తాడేపల్లి: రామోజీరావు జయంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం ప్రకటించడాన్ని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉందో రామోజీ పాత్ర కూడా అంతే ఉందని ఆమె అన్నారు. మోసాలు చేయడంలో వీరిద్దరూ గురుశిష్యులని చెప్పారు. తన గురువు జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిన చంద్రబాబు.. మామ ఎన్టీఆర్ విషయంలో మాత్రం భారతరత్న రాకుండా అడ్డుపడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
వెన్నుపోటుదారులకు రాష్ట్ర పండుగలా?:
ఎంత దారుణమైన ప్రభుత్వం ఇది? వెన్నుపోటుదారులకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారో, దగుల్బాజీ పనులు చేసే వారిని ఎంత గొప్పగా నిలబెడతారో రామోజీరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా ప్రకటించడాన్ని బట్టి అర్దమవుతోంది. ఆయన చనిపోయినప్పుడు కూడా ప్రజా ధనం రూ.10 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడలో ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు. దేనిలో ఆయన గొప్పవాడని మీరు అనుకుంటున్నారు? ఆయన ఓ జాతికి పిత. కమ్మ జాతికి పిత కావచ్చు.
కానీ ఆయన దేశ స్దాయిలో ఎంత గొప్పవాడూ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావిడి చూసి చాలా మంది బాధపడుతున్నారు. అందరికీ ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారు. ఎన్టీఆర్‌ని ముందు నుంచీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రామోజీరావు.
వంచన తెలివితేటలు ఉన్నా బలం లేని చంద్రబాబు వంటి వాడిని ముఖ్యమంత్రిని చేయడానికి, ఎన్టీఆర్‌ను గద్దె దింపడానికి వైజాగ్ డాల్ఫిన్ హోటల్లో సమావేశాలు పెట్టించిన వ్యక్తి రామోజీరావు. యథా గురువు, తథా శిష్యుడులా .. గురువుగారు చేసిన అన్యాయాల్ని శిష్యుడు కూడా చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబుకు ఆయన గొప్పగా కనిపించవచ్చు.కానీ అదంతా రాష్ట్ర ప్రజలపై రుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది? డబ్బు సంపాదించడం ఎలా అని ‘ధనవద్గీత’ రాసిన వ్యక్తి రామోజీరావు. ఈ ధనవద్గీతలో డబ్బు ఎలా అక్రమ మార్గాల్లో సంపాదించవచ్చు, జనానికి ఎలా టోకరా వేయొచ్చు, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలా డబ్పులు వసూలు చేయొచ్చన్న దాన్ని ఆయన రాష్ట్రానికి తెలియజేశాడు.
రామోజీ రుణం తీర్చుకుంటున్న బాబు
ఉండవల్లి అరుణ్‌కుమార్ మార్గదర్శిపై వేసిన కేసు చాలా ఏళ్లపాటు విచారణ జరగకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలుసు. రామోజీరావు సహకరించి ముఖ్యమంత్రిని చేశాడు కాబట్టి చంద్రబాబు ఇదంతా చేస్తున్నాడు. కానీ పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఎన్టీఆర్ చనిపోయి 30 ఏళ్లయింది. ఎన్టీఆర్ పేరుతో ఐదు లక్షల రూపాయలు ఇచ్చే అవార్డు కూడా ఉంది. ఆ అవార్డు మధ్యలో ఒకసారి కృష్ణ గారికి ఇచ్చినట్లున్నారు. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని చంద్రబాబు ఎందుకు నిర్వహించడం లేదు? ఎన్టీఆర్ పట్ల ఆయనకు ఎంత ద్వేషం ఉందో దీన్ని బట్టి అర్దమవుతోంది. అమరావతిలో నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానంటాడు కానీ, ఆయన పేరు చిరస్ధాయిలో ఉండేలా ఏమీ చేయడం లేదు.
రామోజీ ఏ విషయంలో ఆదర్శమూర్తి?
చంద్రబాబుకు రామోజీరావు ఏ విషయంలో ఆదర్శమూర్తో చెప్పాలి. కేవలం దొంగతనాలు, దోపిడీలు, వంచనాలు చేయడానికి, వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడానికి నీ గురువు గారి దగ్గర శిక్షణ తీసుకున్నావు అంతే కదా. దొంగను దొంగ సన్మానం చేసినట్లు ఇది ఉంది. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదిని సైతం ప్రపంచ తీవ్రవాదులు సన్మానం చేశారు. అలాగే నీ గురువును కూడా నువ్వు సన్మానాలు చేస్తున్నట్లుంది. నీ గురువు మీద అభిమానం చాటుకునేందుకు ప్రజల మీద ఎందుకు భారం వేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఒకప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రిక నడిపినా, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి వంటి పత్రికలు వచ్చినా ఎప్పుడూ దిగజారలేదు. కానీ ఒళ్లు అమ్ముకునే స్థాయికి పత్రికను దిగజార్చిన రామోజీరావును ఆదర్శమూర్తి అని రాష్ట్ర పండుగ చేయానుకోవడం ఏంటో అర్దం కావడం లేదు.

మార్గదర్శి వ్యవహారంలో రామోజీ ఆర్ధిక నేరగాడని ఆర్బీఐ చెప్పింది. నిబంధనలకు విరుద్దంగా ఆయన సంస్దలు నడుపుతున్నాడని కోర్టులు కూడా ఘోషించాయి. ఎప్పటికప్పుడు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈయన బాధితులు ఎంతో మంది రోడ్డుకెక్కారు. ఇలా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని గొప్పగా చూపించాలని చంద్రబాబు ఎందుకు తాపత్రయపడుతున్నారు. రామోజీరావు వంటి వ్యక్తి ఈ వ్యవస్ధలో ఉండకూడదని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో చెప్పలేదా, అలాంటి వ్యక్తిని నిలబెట్టడానికి చంద్రబాబుకు ఎందుకింత ఆరాటం?’ అని ప్రశ్నించారు.
రామోజీ–చంద్రబాబు కలిసే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు
‘ఫిలింసిటీ కోసం భూములు కావాలంటే ఎన్టీఆర్ ఇవ్వలేదు. అందుకే ఆయనపై ద్వేషం పెంచుకుని కథనాలు రాశారు. అపాయింట్మెంట్ ఇచ్చాక కూడా ఎన్టీఆర్ ను తీసుకుని నేను వెళ్తే ఆయన తలుపు కూడా తీయలేదు. ఛీ ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది అని ఎన్టీఆర్ నాతో చెప్పారు. ఈయన పచ్చళ్ల వ్యాపారంలో మోసం చూసి విదేశాలు నిషేధించలేదా, ఈయనకు ఫైనాన్స్ కంపెనీ కూడా జార్జిరెడ్డి గారి వల్లే కదా వచ్చింది. ఆయన మీదే దొంగ కేసు పెట్టించి, ఆ భయంతో ఆయన పారిపోతే ఆ సంస్థల్ని తన హస్తగతం చేసుకున్నారు.
ఢిల్లీలో చిన్న ఉద్యోగం చేసుకున్న రామోజీరావు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు, ఎంత మందిని ముంచితే ఇక్కడికి రాగలిగారు? ఇంత మంది తప్పుబట్టిన వ్యక్తి మీకెలా ఆదర్శమయ్యాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి రామోజీరావు శ్రీధర్ అనే కార్టూనిస్టు వేసిన కార్టూన్లు ఇప్పటికీ మర్చిపోలేం. హీనమైన సంస్కారం కలిగిన వాళ్లు, వెన్నుపోటుదారులకు బతికున్నా, చచ్చినా గౌరవం ఇవ్వలేం. దేశమంతా అభిమానులున్న ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్లను రాష్ట్రంలో గొప్పోళ్లు అని చెప్పుకుంటారా మీరు ?
ఎన్టీఆర్ పదవి పోయాక ఇంటికి పరామర్శ కోసం వచ్చిన రామోజీరావు.. వ్యంగంగా నేను తల్చుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలనని మాట్లాడారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు వెనుక ఉండి, ఆయన పదవి కోల్పోయాక ఇంటికి వచ్చి ఇలాంటి పలకరింపులు చేయడం శాడిజం కాగా, శాడిజానికి నంబర్ వన్ రామోజీరావు, నంబర్ టూ చంద్రబాబు, నంబర్ త్రీ లోకేష్. ఎన్టీఆర్ పదవి పోయాక ఎలా ఉన్నారని రామోజీరావు ప్రశ్నిస్తే.. నేను ఆల్ రైట్ అని ఆయన సమాధానం ఇచ్చారు. మీ పాత సినిమాలన్నీ కొన్నానని వెటకారపు మాటలు మాట్లాడారు. ఈటీవీ ప్రారంభానికి ముందు రోజే ఈ వెన్నుపోటు కుట్ర ప్రారంభమైంది. రామోజీ ఈ ప్లాన్ పెట్టుకుని వెన్నుపోటు కుట్రకు సహకరించారు. వైశ్రాయ్ హోటల్ దగ్గర ఎవరూ లేకపోయినా గంట గంటకూ బులిటెన్లు పెట్టి గంట గంటకూ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని తప్పుడు వార్తలు వేసి రాజకీయాలు చేశారు.
అలాంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర పండుగగా జరిపిస్తానని చంద్రబాబు చెప్పడం దిగజారుడుతనమే కదా. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు, రామోజీ ముఖ్యమంత్రి అని పత్రికలు రాశాయి. రామోజీ ఆదేశాల ప్రకారమే అప్పట్లో ప్రభుత్వం నడుచుకునేది. ఓ కార్యక్రమంలో రామోజీ పెద్ద కుర్చీ వేయించుకుంటే, సీఎంగా ఉన్న చంద్రబాబు చిన్న కుర్చీ వేసుకుని కూర్చొన్నాడు. దీన్ని బట్టి చంద్రబాబును రామోజీ ఎలా చూసేవాడో తెలుస్తుంది. అయినా చంద్రబాబుకు ఎలాంటి సిగ్గూ లేదు’ అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ‘వినతి పత్రాలు ఇస్తున్నా.. నామినేషన్లు వేయనివ్వడం లేదు’


