రాజధాని కోసం అప్పుల వేట | Chandrababu Govt Forms Committee of Officials to Mobilize Revenue Sources | Sakshi
Sakshi News home page

రాజధాని కోసం అప్పుల వేట

Nov 18 2026 5:57 AM | Updated on Nov 18 2026 5:57 AM

Chandrababu Govt Forms Committee of Officials to Mobilize Revenue Sources

ఆదాయ వనరుల సమీకరణకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కారు 

రాజధానిలో రూ.90,092 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడి 

2027 నుంచి 2046 నాటికి ఆదాయం రూ.1.05లక్షల కోట్లు వస్తుందని అంచనా

ఇదే కాలానికి చెల్లించాల్సినది రూ.1.33లక్షల కోట్లు ఉంటుందని ప్రకటన  

లోటు రూ.27,954 కోట్లు  అని స్పష్టికరణ 

బ్యాంకుల నుంచి అప్పులు చేయడం, గ్రీన్‌ బాండ్ల జారీ, భూనగదీకరణపై కసరత్తు  

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాజెక్టుల కోసం అప్పులు చేయడం, ఆదాయ వనరులను సమీకరించడం కోసం చంద్రబాబు ప్రభుత్వం వేట ప్రారంభించింది. ఇందుకోసం అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో రూ.90,092 కోట్లతో 129 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో రూ.41,062 కోట్లతో 67 ప్రాజెక్టులకు నిధులు సమకూరాయని పేర్కొంది.

మిగిలిన రూ.49,030 కోట్ల వ్యయం కలిగిన 62 ప్రాజెక్టులకు ఇంకా నిధులు సమకూరాల్సి ఉందని వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి 2046 ఆర్థిక సంవత్సరం వరకు రాజధాని ఆర్థికప్రణాళిక ప్రకారం మొత్తం ఆదాయం రూ.1,05,348 కోట్లు వస్తుందని, అదే కాలానికి చెల్లించాల్సిన బాధ్యతలు రూ.1,33,302 కోట్లుగా అంచనా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

దీంతో రూ.27,954 కోట్లు ఆర్థిక లోటు ఏర్పడుతుందని సర్కారు స్పష్టంచేసింది. ఈ లోటును అధిగమించేందుకు భూమిని నగదీకరించడం, సొంత ఆదాయ వనరులను బలోపేతం చేయడం, బ్యాంకు రుణాలు పొందడం, గ్రీన్‌ బాండ్లు జారీ చేయడం, పీపీపీ, బహు పాక్షిక సంస్థల నుంచి ఆర్థిక మద్దతును పొందాల్సి ఉందని పేర్కొంది. 

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆర్థిక ప్రణాళికలపైనా సమీక్ష 
రాజధాని ఆర్థిక ప్రణాళికను సమీక్షించి తగిన సిఫార్సులు చేసేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ, క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సీఆర్‌డీఏ) అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) కార్యక్రమాల కింద రాజధాని నగరానికి సంబంధించిన సమగ్ర ఆర్థిక ప్రణాళికను పరిశీలించడంతోపాటు సమీక్షించాలని రాష్ట్ర స్థాయి కమిటీకి సూచించారు. రాష్ట్ర స్థాయి కమిటీ 60 రోజుల్లోగా ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

ఈ విధివిధానాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి
⇒  సొంత వనరుల ఆదాయం, ప్రాజెక్టు ఖర్చులు, వడ్డీ రేట్లు, కాలపరిమితులు     వంటి ప్రణాళికలోని కీలక అంచనాలను సమీక్షించడం.

⇒  సంవత్సరాల వారీగా నగదు ప్రవాహాలు, రుణ సేవా అవసరాల ఆధారంగా సీఆర్‌డీఏ తన రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడం.

⇒  భూమి నగదీకరణ, సొంత వనరుల ఆదాయం, బ్యాంకు రుణాలు, గ్రీన్‌ బాండ్లు, పీపీపీ, బహుపాక్షిక రుణాలు, ప్రభుత్వ మద్దతుతో సహా ప్రతిపాదిత నిధుల ప్రతి వనరును పరిశీలించి, వాటి సరైన మిశ్రమం, వ్యయం, సమయంపై సలహా ఇవ్వడం.

⇒  వ్యయాల పెరుగుదల, జాప్యం, భూమి అమ్మకాలలో మందగమనం, వడ్డీ రేట్లలో మార్పులు వంటి ప్రధాన ఆర్థిక నష్టాలను గుర్తించి, వాటిని తగ్గించడానికి చర్యలను సూచించడం.

⇒ ప్రణాళికను ఆర్థికంగా పటిష్టంగా, నిలకడగా చేయడానికి అవసరమైన మార్పులను సిఫార్సు చేయడంతోపాటు ప్రభుత్వం సూచించిన ఇతర సంబంధిత విషయాలను పరిశీలించడం.

⇒  2027 ఆర్థిక సంవత్సరం నుంచి 2046 ఆర్థిక సంవత్సరం వరకు ఆదాయం, బాధ్యతల అంచనాలను పరిశీలించడం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement