ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన వలలు! | Fishing Nets Fire Prakasam Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన వలలు!

Nov 18 2026 5:30 AM | Updated on Nov 18 2026 5:30 AM

Fishing Nets Fire Prakasam Andhra Pradesh

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కొత్తపట్నం పల్లెపాలెంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వలలను భద్రపరిచేందుకు ఉపయోగిస్తున్న ఓ స్లాబ్‌ షెల్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న వలలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

సుమారు 30 మంది మత్స్యకారులకు చెందిన వలలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. వాటి విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తుఫాన్ల ప్రభావంతో సముద్రంలో వేటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మత్స్యకారులు తమ వలలను తీరంలోని షెల్టర్‌లో భద్రపరిచారు. అయితే, అనుకోకుండా మంటలు చెలరేగడంతో వారి జీవనాధారమైన వలలు కళ్లముందే బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, వలలు త్వరగా మంటలు అంటుకోవడంతో అగ్ని తీవ్రత పెరిగింది. దీంతో సుమారు రెండు గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ వలలన్నీ పూర్తిగా కాలిపోయాయి.

అయితే, ఈ ప్రమాదంతో బాధిత మత్స్యకారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒక్కసారిగా ఈ ఘటనతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఎవరైనా కాలుతున్న సిగరెట్‌ను అక్కడ పడేయడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ జరిపి నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: పిల్లలకూ బాబు వంచన.. సాయం కోసం.. ‘తల్లుల వందనం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement