విజయవాడ: తాము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నామని అయినప్పటికీ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, నవంబర్ 17వ తేదీ) రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి నేతల అరాచకాలపై ఫిర్యాదు చేశారు.
ఎస్‌ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, మరో నేత నారాయణమూర్తిలు ఉన్నారు.ఎస్‌ఈసీని కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు
కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ మేం వచ్చి వినతులు ఇస్తూనే ఉన్నాం.. అయినా నామినేషన్లు వేయనివ్వడం లేదు. చివరి రోజు రాయచోటి లాంటి చోట నామినేషన్లు వేయనివ్వడం లేదు. మా అభ్యర్ధులను నామినేషన్లు వేయనివ్వకుండా, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ విధానాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయచోటిలో మంత్రి ఆదేశాల మేరకు ఫాలో అవుతున్నారు. పంచాయితీ ఎన్నికలకు కూడా ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది. ఓటమి భయంలోనే మా అభ్యర్ధులను నామినేషన్లు వేయనివ్వడం లేదు..
రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి జరుగుతున్న వ్యతిరేక కార్యక్రమాలు ఎస్‌ఈసీకి చెప్పాం. నామినేషన్లు వేయకుండా చేస్తున్నారు. ఎస్ఈసీ ఆఫీసు 23 మెట్లు వందల సార్లు ఎక్కాం. అధికారులు వెన్నుపోటు పార్టీ నాయకులకు అండగా ఎన్నికలు చేస్తున్నారు. 2029 లో మా ప్రభుత్వం వచ్చాక అన్నిటిపైనా ఎంక్వైరీ చేస్తాం.
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్ళాం. పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా క్షేత్రస్ధాయిలో పని చేస్తోంది. ఎలక్షన్ల సమయంలో యంత్రాంగం ఎస్ఈసీ కనుసన్నల్లో పని చేయాలి. రాయచోటి నియోజకవర్గంలో నామినేషన్లు వేయనివ్వడం లేదు. అన్నమయ్య జిల్లా అధికారులు ఎస్ఈసీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది. అంబటి మురళి అనే వ్యక్తిని బాపట్లలో హౌస్ అరెస్ట్ చేసారు. రాయచోటి లో శ్రీకాంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసారు. గుడివాడ మున్సిపాలిటీలో 7, 27 వార్డులలో నామినేషన్లు రిజెక్ట్ చేస్తున్నారు. టీడీపీ నామినేషన్లు ఎలా ఉన్నప్పటికీ ఓకె అవుతున్నాయి.. ఎస్ఈసీ దృష్టికి తీసుకొస్తే తూ తూ మంత్రంగా చేస్తున్నారు. ఎస్ఈసీ ఎందుకు పట్టనట్టు ఉంటున్నారు’ అని మండిపడ్డారు.
మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ అధికార కూటమి కొత్త పద్ధతులకు పాల్పడుతోంది. నామినేషన్లు వేయాల్సిన వారిని 307 కేసుల్లో ఇరికిస్తున్నారు. చాలామందిని నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరిస్తున్నారు. నామినేషన్లలో అన్నీ సరిగానే ఉన్నా స్క్రూటినీ లో రిజెక్ట్ చేస్తున్నారు. మా అభ్యర్ధులను కిడ్నాప్ చేస్తున్నారు. టీడీపీ కుట్ర పూరితంగా పని చేస్తోంది. టీడీపీకి అండగా రెవెన్యూ, పోలీసు అధికారులు పని చేస్తున్నారు’ అని విమర్శించారు.
ఇదీ చదవండి: అక్రమంగా వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ


