పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాలి  | Narendra Modi remarks followed his talks with Finland President Alexander Stubb | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాలి 

Mar 6 2026 6:34 AM | Updated on Mar 6 2026 6:34 AM

Narendra Modi remarks followed his talks with Finland President Alexander Stubb

ఫిన్లాండ్‌ అధ్యక్షుడితో భేటీలో ప్రధాని మోదీ పిలుపు 

మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి స్టబ్‌ మద్దతు 

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదరకుండా తక్షణమే ముగింపు పలకాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సైనికపరమైన జోక్యం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని ఆయన చెప్పారు. ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన విభాగం భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి ఫిన్లాండ్‌ గట్టి మద్దతు దారుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు స్టబ్‌ తెలిపారు. 

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ, పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం మారిన భౌగోళిక పరిణామాలను ప్రతిఫలించేలా ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని స్టబ్‌ కోరారు. రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చర్చల సందర్భంగా ఇరు దేశాల నేతలు అంగీకరించారు. 

‘చట్టాలు, దౌత్యం, చర్చలపై భారత్, ఫిన్లాండ్‌లకు విశ్వాసముంది. సైనికపరంగా తలపడటం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం కనుగొనలేమనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చాం’అని ప్రధాని మోదీ అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలకు తక్షణమే ముగింపు పలకాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. భారత్‌–యూరప్‌ దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో ఎంతగానో మెరుగుపడ్డాయని తెలిపిన ప్రధాని మోదీ.. ఇది ప్రపంచ స్థిరతకు, అభివృద్ధికి దారితీస్తుందన్నారు. భారత్‌–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్, ఫిన్లాండ్‌ల మధ్య సంబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఫిన్లాండ్‌కు చెందిన టెలికం దిగ్గజ సంస్థ నోకియా భారత్‌లో చేపట్టిన వివిధ భారీ ప్రాజెక్టులను ఆయన మెచ్చుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement