ఒకరిని దించుతా.. మరొకరిని ఎక్కిస్తా! | AP BJP Leaders Internal Fight In Kurnool District | Sakshi
Sakshi News home page

ఒకరిని దించుతా.. మరొకరిని ఎక్కిస్తా!

Nov 17 2026 12:09 PM | Updated on Nov 17 2026 12:13 PM

AP BJP Leaders Internal Fight In Kurnool District

బి.పురుషోత్తమ రెడ్డి, పి.వి.పార్థసారథి

ఆదోని(కర్నూలు): బీజీపీ నాయకుడు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.పురుషోత్తమ రెడ్డి ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో పుష్ప–2 సినిమాలో హీరో ముఖ్యమంత్రిని గద్దె దించి మరో వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టినట్లుగానే ఆదోనిలో కూడా ఓ నాయకుడిని దించి మరొకరిని ఆ స్థానంలో కూర్చోబెడతానని ప్రకటించారు. తన వ్యాఖ్యల్లో ఆయన ఎవరి పేరు ను నేరుగా ప్రస్తావించకపోయినా మాటల వెనుక ఉన్న రాజకీయ అంతరార్థంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆదోని కూటమి ఎమ్మెల్యే బీజేపీకి చెందిన డాక్టర్‌ పార్థసారథి లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు రాజకీ య వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆదోనిలో కూటమి అధికారంలో ఉన్నా స్థానికంగా టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయ సమీకరణాలు, ఆధిపత్య పోరు ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకుడే  ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతను దించుతానని వ్యాఖ్యా నించడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 

19 మందిలో ముగ్గురేనా..అధిష్టానం గుర్రు? 
ఇటీవల జరిగిన ఆదోని మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కూడా ఈ రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి.  బీజేపీ తరపున 19 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు బరిలో నిలువగా వారిలో కేవలం ముగ్గురు విజయం సాధించడం రాజకీయంగా చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్యేగా పార్థసారథి ఉండి కూడా పార్టీ అభ్యర్థులను ఆశించిన స్థాయిలో గెలిపించుకోలేకపోయారన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పనితీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

కూటమిలో కొత్త చిచ్చు రగులుతోందా? 
రాష్ట్ర స్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా కొనసాగుతున్నాయి. కానీ స్థానిక రాజకీయాల్లో మాత్రం పార్టీల మధ్య ఆధిపత్యం, నాయకత్వం, భవిష్యత్తు రాజకీయ అవకాశాలపై భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పురుషోత్తమ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య కొత్త చర్చకు కారణమయ్యాయి. ఆయన చెప్పినట్లు ఆదోనిలో ఒక నాయకుడని దించి మరొకరిని ఎక్కించే రాజకీయ శక్తి ఆయనకు ఉందా? ఆ స్థానంలోకి రావాల్సిన నాయకుడు ఎవరు? ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా రాజకీయ కార్యాచరణ ఉందా? అనే ప్ర శ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హైకోర్టు న్యాయవాది బి.పురుషోత్తమ రెడ్డి విసిరిన ‘దించుతా.. ఎక్కిస్తా’ సవాల్‌ ఆదోని రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మరి ఆయన మాటలు కేవలం డైలాగ్‌కే పరిమితమవుతాయా? లేక స్థా నిక రాజకీయాల్లో నిజంగానే నాయకత్వ మార్పునకు దారితీస్తాయా? అన్నది వేచి చూడాలి.    

ఇదీ చదవండి: అలా అయితే పొత్తుకు టాటా..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement