ఎన్నికల్లో నా పాత్ర ఉండాల్సిందే.. ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన ప్రకటన | USA Donald Trump Key Statement On Iran | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో నా పాత్ర ఉండాల్సిందే.. ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన ప్రకటన

Mar 6 2026 7:03 AM | Updated on Mar 6 2026 8:36 AM

USA Donald Trump Key Statement On Iran

వాషింగ్టన్‌: ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ ఎన్నిక ప్రక్రియలో తనను కచ్చితంగా భాగస్వామిని చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఆ పదవికి దివంగత నేత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు. గురువారం డిజిటల్‌ మీడియా సంస్థ ‘ఆక్సియోస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అధ్యక్షుడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు (ఇరాన్‌) సమయం వృథా చేస్తున్నారు. వెనెజువెలాలో డెల్సీ రోడ్రిగ్స్‌ అధ్యక్షురాలయ్యేందుకు సహకరించాను. అలాగే ఇరాన్‌ సుప్రీం నేత ఎన్నికలోనూ నా పాత్ర ఉండి తీరాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు.

సుప్రీం లీడర్‌ను ఇంకా ఎన్నుకోలేదు..
ఇరాన్‌ తన సుప్రీం నేతను ఇంకా అధికారికంగా ఎన్నుకోలేదని ఆ దేశ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. భారత్‌లో ఇరాన్‌ సుప్రీం నేత అధికారిక ప్రతినిధి అయతొల్లా అబ్దుల్‌ మజీద్‌ హకీం ఎలాహీ గురువారం ఈ మేరకు పేర్కొన్నారు. సుప్రీం నేత ఎన్నిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. గత శనివారం ఇజ్రాయెల్, ఇరాన్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ఆయన వారసునిగా రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ బుధవారం ఎన్నుకున్నట్టు వార్తలొచ్చాయి. అవి నిజం కాదని ఎలాహీ చెప్పుకొచ్చారు.

‘‘సుప్రీం నేత పదవికి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొజ్తబా పేరు కూడా వాటిలో ఒకటి. మొజ్తబా అర్హతల దృష్ట్యా బహుశా ఆయనను సుప్రీం నేత పదవికి కమిటీ పరిశీలించవచ్చేమో’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీం నేతగా ఎన్నికయ్యేవారిని వెంటనే మట్టుబెడతామని ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అయినా ఆయన ఎన్నికను గోప్యంగా ఉంచబోమని ఎలాహీ స్పష్టం చేశారు. తమ నాయకున్ని ఎలా కాపాడుకోవాలో ఇరాన్‌కు తెలుసన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement