ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామని హామీలిచ్చి మూడేళ్లుగా బాబు మోసాలు
అన్ని అర్హతలున్నా లబ్ధిదారుల్లో కోతలు.. అంతా కాకి లెక్కలు
మిగిలిన వారికైనా సక్రమంగా ఇస్తోందా అంటే అదీ లేదు
2026–27లో సర్కారు లెక్కల ప్రకారం విద్యార్థుల సంఖ్య 78 లక్షలు
వీరికి ఇవ్వాల్సిన మొత్తం రూ.11,700 కోట్లు
అయితే రూ.10,120 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టు జూలైలో ఉత్తర్వులు
ఇక్కడే అర్హుల్లో కోత.. రూ.1,580 కోట్లు కట్
మిగతా వారిలో ఏకంగా 11.79 లక్షల మందికి రూపాయి ఇవ్వని వైనం
ఈ పథకం కింద లబ్ధిపొందిన వారిలో అత్యధికులకు రూ.8 వేలే
మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలో ఎంత ఇచ్చామన్నది వెల్లడించని ప్రభుత్వం
చంద్రబాబు సూపర్ సిక్స్ మోసాల ఖాతాలో మరో స్కీమ్
ఈ చిత్రంలో కనిపిస్తున్న అక్కా తమ్ముళ్లలో వైష్ణవి 8వ తరగతి చదువుతుండగా, రేశ్వంత్ 4వ తరగతి విద్యార్థి. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పీడీ కండ్రిగ గ్రామానికి చెందిన ఈ చిన్నారుల తల్లి నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.
తండ్రి మరో వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో వీరిద్దరినీ వృద్ధులైన తాత చిరంజీవి, అవ్వ విజయ సాకుతున్నారు. టీకేఎం పేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వీరికి తల్లికి వందనం పొందేందుకు అన్ని అర్హతలున్నా ఈ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా రాలేదు. అధికారులను అడిగితే ‘మీ ఖాతాలో నగదు పడుతుంది’ అని సమాధానం చెబుతున్నారేగానీ ఇంతవరకూ పైసా వచ్చింది లేదు.
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డకు చెందిన పులవర్తి రాజకుమారి గతంలో గ్రామ వలంటీర్‌గా సేవలందించారు. ఆమె భర్త వ్యవసాయ కూలీ కాగా ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకరు నాలుగో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు.
రెండు విద్యా సంవత్సరాల్లోనూ వీరికి తల్లికి వందనం డబ్బులు రాలేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరు రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం. ‘మాకు అన్ని అర్హతలున్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చారు.. ఇప్పుడెందుకు రాదు?’ అని వారు అడిగితే.. ఆ ప్రభుత్వంలో రూల్స్ వేరు.. ఈ ప్రభుత్వంలో వేరు అని చెబుతున్నారని వాపోయారు. ఇదే ఊళ్లో చాలా మంది పిల్లలకు ఇదే సమస్య.
సాక్షి, అమరావతి: గత ఎన్నికల ముందు చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం కాస్తా ఆయన దారుణ మోసాలతో ‘‘తల్లుల వందనం’’ కార్యక్రమంగా మారింది. అధికారంలోకి వస్తూనే ప్రభుత్వ విద్యా రంగాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి పిల్లల చదువులతో చెలగాటమాడిన చంద్రబాబు సర్కార్ కనీసం తల్లికి వందనం ద్వారా నైనా ఆర్థిక ఆసరాగా నిలవకుండా నయ వంచనకు పాల్పడుతోంది.
అసలు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విద్యార్థుల సంఖ్యలోనే కోతలు.. అంతా కాకి లెక్కలు! పోనీ వారికైనా సక్రమంగా అందరికీ చెప్పిన మొత్తం ఇస్తోందా? అంటే అదీ లేదు! అన్ని అర్హతలున్నా లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే విద్యా సంవత్సరం సగానికిపైగా గడిచిపోగా విడతల వారీగా అంటూ మోసాలతో కాలక్షేపం చేస్తోంది. తల్లికి వందనంపై చంద్రబాబు తన మార్కు మోసాలకు తెర తీశారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని అర్హతలున్నా అందరికీ ఇవ్వకుండా బాబు సర్కార్ ఎగ్గొడుతోందని మండిపడుతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు 78 లక్షల మంది ఉన్నారు. వీరికి ఈ పథకం కింద రూ. రూ.11,700 కోట్లు ఇవ్వాలి. అయితే రూ.10,120.78 కోట్లు మాత్రమే ఇస్తున్నట్లు జీవో ఎంఎస్ నం.16లో పేర్కొంది. అంటే ఇక్కడే లబ్ధిదారుల్లో భారీగా కోత వేసింది.
లక్షలాది మందిని అనర్హులుగా చేస్తూ రూ.1,580 కోట్లు కట్ చేసింది. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన వారిలో సైతం రికార్డులు సరి చేయాలనే నెపంతో 2,70,600 మందికి తర్వాత ఇస్తామని చెబుతూ ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులిచ్చింది. నిజానికి మొదటి విడతలోనే చాలా మందికి ఇంత వరకు డబ్బులు జమ కాలేదు. రెండో విడత ఆగస్టులో ఇస్తామన్న నిధులకు సంబంధించి అక్టోబర్‌లో జీవో ఇచ్చిన ప్రభుత్వం.. నెల రోజులు దాటినా చిల్లిగవ్వ విడుదల చేయలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి అన్ని అర్హతలున్నా వారిని అనర్హులను చేశారు. చంద్రబాబు సర్కార్ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టగా.. గత ఏడాది ఏకంగా 30 లక్షల మందికి ఎగనామం పెట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకూ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి చివరకు రూ.13 వేలకు తగ్గించింది.
కొందరికి రూ.10,900, ఇంకొందరికి రూ.10,500, మరికొందరికి రూ.9 వేలు, రూ.8,800 చొప్పున విదిలించి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా ఎగవేసింది. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే సూత్రాన్ని అమలు చేసింది. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన వారిలో సైతం ఏకంగా 11.79 లక్షల మందికి రూపాయి ఇవ్వకుండా మోసం చేసింది. ఈ పథకం కింద లబ్ధిపొందిన వారిలో అత్యధికులకు రూ.8 వేలే పడటం గమనార్హం. కానీ ఈ పథకాన్ని వంద శాతం అమలు చేశామని డబ్బా కొట్టుకుంటోంది.
లక్షల మంది అర్హుల కోత
ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు 78 లక్షల మంది విద్యార్థులున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ తల్లికి వందనం ఇవ్వాలి. కానీ తొలి విడతలో 64.76 లక్షల మందికి నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మిగిలిన 2.70 లక్షల మందికి రెండో విడత ఆగస్టులో ఇస్తామన్నారు. అయితే రెండో విడతలో మరో 58 వేల మంది లబ్ధిదారులు అదనంగా పెరిగారని అక్టోబర్ 10న ఇచ్చిన జీవో ఎంఎస్ నం.26లో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మరో 3.29 లక్షల మందికి వందనం డబ్బులు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. తమకు అన్ని అర్హతలున్నా డబ్బులు అందలేదని పేద తల్లులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పేవారే కరువయ్యారు.
డబ్బులివ్వకుండా మభ్యపెడుతూ..
టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న పాలన చేపట్టగా మరుసటి రోజు విద్యా సంవత్సరం ప్రారంభమైంది. 2023–24 విద్యా సంవత్సరం నిధులను 2024 జూన్‌లో జమ చేయాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం ఆ ఏడాది పూర్తిగా ఎగ్గొట్టింది.
2025–26లో ఒకటి నుంచి ఇంటర్ వరకు 67.27 లక్షల మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్లు తొలుత పేర్కొన్నారు. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం వారికి అడ్మిషన్లు తర్వాత ఇస్తామంటూ ఆ ఏడాది 54.94 లక్షల మందికే పథకం వర్తిస్తుందని జీవోలో ప్రకటించారు. తద్వారా గతేడాది లక్షల మంది అర్హులకు డబ్బులు జమ కాలేదు.
కానీ ప్రభుత్వం నిధులు జమ చేసినట్లు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని తల్లులు వాపోతున్నారు. 2026–27లో కూడా ఇదే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలో ఎంత ఇచ్చామన్నది మాత్రం రహస్యంగా ఉంచారు.
బాబూ.. దీన్నేమంటారు?
⇒ 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు 87.42 లక్షల మంది లబ్ధిదారులుంటే 30 లక్షల మందికి చంద్రబాబు సర్కార్ ఆదిలోనే ఎగవేసింది. మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పినా.. రూ.13 వేలకు తగ్గించింది. తీరా కొందరికి రూ.10,900, ఇంకొందరికి రూ.10,500, మరికొందరికి రూ.9 వేలు, రూ.8,800 చొప్పున సరిపుచ్చింది. సూపర్ సిక్స్‌లు సహా ప్రజలకిచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్ తల్లికి వందనంలోనూ అదే పంథా అనుసరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
⇒ చంద్రబాబు సర్కార్ తొలి ఏడాది 87.42 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద రూ.13,113 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... లబ్ధిదారుల డేటా లేదని, ఇంటింటి సర్వే తర్వాత నిధులు జమ చేస్తామని నమ్మబలికి తీరా డేటా వచ్చాక పూర్తిగా ఎగ్గొట్టింది.
⇒ 2025–26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 84 లక్షల మంది విద్యార్థులకు రూ.12,600 కోట్లు ఇవ్వాలి. కానీ పథకానికి బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు చూపించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కింద రూ.8,278 కోట్లు మాత్రమే కేటాయించింది. జీవోల్లో మొత్తం 67,27,164 మందికి పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించి, తొలి విడతలో 54,94,703 మందికి ఇస్తామని పేర్కొంది. మిగిలిన 12.32 లక్షల మందికి రెండో విడతలో ఇస్తామంటూ సగం మందికి పైగా ఇవ్వకుండా ఎగ్గొట్టింది.
⇒ 2026–27లో అధికారిక లెక్కల ప్రకారం 78 లక్షల మంది విద్యార్థులకు రూ.11,700 కోట్లు ఇవ్వాలి. అయితే 10,120.78 కోట్లు మాత్రమే ఇస్తామని జీవోల్లో పేర్కొంది. తద్వారా అర్హుల్లో భారీగా కోత విధించింది. మిగిలిన వారికి సైతం ఇన్‌స్టాల్‌మెంట్లలో అరకొరగా డబ్బు విదిలి్చంది. అసలు ఎంత మందికి ఎంతెంత ఇచ్చారన్న విషయాన్ని మాత్రం ఎక్కడా బయటకు వెల్లడించలేదు.
అందరికీ ఆర్థిక ప్రయోజనం ఎక్కడ?
మా పాప హన్విక గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. తల్లికి వందనం మొదటి విడతలో నగదు జమ కాలేదు. ఆధార్ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయించినా ఇప్పటివరకు నగదు జమ కాలేదు. అందరికీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలి.
– గాయత్రి, గుంటూరు


