ఇరాన్‌పై నిప్పుల వర్షం!  | West Asia conflict stretches to Lebanon as Israel strikes | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై నిప్పుల వర్షం! 

Mar 5 2026 4:19 AM | Updated on Mar 5 2026 9:15 AM

West Asia conflict stretches to Lebanon as Israel strikes

ఎడతెరిపి లేని దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, అమెరికా 

ఇరాన్‌ అణు ప్రాజెక్టు కేంద్రం ధ్వంసం 

ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతిదాడులు 

దుబాయ్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయంపై దాడి 

సౌదీ రాయబార కార్యాలయంపై, రిఫైనరీపై మళ్లీ దాడికి యత్నం 

టర్కీపై దాడులకు దిగిన ఇరాన్‌ పశ్చిమాసియాను లక్ష్యం చేసుకుంటాం

సైనిక, ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేస్తాం

రివల్యూషనరీ గార్డ్‌ తీవ్ర హెచ్చరికలు

దుబాయ్‌: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్‌తో పాటు లెబనాన్‌పైనా ఇజ్రాయెల్‌ బుధవారం ఐదో రోజు అక్షరాలా నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా టెహ్రాన్‌తో పాటు కోమ్, ఉరి్మయా, కెర్మన్‌షా తదితర నగరాలపై కూడా రోజంతా పలు దఫాలుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్‌లోని క్షిపణి నిల్వల కేంద్రంపై క్షిపణుల వర్షం కురిపించింది.

టెహ్రాన్‌ సమీపంలోని నూతన అణు ప్రాజెక్టు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన వైఏకే–130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్‌ గగనతలంలో కూల్చేసినట్టు సైన్యం వెల్లడించింది. దాడుల ధాటికి తాళలేక దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ఇరాన్‌ వాయిదా వేసుకుంది! ఇప్పటిదాకా ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. 

ఇరాన్‌లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్, నేవీ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్‌ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్‌ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. ఇరాన్‌లో ఇప్పటిదాకా 1,045 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరాన్‌ సైనిక సామర్థ్యం బాగా క్షీణించిందని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ ఎఫీ డెఫ్రిన్‌ పేర్కొన్నారు. దాంతో దాడుల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. 

బుధవారం ఇరాన్‌ కూడా దీటుగా ప్రతి దాడులకు దిగింది. జెరూసలేం తదితర నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతర్‌తో పాటు పలు గల్ఫ్‌ దేశాలపై కూడా దాడులను నిరి్నరోధంగా కొనసాగించింది. దుబాయ్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో కార్యాలయం భారీ మంటల్లో చిక్కింది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అక్కడి రస్‌ అనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా మళ్లీ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. 

బహ్రెయిన్‌లోని యూఎస్‌ నేవీ ఐదో ఫ్లీట్‌ వ్యవస్థపైనా ఇరాన్‌ క్షిపణుల వర్షం కురిపించింది. అంతేగాక తన దాడులను టరీ్కకి కూడా విస్తరించింది! ఇరాన్‌ నుంచి తమ గగనతలంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్‌ క్షిపణిని అడ్డుకున్నట్టు టర్కీ ప్రకటించింది. తమపై అకారణ దాడికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ ప్రకటించింది. పశ్చిమాసియాలోని సైనిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేందుకు సన్నద్ధం అవుతున్నామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది! 

లెబనాన్‌లో... 
లెబనాన్‌పై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్‌ బుధవారం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా వచి్చపడుతున్న క్షిపణులు, బాంబులతో బీరూట్‌ దద్దరిల్లిపోతోంది. అరమౌన్, సాదియత్‌ తదితర నగరాలపైనా దాడులు కొనసాగుతున్నాయి. బలైనట్టు తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామవాసులను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. దాడుల ధాటికి దక్షిణ లెబనాన్‌లో ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులుగా మారారు. బాల్‌బెక్‌లో ఓ నివాస సముదాయంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు, సాదియత్‌లో ఆరుగురు మరణించినట్టు లెబనాన్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement