గుంటూరు: కూటమి ప్రభుత్వం తీరు మారలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలు సృష్టించడంపైనే దృష్టి పెట్టిన కూటమి పెద్దలు.. మళ్లీ మళ్లీ అదే కుట్రలకు తెరలేపుతున్నారు. ఎన్నికల అధికారుల్ని, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారు.
ఇందుకు పొన్నూరు వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డ బీబీ జాన్ నాసర్ నామినేషన్‌ను తిరస్కరించడమే ఉదాహరణ. కావాలనే బీబీ జాన్ నాసర్ నామినేషన్‌ను తిరస్కరించడంపై పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ అంబటి మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై అడగటానికి వెళ్లిన అంబటి మురళీని సైతం పోలీసులు అడ్డుకున్నారు. బీబీ జాన్ నాసర్ నామినేషన్ ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో అడగటానికి వెళుతున్న క్రమంలో మున్సిపల్ కార్యాలయం గేటు బయటే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో పోలీసులకు అంబటి మురళీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారని పోలీసుల్ని సైతం ప్రశ్నించారు అంబటి మురళి. దాంతో అంబటి మురళిని అక్రమంగా అరెస్టు చేశారు పోలీసులు. ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు చేబ్రోలు పీఎస్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఓటుతోనే టీడీపీకి బుద్ధి చెప్పాలి: వైఎస్ అవినాష్‌రెడ్డి


