సాక్షి, వైఎస్సార్ జిల్లా: వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడిందని మండిపడ్డారు. పులివెందులలో 166 పోలింగ్ బూత్‌ల్లో ఎన్నికలు జరిగాయని.. అందులో సగం పోలింగ్ బూత్‌లను టీడీపీ స్వాధీనం చేసుకొని దౌర్జన్యాలకు పాల్పడిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎస్ఈసీ, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ‘‘వైఎస్ జగన్ హయాంలో వేంపల్లి అభివృద్ధి పరుగులు పెట్టింది. రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక వేంపల్లిలో అభివృద్ధి, శాంతిభద్రతలు క్షీణించాయి.
..అజయ్ రెడ్డిపై హాకీ కర్రలతో దాడి మొదలుకొని నేటి వరకు అదే తంతును కూటమి నాయకులు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్, రైస్ మిల్లుపై అక్రమ దాడులు చేసి సీజ్ చేశారు. వేంపల్లి అభివృద్ధి, శాంతి భద్రతల కోసం ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలి’’ అని వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: జనసేన నేతల వసూళ్ల కేసులో మరో ట్విస్ట్


