌ కుమార్‌ వద్దకు వెళ్లి సెలవు పొడిగించాలని కోరారు. వైద్యుడు ఇచి్చన నివేదికను, తాను వాడుతున్న మందులు, బ్యాండేజీలు, ఇతర నివేదికలన్నిటినీ ఆయన ముందుంచారు. అయినా, ఆ అధికారి ససేమిరా అన్నారు. 

దీంతో, మీనా ఆ అధికారికి నమ్మకం కలిగించేందుకు అప్పటికప్పుడు ప్యాంటు విప్పి, శస్త్రచికిత్స బ్యాండేజీలను చూపాల్సి వచి్చంది. గిరిజన వర్గానికి చెందిన రాజేశ్‌ మీనా చివరి ప్రయత్నంగా తన వర్గానికి చెందిన రైల్వే యూనియన్‌ నాయకులను ఆశ్రయించారు. వారి జోక్యంతో సెలవు ఎట్టకేలకు మంజూరయ్యింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతా మీనా ఓ వీడియో ద్వారా వివరించి, ఆన్‌లైన్‌లో ఉంచారు. ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆలిండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) నాయకులు రాజేశ్‌ మీనాకు అండగా ఉంటామని ప్రకటించారు. దీనిపై స్పందించేందుకు లక్నో డివిజన్‌ రైల్వే మేనేజర్‌ సునీల్‌ కుమార్‌ వర్మ నిరాకరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement