92 దాటేసిన రూపాయి! | Rupee Hits Record Low as Iran Crisis Fuels Oil Surge Dollar Demand Soars | Sakshi
Sakshi News home page

92 దాటేసిన రూపాయి!

Mar 5 2026 8:19 AM | Updated on Mar 5 2026 8:58 AM

Rupee Hits Record Low as Iran Crisis Fuels Oil Surge Dollar Demand Soars

డాలర్‌ మారకంలో 56 పైసలు పతనం 

క్రూడ్, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ కారణం

ఇంట్రాడేలో 86 పైసలు డౌన్‌

ఇరాన్‌ సంక్షోభం నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలకు రెక్కలు రావడంతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్‌ మారకంలో 56 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ట స్థాయి 92.05 వద్ద స్థిరపడింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘రిస్క్ –ఆఫ్‌’ పరిస్థితులు నెలకొనడంతో స్టాక్స్, బాండ్‌ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలు బంగారం, వెండి ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో డాలర్‌ ఇండెక్స్‌ 98 స్థాయిని సులభంగా ఛేదించింది.

మరోవైపు ఇరాన్‌ యుద్ధం కారణంగా సరఫరా ఆందోళనలతో  బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర సైతం 1.29% పెరిగి 82.46 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు భయాలు తలెత్తాయి. ఈ పరిణామాలు రూపాయి కరిగిపోయేందుకు కారణమయ్యాయి’’ అని నిపుణులు తెలిపారు.  ఒక దశలో ఏకంగా 86 పైసలు కరిగిపోయి 92.35 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది.

2 రోజుల్లో రూ.16.32 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ సూచీల వరుస నష్టాలతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.16.32 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.447.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల మేర సంపద గల్లంతైంది.

ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!

Advertisement
 
Advertisement
Advertisement