నోచిన నోములు నెరవేరాయని ఆనంద దీపం... కోరిన కోర్కెలు పండాలని ఆశల దీపం..కుటుంబంలో వెలుగులు విరజిమ్మాలని కొండంత దీపం... అందరూ బాగుండాలని అపురూప దీపం... ఇలా మదినిండా భక్తి భావంతో భక్తులు దీపాలు వెలిగించారు. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో చేపట్టిన ఈ దీపారాధనలతో ఆధ్యాత్మిక వెలుగులు ప్రకాశించాయి. మరో వైపు లక్ష దీపోత్సవ కార్యక్రమం భక్తులను పరవశింపజేయగా..శివ నామస్మరణ మార్మోగింది.
● శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
● మార్మోగిన శివనామస్మరణ
● వైభవంగా లక్షదీపోత్సవం
శ్రీశైలం: భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రాంగణానికి ఈశాన్యంలో ఉన్న పుష్కరిణి వద్ద వేలాదిగా భక్తులు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని పుష్కరిణి వద్ద దీపాలను వెలిగించారు. దీంతో ఆ ప్రాంగణమంతా దీపకాంతుల శోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి ముందు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అధిష్టింపజేసి ఊరేగింపుగా పుష్కరిని వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక వాహన పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అర్చకులు, వేద పండితులు జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఉభయ దేవాలయాల అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య దశవిధ హారతులు పుష్కరిణికి ఇచ్చారు.
త్రిశూల హారతి ఇస్తున్న అర్చకుడు
కార్తీక దీపం వదులుతున్న మహిళ


