breaking news
Kurnool District Latest News
-
దూసుకొచ్చిన మృత్యువు
● నిలిచిన లారీని ఢీకొన్న బొలెరో ● అదుపు తప్పి డివైడర్ ఆవల వైపు కారు పైకి దూసుకొచ్చిన వైనం ● కారులో ఉన్న తల్లీ, కుమార్తె మృతి ● గాయాలతో బయటపడిన తండ్రి, కుమారుడు ఎమ్మిగనూరురూరల్: తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బనవాసి గ్రామానికి చెందిన తల్లీ, కుమార్తె మృతి చెందారు. మండల పరిధిలోని బనవాసి గ్రామానికి చెందిన సర్పంచ్ లక్ష్మీదేవి, నల్లారెడ్డి దంపతుల కుమారుడు బసిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇతనికి భార్య రాధ(42), కుమార్తె లక్ష్మీదుర్గ(8), కుమారుడు ఠాగూర్‌రెడ్డి ఉన్నారు. బసిరెడ్డి కుమార్తెకు పుట్టినప్పుటి నుంచి ఆరోగ్యం బాగలేకపోవటంతో చికిత్స చేయిస్తున్నారు. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ వైద్యం అందిస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం బనవాసికి వచ్చిన వీరి చికిత్స నిమిత్తం సోమవారం మధ్యాహ్నం కారులో హైదరాబాద్‌కు భార్య, పిల్లలతో బసిరెడ్డి బయలుదేరాడు. మార్గమధ్యలో జానంపేట సమీపంలో నిలిచి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదరుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న రాధ (42), వెనక సీటులో లక్ష్మీదుర్గ(8) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్‌లో ఉన్న బసిరెడ్డి, కుమారుడు ఠాగూర్‌రెడ్డి గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తల్లీబిడ్డలో మృతి చెందారనే విషయం తెలియటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పోలీసుల ‘పచ్చ’పాతం!
● వైఎస్సార్సీపీ వర్గీయుడిని చితకబాదిన టీడీపీ మద్దతుదారులు ● విచారణ చేయకుండానే బాధితుడిపైనే పోలీసుల కేసు నమోదు బండిఆత్మకూరు: బాధితుల పక్షాన నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి దాసోహమవుతున్నారు. టీడీపీ నేతలు, మద్దతుదారులు చెప్పిందే వేదంలా భావిస్తూ జీ హూజూర్ అంటున్నారు. ఇందుకు బండిఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం. ఆదివారం సాయంత్రం టీడీపీ మద్దతుదారుల చేతిలో దాడికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం పొలం వద్ద పూడ్చిన సాగునీటి కాలువ విషయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారుడు దాసరి నడిపెన్న స్థానిక పోలీస్ స్టేషన్లో నాగరాజుపై ఆదివారం ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక ఎస్ఐ జగన్మోహన్ పిలుపుతో నాగరాజు స్టేషన్‌కు వెళ్లి సమస్యను వివరించాడు. అయితే టీడీపీ మద్దతుదారులకు అనుకూలంగా నడుచుకోవాలని సూచించడంతో అందుకు ఒప్పుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో గ్రామంలోని ఫిల్టర్ వాటర్ ప్లాంట్ వద్దకు రాగానే దాసరి నడిపెన్న, చిన్న మల్లికార్జున, యువరాజు, దాసరి వంశీ.. నాగరాజు బైక్ ఆపి కేకలు వేస్తూ తిట్ల దండకం అందుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా నాగరాజుపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకుని తీవ్ర గాయాలపాలైన నాగరాజును నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నాగరాజుపై దాడికి పాల్పడిన టీడీపీ మద్దతుదారులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ జగన్మోహన్ విచారణ చేపట్టకుండానే వైఎస్సార్సీపీ వర్గీయుడిపై కేసు నమోదు చేయడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవాలను పక్కనపెట్టి టీడీపీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజుపై సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై ఎస్ఐను వివరణగా కోరగా.. నాగరాజు తప్పిదం ఉండటతో కేసు నమోదు చేశామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజును సోమవారం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బారెడ్డి విజయభాస్కర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు పక్షపాత వైఖరిని వీడి బాధితులకు న్యాయం చేయాలని హితవు పలికారు. -
బిల్వ స్వర్గం, వాల్మీకి గుహలపై ప్రచారం కల్పించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలోని బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలపై ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో పర్యాటక సమాచార స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. పర్యాటక సమాచారాన్ని ప్రజలకు చేరవేసే దిశగా జిల్లాలోని అన్ని గ్రామ సచివాలయాలలో పర్యాటక సమాచార స్టిక్కర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల క్షేత్ర పర్యటనల్లో బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలను చేర్చాలని, ఉపాధ్యాయుల ద్వారా ఫీల్డ్ విజిట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకం, ఈకో టూరిజం, సహజ గుహలు వంటి విభిన్న ఆకర్షణలు కలగలిసిన నంద్యాల జిల్లా పర్యాటకులకు అనుకూలమైన జిల్లాగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, టూరిజం అధికారి ఉమాదేవి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, బెలుం గుహల యూనిట్ మేనేజర్ కిశోర్, బిల్వ స్వర్గం యూనిట్ మేనేజర్ మధుమోహన్‌రెడ్డి, వాల్మీకి గుహల యూనిట్ మేనేజర్ గిరి పాల్గొన్నారు. -
బిల్వ స్వర్గం, వాల్మీకి గుహలపై ప్రచారం కల్పించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలోని బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలపై ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో పర్యాటక సమాచార స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. పర్యాటక సమాచారాన్ని ప్రజలకు చేరవేసే దిశగా జిల్లాలోని అన్ని గ్రామ సచివాలయాలలో పర్యాటక సమాచార స్టిక్కర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల క్షేత్ర పర్యటనల్లో బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలను చేర్చాలని, ఉపాధ్యాయుల ద్వారా ఫీల్డ్ విజిట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకం, ఈకో టూరిజం, సహజ గుహలు వంటి విభిన్న ఆకర్షణలు కలగలిసిన నంద్యాల జిల్లా పర్యాటకులకు అనుకూలమైన జిల్లాగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, టూరిజం అధికారి ఉమాదేవి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, బెలుం గుహల యూనిట్ మేనేజర్ కిశోర్, బిల్వ స్వర్గం యూనిట్ మేనేజర్ మధుమోహన్‌రెడ్డి, వాల్మీకి గుహల యూనిట్ మేనేజర్ గిరి పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం చెల్లించాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె, శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్–బేవరేజెస్ క్యాంప కో లా కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహా రం వెంటనే చెల్లించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అలాగే భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలన్నారు. కాల్వ, హుస్సేనాపురం ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్లు వేయడం అన్యాయమని, ముందు వారికి పరిహారం చెల్లించాలని కోరారు. పీజీఆర్ఎస్ అర్జీలను త్వరగా పరిష్కరించండి పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువులోపు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా బాధితులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. కాగా, సోమవారం మొత్తం 270 అర్జీలు రాగా, అందులో రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 167 ఉండగా..మిగిలిన అర్జీలను శాఖల వారీగా విభజించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసినట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. కార్యక్రమంలో జేసీ నూరుల్లా ఖమర్, హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు. -
గురుశిష్యుల బంధానికి ప్రతీక
● 25న బొమ్మిరెడ్డిపల్లె పామయ్య తాత తిరుణాల వెల్దుర్తి: గురుశిష్యుల బంధానికి, రెండు గ్రామాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధానికి పామయ్య తిరుణాల ప్రతీకగా నిలుస్తోంది. అవధూత లద్దగిరి పెద్దరాందాసు అంశగా పిలిచే బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన పామయ్య తాత వర్ధంతి ఈనెల 25న ఆదివారం (తెలుగు సంవత్సరం మాఘమాసం తొలి ఆదివారం) సందర్భంగా ఏటా అదే రోజున తిరుణాల జరుపుకుంటున్నారు. మండల పరిధిలోని నార్లాపురం గ్రామం పెనికలపాటి వంశీయులు ఎడ్లబండ్ల ద్వారా తీసుకువచ్చే తొలి నైవేద్యంతో, తాత వారసులైన బొమ్మిరెడ్డిపల్లె వాసులు అర్చకులై చేసే పూజలతో తిరుణాల ప్రారంభమవుతుంది. పూర్వం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన గొల్ల పామయ్య, నార్లాపురం రైతు పెనికలపాటి హనుమంతయ్య గొర్రెల కాపర్లుగా కొండలు, గుట్టల వెంబడి సంచరించేవారు. అయితే పామయ్య తన మహిమలతో అద్భుతాలు సృష్టిస్తుండటంతో హనుమంతయ్య శిష్యుడిగా మారి అతని సేవలో తరించాడు. పామయ్య తాత పరమదించగా బొమ్మిరెడ్డిపల్లె సమీపంలో సమాధి చేశారు. గ్రామస్తులు ఆలయాన్ని నిర్మిస్తుండగా నాటి బ్రిటీష్ కలెక్టర్ అడ్డుపడి అనారోగ్యం పాలై తాత మహిమలు గుర్తించి, తిరిగి ఆలయ నిర్మాణానికి సహకరించినట్లు గ్రామస్తులు చెబుతారు. 1930లో శిష్యుడు హనుమంతయ్య పరమపదించగా పామయ్య గుడి పక్కనే శిష్యున్ని సమాధి చేశారు. పామయ్య తాత గుడి నిర్వహణకు శిష్యుడు హనుమంతయ్య వంశీయులు సొంత పొలం రెండెకరాలు కేటాయించి, హనుమంతయ్యకు సైతం గుడి నిర్మించారు. పామయ్య తాత తిరుణాల నాడు పక్కపక్కనే ఉన్న గురుశిష్యుల సమాధుల వద్ద భక్తులు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. శిష్యుడైన పెనికలపాటి హనుమంతయ్య పద్ధతి మేరకు ఆయన వంశీయులు ఇప్పటికీ ఆనవాయితీగా తిరుణాల రోజు ఎద్దులబండ్లపై తొలినైవేద్యం బొమ్మిరెడ్డిపల్లె పామయ్యతాత సమాధి వద్ద సమర్పిస్తూ వస్తున్నారు.మూడు రోజుల వేడుకలు పామయ్య తిరుణాల పురస్కరించుకుని వర్ధంతి నాడు ఈనెల 25న ఆదివారం ప్రత్యేక పూజలు, రాత్రి చెక్కభజన, నందికోలసేవ అనంతరం పంచమాంకములు డ్రామా నిర్వహిస్తున్నారు. 26వ తేదీ సోమవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇరు గ్రామాల ప్రజలు, వారి బంధువులు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు గురుశిష్యుల ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తిరుణాలలో భాగంగా 26న రాష్ట్రస్థాయి వృషభాల బండలాగుడు పోటీలు, 27న గిరక బండి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల వివరాలకు 8328252686, 9398809593ను సంప్రదించాలన్నారు. -
సమస్యను రాసేవారు ‘లేఖ’..
సమస్యను పరిష్కరించేందుకు సూదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అర్జీ తయారీ కూడా సమస్యగానే మారుతోంది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకోక పోవడంతో చివరకు కలెక్టర్‌కు చెప్పుకోవాలని ఎంతో ఆశతో కలెక్టరేట్ చేరుకుంటారు. అయితే చాలా మంది నిరక్షరాస్యులు కావడంతో సొంతంగా వారు అర్జీ రాసుకోలేరు. వీరంతా పదో, పదిహేనో ఇచ్చి కలెక్టరేట్ వెలుపల, లోపల అందుబాటులో ఉండే లేఖరులతో తమ అర్జీలను రాయించుకోవాల్సి వస్తోంది. అయితే కలెక్టర్‌గా డాక్టర్ ఏ.సిరి వచ్చిన తరువాత అర్జీలను లేఖరులకు బదులుగా అధికారులే రాసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక బయటి వ్యక్తులు ఎవరూ అర్జీలు రాకూడదని..కలెక్టరేట్లో ఉండకూడదని ఆదేశించారు. అయితే కొందరు అధికారులు అర్జీలు రాసి ఇవ్వకపోవడంతో ప్రజలు తమ అర్జీల కోసం కలెక్టరేట్ వెలుపల రోడ్లపైనే అర్జీలు రాయించుకుంటున్నారు. అటు ఇటుగా వాహనాలు వెళ్తున్నా అర్జీ రాయించుకోవడం కోసం రోడ్డుపైనే కూర్చోవాల్సి వస్తోంది. ఈ దృశ్యాలు ప్రజల సమస్యలకు అద్దం పడుతోంది. – కర్నూలు(సెంట్రల్) -
ఏర్పాట్లు పూర్తయ్యేదెన్నడు!
కొత్తపల్లి: వసంత పంచమికి మూడురోజులే వ్యవధి ఉన్నా కొలనుభారతి క్షేత్రంలో ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈనెల 23వ తేదీ సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీశైలం దేవస్థానం కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్న వేడుకలు కావడంతో భక్తులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఘనమైన ఏర్పాట్లు చేస్తారని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సప్త శివాలయాల చుట్టూ ఉన్న బేస్ మట్టానికి సున్నం, సర్పంచు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత పనులు తప్పా ఎటువంటి పనులు ప్రారంభించలేదు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. క్యూలైన్లు, తాగునీటి ప్లాంట్, రహదారి మరమ్మతులు, పార్కింగ్ ఏర్పాట్లు, చారుఘోషిని నది కొలను శుభ్రత చేపట్టలేదు. మూడు రోజులే వ్యవధి ఉండటంతో ఏర్పాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైల దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. -
రూ. 2 కోట్ల ఆస్తి రాములోరికి ధారాదత్తం
కర్నూలు జిల్లా: జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు సమీపంలోని మాధవరం గ్రామంలో సీతారాముల దేవాలయానికి భూరి విరాళం ఇచ్చారు. జలదుర్గం రెవెన్యూ పరిధిలో తమ పేరిట ఉన్న రూ. 2 కోట్ల విలువ చేసే 8 ఎకరాల తోటను సోమవారం ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాముల వారి దేవాలయానికి రిజిస్టర్ చేసి ఇచ్చారు. సంతానం లేని తమకు రాములోరే దిక్కు అని భావించిన ఈ దంపతులు తమ ఆస్తిని ఆలయానికి ధారాదత్తం చేసి ఆదర్శంగా నిలిచా రు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి మాధవరం గ్రామస్తులు వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులను గ్రామ పురవీధుల మీదుగా మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. వృద్ధ దంపతులకు అడుగడుగునా నీరాజనం పలుకుతూ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని రాముల దేవాలయంలో వృద్ధ దంపతులను ఘనంగా సన్మానించి సీతారాముల దర్శనం చేయించారు. అనంతరం మాధవరం గ్రామస్తులు మాట్లాడుతూ వృద్ధ దంపతులకు తామెంతో రుణపడి ఉంటామని, వారికి ఏ కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
మూగజీవాలకూ.. మందుల్లేవ్!
కర్నూలు(అగ్రికల్చర్): పశువైద్యానికి ఏడాదిగా మందులు సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. అత్యవసర వైద్యం అందించే సంచార పశువైద్య కేంద్రాలను నామమాత్రానికి పరిమితం చేసింది. పశువైద్యానికి మందుల్లేవని, వెంటనే సరఫరా చేయాలని పశువైద్యులు కోరుతున్నా.. పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. మొత్తంగా పశువైద్యం పడకేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల దృష్టి మరల్చేందుకు.. నోరులేని మూగజీవులకు వైద్య సేవలు అందించడంలో విఫలమైందనే అసంతృప్తి చాపకింది నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఉచిత పశువైద్య శిబిరాలంటూ హడావుడి చేస్తోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు మందులు సరఫరా చేసిన దాఖలాలే లేవు. మందులు ఇవ్వడంలో చేతులేత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పశువైద్య శిబిరాలు అంటూ ప్రకటించింది. పశువైద్య శిబిరాలు నిర్వహించాలంటే అనేక రకాల మందులు అవసరం. కేవలం నట్టల నివారణ మందులు మినహా ఇతరత్రా మందులు లేవు. మందులే లేనపుడు ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులే పేర్కొంటున్నారు. రోజుకొక పంచాయతీ ప్రకారం ఈ నెల 19 నుంచి 31 వరకు పంచాయతీల వారీగా పశువైద్య శిబిరాలు నిర్వహించడానికి పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో 484, నంద్యాల జిల్లాలో 489 పంచాయతీల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించనుంది. పశువైద్య శిబిరాలను పర్యవేక్షించేందుకు పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లో జాయింట్ డైరెక్టర్ అయిన డాక్టర్ దుర్గాప్రసన్నబాబు ఉమ్మడి జిల్లాకు స్పెషల్ అధికారిగా నియమితులయ్యారు. పశువైద్యశాలలు కర్నూలు జిల్లాలో 66, నంద్యాల జిల్లాలో 74 ఉన్నాయి. ప్రతి పశువైద్యశాల పరిధిలోని రోజు ఒక పంచాయతీ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యశిబిరాలు నిర్వహిస్తారు. సరఫరా కాని మందులు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించాలంటే అనేక రకాల మందులు అవసరం. కనీసం యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, లివర్ టానిక్‌లు, ఆవులు, గేదెలు ఎదకు రావడానికి అవసరమైన మందులు ఉండాలి. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గొర్రెలు, మేకలకు పీపీఆర్, హెచ్ఎస్ టీకాలు వేయాల్సి ఉంది. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ మందులేవి సరఫరా చేయలేదు. వైద్య శిబిరాల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మందులు మాత్రం సరఫరా కాలేదు. గొర్రెలు, మేకలు, దూడలు, పెద్ద పశువులకు కేవలం నట్టల నివారణ మందులు మాత్రమే సరఫరా అయ్యాయి. నట్టల నివారణ మందులతో పశువైద్య శిబిరాలు నిర్వహించడం ఎలా సాద్యమవుతుందని వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్, అసిస్టెంటు డైరెక్టర్స్ వాపోతున్నారు. దయనీయం.. పశువైద్యం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పశువైద్యం డీలాపడింది. పశువైద్యానికి అవసరమైన మందులు సరఫరా చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ సంవత్సరానికి సంబంధించి పశువైద్య శాలలకు మందులు సరఫరా కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలకు మందులు సరఫరా చేసేవారు. వెటర్నరీ అంబులెటరీ సర్వీస్‌లతో అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చింది. 1962 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే క్షేత్రస్థాయికే వెళ్లి వైద్య సేవలు అందించేవారు. నియోజక వర్గాలవారీగా పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో సంచార పశువైద్యకేంద్రాలు నామమాత్రానికి పరిమితం అయ్యాయి. పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు మరుగునపడ్డాయి. తెల్ల జాతి పశువులు 3,56,541 నల్ల జాతి పశువులు 4,20,882 గొర్రెలు 19,85,868 మేకలు 6,10,669 కోళ్లు 12,89,417 నేటి నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు మందులు సరఫరా చేయని చంద్రబాబు ప్రభుత్వం తూతూమంత్రానికే పరిమితమైన సంచార పశువైద్యశాలలు -
‘బావి’ తరాలకు అ పూర్వ సంపద!
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి నిర్మించిన కట్టడాలు, చెరువులు, బావులు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అయితే చాలా చోట్ల ఉపయోగం లేక కాలగర్భంలో కలిపిపోతుండటంతో ఓ యువ సైన్యం కాపాడేందుకు ముందుకు వచ్చింది. కొలిమిగుండ్లకు చెందిన కొందరు యువకులు ‘పూర్వ సంపద రక్షక సేన’గా ఏర్పడి పురాతన బావులను సంరక్షిస్తూ బావి తరాలకు చారిత్రక సంపదను అందిస్తున్నారు. ప్యాపిలి సమీపంలోని పురాతన వెంగన్న బావి దుస్థితిని తెలుసుకున్న రక్షక సేన ఆదివారం బావి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 40 మంది సభ్యులు పారలు, గంపలు చేతబూని పనిలోకి దిగి చెత్తాచెదారాన్ని తొలగించి బావిని శుభ్రం చేశారు. తమ గ్రామంలోని బావిని శుభ్రం చేసేందుకు ఇతర ప్రాంతాల యువకులు వచ్చిన విషయం తెలుసుకుని స్థానిక యువత సైతం వారితో చేయి చేయి కలిపారు. పూర్వ సంపద రక్షక సేన సభ్యులకు స్థానికులు బావి వద్దే భోజన సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు బాటసారుల దాహార్తిని తీర్చిన ఇలాంటి పురాతన బావులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని రక్షకసేన సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 13 బావులను శుభ్రం చేశామన్నారు. జిల్లాలో ఇలాంటి సమస్య ఎక్కడ ఉన్నా అక్కడకు చేరుకుని వెంటనే శుభ్రం చేస్తామన్నారు. ఈ సందర్భంగా కొలిమిగుండ్ల యువకులను స్థానికులు అభినందించారు. – ప్యాపిలి -
నేడు డయల్ యువర్ ఎస్ఈ, సీఎండీ కార్యక్రమం
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో నేడు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 73826 14308 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతిలో డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లా వినియోగదారులు నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లాలంటే 89777 16661 నంబరుకు ఫోన్ చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లోవోల్టేజీ సమస్యలు, విద్యుత్ సిబ్బంది అందుబాటు తదితర వాటిపై డయల్ యువర్ కార్యక్రమం దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం నందికొట్కూరు: బ్రాహ్మణకొట్కూరు గ్రామ సమీపంలోని హంద్రీనీవా పంప్‌హౌస్ వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఇన్చార్జ్ ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు.. హంద్రీనీవా కాల్వ లష్కర్లు అందించిన సమాచారం మేరకు ఎస్ఐ, పోలీసు సిబ్బంది పంప్‌హౌస్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఆకుపచ్చ రంగు టీ షర్టు, బ్లూ కలరు జీన్స్ పాయింట్ ధరించినట్లు పేర్కొన్నారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి పోలీసులు తరలించారు. యువతి అదృశ్యం బండిఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ముల్ల సానియా(23) అనే యువతి రెండు రోజులుగా కనిపించడం లేదని ఆదివారం ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. శనివారం రాత్రి ఇంటిలో అందరూ నిద్రించిన తర్వాత, ఇంటిలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు. దీంతో బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు యువతి తండ్రి సయ్యద్ మోదిన్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. క్రీడాకారుల మధ్య వాగ్వాదం ● రద్దయిన క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆదోని సెంట్రల్/అర్బన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదోని మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో క్రీడాకారుల మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదోని చాంపియన్‌షిప్–2026 పేరుతో వారం రోజుల క్రితం క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వాహకులు అట్టహాసంగా ప్రారంభించారు. ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. సెమీఫైనల్లో ఫైర్ బాల్స్ 11 కల్లుబావి, ఆదోని ఏబీసీ స్టార్స్ జట్ల మధ్య బౌలర్ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు జట్ల మధ్య సమన్వయం పరిచి టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. వివాదం మరింత తీవ్రతరం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు జట్లకు సర్దిచెప్పి మైదానం నుంచి వారిని పంపి వేశారు. ఆదివారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ దీంతో రద్దు అయ్యింది. ఏటీఎం దొంగ అరెస్ట్ తాడిపత్రి రూరల్: తాడిపత్రిలోని కడప మార్గంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోని కియోస్క్ ను పెద్ద బండరాయితో పగులకొట్టే ప్రయత్నం చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన దుర్గానాయుడు, తన తండ్రితో కలసి పని కోసం తాడిపత్రికి వచ్చాడు. వ్యసనాలకు బానిసైన దుర్గానాయుడు జల్సాలు తీర్చుకునేందుకు ఈజీ మనీ కోసమని ఆదివారం తెల్లవారుజామున ఏటీఎంలోని యంత్రాన్ని ధ్వంసం చేసి డబ్బు అపహరించేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గుర్తించిన ముంబయిలోని సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకోగానే దుర్గానాయుడిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. విచారణ అనంతరం దుర్గానాయుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నయన మనోహరం.. రజిత రథోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజిత రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మౌని అమావాస్య కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా మంత్రాలయం వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ కుంకుమ ఆర్చన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం ప్రాంగణంలో చెక్క రథంపై ప్రహ్లాదరాయలను ఊరేగించారు. భక్తుల మధ్య రజిత రథోత్సవం కనుల పండువగా సాగింది. -
కూర‘గాయాలు’
రబీ సీజన్లో కూరగాయల సాధారణసాగు 5,769 హెక్టార్లు ఉంది. అయితే టమాట 115, ఉల్లి 247, పచ్చి మిరిప 200 హెక్టార్లకే పరిమితం అయ్యింది. వంకాయ, బెండకాయ, కాకర, బీర, చెవుల తదితర కూరగాయల పంటల సాగు నామమాత్రమే. సాగు పడిపోవడంతో రానున్న రోజుల్లో కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. కూరగాయల సాగుకు 50 శాతం సబ్సిడీపై హైబ్రిడ్ విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. రబీ సీజన్ సాధారణ సాగులో 30 శాతం కూడా లేకపోవడంతో రానున్న రోజుల్లో కూరగాయల కొరత ఉత్పన్నమయ్యే అవసరం ఉంది. ఉల్లి పంట సాగు చేసిన దృశ్యం -
అర్హతలేని వారితో వైద్యపరీక్షలు
● స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో దారుణంకర్నూలు(హాస్పిటల్): ల్యాబ్‌టెక్నీషియన్ ద్వారా చేయాల్సిన వైద్యపరీక్షలు(డయాగ్నోస్టిక్ టెస్ట్) అర్హతలేని జనరల్ డ్యూటీ అటెండర్‌తో చేయిస్తున్నారు. ఇదేదో ప్రైవేటు ల్యాబ్‌లో జరుగుతున్న తంతు కాదు. కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఏడాదిన్నరగా ఈ దారుణం కొనసాగుతోంది. ఈ కారణంగా ఏ పరీక్షలు సరైనవో, ఏవి కావో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయడం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఏడాదికి మెరిట్లిస్ట్లు విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు. దీనికి మెడికల్ కాలేజీ అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో నిలిపివేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అభ్యర్థులు పలుమార్లు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో అర్హతలేని వారు చేసే రక్తపరీక్షల వల్ల నివేదికలు తప్పుల తడకగా వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాజాగా కొందరు అభ్యర్థులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా చేసిన మెసేజ్ వైరల్ అవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తమ ఆవేదన అర్థం చేసుకుని పోస్టులు భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. కాగా ఈ విషయమై కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ వివరణ ఇస్తూ సిబ్బంది కొరతతో ఆలస్యమైందని, మరో వారం రోజుల్లో పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. -
అపూర్వ ‘వేడుక’కు సన్నద్ధం
కొలిమిగుండ్ల: దాదాపు 67 ఏళ్ల క్రితం నాటి నుంచి మండల కేంద్రం కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అపూర్వ వేడుకకు సిద్ధమవుతున్నారు. వేలాది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ పాఠశాల నిరుపేద, మధ్య తరగతికి చెందిన ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. 1958లో కొలిమిగుండ్లలో ఉన్నత పాఠశాల ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న విద్యార్థులంతా కలిసి పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 8వ తేదీని ఖరారు చేశారు. కొలిమిగుండ్ల వాసి మైన్స్అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ తన సహచర బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ఉండటంతో వారి ఫోన్ నంబర్లను సేకరించేందుకు ప్రతి 25 మందికి ఒక కమిటీ చొప్పున నియమించారు. అలాగే విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి ఒక్కరూ అలనాటి జ్ఞాపకాలను పంచుకునేందుకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఫిబ్రవరి 8న పూర్వ విద్యార్థుల సమ్మేళనం 1958 బ్యాచ్ నుంచి అందరినీ ఆహ్వానించే ప్రయత్నం -
‘సర్వజన’ కష్టాలు!
కర్నూలు(హాస్పిటల్): రోజూ వేలాది మంది పేదలకు వైద్యసేవలు అందించే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పెద్ద కష్టం వచ్చింది. రోగులు వరండాలో వైద్యం పొందాల్సిన దుస్థితి తలెత్తింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐపీ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. చంద్రబాబు సర్కార్‌లో 19 నెలలుగా ఒక్క ఇటుకా కదలడం లేదు. నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వలేదు. అలాగే కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇవ్వకుండా పరోక్షంగా బెదిరించి వెనక్కి పంపారు. భవన నిర్మాణం ఆగిపోవడంతో అవసరమైన వసతులు, సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రజాప్రతినిదులు ఏడాదిన్నరగా ఇదిగో ప్రారంభిస్తామని చెబుతూ కాలం నెట్టుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. వైద్యరంగానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, సర్వజన వైద్యశాలలు, మెడికల్ కాలేజీలు అత్యున్నత స్థానంలో ఉంచేందుకు కృషి చేసింది. ఈ మేరకు కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలల అభివృద్ధికి రూ.500కోట్ల నిధులకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. ఇందులో రూ.350కోట్లు భవనాలకు, రూ.150కోట్లు పరికరాలకు కేటాయించింది. వీటిలో ఆసుపత్రిలో ఇన్ పేషంట్ డిపార్ట్మెంట్ భవనం(ఐపీ భవనం), అవుట్ పేషంట్ డిపార్ట్మెంట్, అధునాతన క్యాజువాలిటి, మాడరన్ మార్చురీ, బయోమెడికల్ వేస్ట్ షెడ్డు, కర్నూలు మెడికల్ కాలేజిలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, లెక్చరర్ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రాధాన్యత క్రమంలో ఆసుపత్రిలో ఐపీ భవనం, మెడికల్ కళాశాలలో ఎగ్జామినేషన్ హాల్, లెక్చరర్ గ్యాలరీల నిర్మాణాలు ప్రారంభించారు. దాతల కోసం ఎదురు చూపు ఆసుపత్రిలోని ఐపీ భవనం నిర్మాణం ఆగిపోవడం, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, పనులు తిరిగి ప్రారంభం కాకపోవడంతో అధికారులు, వైద్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా భవనాన్ని పాక్షికంగానైనా పూర్తి చేయించేందుకు కార్పొరేట్ సంస్థలను సంప్రదించి సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించాలని కోరేందుకు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సైతం నిధుల కోసం దాతలను సంప్రదించాలని చర్చిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని దాతల సహాయంతో చేయించడమేమిటని మరికొందరు వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. ఇది ఒక విధంగా ప్రభుత్వానికే తలవంపులు తెస్తుందని వారు భావిస్తున్నారు. ఒకవైపు నిర్మాణం... మరోవైపు నిధులుగత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెండేళ్ల సమయం కోవిడ్‌తో వెళ్లిపోయింది. మిగిలిన మూడేళ్లలో పనులను వేగంగా కొనసాగించారు. ఇందులో భాగంగా ఒకవైపు ఆసుపత్రిలో ఐపీ భవన నిర్మాణ పనులు వేగంగా సాగాయి. ఖర్చయిన రూ.60.5కోట్లలో రూ.42కోట్లు చెల్లించారు. ఇంకా రూ.18.5కోట్లు మాత్రమే బకాయి ఉంది. దీంతో పాటు కళాశాలలో లెక్చరర్ గ్యాలరీకి, ఎగ్జామినేషన్ హాలుకు పనులు జరుగుతుండగానే బిల్లులు చెల్లించారు. -
నిర్మాణాలకు ‘చంద్ర’ గ్రహణం
చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు వేగంగా సాగుతున్న నిర్మాణ పనులు అర్ధరంతరంగా ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో కొనసాగిన నిర్మాణాలు వెంటనే ఆపేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐపీ భవనంతో పాటు మెడికల్ కాలేజిలో ఎగ్జామినేషన్ హాలు, లెక్చరర్ గ్యాలరీ నిర్మాణాలు ఆగిపోయాయి. ఐపీడీకి రూ.21కోట్లు, లెక్చరర్ గ్యాలరీకి 2.95కోట్లు, ఎగ్జామినేషన్ హాలుకు రూ.79లక్షలు బిల్లులు బకాయిలు మిగిలాయి. వీటితో పాటు పనులు పూర్తయిన కాలినరోగుల వార్డుకు రూ.50లక్షలు, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రూ.5కోట్లు, ఆపరేషన్ థియేటర్ మరమ్మతులు రూ.35లక్షలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాదిగా అడుగుతున్నా ఇప్పటి వరకు ఈ నిధులు విడుదల చేయలేదు. ఒక్క పనీ తిరిగి ప్రారంభం కాలేదు. ఈ విషయమై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆసుపత్రి అధికారులు ప్రతి సమావేశంలో చెబుతున్నా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఏడాదిన్నర దాటినా ఇందుకు సంబంధించి ఒక్క పనీ పునఃప్రారంభం కాలేదు. గత హెచ్‌డీఎస్ సమావేశంలో ప్రస్తావన వచ్చినా పక్కకు పెట్టేశారు. -
జల్సాలకు అలవాటు పడి అడ్డదారి
● బ్యాటరీలు చోరీ చేస్తూ పట్టుబడిన ఇద్దరు దొంగలు కర్నూలు: ఆ ఇద్దరు సమీప బంధువులు, కుల వృత్తి ద్వారా జీవనం సాగించేవారు. మద్యం, జల్సాలకు అలవాటు పడి వచ్చే ఆదాయం చాలక, సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించారు. ఇద్దరు బ్యాటరీ చోరీలను ఎంచుకున్నారు. కర్నూలు శివారు కాలనీలు సంతోష్‌నగర్, ఉద్యోగనగర్, ఎన్టీఆర్ బిల్డింగ్స్, వీకర్ సెక్షన్ కాలనీ, న్యూ ఈద్గా ప్రాంతాల్లో పార్కు చేసిన వాహనాల బ్యాటరీలను చోరి చేసి తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సా చేసేవారు. ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, బోర్వెల్ వాహనాలకు అమర్చిన బ్యాటరీలను రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారని గత నెలలో ఇద్దరు వాహన యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో బాగంగా ఆయా కాలనీల్లోని వాహన పార్కింగ్ స్థలాల్లో సీసీ ఫుటేజీలను సేకరించారు. కల్లూరు నిర్మల్‌నగర్ సమీపంలోని చెంచు కాలనీలో నివాసం ఉంటున్న మహేంద్ర, సుధాకర్‌లు ఈ నేరాలకు పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారి కదలికలపై నిఘా వేసి పక్కా ఆధారాలతో ఆదివారం గుత్తి పెట్రోల్ బంక్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా, బ్యాటరీ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈ మధ్య కాలంలో చోరీ చేసిన 11 బ్యాటరీలను విక్రయించేందుకు ఇంటి వెనుకాల షెడ్డులో దాచి ఉంచినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకొని సీఐ విక్రమసింహ ఎదుట హాజరు పరచగా, ఎస్ఐలు గోపినాథ్, శరత్‌కుమార్‌తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి సీఐ వివరాలను వెల్లడించారు. చోరి చేసిన బ్యాటరీల విలువ దాదాపు రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒక్కొక్కటి రూ. 2,3 వేలకే విక్రయించి వచ్చిన డబ్బుతో వీరు జల్సాలు చేసేవారని తెలిపారు. వీరిద్దరితో పాటు మరొకరు కూడా ఈ నేరాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయని, ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వాహనాలు ఇళ్ల ముందు పార్క్ చేసినప్పుడు అవి చోరీలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆర్థిక స్థోమత ఉన్న వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చోరీలకు పాల్పడిన ఇద్దరిని రిమాండ్‌కు పంపుతున్నట్లు వివరించారు. -
రిజర్వేషన్ కోసం త్యాగాలకు సిద్ధం
కర్నూలు(అర్బన్): రిజర్వేషన్ సాధన కోసం ఎలాంటి త్యాగాలు చేసేందుకై నా వెనుకాడబోమని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ అన్నారు. కర్నూలులోని హార్ట్ ఫౌండేషన్ భవనంలో ఆదివారం బేడ బుడగ జంగాల యువత సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బేడ బుడగ జంగాల తల రాతలు మాత్రం మారడం లేదన్నారు. రిజర్వేషన్ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ప్రస్తుత వేసవి కాల బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలన్నారు. లేని పక్షంలో విజయవాడలో యువత ఆధ్వర్యంలో భారీ కా ర్యక్రమాన్ని చేపడతామన్నారు. సమావేశంలో భార్గవ్, డీటీఎఫ్ నాయకులు రత్నం ఏసేపు, రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు భా స్కర్‌రెడ్డి, చిన్న రాముడు, జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన యువకులు పాల్గొన్నారు. -
శ్రీశైలేశునికి పుష్పోత్సవం
● అశ్వవాహనంపై విహరించిన ఆదిదంపతులు ● శ్రీశైలంలో ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అశ్వవాహనాధీశులైన పార్వతీ పరమేశ్వరుడికి ఆలయ ఉత్సవం నిర్వహిస్తున్న దృశ్యంస్వామి అమ్మవార్లకు పుష్పోత్సవ సేవ నిర్వహిస్తున్న పండితులుశ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో పార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి వైభవంగా పుష్పోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లకు శయనోత్సవం, ఏకాంతసేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆయా ఉత్సవాలతో శ్రీగిరిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సంక్రాతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సమూర్తులను అశ్వవాహనంపై ఉంచి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజాది హారతులిచ్చారు. అనంతరం అశ్వవాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో కళాకారుల నృత్యాలు, విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, కోలాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. అశ్వవాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లను పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పుష్పోత్సవం, శయనోత్సవం సంక్రాంతి పర్వదినం రోజున నూతన వధూవరులైన పార్వతీ, మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లగులాబీలు, పసుపు గులాబీలు, ఎర్రమందారం, తెల్లమందారం, ముద్దమందారం, నందివర్దనం, గరుడవర్దనం, కనకాంబారాలు, సుగంధాలు(లిల్లీపూలు), పసుపు చేమంతి, ఊదాచేమంతి, తెల్లచేమంతి, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, దేవగన్నేరు, ముద్దగన్నేరు మొదలైన 20 రకాల పుష్పాలు, బిల్వం, మరువం మొదలైన పలు రకాల పత్రాలతో స్వామిఅమ్మవార్లకు విశేషంగా అర్చించారు. అలాగే అరటి, తెల్ల, నల్లద్రాక్ష, దానిమ్మ, కమల, యాపిల్, పైనాపిల్, జామ, ఖర్జూరం మొదలైన 11 రకాల ఫలాలు కూడా నివేదించారు. అనంత రం స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి, శయనోత్సవం నిర్వహించారు. శయనోత్సవం కోసం ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల శయన మందిరాన్ని విశేష పుష్పాలంకరణ చేశారు. ఆయా పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన ధర్మకకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
శరవేగంగా వసంత పంచమి ఏర్పాట్లు
కొత్తపల్లి: కొలనభారతి క్షేత్రంలో ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్న వసంత పంచమికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీశైల దేవస్థాన అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయ్‌కుమార్‌స్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నరసింహారెడ్డి, వసంత పంచమి మహోత్సవ ప్రత్యేక అధికారి ఎం.ఫణిధర ప్రసాద్, డీఈఈ నరసింహారెడ్డి, అధికారులు, వైదిక సిబ్బంది కొలను భారతికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారికి జరిపించాల్సిన ఆయా పూజాదికాలు, నివేదనలు, సామూహిక అక్షరాభ్యాసార నిర్వహణ ఏర్పాట్లు, ఉత్సవం రోజు పుష్పాలంకరణ, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సూచికబోర్డుల ఏర్పాట్లు, శౌచాలయాల ఏర్పాట్లు మొదలైన ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం ఈఈ ఈఈ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఆత్మకూరు, నందికొట్కూరు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. -
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కర్నూలు(అర్బన్): పవిత్ర తుంగభద్ర నది తీరాన సంకల్‌భాగ్ హరిహర క్షేత్రంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు చెరువు దుర్గాప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు లక్ష్మి గణపతి, నారాయణ, రుద్ర దుర్గా, మన్యుసూక్త, సరస్వతీ, లక్ష్మికుభేర, నవగ్రహ, మృత్యుంజయ, పంచసూక్తి హోమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 28న పూర్ణాహుతి, 29న ధ్వజారోహణం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ రూపాల్లో ప్రతి రోజు వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకండి కర్నూలు (టౌన్): చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు దూరంగా ఉండాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని డీఐజీ, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర, చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాల, చట్ట వ్యతిరేక కార్య కలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
ఈరన్నస్వామికి ప్రత్యేక పూజలు
కౌతాళం: మౌని అమావాస్య కావడంతో ఆదివారం ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శంచుకోవాడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొని భక్తిని చాటుకున్నారు. పిండివంటలు వండి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప ఆర్టీసీ డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు. జాతీయ పోటీలకు బంటన్హాల్ విద్యార్థినులు చిప్పగిరి: నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు బంటన్హాల్ గ్రామానికి చెందిన అమూల్య, నందిని ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల తరఫున రూ 70,000 నగదు ప్రోత్సాహం అందించారు. మారుమూల ప్రాతంలో పుట్టి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పై వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం చేశారు. ఈ విద్యార్థినులు గుంతకల్లు జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ కవల పిల్లలు కావడం విశేషం. కొలిమిగుండ్ల: సైబర్ నేరగాళ్లకు చిక్కిన ఓ యువకుడు బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును పోగొట్టుకున్న సంఘటన ఆదివారం కల్వటాలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడికి వాట్సాప్‌లో లింక్ రావడంతో క్లిక్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి మొదటగా రూ.50 వేలు, రెండవ సారి రూ.18 వేలు మొత్తం కలిపి రూ.68 వేలు లూటీ చేశారు. సెల్‌ఫోన్‌కు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు సమాచారం రావడంతో మోసపోయానని లబోదిబోమన్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సంక్రాంతి సందర్భంగా సైబర్ కేటుగాళ్లు వాట్సాప్, సోషల్ మీడియాలో లింక్‌ను పెట్టారు. లింక్‌ను క్లిక్ చేస్తే తక్షణమే రూ.5 వేలు జమ అవుతాయని పెట్టారు. ఇలాంటి వాటిని చూసి చాలా మంది జనం మోసపోతూనే ఉన్నారు. -
ఐపీ భవనం పూర్తి చేయాలని కోరుతున్నాం
ఆసుపత్రిలో ఐపీ భవనం నిర్మాణం ఆగిపోవడంతో ఇబ్బందులు అంతా ఇంతా కాదు. దీనివల్ల అటు రోగులు, ఇటు వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ మెడిసిన్, సర్జికల్, డ్రగ్ స్టోర్, వాహనాల పార్కింగ్, ఆపరేషన్ థియేటర్లకు స్థలం లేక అవస్థలు పడుతున్నాం. ఐపీ భవనం పూర్తయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. భవనం పూర్తి చేయాలని ఆసుపత్రి, కళాశాలల్లో నిర్వహించే పలు సమావేశాలు, కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను కోరుతున్నాం. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు -
ఎస్టీ సాధనకు త్యాగాలకై నా సిద్ధం
● జేవీఐపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా ఈశ్వరయ్య కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు ఎంతటి త్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా ఈశ్వరయ్య అన్నారు. శనివారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వాల్మీకుల చిరకాల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో పార్లమెంట్లో వాల్మీకుల ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల్లోని వాల్మీకులందరు ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. వాల్మీకుల ఎస్టీ సాధనతోనే వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జేవీఐపీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బోయ రామకృష్ణ, లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శీలం భాస్కర్‌నాయుడు, కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గ నేతలు కుంపటి క్రిష్ణ, వీరేష్, ఆనంద్, గోపినాథ్నాయుడు, హనుమంతప్ప, నాయకులు ఉల్చాల వెంకటేశ్వర్లు, డోన్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అరటి తోటల్లో దొంగలు
● అర్ధరాత్రి గెలలు కోసుకుపోతున్న వైనం ● లబోదిబోమంటున్న బాధిత రైతులు మహానంది: దొంగలు పంట పొలాల్లోని మోటార్లు, విద్యుత్ తీగలు అ పహరించడం చూ శాం. కానీ దొంగలు రూటు మార్చి రైతు ల కడుపులు కొడుతున్నారు. అరటి తోటలపై దొంగలు కన్నేసి గెలలు కోసుకుపోతున్నారు. మహానంది మండలంలో ప్రధానంగా సాగయ్యే పంటల్లో అరటి ముఖ్యమైనది. ఇటీవల ధరలు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం అరటి కిలో రూ. 18 నుంచి రూ. 22 వరకు ఉంది. దీంతో కొద్దిగా లాభాలు వస్తాయనుకునే తరుణంలో దొంగలు ఇదే అదనుగా భావించి రైతుల పొలాల్లోని అరటి గెలలను కోసుకెళ్తున్నారు. మహానంది, తిమ్మాపురం సమీపంలోని తెలుగుగంగ పదవ బ్లాక్ పరిధిలో సాగు చేస్తున్న రైతుల పొలాల్లో గెలలు చోరీకి గురవుతున్నాయి. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన యర్రగుంట్ల రమేష్, పగడాల నాగరాజు, అబ్బీపురం వెంకటేశ్వరరెడ్డి, పుట్టుపల్లె సాలన్న, మురళీధర్‌రెడ్డి, తదితర రైతులకు చెందిన పొలాల్లో దొంగలు అర్ధరాత్రి వేళ వచ్చి చెట్లను విరుస్తూ అరటి గెలలను కోసుకుపోయారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు స్పందించి అరటి పొలాల్లో చోరీలకు పాల్పడినవారిని పట్టుకుని రైతులకు అండగా నిలవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
● వేగంగా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు ● ఆలయం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో నెమ్మదించిన బస్సు ● పక్కనే దర్గాలో ఉన్న భక్తులు స్పందించి మంటలు ఆర్పిన వైనం
దేవుడే కాపాడాడు పత్తికొండ: త్రుటిలో మరో బస్సు ప్రమాదం తప్పింది. జిల్లాలో మూడు నెలల క్రితం చిన్నటేకూరు బస్సు దుర్ఘటన ఇంకా కళ్ల ముందే కదిలాడుతోంది. అదే తరహాలో మరో బస్సు ప్రమాదం జరగకుండా దేవుడే కాపాడినట్లుగా అనిపించింది. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నా రు. బస్సు ముందు భాగం మంటలు వ్యాపించి బస్సులోకి వ్యాపిస్తున్న సమయంలో స్పీడ్ బ్రేకర్ల కారణంగా బస్సు వేగం నెమ్మదించడం, బస్సు డ్రైవర్లు మంటలను గుర్తించి నిలపడం, అదే సమయంలో అక్కడ బడేరాత్ సందర్భంగా జాగారంలో ఉన్న ముస్లిం యువకులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. శుక్రవారం రాత్రి మంత్రాలయం నుంచి 15 మంది ప్రయాణికులతో కర్ణాటకకు చెందిన శాన్వి ట్రావెల్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. మార్గమధ్యలో పత్తికొండ సమీపంలో ఉరుకుంద వీరన్న స్వామి ఆలయం ఉంది. అక్కడ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో బస్సు వేగం నెమ్మదించింది. అప్పటికే బస్సు రేడియేటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బస్సులోకి వ్యాపిస్తున్నాయి. మంటలను గుర్తించి డ్రైవర్ పక్కనే బస్సును నిలిపి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దిగమని సూచించారు. అంతలో శుక్రవారం బడేరాత్ సందర్భంగా పక్కనే ఉన్న దర్గాలో జాగారం చేస్తున్న ముస్లిం భక్తులు వెంటనే స్పందించారు. ఓ హోటల్లో ఉన్న నీటిని బిందెలతో తెచ్చి మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది సమాచారం అందుకుని అక్కడికి చేరుకుని మంటలను అదుపు లోకి తెచ్చారు. అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్ బస్సులో ప్రయాణికులు పంపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. శనివారం ఉదయం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రావెల్ బస్సును చూసి ‘దేవుడి దయతోనే పెను ప్రమాదం తప్పింది’ అని ప్రజలు చర్చించుకుంటూ కనిపించారు. -
శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన యం. జ్యోతిర్మయి వెండి పళ్లెం, రెండు గిన్నెలు, దీపం విరాళంగా సమర్పించారు. శనివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. ఈ వెండి వస్తువుల బరువు 630 గ్రాములు ఉంటుందని దాతలు తెలిపారు. అనంతరం వీరికి రశీదును అందజేసి, వేదాశీర్వచనంతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. మహానందీశ్వరుడి సేవలో మహానంది: మహానందీశ్వరస్వామిని చైన్నె రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రాష్ట్ర చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుబ్బయ్య దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. శనివారం దర్శనానికి వచ్చిన వారికి ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. ఈ మేరకు వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి స్థానిక అలంకార మండపంలో స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు సంజామల: చిన్న కొత్తపేట గ్రామ సమీపంలో ఓ కారు అదుపు తప్పి వరిమడిలోకి దూసుకెళ్లింది. ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పసురు కట్టు కోసం శనివారం కారులో ఆర్.లింగందిన్నెకు చేరుకున్నారు. కట్టు కట్టించుకుని తిరిగి వెళ్తుండగా చిన్న కొత్తపేట గ్రామ సమీపంలో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకుపోయింది. వాహనంలో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తుల సహకారంలో జేసీబీతో కారును బయటకు తీశారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
తుగ్గలి : మండల కేంద్రమైన తుగ్గలి సమీపంలో శనివారం రైల్వే ట్రాక్ పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తుగ్గలిలో నివాసముంటున్న మారెల్ల మంకె సునీల్‌కుమార్(37) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న డోన్ రైల్వే పోలీసులు ఘటనాస్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సునీల్‌కుమార్‌ది ఆత్మహత్య, ప్రమాదమా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు డోన్ టౌన్: వెంకటాపురం చెరువు పెద్ద వంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కౌలుట్ల శనివారం ఉదయం డోన్ నుంచి ఖాళీ బాక్స్ లోడ్‌తో స్వగ్రామానికి బయలుదేరాడు. అదే సమయంలో గుమ్మకొండ గ్రామానికి చెందిన సుధాకర్ బైకుపై డోన్‌కు వస్తుండగా ప్రమాదవశాత్తూ ఆటో, బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధాకర్‌కు తీవ్ర, కౌలుట్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుధాకర్‌ను కర్నూలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. గంజాయి విక్రేత అరెస్టు పెద్దకడబూరు: గంజాయి సాగుచేసి అమ్ముతు న్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. అలాగే కొనడానికి వచ్చిన ఓంకారిని అరెస్ట్ చేశామన్నారు. జాలవాడి గ్రామానికి చెందిన మల్లికార్జున తన ఇంటి పక్కనున్న పొలంలో గంజాయి సాగు చేసి అమ్ముతున్నాడని సమాచారం అందిందన్నారు. విషయం తెలుసుకున్న తాము శనివారం కాపుకాచి ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వారివద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
శ్రీశైలంలో వేదశ్రవణం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో వేదశ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలోని అమ్మ వారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. అలాగే రుత్విగ్వరణ కార్యక్రమంలో వేదపండితులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపఠన కార్యక్రమం జరిపించారు. మూడు గంటల పాటు నిరంతరాయంగా వేదపారాయణాలు కొనసాగాయి. దేవస్థాన వేదపండితులతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారక తిరుమల, ఇంద్రకీలాద్రి (విజయవాడ) దేవస్థానాల నుంచి వచ్చిన వేదపండితులతో పాటు తిరుపతి, హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేదపారాయణం చేశారు. దేవస్థానం వేదపండితులతో పాటు కార్యక్రమానికి హాజరైన వేదపండితులందరు కూడా స్వామిఅమ్మవార్ల కై ంకర్యంగా రెండు గంటల పాటు ఘనస్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● పిన్నెల్లి ఘటన దారుణం ● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆలూరురూరల్/చిప్పగిరి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త, దళితుడైన మందా సాల్మన్‌పై టీడీపీ కార్యకర్తలు ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టడంతో ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాల్మన్ భౌతికకాయాన్ని సందర్శించడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని చూస్తే రాష్ట్రంలో అరాచకం ఏమేర రాజ్యమేలుతుందో అర్థమవుతోందన్నారు. హత్యకు గురైన వ్యక్తిపైనే కేసు పెట్టడాన్ని చూస్తే నియంత పాలన కనిపిస్తోందన్నారు. దళితుడైన సాల్మన్ హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా, నియోజకవర్గ నేతలు, మండలాల నాయకులు పాల్గొన్నారు. -
కమనీయం.. పార్వేట మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీ అహోబిలేశుడి పార్వేట మహోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. కొండదిగిన ఉత్సవ పల్లకి శనివారం బాచేపల్లి గ్రామానికి చేరుకుంది. శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీ జ్వాలా నరసింహస్వాములు కొలువైన ఉత్సవ పల్లకీకి గ్రామ ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీని గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ తెలుపులపై కొలువుంచుతూ భక్తిని చాటుకున్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. చైన్నె–సూరత్ హైవేతో అనుసంధానించండి కర్నూలు(సెంట్రల్): చైన్నె–సూరత్ హైవేతో కర్నూలు నగరాన్ని అనుసంధానించేందుకు తక్షణమే సర్వే నిర్వహించి నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు బళ్లారి చౌరస్తా, రాజ్విహార్లలో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు కూడా సర్వే చేయాలన్నారు. శనివారం కలెక్టర్ తన కార్యాలయంలో కర్నూలు స్మార్ట్ సిటీపై కేఎంసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వెంకటరమణ కాలనీకి 24 గంటలపాటు నీటి సరఫరాకు పైప్‌లైన్‌ను సిద్ధం చేయాలన్నారు. తుంగభద్ర, హంద్రీ, కేసీ కెనాల్ కాలువల సుందరీకరణపై దృష్టి సారించాలన్నారు. నగరంలో రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఎస్ఈ రమణమూర్తి, ఈఈ మనోహర్‌రెడ్డి, ఆర్అండ్బీ డీఈ ఫణిరామ్ పాల్గొన్నారు. రైలు ఢీకొని ఎలుగుబంటి మృతి మహానంది: నల్లమల అడవిలోని నంద్యాల–గిద్దలూరు రైలు మార్గంలో రైలు ఢీకొని ఎలుగుబంటి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. చలమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయ్ దీప్ వివరాల మేరకు.. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రైల్వే మార్గంలోని గాజులపల్లె బీట్ పరిధిలో ఉన్న జీవాలమోరీ వద్ద ట్రాక్ దాటుతున్న ఎలుగుబంటిని రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఎలుగుబంటి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ ఉదయ్‌దీప్, గాజులపల్లె పశువైద్యాధికారి శివానంద్, చలమ సెక్షన్ ఆఫీసర్ విజయవర్ధన్, ఏబీఓ మద్దిలేటిస్వామి, తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి ఎలుగుబంటిని పరిశీలించారు. మగ ఎలుగుబంటిగా గుర్తించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీశాఖ నిబంధనల ప్రకారం దహనం చేశారు. -
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రెండేళ్లు కావస్తున్నా అమలు చేయలేకపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇచ్చిన హామీలకూ నీళ్లొదిలారు. రాష్ట్ర వ్యాప్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గ్రామం ఎంతో ఆశగా ఇక్కడి సమస్యలను ఏకరువు పె
● నెరవేరని రూ.15.08 కోట్ల పనుల హామీ ● నేటికీ రూ.8 కోట్ల పనులకు లభించని పాలనా అనుమతులు ● కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.4 కోట్ల పనులకు మోక్షం ● మంజూరు కానున్న పుచ్చకాయలమాడ– రామచంద్రాపురం రోడ్డు ● ఫీజుబులిటీ లేదని రూ.1.20 కోట్ల పనులు తిరస్కరణ పాలనా అనుమతులు లభించని పుచ్చకాయలమాడ–హోసూరు రోడ్డు కర్నూలు(అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2024 అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమాడ గ్రామం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన సభలోనే ప్రజలు కోరిన విధంగా రూ.15.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు హామీ ఇచ్చారు. ఈ పనులన్నింటినీ గత ఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలనుకున్నారు. కానీ రెండు సంక్రాంతులు పోయినా, పలు పనులకు నేటికీ పాలనా అనుమతులు కూడా లభించకపోవడం గమనార్హం. అలాగే అప్పట్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన వాటిలో ఫీజుబులిటీ లేదని మూడు పనులు తిరస్కరించగా, చంద్రబాబు హామీ ఇచ్చిన రెండు ముఖ్యమైన రోడ్ల పనులకు 16 నెలలు గడుస్తున్నా, నేటికి పాలనా అనుమతులు మంజూరు కాని పరిస్థితి. అయితే, కేంద్ర ప్రభుత్వ నిధులతో పుచ్చకాయలమాడ–రామచంద్రాపురం రోడ్డు పని మంజూరయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర నిధులే దిక్కు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. హైస్కూల్ ప్రహరీగోడ, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు పూర్తి చేశారు. కాగా, ఉద్యాన పంటలు పండించే గ్రామాలకు ఆయా పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో రహ దారి సౌకర్యాలను కల్పిస్తున్నారు. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలు రోడ్ల పనులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలోనే పుచ్చకాయలమాడ నుంచి రామచంద్రాపురం వరకు రూ.4 కోట్లతో 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేసేందుకు అనుమతులు రానున్నట్లు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఫీజుబులిటీ లేదని తిరస్కరణ నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో రూ.1.20 కోట్ల విలువ చేసే పనులు ఫీజుబులిటీ లేదని తిరస్కరణకు గురైనట్లు సమాచారం. గ్రామంలోని దర్గా, హిందూ శ్మశానవాటికకు ప్రహరీగోడల నిర్మాణంతో పాటు వెటర్నరీ లైవ్ స్టాక్ భవన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారాయి. రూ.8 కోట్ల పనులకు లభించని పాలనా అనుమతులు పుచ్చకాయలమాడ గ్రామం నుంచి పెరవలి, హోసూరు గ్రామాలకు రూ.8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ఈ పనులను చేపట్టేందుకు వీలుగా నేటి వరకు పీఆర్ ఈఎన్సీ కార్యాలయం నుంచి పాలనా అనుమతులు మంజూరు కాని పరిస్థితి. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్థానిక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించి ప్రపోజల్స్‌ను ఈఎన్సీ కార్యాలయానికి పంపారు. పైగా పలుమార్లు రిమైండ్ చేసినా, నేటి వరకు అనుమతులు రాకపోవడం గమనార్హం. పనులు చేపట్టకపోవడంతో ఈ రోడ్లపై ప్రయాణం చేస్తున్న ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎలాగోలా సర్దుకుపోతున్నా, వర్షాకాలంలో ఈ రోడ్లపై ప్రయాణమంటే ప్రత్యక్ష నరకమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు.. గ్రామంలో మూడున్నర కిలోమీటర్ల మేర రూ.1.38 కోట్లతో 16 అంతర్గత రోడ్ల నిర్మాణం రూ.20 లక్షలతో హైస్కూల్ ప్రహరీగోడ నిర్మాణం రూ.30 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పుచ్చకాయలమాడ నుంచి పెరవలి వరకు రూ.5.60 కోట్లతో 7 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పుచ్చకాయలమాడ నుంచి హోసూరు వరకు రూ.2.40 కోట్లతో 3 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పుచ్చకాయలమాడ నుంచి రామచంద్రాపురం వరకు రూ.4 కోట్లతో 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు రూ.30 లక్షలతో గ్రామంలో దర్గాకు ప్రహరీగోడ రూ.60 లక్షలతో హిందు శ్మశానవాటికకు ప్రహరీగోడ రూ.30 లక్షలతో వెటర్నరీ లైవ్ స్టాక్ భవన నిర్మాణం -
‘ఆడ’నే అంతమవుతూ!
ఒక్క క్షణం ఆలోచించలేకపోతున్నారు.. సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు.. ఆటుపోట్లకు నిలదొక్కుకోలేకపోతున్నారు.. అనుకున్నది జరక్కపోతే తట్టుకోలేకపోతున్నారు.. అత్తారింట్లో ఇమడలేకపోతున్నారు.. ఆడపడుచుల పోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. తల్లిదండ్రుల చాటు బిడ్డలుగానే మెలుగుతున్నారు.. తెలిసీతెలియని వయస్సు పెళ్లిళ్లతో నలిగిపోతున్నారు.. కోపం వస్తే అణచుకోలేకపోతున్నారు.. అణకువను అలవర్చుకోలేకపోతున్నారు.. మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు.. సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోతున్నారు.. నలుగురితో చర్చించలేకపోతున్నారు.. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. నూరేళ్ల జీవితాన్ని కాలరాసుకుంటున్నారు.. కంటిపాపలను నిర్దయగా చిదిమేస్తున్నారు.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య ● 20 రోజుల్లో ఇదే తరహాలో మూడు ఘటనలు ● క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్న దంపతులు నంద్యాల: ఆర్థిక, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలతో కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. ఏం పాపం చేయని చిన్న పిల్లలకు రంగుల లోకంలో చోటు లేకుండా చేస్తున్నారు. విషమిచ్చి, కాల్వలో తోసేసి చిన్నారులను తమతోపాటు తీసుకెళ్తున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలతో కుటుంబసభ్యులకు రోదనే మిగులుతోంది. నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మి(23) గతేడాది డిసెంబర్ 28న మంచాలకట్ట సమీపంలో తన పిల్లలు వైష్ణవి(3), మూడు నెలల చిన్నారి సంగీతను ఎస్సార్బీసీ కాల్వలో తోసి తాను కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడవకముందే ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర(34) ఆర్థిక సమస్యలతో తట్టుకోలేక సురేంద్ర కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి (4), సూర్యగగన్ (1.5)కు పాలలో విషం కలిపి తాపించి తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపులు భరించలేక మల్లిక(27) అనే మహిళ శనివారం ఉదయం ఇద్దరు పిల్లలు ఇషాంత్(7), పరిణతి(9నెలలు)కి పురుగుల మందు తాపి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత 20 రోజుల్లో జిల్లాలో వరుసగా జరిగిన ఘటనల్లో అభం శుభం తెలియని ఏడుగురు చిన్నారులు నిండు జీవితాలను కోల్పోయారు. -
దళితులపై దమనకాండ దారుణం
● నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు కర్నూలు (టౌన్): రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగుతోందని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి పర్తి చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శనివారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి ‘చంద్రబాబు డౌన్..డౌన్, జోహార్ అంబేడ్కర్, జైభీమ్..పోలీసుల జులుం నశించాలి.. దళితులపై దాడులు అరికట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి’ అని నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ● ఎమ్మెల్యే తాటి పర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ..కుప్పం నియోజకవర్గంలో మహిళలపై అకృత్యాలు, పిఠాపురంలో దళితులను వెలివేయడం అందరికీ తెలిసిందేనన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు ఊరికి వచ్చిన సాల్మన్‌ను టీడీపీ నాయకులు ఇనుపరాడ్లతో బాది చంపేయడం దారుణమన్నారు. ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్ల వ్యవధిలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్రంలో గత 18 నెలలుగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. ● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 300 దళిత కుటుంబాలను ఊర్ల నుంచి తరిమేశారన్నారు. టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలు మానుకోవాలన్నారు. పార్టీ నేతలు షరీఫ్, కిషన్, ఽరాంపుల్లయ్య యాదవ్, దనుంజయ ఆచారి, కటారి సురేష్, కార్పొరేటర్లు ఆర్షియా ఫర్హీన్, మునెమ్మ, క్రిష్ణకాంత్, భారతి, లాజరస్, రాజశేఖర్, లీగల్ సెల్ నాయకులు రాజేష్, ఫిరోజ్, గద్ద రాజశేఖర్, పరుశరామ్, వన్నెష్ తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి ధర రూ.25వేలు
● అతి చిన్న లాట్‌కు పెద్ద ధర కోట్ చేసిన వ్యాపారులు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బాడిగ రకం మిర్చి క్వింటా రూ.25 వేల ధర పలికింది. ఈ రకం మిర్చి కేవలం 4 లాట్లు మూడు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అతి తక్కువ అంటే క్వింటా లోపున్న లాట్‌కు వ్యాపారులు రూ.25 వేల ధర కోట్ చేశారు. మిగిలిన లాట్లకు కేవలం రూ.8,080 మాత్రమే ధర వేయడం గమనార్హం. 2025–26లో మిర్చి సాగు పడిపోయింది. 2024–25లో మిర్చి సాగు చేసిన రైతులందరూ నష్టాలు మూటకట్టుకున్నారు. గత ఏడాది మిర్చి సాగు కలసి రాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లారు. ఈ కారణంగా మిర్చి సాగు పడిపోయింది. అంతంతమాత్రం వచ్చిన మిర్చి దిగుబడులను మార్కెట్‌కు తెప్పించడం కోసం వ్యాపారులు అతి చిన్న లాట్లకు ఎక్కువ ధర కోట్ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 21న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలను జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య–వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు. సమావేశాలకు ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తమకు కేటాయించిన స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పుష్యమాసం పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో పార్వతీ, పరమేశ్వరులకు లీలాకల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ సంకల్పం తర్వాత మహా గణపతిపూజ, పుణ్యహావచనం జరిపారు. ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి సింహాసనానికి, కంకణాలకు పూజాదికాలు చేశారు. స్వామికి యజ్ఞోపవీతధారణను చేసి మంత్రాలను పటించారు. అమ్మవారికి కంకణధారణ జరిపారు. మహాసంకల్పం తరువాత మంగళకరమైన ఎనిమిది శ్లోకాలు చదివి స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. మాంగల్యపూజ జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి స్థానిక చెంచులు నూతన వస్త్రాలతో పాటు అడవి ఆకులతో అల్లిన అభరణాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహనంపై అధిష్టింప చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా గోపూజ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కనుమ పండుగరోజైన శుక్రవారం శ్రీశైల దేవస్థానంలో శ్రీగోకులంలో, గోసంరక్షణశాల వద్ద శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో రావణవాహనంపై అధిష్టింపజేశారు. ఆలయ ఉత్సవం దేదీప్యమానంగా కొనసాగింది. రావణవాహనంపై స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజల అనంతరం స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. అడవి ఆకులతో ఆభరణాలు సమర్పించిన చెంచులు కనుమ పండుగ రోజున రావణవాహన సేవ నేడు సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు యాగపూర్ణాహుతి -
బండిఆత్మకూరు రైతు సేవా కేంద్రం వద్ద గత శుక్రవారం కనిపించిన దృశ్యం ఇది. కేవలం 24 టన్నుల యూరియా రావడంతో రైతులు ఉదయం నుంచే క్యూలో నిలబడి అగచాట్లు పడ్డారు. క్యూలో ఉన్న ఒక రైతు స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స కోసం పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించా
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాకు రావాల్సిన మూడు ర్యాక్‌ల యూరియాను ఇతర జిల్లాలకు మళ్లించారు. దీంతో కొరత తీవ్రమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజన్లో నీటిపారుదల కింద వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు సాగు చేశారు. పైరు ఎదుగుదలకు యూరియా అవసరం ఎంతో ఉంది. ఎలాంటి కొరత లేదని అధికారులు ప్రకటనలు ఇస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఒక బస్తా యూరియా కోసం రైతులు ప్రతి రోజూ పోరాటం చేయాల్సి వస్తోంది. నోరు మెదపని టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలు అదనంగా యూరియా తెప్పించాలి. అలా చేయకపోగా వచ్చిన ఎరువులు దారి మళ్లుతున్నా మౌనంగా ఉండిపోయారు. నంద్యాలకు స్పిక్, కోరమాండల్, క్రిఫ్కో యూరియా ర్యాక్‌లు వస్తాయని అధికారికంగా సమాచారం వచ్చింది. ఈ ర్యాక్‌లతో 9,500 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందనుకున్నారు. అయితే వీటిని ఇతర జిల్లాలకు దారి మళ్లించారు. దీంతో బండిఆత్మకూరు, మహానంది, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో రైతులు ఒక బస్తా యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అసలైన రైతులకు ఇవ్వకుండా.. యూరియా లేకపోతే పంటలే వేయలేని పరిస్థితి ఏర్పడింది. నంద్యాల మార్క్‌ఫెడ్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాలకు యూ రియా సరఫరా చేస్తున్నారు. ఈ కేంద్రాలను టీడీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలైన వారికి మాత్రమే యూరియా ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిజమైన రైతులకు వైఎస్సార్సీపీ ముద్ర వేసి ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి 532 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. తీవ్ర కొరత నంద్యాల జిల్లాలో రబీ సాధారణ సాగు 1,75,865 హెక్టార్లు ఉండగా ఇప్పటికే 1,80,312 హెక్టార్లలో సాగైంది. వరి 40,264, మినుము 20569, మొక్కజొన్న 15,442, జొన్న 28,120 హెక్టార్లలో సాగైంది. కలెక్టర్, డీఏవో ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా బయటికి వెలుతున్నప్పటికీ సామన్య రైతులకు దక్కడం లేదు. అన్నింటా టీడీపీ నేతలే తిష్ట వేసి టోకన్లు ఇవ్వడం సహా మొత్తం వారే చేస్తున్నారు. దీంతో రైతులు ప్రయివేటు దుకాణాల్లో లింక్‌లతో కొనాల్సి వస్తోంది. మార్క్‌ఫెడ్, ఆర్ఎస్కేలు, ప్రయివేటు డీలర్లు, కంపెనీ గోదాముల్లో 8,000 టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణ రైతులకు యూరియా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుచెబుతున్నారు. తాము చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులను హెచ్చరిస్తున్నారు. బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరిశెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దోపిడీ చేస్తూ.. కర్నూలు జిల్లాలో రబీ సీజన్లో 75 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్‌కు 24,580 టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే 14 వేల టన్నులు మాత్రమే వచ్చింది. ఇటీవల కర్నూలు ర్యాక్పాయింట్కు కోరమాండల్ కంపెనీకి చెందిన యూరియా 1300 టన్నులు వచ్చింది. ఇందులో 650 టన్నులు మార్క్‌ఫెడ్‌కు, 650 టన్నులు ప్రయివేటు డీలర్లకు కేటాయించారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకు కేటాయించారు. యూరియాను ప్రయివేటు డీలర్లు లింక్‌లు పెట్టి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఇతర జిల్లాలకు మళ్లింపు ఒక బస్తా కోసం రైతులకు తప్పని నిరీక్షణ బయోఫర్టిలైజర్ లింకుతో దోపిడీ చేస్తున్న డీలర్లు విక్రయాల్లో టీడీపీ నాయకుల చేతివాటం చంద్రబాబు ప్రభుత్వంలో తొలగని యూరియా కష్టాలు -
‘ఉల్లంఘనల’ మూల్యం రూ.10 కోట్లు!
● ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని వాహనదారులు ● జరిమానాల జోరుతో జేబులు గుల్ల కర్నూలు: బైకులపై రయ్‌మంటూ దూసుకెళ్లడం.. హెల్మెట్ లేకుండా దర్జాగా రోడ్డు ఎక్కడం.. తాగిన తర్వాత వాహనాన్ని నడపటం.. వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం.. ఇలా నిబంధనలకు విరుద్ధమైన ప్రయాణాల జోరు జిల్లాలో పెరుగుతోంది. ఏమవుతుందనే సాహసమో.. ఒక్కసారే కదా.. అనే నిర్లక్ష్యమో, ఏదైతేనేమి ప్రయాణికుల వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఎవరికి వారుగా చిన్నపాటి మొత్తంగానే భావించినా... ట్రాఫిక్ ఉల్లంఘనులకు వాహనదారులు తగిన మూల్యాన్ని మాత్రం భారీగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు కేవలం 12 ఉల్లంఘనలకు సంబంధించి 92 వేలకు పైగా కేసులు నమోదైన తీరు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మొదటి స్థానంలో లైసెన్స్ రికార్డు లేని కేసులు 92వేల కేసుల్లో లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా నడిపిన కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇందుకు రూ.43 లక్షలు వాహనదారులు జరిమానా రూపంలో చెల్లించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిప్పుతున్న వాహనాలపై నమోదైన కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డా పట్టించుకోని వాహనదారులపై 9,332 కేసులు నమోదయ్యాయి. అలాగే రాంగ్ రూట్ ప్రయాణాల వల్ల ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు నిత్యం జిల్లాలో ఏదో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపటమే దీనికి కారణమని తెలిసినప్పటికీ వాహనదారుల్లో మార్పు కరువైంది. సమయం కలసి వస్తుందని కొందరు వాహనదారులు చేస్తున్న తప్పిదం ఎంతోమంది ప్రాణాల మీదకు తెస్తోంది. ‘యూటర్న్’ తీసుకుని వెళ్లాలంటే ఫర్లాంగ్, అర కిలోమీటర్ దూరం ప్రయాణించాల్సి వస్తోందని రాంగ్రూట్లో వెళ్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం తగ్గడం లేదు. ‘మత్తు’గా దొరికిపోతున్నారు మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్నా.. ఆ మత్తులో చిత్తవుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో యువతే అధిక సంఖ్యలో ఉండటం ఆందోళనకర పరిణామం. గత ఏడాది జిల్లాలో ఏకంగా 9,360 మంది మందుబాబులు తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. వారిని న్యాయస్థానాల్లో హాజరుపర్చగా మొదటి ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.3 వేలు, రెండవ ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.10 వేలు చొప్పున జరిమానా రూపంలో రూ.6.50 కోట్లు మూల్యం చెల్లించారు. తలకెక్కించుకోవాలి.. హెల్మెట్ వినియోగం విషయంలో ఇంకా జిల్లాలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. శిరోభారం అనే ఆలోచనను వాహనదారులు వీడాల్సిన అవసరం ఉంది. ఏకంగా 10,735 మందికి వీటిని ధరించకపోవడం వల్ల జరిమానా పడింది. అంటే 12 నెలల కాలంలో రూ.45.50 లక్షలు జరిమానా రూపంలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. సిగ్నల్ జంపింగ్, అధిక బరువు, మైనర్లు వాహనాలు నడపటం, అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లడం లాంటి కేసుల సంఖ్య తగ్గేలా వాహనదారుల్లో మార్పు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. -
ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(టౌన్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్ www.ecourts.kurnool.com అలాగే kurnool.dcourts.gov.in లో చూసుకోవచ్చన్నారు. ఈ నెల 27న సాయంత్రం 6 గంటల్లోపు జిల్లా కోర్టు కాంపౌండ్‌లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్రస్ పేరుతో రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు. ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు గురువారం టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపేశారు. దీంతో శుక్రవారం ఆంధ్ర పరిధిలోని హొళగుంద సెక్షన్ దిగువ కాలువలో 70 శాతం మేర నీటి సరఫర తగ్గుముఖం పట్టింది. 1633 అడుగులతో 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న టీబీ డ్యాంలో శుక్రవారం 1604 అడుగులతో 27.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో జీరో ఉండగా.. ఔట్‌ఫ్లో దాదాపు 250 క్యూసెక్కులు నమోదైంది. ఇక ఎల్లెల్సీ ఆంధ్ర కాలువ ప్రారంభం 250 కి.మీ వద్ద దాదాపు 270 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది. శనివారం రాత్రికి పూర్తిగా జీరో కానుంది. జలాశయంలో 33 కొత్త క్రస్టుగేట్ల ఏర్పాటు పనులు జరుగుతుండడంతో ఎల్లెల్సీ, ఇతర కాలువలకు నీటిని నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా టీబీ బోర్డు అధికారులు డ్యాంలో ఉన్న 27.5 టీఎంసీల నీటిని తాగునీరు, ఇతర అత్యవసరాలకు ఉంచుకోనున్నారు. మే నెలాఖరు నాటికి గేట్లను అమర్చే పనులు పూర్తయితే జూలైలో మళ్లీ కాలువలకు నీటి విడుదల పునరుద్ధరించనున్నారు. ఈ మధ్యలో రెండు, మూడు సార్లు తాగునీటి అవసరాలకు కాలువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. తప్పుడు కేసులు ఇంకెన్నాళ్లు? కర్నూలు (టౌన్): ప్రజల నుంచి వైఎస్సార్సీపీకి విశేష మద్దతు వస్తుండటంతో తప్పుడు కేసులు నమోదు చేసి టీడీపీ నాయకులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. ఇటీవల తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని, శుక్రవారం డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరైనట్లు చెప్పారు. గతేడాది డిసెంబర్ నెలలో తాను ఇంటికి వెళుతున్న సమయంలో సంకల్ బాగ్ సమీపంలో మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా నిలబడి బుధవారపేటకు చెందిన చంద్రశేఖర్, మరి కొంత మంది ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి గొడవలు లేకున్నా తాను ఇంటికి వెళ్లగా రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్నారు. -
ఎర్రమట్టి.. కొల్లగొట్టి!
● కొండను మాయం చేస్తున్న టీడీపీ నాయకులు ● చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం ఆలూరు: అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని టీడీపీ నాయకులు బరితెగించారు. అక్రమార్జనే లక్ష్యంగా ఎర్రమట్టిని దోపిడీ చేస్తున్నారు. కొండలో సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామ సమీపంలో ఎర్రమట్టి కృష్టాపురం కొండ 105 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విండ్ పవర్ కోసం టీడీపీ నాయకులు అక్కడ 350 వరకు ఫ్యాన్లు వేయడానికి, అలాగే సోలార్, పవర్‌గ్రిడ్ కంపెనీలకు లింక్ రోడ్లు వేయడానికి ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. రాత్రి సమయంలో కొండ నుంచి ఎర్రమట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రతి రోజూ పది టిప్పర్లలో 18 నుంచి 22 టన్నుల వరకు ఎర్రమట్టిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అయినా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలకు వస్తున్నాయి. ఎన్ఓసీని రద్దు చేయాలని ధర్నా హత్తిబెళగళ్ గ్రామ సమీపంలో క్వారీలో పేలుళ్ల కారణంగా 2018 ఆగస్ట్ 3న చత్తీస్ఘడ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన 12 మంది కార్మికులు మృతి చెందారు. తిరిగి పది ఎకరాలను లీజుకు తీసుకుని క్వారీని పేల్చుతున్నారు. లీజుదారుడి ఎన్ఓసీని రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట హత్తిబెళగళ్ గ్రామస్తులు గత నెల 28న ధర్నా చేశారు. అదేవిధంగా గనులు, భూగర్భజల శాఖ అధికారులకు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. సమక్షంలో విచారణ చేసి క్వారీని నిలిపివేయడానికి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ప్రస్తుతం తాత్కాలికంగా పనులను నిలిపి వేయాలని లీజుదారులను ఆదేశించారు. -
విద్యుత్ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈ నెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్సీడీసీఎల్ చైర్మన్, సీఎండి శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై ఈ నెల 20న తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం.. 22, 23వ తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, 27న కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు కార్యక్రమం ఏర్పాటవుతుందన్నారు. ప్రతి రోజు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తారన్నారు. అభిప్రాయాలను తెలియపర్చాలనుకుంటే ఆయా వేదికల వద్ద నేరుగా పాల్గొనవచ్చని, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అవకాశం కల్పిస్తామన్నారు. -
శ్రీశైలంలో ముగ్గుల పోటీలు
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గురువారం ఆలయ మహాద్వారానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద నిర్వహించిన ఈ పోటీలలో స్థానికులే కాకుండా నంద్యాల, గుంటూరు, సూర్యాపేట తదితర ప్రాంతాలకు చెందిన మొత్తం 38మంది మహిళలు పాల్గొన్నారు. పోటీలకు దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, పర్యవేక్షకులు కె.గిరిజామణి, పి.దేవిక, డి.స్వర్ణలత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ముగ్గుల పోటీలలో రోజారాణి మొదటి బహుమతి గెలుపొందారు. విజేతలకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు బహుమతులను అందజేయడంతో పాటు పోటీలలో పాల్గొన్న మహిళందరికి స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రంగా చీర, రవిక, దేవస్థానం క్యాలెండర్ అందజేసి సత్కరించారు. దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డా.సి.అనిల్‌కుమార్, పీఆర్వో టి.శ్రీనివాసరావు,ఽ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 8న ఉపాధ్యాయుల సమ్మేళనం కర్నూలు కల్చరల్: ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సేవాసంస్థ వికాస భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉపాధ్యాయుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్తలు ఎం.హరికృష్ణారెడ్డి, బి.సుశీలాబాయి తెలిపారు. ప్రధాన వక్తగా విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ అన్నదానం సుబ్రహ్మణ్యం, వక్తగా వికాస భారతి సంఘటన కార్యదర్శి బీవీ నాగేంద్ర ప్రసాద్, అతిథులుగా జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.సుబ్బారెడ్డి, నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జి.రామకృష్ణారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. కోడి పందెం ఆటగాళ్ల అరెస్టు రుద్రవరం: మండలంలోని టీ లింగందిన్నె గ్రామ పొలిమేరలో పలు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కోడిపందెం ఆటగాళ్లను అరెస్టు చేసినట్లు రుద్రవరం ఎస్ఐ జయప్ప శక్రవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.20,150 నగదును, మూడు పందెం కోళ్లను, ఏడు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో సూర్యనారాయణ, రమణ ఇనే ఇద్దరు నిందితులు పారిపోయారని, వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. -
ఇంజినీర్ ప్రాణం తీసిన పని ఒత్తిడి
● అధికారుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● కోవెలకుంట్లలో విషాద ఘటన కోవెలకుంట్ల: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వెల్ఫేర్‌శాఖ (ప్రభుత్వ) ఇంజినీర్‌గా పనిచేస్తున్న కోవెలకుంట్లకు చెందిన పల్లె మధుబాబు(52) పని ఒత్తిడి భరించలేక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మధుబాబు గత కొన్నేళ్ల నుంచి ఆశాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో ఆదర్శ పాఠశాలలో గతంలో నాడు– నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని నెలల నుంచి జరిగిన పనులపై పలు రకాలుగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ఈ కారణంగానే కొన్ని రోజుల నుంచి మనో వేదనకు గురి అవుతున్నారు. పని ఒత్తిడి తాళలేక మనస్తాపం చెంది బుధవారం తెల్లవారుజామున అమ్మోనియం రసాయన ద్రావణం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విధి నిర్వహణలో పని ఒత్తిడి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో కోవెలకుంట్లలో విషాదచాయలు అలుముకున్నాయి. మిట్నాల పనుల విషయంలో కొందరు ఉన్నతాధికారులు, పాఠశాల విద్యా కమిటీ, ప్రిన్సిపాల్, సచివాలయ ఉద్యోగి, తదితరులు కొన్ని రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తుండటంతోనే ఆత్మహత్య చేసుకున్నారని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని కుమారుడు మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. -
అప్పుల ఉరికి వేలాడిన ఇద్దరు రైతులు
గోనెగండ్ల/ కల్లూరు: అప్పుల బాధతాళలేక కౌలు రైతు ముల్లా జైనుద్దీన్(51), రైతు డి. జయరామిరెడ్డి (45) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్ల అచ్చుకట్ల వీధికి చెందిన ముల్లా జైనుద్దీన్‌కు భార్య నూరన్బీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరికి గ్రామంలో 1.25 ఎకరాల భూమి ఉంది. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలు తీర్చడానికి 2023లో జైనుద్దీన్ పొలాన్ని అమ్మివేశాడు. అయినా అప్పులు తీరలేదు. దీంతో గ్రామంలో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేశాడు. పంట సాగు కోసం, కుటుంబ పోషణ కోసమని రూ.7.50లక్షల అప్పు ఉంది. అప్పులు ఇచ్చిన వారు అడుగుతుండడంతో మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం మధ్యాహ్నం తన కొట్టంలో కొండికి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీ సులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పుసులూరు గ్రామంలో ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని పుసులూరు గ్రామానికి చెందిన డి. జయరామిరెడ్డి తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది పత్తి పంట సాగు చేయడానికి రూ. 3.95 లక్షలు అప్పు చేశారు. పంట సరిగా రాక పూర్తిగా నష్టపోయాడు. అప్పు కట్టలేనేమోనని శుక్రవారం మధ్యాహ్నం పశువుల ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. -
భక్తిశ్రద్ధలతో నృసింహ దీక్ష
● 5వేల మందికి పైగా దీక్ష చేపట్టిన భక్తులుఆళ్లగడ్డ: శ్రీమద్ అహోబిలం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దీక్షను భక్తులు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. పారువేట ఉత్సవాల్లో భాగంగా స్వామి గ్రామాల్లో పర్యటించేందుకు బయలుదేరే రోజున దీక్షను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం రాత్రికే దేశం నలుమూలల నుంచి అహోబిలం చేరుకున్న భక్తులు శుక్రవారం తెల్లవారు జామునే పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు దుస్తులు ధరించి ఎగువ, దిగువ అహోబిలంలో వెలసిన మూలమూర్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దిగువ అహోబిలం దేవాలయం ఎదురుగా యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసుదర్శన హోమం నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు దీక్షాపరులకు శ్రీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దీక్ష మాలలను వేసి ఆశీర్వదించారు. దీక్షాపరులు నేటి నుంచి 41 రోజులు నారసింహ స్వామి దీక్ష కొనసాగిస్తారు. -
ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో బెదిరింపు
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం గోశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో లో బెదిరింపులకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం గోశాల పర్యవేక్షకులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని గత మూడు నెలలుగా జీతం రాకుండా చేశాడని వీడియోలో ఆరోపించారు. 2020లో గోశాలలో గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో పనిచేయడానికి నియమించారని తెలిపారు. మూడు నెలల క్రితం గోశాల పర్యవేక్షకులుగా విధులు చేపట్టిన రాజశేఖర్ తన నెలసరి వేతనం రాకుండా చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంపై పర్యవేక్షకులు రాజశేఖర్ సంప్రదించగా గో ఉత్పత్తుల కేంద్రంలో పనిచేసే రాజు విధులకు గైర్హాజరవుతున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లానన్నారు. ఈ విషయంపై వన్‌టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబును సంప్రదించగా గోశాల రాజును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం పాణ్యం: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తమ్మరాజుపల్లెకు చెందిన కల్ప నాగరత్నమ్మ(60) అనే వృద్ధురాలు చెందారు. ఈ దుర్ఘటన తెల్లవారుజామున తమ్మరాజుపల్లె సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికుల ఫిర్యాదు మేరకు హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. కల్ప నాగరత్నమ్మ కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని, ఈమెకు కుమార్తె రేణుక ఉన్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. బైక్ ఢీకొని మహిళ మృతి పాములపాడు: మండలంలోని వాడాల గ్రామంలో జీవమ్మ(50) అనే మహిళ బైక్‌ఢీకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు జరిగింది. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 15న వాడాల గ్రామంలో వారపు సంత జరుగుతుండగా ఆమె కూరగాయలతో ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ ఢీ కొంది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. మృతురాలి పెద్ద కుమారుడు మాధవరం బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటులఎస్ఐ తెలిపారు. కేసీ కెనాల్లో వృద్ధుడి గల్లంతు పగిడ్యాల: కేసీ కాలువ గట్టుపై బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి వృద్ధుడు గల్లంతయిన ఘటన ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోటలో శుక్రవారం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గడివేముల గ్రామానికి చెందిన అచ్చన్న గౌడ్(80) సంక్రాంతి తిరునాలకు మనువరాలు చరిత ఇంటికి వెళ్లాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లి బ్రిడ్జి సమీపంలో సిమెంట్ బెడ్‌పై అమర్చిన మట్టి బస్తాల మీదుగా కేసీ కెనాల్లోకి దిగాడు. ఈ క్రమంలో అదుపు తప్పిలో అందులో జారిపడ్డాడు. గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించేలోగా నీటి ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బంధువులు వృద్ధుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా మృతదేహం లభ్యం కాలేదు. రోడ్డు ప్రమాదంలో శివ మాలధారుడు మృతి బేతంచెర్ల: ద్విచక్రవాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొట్టడంతో శంకరాపురం గ్రామానికి చెందిన శివమాలధారుడు శరవేణి దస్తగిరి మృతి చెందాడు. సీతారామాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పని నిమిత్తం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగి శరవేణి దస్తగిరికి తీవ్రగాయాలు అయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. దస్తగిరి(33)కి భార్య సుజాత, ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాల్ తెలిపారు. కుందూలో వృద్ధురాలి మృతదేహం ఉయ్యాలవాడ: మండలంలోని అల్లూరు గ్రామ సమీపంలో కుందూనదిలో వృద్ధురాలు శూలం లక్ష్మిదేవి(75) మృతదేహం శుక్రవారం కనిపించింది. వైఎస్సార్ జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన లక్ష్మిదేవి మెట్టినిల్లు నుంచి తరుచుగా తన సొంత గ్రామమైన సంజామల మండలం వసంతాపురం, కోవెలకుంట్ల మండలం కలుగొట్ల వద్ద కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు వస్తూ వెళ్లేది. ఈమె అనారోగ్యంతో బాధపడుతూ వుండేది. ఈమె భర్త వీరయ్య కూడా గతంలోనే మృతిచెందాడు. ఈ నెల 11న కలుగొట్ల వద్ద ఆశ్రమానికి వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పి వచ్చింది. ఐదు రోజులైనా ఇంటికి రాకపోవడంతో పుట్టింటికి వెళ్లి ఉంటుందని కుమారుడు అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధురాలు కుందూనదిలో విగతజీవిగా కనిపించింది. ఉయ్యాలవాడ పోలీసులు ఆధార్ కార్డు ఆధారంగా సమాచారం బంధువులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. -
భక్తుల చెంతకే పాండురంగడు
● వైభవం.. పార్వేట ఉత్సవంకోవెలకుంట్ల: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడు భక్తుల చెంతకు చేరి పూజలందుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పార్వేట ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్వేట సందర్భంగా ఆల య అర్చకులు సుదర్శనాచార్యులు, సంజీవాచార్యు లు, పవనాచార్యుల ఆధ్వర్యంలో స్వామికి శ్రీసూక్త, భూసూక్త విధానేనా అభిషేకాలు చేశారు. అనంతరం మండల పరిధిలోని సౌదరదిన్నె, అమడాల గ్రామాల్లో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. స్వామివారి పార్వేటను పురస్కరించుకుని సౌదరదిన్నెలో ఎస్సీ కుటుంబాల్లోని వ్యక్తులు ఉపవాసదీక్షలు ఆచరించారు. స్వామి పాండురంగస్వామి అశ్వవాహనంపై ఊరేగింపుగా గ్రామంలోకి రాగానే ఆ కుటుంబాలకు చెందిన చిన్నారులు పొర్లుదండాలతో స్వామివద్దకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కాలనీకి చెందిన సంగూ, తిరుపతి వంశస్తులైన బాల నరసింహుడు ఆధ్వర్యంలో స్వామివారిని పూలమాలలతో అలంకరించి ఖడ్గాలు చదువుతూ స్వామివారికి మొదటి పూజ చేసిన అనంతరం ఉపవాసదీక్ష విరమించారు. అక్కడి నుంచి పాండురంగని ఊరేగింపు అమడాల గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు ఘనస్వాగతం పలికి పూజలు నిర్వహించారు. పార్వేట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మహా‘నందీ’శ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ మహానందీశ్వరస్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న నందీశ్వరస్వామికి శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో అభిషే కం పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అ ర్చకులు డి.సురేంద్రశర్మ, వేదపండితులు శాంతారాంభట్లు ముందుగా గణపతిపూజ, పుణ్యాహవచనం చేసిన తర్వాత పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం, క్షీరాభిషేకం వైభవంగా చేపట్టారు. ప లు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవాటికెట్ల ద్వారా నందీశ్వరస్వామి ప్రదోష కాల అభిషేక పూజల్లో పాల్గొన్నారు. మహానందిలో భక్తుల సందడి మహానంది పుణ్యక్షేత్రంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా గత మూడు రోజుల నుంచి భక్తులరద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత, శీఘ్రదర్శనం, స్పర్శదర్శనం, క్షీరాభిషేకం, రుద్రాభిషేకం ఆర్జితసేవా టికెట్ల ద్వారా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. -
ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో బుధవారం రెండు అడుగుల వరకు నీటి ప్రవాహం తగ్గింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎల్లెల్సీకి దాదాపు 1,700 క్యూసెక్కుల నీరు వదులుతుండగా ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతోంది. రెండు, మూడు రోజుల వరకు ఈ విధంగా నీటిని వదులుతూ పూర్తిగా నిలిపి వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జలాశయం గేట్ల ఏర్పాటుకు సంబంధించి రబీలో డ్యాం నుంచి వచ్చే ఎల్లెల్సీతో పాటు ఇతర కాలువలకు నీటిని నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, ఇతర పంటలు డిసెంబర్ నెలలో చేతికి రావడంతో బోరు బావులున్న కొందరు రైతులు వరినారు వేసుకున్నారు. కాలువకు ఇంకా నీటి సరఫరా జరుగుతుండడంతో ఎల్లెల్సీ నీటితో మడులను తడిపి సిద్ధం చేసుకున్న రైతులు వరి, ఇతర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్లెల్సీ కింద ఒక కారు పంటతో సరి పుచ్చుకోవాల్సి రావడంతో బోరుబావులున్న రైతులు రబీ పంట విషయంలో బెంగపెట్టుకున్నారు. బోసిపోనున్న ఎల్లెల్సీ పశ్చిమ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీటిని అందించే తుంగభద్ర దిగువ కాలువ ఈ ఏడాది దాదాపు 6 నెలల పాటు బోసిపోనుంది. మార్చి, మే నెలలో తాగునీటి అలసరాల కోసం కొద్ది రోజులు కాలువకు నీటి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రబీలో వరి సాగు, మెట్టభూముల్లో పంటలు లేకపోవడంతో రానున్న రోజుల్లో పశుగ్రాసం, తాగునీటి ఎద్దడితో పశువుల పోషణ భారం కానుంది. కాగా టీబీ డ్యాంలో 1633 అడుగులతో 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి బుధవారం 1604 అడుగులతో 27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో లేకపోగా.. ఔట్‌ఫ్లో 3,474 క్యూసెక్కులు ఉంటోంది. పిచ్చికుక్క స్వైర విహారం పాణ్యం: తమ్మరాజుపల్లెలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. రెండు రోజులుగా గ్రామంలో పలువురిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. పిచ్చి కుక్క దాడిలో విష్ణు అనే బాలుడికి, మరో మహిళకు, వంట సామగ్రి వ్యాపారం నిమిత్తం వచ్చిన మరో మహిళకు గాయాలైనట్లు సమాచారం. అధికారులు చర్యలు చేపట్టి పిచ్చి కుక్కను తరిమేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
● గంజిహళ్లిలో రాయలసీమ జోన్ మైనింగ్ అధికారుల విచారణ గోనెగండ్ల: అధికారుల అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఎ. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం సాక్షి దినపత్రికలో ‘ఆగని ఇసుక దందా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం పోలీసులతో కలిసి వారు గంజిహళ్లి హంద్రీనదిలో ఇసుక తవ్వే ప్రాంతాన్ని పరిశీలించారు. హంద్రీనదిలో ఎక్కడెక్కడ ఇసుక కోసం తవ్వకాలు జరిపారు.. రోజుకు ఎన్ని ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారని ఆరా తీశారు. హంద్రీలో ఇసుక తరలిస్తున్న ప్రాంతం గాజులదిన్నె ప్రాజెక్టుకు చెందిన భూమిగా రెవెన్యూ రికార్డులో ఉంది. అయితే, గంజిహళ్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి సొంత భూమి అని ఒక ట్రాక్టర్ ఇసుక రూ.400 చొప్పున అక్రమార్కులకు విక్రయిస్తున్నట్లు మైనింగ్ అధికారులకు తెలియడంతో అతడిని విచారించారు. అనంతనం ఆ అధికారులు మాట్లాడుతూ హంద్రీనదిలో తవ్విన గుంతలను కొలతలు తీసుకున్నామని.. అలాగే శ్రీనివాసులును విచారించిన రిపోర్టును జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. గోనెగండ్ల మండలంలో ఇసుక రీచ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అధికారుల అనుమతులు అక్కడ ఇసుక తవ్వకాలు జరపరాదన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మండలంలోని గంజిహళ్లి హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను బుధవారం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. తర్వాత వాటిని మైనింగ్ అధికారులకు అప్పజెప్పినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. -
అనారోగ్యంతో సర్పంచ్ మృతి
తుగ్గలి : మండలంలోని రాతన గ్రామ సర్పంచ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గూడూరు రాచప్ప (80) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికి త్స అనంతరం నాలుగు రోజులకు క్రితం ఇంటికి వచ్చారు. తిరిగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొదట ఆదోనికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ కోలుకోలేక తుది శ్వాస విడిచారు. రాచప్ప మాస్టారు 2021లో వైఎస్సార్సీపీ మద్దతుదారుగా సర్పంచ్‌గా గెలిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు ఎస్.రామచంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మేధావుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు టీఎండీ హుసేన్, కో ఆప్షన్ సభ్యుడు చాంద్‌బాషా, ఇన్చార్జ్ సర్పంచ్ అన్వర్‌బాషా, సీ నియర్ నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, బసవరాజు,పంచాయతీ పాలకవర్గం నివాళులర్పించారు. సెల్‌ఫోన్ అప్పగింత వెల్దుర్తి: తనకు దొరికిన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్న యజమానికి పోలీసుల ద్వారా అప్పగించి ఓ యువకుడు తన నిజాయితీ చాటుకున్నాడు. పట్టణానికి చెందిన కర్రెక్కగారి లక్ష్మీకాంతరెడ్డి రోజులాగే తెల్లవారుజామున వంకగడ్డనున్న తన ఇంటి నుంచి రామళ్లకోట రోడ్డులో జాగింగ్‌కు వెళ్లాడు. నక్కల తిప్ప దాటిన తర్వాత రహదారి పక్కన సెల్‌ఫోన్ పడి ఉండటాన్ని చూసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఆ సెల్‌ఫోన్‌కు ఫోన్ కాల్ రావడం, లిఫ్ట్ చేయగా పోగొట్టుకున్న వ్యక్తి ఫోన్ చేయడాన్ని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఏఎస్ఐ ఆనందరెడ్డి విచారించి సెల్‌ఫోన్‌ను బొమ్మరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణకు అందజేశారు. -
ఈత ఆకులే ఆభరణాలుగా
చెంచులే అతిథులుగా..శ్రీశైలంటెంపుల్: నల్లమల అడవిలో నివసించే చెంచులు భ్రమరాంబాదేవిని కూతురుగా, మల్లికార్జునస్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో బ్రహ్మోత్సవ కల్యాణానికి వారే అతిథులుగా నిలిచి ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామిఅమ్మవార్లను అలంకరించనున్నారు. మకర సంక్రాంతి రోజే జరిగే ఈకల్యాణోత్సవానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక గాథ ప్రకారం: ప్రచారంలో ఉన్న స్థానిక గాథలను బట్టి ఒకానొకసారి పార్వతీదేవికి భూలోకా అందాలను తిలకించాలనే కోరిక కలిగింది. దాంతో అమ్మవారు చెంచు యువతి రూపాన్ని పొంది శ్రీశైలం అటవీ ప్రాంతానికి విచ్చేసింది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్దురాలైన అమ్మవారు కొంతకాలం శ్రీశైలంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. అడవిలో ఒకచోట తన నివాసాన్ని ఏర్పరుచుకుని ఉండసాగింది. చెంచురూపంలో ఉన్న పార్వతీదేవిని స్థానిక చెంచులు ఆదరిస్తూ అమెకు సపర్యలు చేయసాగారు. ప్రతిరోజూ అమెకు పాలు, తేనే, పలురకాల అడవిపండ్లు, దుంపలు మొదలైనవాటిని అమెకు ఆహారంగా ఇవ్వసాగారు. ఇక సంతానం లేని ఈ ప్రాంతపు చెంచుదొర దంపతులు అమ్మవారినే తమ సొంత బిడ్డగా భావించి పార్వతీదేవిపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు. ఇదిలా ఉంటే అమ్మవారు కై లాసాన్ని వీడిరావడంతో కై లాసమంతా బోసిపోయింది. దాంతో పార్వతీదేవిని వెతుకుంటూ పరమేశ్వరుడు శ్రీశైల అడవికి చేరుకుంటాడు. అమ్మవారిని కలుసుకోవడానికి తాను కూడా చెంచు యువకుడి రూపం ధరిస్తాడు. ఇలా ఇద్దరు కలుసుకొని ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుని వివాహానికి సిద్ధపడుతారు. అయితే, తనను కన్నబిడ్డగా చూసుకున్న చెంచుదొర దంపతుల అంగీకారం పొందాలని అమ్మవారు స్వామిని సూచిస్తారు. అతను దొర వద్దకు వెళ్లి అడిగితే వివాహమైతే కుమార్తెను భర్తతో పంపాల్సి ఉంటుందని అంగీకరించడు. ఇలా ఎంతకీ చెంచులు వివాహానికి అంగీకరించక పోవడంతో స్వామి అమ్మవారు ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకుంటారు. ఆ వివాహం జరిగిన రోజే మకర సంక్రాంతి. తరువాత ఆ వివాహాన్ని తెలుసుకున్న చెంచులు చేసేదేమిలేక మహాశివరాత్రి రోజు అందరి సమక్షంలో స్వామిఅమ్మవారికి మళ్లీ పెళ్లి చేస్తారు. ఈ కథ ఆధారంగా శ్రీశైల సంస్కృతిలో చెంచులకు గల విశిష్టస్థానాన్ని గుర్తించిన దేవస్థానం గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. పార్వతీ, పరమేశ్వరుల కల్యాణానికి అటవీఆకులతో సిద్ధం చేసిన ఆభరణాలు కల్యాణానికి సిద్ధమైన పెళ్లి ఆభరణాలు శ్రీశైలం మేకలబండ చెంచు గూడెంలో నివసిస్తున్న మండ్లి మల్లికార్జున(దేవ చెంచు) స్వామిఅమ్మవార్ల కల్యాణానికి అడవి ఆకులతో ఆభరణాలు సిద్ధం చేశారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు. అలాగే స్వామివారికి జంజం, మెడలో ధరించేందుకు ఆభరణం, ఉంగరం, తలంబ్రాలుగా వెదురు బియ్యం ఇలా కల్యాణానికి అవసరమైన అన్ని వస్తువులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. -
నేడు వాతావరణ కేంద్రం సందర్శనకు అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులోని బిర్లా కూడలిలో ఉన్న భారత వాతావరణ విభాగాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాల ప్రజలు గురువారం సందర్శించే అవకాశాన్ని కల్పించినట్లు వాతావరణ కేంద్రం అధికారి పి.ప్రభాకర్ తెలిపారు. భారత వాతావరణ విభాగం ఏర్పడి ఈ నెల 15 నాటికి సరిగ్గా 151 సంవత్సరాలు పూర్తవుతోందన్నారు. ఈ సందర్భంగా కర్నూలులోని వాతావరణ కేంద్రాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సందర్శించి ఇక్కడి యంత్రాలు, పరికరాలు, వాటి పని తీరును తెలుసుకోవచ్చన్నారు. వాతావరణ కేంద్రం వల్ల కలిగే ఉపయోగాలు, ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయనే విషయాలపై అవగాహన పెంచుకోవచ్చని ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెరుగుతున్న పత్తి ధరలు ● కొనుగోలు కేంద్రాలకు తగ్గిన తాకిడి కర్నూలు(అగ్రికల్చర్): బహిరంగ మార్కెట్లో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు పత్తి తాకిడి తగ్గింది. జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడుల్లోని 16 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొంటోంది. ఈ నెల 12 నాటికి 24,649 మంది రైతుల నుంచి రూ.577.91 కోట్ల విలువైన 7,37,592.73 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. పత్తి మద్దతు ధర రూ.8,060. ఉమ్మడి జిల్లాలో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రమే పత్తి క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న ఆదోని మార్కెట్ యార్డులో క్వింటా పత్తికి కనిష్టంగా రూ.4,209, గరిష్టంగా రూ.8,778 లభించింది. సగటు ధర రూ.7,869 నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నెల రోజులుగా నగదు జమ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ నెల 23వ తేదీ వరకే స్లాట్స్ బుక్ అయ్యాయి. ఈనేపథ్యంలో స్లాట్ బుకింగ్‌ను బట్టి పత్తి కొనుగోళ్లు జరుగుతాయా, లేదా అన్నది స్పష్టమవుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై టీడీపీ నేత వీరంగం నందవరం: మద్యం మత్తులో ఓ టీడీపీ నాయకుడు డ్యూటీలోని కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో బైక్‌పై వస్తూ పడిపోగా లేపబోయిన కానిస్టేబుల్‌పైనే నోరు పారేసుకున్నాడు. నీవెంత, నువ్వు తాగవా.. అంటూ మానవత్వం చూపిన పాపానికి బూతులు తిట్టాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు, నందవరం మండలంలోని నదికై రవాడి గ్రామానికి చెందిన కురవ వీరేష్ తెలంగాణలోని రాజపురంలో పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత బైక్‌పై నాగలదిన్నెకు బయలుదేరాడు. సరిహద్దు చెక్ పోస్టు వద్ద బైక్ నుంచి కింద పడిపోగా చెక్‌పోస్టు విధుల్లోని కానిస్టేబుల్ కె.రాజు మానవత్వంతో అతడిని లేపబోయా డు. ఇంతలోనే టీడీపీ నాయకుడు కొడకల్లారా.. నా ఇసుక ట్రాక్టర్లే ఆపుతారా అంటూ బూతులు మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వీరంగం సృష్టించాడు. ఇంతచేసినా ఇప్పటివరకు పోలీసులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
డోలమైట్ ఖనిజం టిప్పర్ బోల్తా
బేతంచెర్ల: మండల పరిధిలోని గోర్లగుట్ట మలుపులో బేతంచెర్ల వైపు నుంచి బనగాపల్లె వైపు డోలమైట్ ఖనిజం లోడుతో వెల్తున్న టిప్పర్ మంగళవారం అర్ధరాత్రి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఎవరికి ఎ లాంటి ప్రమాదం జరగలేదు.రహదారిపై డోలమైట్ ఖనిజం పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసు లు సంఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సహాయంతో ఖనిజాన్ని, టిప్పర్‌ను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. పాల వ్యాపారి అదృశ్యం కర్నూలు: కల్లూరు మండలం ఎన్టీఆర్ బిల్డింగ్స్‌లో నివాసముంటున్న పాల వ్యాపారి బ్రహ్మానంద రెడ్డి (26) అదృశ్యమయ్యాడు. తల్లి లక్ష్మిదేవితో కలసి పంచలింగాల వద్ద డైరీ ఫారం ఏర్పాటు చేసుకుని పాల వ్యాపారం సాగిస్తున్నాడు. పంచలింగాల నుంచి రోజూ కర్నూలుకు పాలు తీసుకుని వచ్చి వ్యాపారం సాగించేవాడు. ఈనెల 12న పాలు తీసుకుని కర్నూలుకు వచ్చాడు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో తల్లి లక్ష్మిదేవి ఆయన సోదరుడు బ్రహ్మానందరెడ్డితో కలిసి గాలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో కేసీ కెనాల్ హైవే పక్కన అతని బైకు కనిపించడంతో స్వాధీనం చేసుకుని మేనమామ మల్లికార్జున రెడ్డి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాల వ్యాపారి శ్రీకాంత్ రెడ్డితో డబ్బుల విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, అతనిపైనే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కేసీ కెనాల్ వెంట పాములపాడు వరకు గస్తీ తిరుగుతున్నారు. మూడు రోజులుగా బ్రహ్మానందరెడ్డి కనిపించకపోవడంతో ఎలాగైనా తన కుమారుడిని వెతికి అప్పగించాలని తల్లి లక్ష్మీదేవి పోలీసులను వేడుకుంటోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తండ్రి కర్మకాండకు వెళ్తూ..
● సంతజూటూరు ప్రభుత్వ పాఠశాల టీచర్ నాగన్న మృతి ● ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ప్రమాదం ● శోకసంద్రంలో బాధిత కుటుంబం జూపాడుబంగ్లా: తండ్రి కర్మకాండలకు వెళ్తూ కుమారుడు ప్రమాదానికి గురై మృతిచెందాడు. బాధిత కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన బుధవారం జూపాడుబంగ్లా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన జూపాడుబంగ్లాకు చెందిన జేమ్స్(చెంచన్న) డిసెంబర్ 31న మృతి చెందాడు. ఈయన కుమారుడైన నాగన్న (50) బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి కర్మకాండల నిమిత్తం బుధవారం భార్య విజయకుమారితో కలిసి నాగన్న స్వగ్రామమైన జూపాడుబంగ్లాకు బయలుదేరాడు. ఆత్మకూరు ఆర్టీసి బస్టాండులో శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సులో ఎక్కారు. మరో ఐదు నిమిషాల్లో బస్సు జూపాడుబంగ్లా బస్టాండుకు చేరుకుంటుంది. నాగన్న దంపతులు దిగేందుకు ముందుగానే సీట్లోంచి లేచి ఫుట్‌బోర్డుపై నిల్చొన్నారు. కండక్టర్ చంద్రమోహన్ గమనించి అలా నిల్చొ వద్దని ఇరువురిని వారించాడు. అదే సమయంలో హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా గొర్రెలు రావటంతో బస్సు డ్రైవర్ ఆకుల లక్ష్మన్న సడన్ బ్రేక్‌వేశాడు. ఫుట్‌బోర్డుపై నిల్చొన్న నాగన్న బస్సు లోంచి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అతని పక్కనే నిలబడిన మృతుని భార్య కూడా పడబోతుండగా కండక్టర్ చె య్యి అడ్డుపెట్టడంతో ప్రమాదం తప్పి ంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యు లు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని బో రున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సంజీవ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించాడు. -
నేడు నందివాహనసేవ
సంక్రాంతి రోజు గురువారం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు నందివాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో గంగాపార్వతీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ● శ్రీగిరిలో వైభవోపేతంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ● నేడు పార్వతీ సమేత మల్లికార్జునుడికి కల్యాణోత్సవంచీకట్లను తరిమేస్తూ.. భోగి భాగ్యాలను ఆహ్వానిస్తూ.. సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం బుధవారం వేకువజామున భోగిమంటలు కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, మహా మంగళహారతులు పూర్తయిన తరువాత ప్రధాన ఆలయ మహాద్వార ఎదురుగా గంగాధర మండపం వద్ద భోగి మంటలు వేశారు. అర్చకస్వాములు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంట చెరకు వేసి భోగిమంటలు వేశారు. సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐదేళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు ఈ భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు, వేదపండితులు సంకల్పాన్ని పఠించి, గణపతిపూజ జరిపారు. అనంతరం షోడశోపచారపూజలు నిర్వహించి రేగిపండ్లను, చిన్న చిన్న చెరకు ముక్కలు, పూలరెక్కలతో కలిపి పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పి భోగిపండ్లను పిల్లలపై వేశారు. ఈ భోగిపండ్లు వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెప్పబడుతుంది. భక్తజనం మధ్య గ్రామోత్సవం -
వైభవంగా గోదాదేవి పరిణయం
● అహోబిలంలో శాస్త్రోక్తంగా ముగిసిన ధనుర్మాసోత్సవాలు ఆళ్లగడ్డ: జయజయ నారసింహ నామ సంకీర్తనలు.. వేద పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. ఆస్థాన విద్వాంసుల మంగళకర వాయిద్యాల నడుమ శ్రీ అహోబిలేశుడు, గోదాదేవీ పరిణయ వేడుక బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వైభవంగా జరిగింది. ఈ తంతుతో నెలరోజులు విశేష పూజలు నిర్వహిస్తూ గోదాదేవి అమ్మవారిని రోజుకో అలంకరణ చేస్తూ నిర్వహించిన ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా ముగిశాయి. బుధవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవర్లాతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక ధనుర్మాస, భోగి పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన పెళ్లి మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచి వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశస్థాపణ, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి కొలువుంచారు. రాత్రి స్వామి, అమ్మవారిని ఆండాళ్ అమ్మవారి సన్నిధికి తీసుకెళ్లి శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని, గోదాదేవిని పల్లకీల్లో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. -
పెద్దాసుపత్రిలో మంత్రి టీజీ అనుచరుల దౌర్జన్యం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీ, పారిశుధ్య పోస్టుల విక్రయాల్లో చేతివాటం ప్రదర్శించడం తెలిసిందే. తాజాగా ఆసుపత్రి ఆవరణలో జిరాక్స్ సెంటర్ ఏర్పాటుకు కంటైనర్ దుకాణాన్ని రాత్రికి రాత్రి దించేశారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో మంత్రి అనుచరుడు ఒకరు దుకాణం ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే ఆసుపత్రిలో ఇలా బంకులకు అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్లడం సరికాదని ఆ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ పక్కన పెట్టేశారు. సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆసుపత్రిలోని ఓపీ టికెట్ కౌంటర్ సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో మంత్రి అనుచరుడుగా చెప్పుకునే ఓ వ్యక్తి కంటైనర్ బంక్‌ను తెచ్చి పెట్టేశారు. బుధవారం ఉదయం విష యం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి మాట్లాడారు. తాము వారిస్తున్నా వినిపించుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఇద్దరు సెక్యూరిటీ సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు. అనంతరం బంక్ ఏర్పాటు చేసే సమయంలో ఎవరున్నారనే విషయమై సీసీ కెమెరా ఫుటేజ్‌ను తెప్పించుకున్నారు. ఓ ఉద్యోగ సంఘం నాయకుడు అక్కడున్న విషయం గుర్తించి మాట్లాడగా విషయం తెలుసుకునేందుకు వెళ్లామని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇలా పిలిపించి మాట్లాడటాన్ని అవమానంగా భావించిన ఓ నాయకుడు తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశా రు. ఇదిలాఉంటే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు నాయకులు ఆయనకు ఫోన్ చేసి తీవ్ర ఒత్తిళ్లకు గురిచేసినట్లు తెలిసింది. బంక్‌ను మంత్రి ఆదేశాల మేరకే వేశామని తొలగించవద్దని చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది బంకును తొలగిస్తుండగా మంత్రి అనుచరులు అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగడం గమనార్హం. ఎట్టకేలకు ఆసుపత్రి సిబ్బంది ప్రొక్లెయిన్ సాయంతో బంక్‌ను కంటి ఆసుపత్రికి వెళ్లే దారిలోకి తరలించారు. హెచ్‌డీఎస్ మీటింగ్‌లో కలెక్టర్ ఆదేశాలూ బేఖాతర్ -
యామబ్బీ.. ఊరికేమాయా!
సంక్రాంతి పండుగకు ఎక్కడో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు స్వగ్రామానికి చేరుకున్నారు. చాలా మంది బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు పండుగకు పల్లెలకు చేరుకున్నారు. ఊరిలో స్నేహితులు, బంధువులు, పెద్దలు కలిసి కబురు చెప్పుకుంటూ కనిపించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామ రచ్చబండ వద్ద పలువురు ఆసక్తికర విషయాలు మాట్లాడుకుంటూ కనిపించారు. గత వైఎస్సార్సీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనను బేరీజు వేస్తూ చర్చించారు. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుబడుతూ.. పడకేసిన అభివృద్ధి, అందని సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని నిట్టూర్చారు. – కొలిమిగుండ్ల భాస్కర్‌రెడ్డి: శివాడ్డి ఎక్కడికి పోయింటివి..ప్యాంటు వేసుకున్నావు..గని కాడికి పోలేదా? శివారెడ్డి: తాడిపత్రికి పోయింటిని..పాలీష్ ప్యాక్టరీ ఓనర్ దగ్గరకు. సంక్రాంతి పండుక్కు లెక్క ఇస్తే కూలోల్లకు ఇద్దామనుకుంటిని..వ్యాపారాలు అప్పుడు మాదిరి లేవు..రాళ్లన్నీ ప్యాక్టరీలోనే ఆనుకున్నాయి.. అని కొంచెం ఇచ్చినాడు. కూలోల్లకు ఇచ్చేదానికి కూడ సరిపోదు. ఇంతకు ముందు గన్లలో రాళ్లు ఉండగానే ముందుగానే అడ్వాన్సు ఇచ్చి తీసుకుబోతుండిరి. ఇప్పుడు భంగకపోయి రాళ్లు ఎత్తిచ్చన్నాం. కూలోల్లకు పండక్కన్నా డబ్బులు ఇయ్యక పోతే మల్లా గనికి రారు. ఏట్లైనా వాల్లకు లెక్క ఇయ్యాల్సిందే. కొన్నాల్లుంటే రాల్లు అడిగే వారుండరేమో.. భాస్కర్‌రెడ్డి: భాగ్యాలూ.. మేకలు బాగున్నాయా.. భాగ్యాలు: బాగనే ఉన్నాయిన్నా..కానీ మన ఊర్లో పసుల ఆసుపత్రి ఉంది కానీ మందులే ఉండవు. డాక్టరు లేడు.. వేరు వాళ్లు ఎప్పుడో ఒక సారి వస్తాడంటా. నేనేం మేకలు తోలుకొని మేతకు కొండకు పోయింటాను. ఆసుపత్రి పడిపోయేలాగా ఉంది. ఇంతకు ముందు గవర్నమెంట్లో పశువులకు మందులు ఎన్ని కావాలన్నా ఇస్తండిరి. ఎదన్న రోగం వచ్చి మేకలు చచ్చిపోతే ఇన్సురెన్స్ కూడా రావడం లేదంటా.. పోయిన ప్రభుత్వంలో పశవులు చచ్చిపోతే ఆఫీసర్లు పోస్టుమార్టం చేసి పైకి పంపించగానే లెక్క పడుతుండేదంట. భాస్కర్‌రెడ్డి: ఏం మద్దిలేటి.. యాడికి పోయింటివి లేటుగా వస్తివే! మద్దిలేటి: ఒళ్లంతా నొప్పులుంటే ఖాశీం డాక్టర్ కాడికి పోయింటి..సూదేసి రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. జగన్ ఉన్నప్పుడు నెల నెలా 104 బాగా వచ్చుండేది. ఇప్పుడు.. ఎప్పుడు వచ్చుందో తెల్దు. రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. తగ్గక పోతే తాడిపత్రి కన్నా పోయి సూపించుకుంటా. పోయిన గవర్నమెంట్లో జగనన్న వైద్య శిబిరం మన ఊర్లో బడి కాడ పెట్టినప్పుడు పోయింటిని డాక్టర్లు మంచి మందులు ఇచ్చినారు. ఇప్పుడీ ప్రభుత్వం ఒక్క సారి కూడా వైద్య శిబిరం పెట్టనేలేదు. భాస్కర్‌రెడ్డి: వెంకటనారాయణ నీకు 60 ఏళ్లు ఉండవు? వెంకటనారాయణ: 60 ఏళ్లు పడి సంవత్సరం దాటిందిప్పా. సచివాలయం కాడికి ఆధార్ కార్డు తీసుకొని ఐదార్లు సార్లు పోయినా.. వాళ్లు ఇంకా పైనుంచి రాలేదంటున్నారు. జగన్ ఉన్నప్పుడు ప్రతి వాళ్లకు ఇచ్చినాడు. అప్లికేషన్ పెట్టేదే ఆలస్యం వెంబడే వచ్చండ్లా. ఇప్పుడు ఒక్కో ఊల్లో పించన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తన్నారు. కాళ్లు, చేతులు లేనళ్లకు ఇయ్యలా. -
ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలు పట్టవా?
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన బాట పడుతామని ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పి.కన్నన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ సమావేశ భవనంలో డ్రైవర్స్ ఫెడరేషన్ సౌత్ వెస్ట్ జోన్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జాతీయ అధ్యక్షుడు కన్నన్ అధ్యక్షతన జరిగింది. ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కన్నన్, జాతీయ ప్రధాన కార్యదర్శి సత్పాల్ మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల చట్టబద్ధమైన డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేదన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. విద్యార్హతలను బట్టి డ్రైవర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉన్నప్పటికి ఈ దిశగా ప్రభుత్వ చర్యలు లేవని తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా గవర్నమెంటు డ్రైవర్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రసిడెంట్లు జి.అబ్దుల్ హమీద్(కర్నూలు), రిజ్వాన్ అహ్మద్ సిద్దకి, సౌత్ వెస్ట్ జోన్ అధ్యక్షుడు అనిరుద్ధ టెహరా, మాజీ జాతీయ అధ్యక్షుడు రాంపర్ పాండే, జిల్లా నాయకులు రామ్‌గోపాల్, ఇలియాస్ బాషా, షబ్బీర్ బాషా, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే ఆందోళన బాట తప్పదు ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పి.కన్నన్ -
బోడబండలో పట్టపగలు భారీ చోరీ
● 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి ఏకంగా 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పెద్దనర్సిరెడ్డి అనే వ్యక్తి ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పొలం పనులకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పొలం పనులు ముగించుకొని వచ్చిన పెద్దనర్సిరెడ్డికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటం, తలుపులు తెరుచుకొని ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలోని 15 తులాల బంగారు చోరీకి గురైందని బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
మాకు పరిహారం ఏదీ?
● కలెక్టరేట్ ఎదుట ఉల్లి రైతుల ఆందోళన ● టీడీపీ నాయకులకు ఇచ్చి తమకు మొండి చేయి చూపారని మండిపాటు కర్నూలు(సెంట్రల్): ఉల్లి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని దేవనకొండ మండలం గుడిమిరాళ్ల, బేతపల్లి, చెల్లెలి చెలిమల, కొటకోండ, బండపల్లి తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు టీడీపీ నాయకులకు ఇచ్చి నిజమైన బాధితులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ గ్రామాల ఉల్లి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వకీలు రంగన్న, ప్రకాస్‌రెడ్డి, హనుమంతరెడ్డి, సురేంద్రబాబు, మల్లి, భాస్కర్, విజయుడు, వంశీశెట్టి, గోపాల్, సోమలింగ, షేక్ మహ్మద్‌బాషా, గజ్జెలు శ్రీనివాసులు, బోయ కిష్టన్న, కౌలుట్లయ్య, ఆంజనేయులు, రంగడు మాట్లాడుతూ..తమ గ్రామాల్లో వందల మంది ఉల్లి పండించి ధర లేక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన రూ.1200 కూడా రాకపోవడంతో పారబోసి వచ్చామని, అయితే ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నష్టపోయిన రైతులకు కాకుండా మండలంలో టీడీపీ నాయకులకు మాత్రమే అందించారన్నారు. మరోవైపు కొందరు రైతులు మార్క్‌ఫెడ్‌కు ఇచ్చినా ఇంత వరకు సరుకు ధర ముట్టలేదన్నారు. పరిహారం మంజూరులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.జిల్లా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. కాగా, ఉల్లి రైతులకు ఏపీ రైతు సంఘం నాయకులు వీరశేఖర్, సూరి మద్దతు తెలిపారు. అనంతరం రైతులు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో తమకు న్యాయం చేయాలని వినతిపత్ర ఇచ్చారు. -
అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి
కర్నూలు సిటీ: జిల్లాలో 2025–26 అప్రెంటిస్‌కు ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హాజరుకావాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజిల్ మెకానిక్ విభాగంలో 204, 2, 93, 236, 269, 167, 227, 98, 232, 137, 74, 202, 246, 201, 166, 205, 108, 92, 300, 266, 5, 112, 117, 283, 260, 309, 27, 63, 307, 69, 174, 282, 224, మోటర్ మెకానిక్ విభాగంలో 12, 28, 14, 35, 7, ఎలక్ట్రీషియన్ 16, 281, 74, 129, వెల్డర్ విభాగం 4, ఫిట్టర్ విభాగంలో 7, డ్రాఫ్ట్‌మెన్ విభాగంలో 7 అనే నంబరు గల వారు అప్రెంటిస్‌కు ఎంపికయ్యారన్నారు. ఓటరు మ్యాపింగ్‌లో పురోగతి తీసుకురావాలి కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతిని తీసుకు రావాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలునుంచి రెవెన్యూ క్లినిక్‌లు, పీజీఆర్ఎస్, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే తదితర అంశాలపై కలెక్టర్ మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, ఎస్డీసీలు అనురాధ, సునీత పాల్గొన్నారు. 18 మద్యం బాటిళ్లు స్వాధీనం కోవెలకుంట్ల: మండలంలోని వల్లంపాడులో సోమవారం ఓ మహిళ వద్ద నుంచి 18 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ధనుంజయులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మాధవి అనే మహిళ బెల్ట్షాపుద్వారా మద్యం బాటిళ్లు విక్రయిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఆమె వద్ద 10 మద్యం, ఎనిమిది బీరుబాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అలాగే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బైక్‌పై వచ్చి..డబ్బులు దోచుకెళ్లి కోడుమూరు రూరల్: పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద రూ.2 లక్షల చోరీ జరిగింది. బైక్ సైడ్బ్యాగ్లో పెట్టి బ్యాంక్ లోపలికి వెళ్లి వచ్చేలోపు ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దేవనకొండ మండలంలోని ఐరనబండ బి.సెంటర్ గ్రామానికి చెందిన ఖాసీంవలి తెర్నేకల్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రికవరీ అమౌంట్ రూ.2 లక్షలు తీసుకుని కోడుమూరులోని ఎస్బీఐ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి మరిన్ని డబ్బులు తీసుకునేందుకు స్నేహితుడు అనూక్‌తో కలిసి బైక్‌పై వచ్చాడు. డబ్బును బైక్ సైడ్ బ్యాగులో ఉంచి స్నేహితుడిని అక్కడే ఉండమని చెప్పి ఖాసీంవలి బ్యాంకులోకి వెళ్లాడు. ఎంతసేపటికి అతను తిరిగి రాకపోవడంతో స్నేహితుడు అనూక్ బ్యాంక్ వద్దకెళ్లాడు. తిరిగివస్తుండగానే ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి బైక్‌పై వేగంగా వచ్చి డబ్బులున్న బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. అభివృద్ధికి తోడ్పాటు అవసరం కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల తోడ్పాటు అవసరమని కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆర్సెలర్ మిట్టల్గ్రీన్ ఎనర్జీ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ(సీఎస్ఆర్) కింద చిన్నటేకూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటనరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి రూ.10 లక్షలు, ఓర్వకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రూ.10 లక్షలు చొప్పున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్, ప్రాజెక్టు హెడ్ కో ఆర్డినేటర్ శ్రీధర్ పరవాడ కలెక్టర్‌కు అందజేశారు. -
ఫిబ్రవరి 18 నుంచి శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వాముల గురు వైభవోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి 24వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ మఠం మేనేజర్ యస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనం చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా గురువైభవోత్సవ ఆహ్వాన పత్రికను ప్రారంభించారు. మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు మట్లాడుతూ భక్తులు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందాలని కోరారు. ఫిబ్రవరి 19న గురు వైభవోత్సవాల్లో భాగంగా 405వ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తామన్నారు. -
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(అర్బన్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లాలోని 91 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 10, 11వ తేదీల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే అనేక మంది గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొనలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులపై 24 గంటల్లోగా సచివాలయ ఉద్యోగులు సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు. సమస్యలను సత్వరం పరిష్కరించాలి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్ఈ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరిస్తే వినియోగదారుల్లో సంతృప్తి రేటు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జంట హత్యల కేసులో మరో 13 మంది అరెస్టు ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన అన్నదమ్ముల హత్య కేసులో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మర్రివాడ భార్గవి తెలిపారు. సోమవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మీడియా ముందు హత్య కేసు నిందితులను చూయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో హెచ్‌సీ బీరప్ప, చంద్ర, ప్రేమన్న, కానిస్టేబుళ్లు కె.తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వరరెడ్డి, మల్లయ్య, జి.తిప్పన్న, రమేష్, తుకారాం, శివప్రసాద్, సుధాకర్‌లు టీంగా ఏర్పడి హత్యల కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టారన్నారు. ఆదివారం సాయంత్రం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేశామన్నారు. తాజాగా అదుపులోకి తీసుకున్న 13 మందితో కలిసి అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 25కు చేరిందన్నారు. వీరి నుంచి హత్యలకు ఉపయోగించిన మారణాయుధాలు, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పికెట్ ఏర్పాటు చేశామన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో బాగా పనిచేసిన సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ కె.శ్రీనివాసులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చ’గడ్డి వేస్తే భగ్గుమంటోంది!
కర్నూలు: టీడీపీలో మంత్రి టీజీ భరత్ వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడటం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో పాటు ఆ పార్టీ నేతలనే పరోక్షంగా బెదిరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గం ఇన్చార్జి విష్ణువర్దన్‌రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చేతులు కలిపినట్లు తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతోంది. కోడుమూరులో ఇటీవల మంత్రి అచ్చెన్నాయడు పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, విష్ణు మధ్య ఉన్న విబేధాలు బహిర్గతమయ్యాయి. అలాగే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు జన్మదిన వేడుకల సందర్భంగా వెలిసిన బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీని వెనుక మంత్రి టీజీ హస్తం ఉన్నట్లు శ్యాంబాబు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా కార్యకర్త పడాల సునీల్బాబుపై జరిగిన దాడి పట్ల కూడా విష్ణు తీవ్రంగా స్పందించారు. దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్సపొందుదున్న సునీల్‌బాబును స్వయంగా వెళ్లి పరామర్శించారు. నెల రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస పరిణామాలతో మంత్రి వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు విష్ణు, కేఈలు కలిసి పార్టీ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు వారి అనుచరుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలులో మంత్రి అనుచరుల గుండాయిజంపై చంద్రబాబు, లోకేష్‌లకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి అనుచరుల గుండాయిజంపై విష్ణు ఫైర్ ‘‘తాజా పరిణామాలు పూర్తిగా నాకు తెలుసు, వాటి పర్యవసానం త్వరలో మీరే చూస్తారు. సునీల్‌బాబు.. విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అతను టీడీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నాయకుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు దాడి చేశారు. మనపై జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా మనం కూడా అదే స్థాయిలో స్పందించాలి. ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదు’’ అంటూ విష్ణువర్దన్‌రెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన తన నివాసంలో ముఖ్య అనుచరులు, కర్నూలు మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే తాను తాపత్రయపడుతున్నానని, ఇటీవల ఆల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్‌పైప్ లీకేజీ విషయంలో కూడా అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేశాను. అయితే చివరి నిమిషంలో అధిష్టానం సూచన మేరకు విరమించుకున్నట్లు చెప్పారు. వివాదాస్పదమవుతున్న మంత్రి టీజీ భరత్ తీరు జట్టుకడుతున్న రెండు ప్రధాన కుటుంబాలు ఆజ్యం పోసిన సోషల్ మీడియా కార్యకర్తపై దాడి ముఖ్య నేతలు, అనుచరులతో సమావేశమైన విష్ణు అదేస్థాయిలో స్పందిద్దామని భరోసా -
హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
కర్నూలు: ద్విచక్ర వాహనదారులకు ప్రాణాపాయం జరగకుండా ఉండటానికి రవాణా, పోలీసు శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద డీఐజీ/ఇన్చార్జి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పాత కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్‌విహార్, కలెక్టరేట్ మీదుగా సి.క్యాంప్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఇన్చార్జి ఆర్టీఓ మల్లికార్జున, సీఐలు మన్సూరుద్దీన్, మధుసూదన్ రావు, పార్థసారధి, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు, వివిధ షోరూమ్‌ల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. నో హెల్మెట్ – నో పెట్రోల్ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈనెల 1 నుంచి కొనసాగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలతో పాటు తనిఖీ నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నో హెల్మెట్ – నో పెట్రోల్ విధానాన్ని కూడా అమలు చేస్తూ పెట్రోల్ బంకుల వద్ద బోర్డులు పెట్టించి హెల్మెట్ లేనివారిని వెనక్కు పంపుతున్నారు. -
రెండేళ్లుగా అందని పదవీ విరమణ బెనిఫిట్స్
కర్నూలు(అగ్రికల్చర్): పదవీ విరమణ చేసి రెండేళ్లవుతున్నా ఇంతవరకు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వలేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. సోమవారం కలెక్టరేట్లోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ఈ నెల 22న నిర్వహించే విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిడుతూరు తహసీల్దారుగా పని చేసి 2024 జనవరి 31న పదవీ విరమణ పొందిన సిరాజుద్దిన్ ఈ సందర్భంగా తన గోడు వినిపించారు. కర్నూలుకు చెందిన ఈయనకు రెండేళ్లవుతున్నప్పటికీ ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. 2024 జనవరి నెల నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో రెవెన్యూ యంత్రాంగం ఈయన పెన్షన్ ప్రపోజల్స్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. జూన్‌లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారులు విశ్రాంత తహసీల్దారు పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. అయితే కనీసం పెన్షన్ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం నెలకొంది. నిరంతర పోరాటంతో 9 నెలల క్రితం పెన్షన్ మంజూరైంది. ఇక ఏపీజీఎల్ఐ, ప్రాపిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, 10 నెలల సెలవు వేతనం ఇప్పటికీ చెల్లించని పరిస్థితి. దాదాపు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందాల్సి ఉంది. రెవెన్యూ శాఖలో ఈయన ఒక్కరే కాదు.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పదవీ విరమణ చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే ఆవేదన.బైక్ అదుపు తప్పి.. డోన్ టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఖాజా హుస్సేన్(54) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు పట్టణ సమీపంలోని యు. కొత్తపల్లెలో క్లీనిక్ నిర్వహిస్తూ ప్రతి రోజు బైకుపై కొత్తపల్లె గ్రామానికి వెళ్లి వచ్చేవాడు. విధి నిర్వాహణలో భాగంగా బైక్‌పై వెళుతుండగా వైఎస్, కోట్ల నగర్ కాలనీల మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై బైకు అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమ్మిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచేందకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఆమె వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాంద్ర కార్యక్రమానికి సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో నిరక్షరాస్యులుగా ఉన్న 1,61,914 మందిని అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. అక్షరాంధ్రలో భాగంగా నిరక్షరాస్యులకు డీఆర్డీఏ, మెప్మా, విద్యా వలంటీర్ల ద్వారా చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, వయోజనవిద్య డీడీ చంద్రశేఖరరెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, డీఈఓ సుధాకర్, సీపీఓ భారతి, డివిజినల్ పంచాయతీ అధికారి తిమ్మక్క పాల్గొన్నారు. ఫుట్‌బాల్ విజేత అనంతపురం కర్నూలు (టౌన్): నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్ స్థాయి మహిళల ఇన్విటేసన్ ఫుట్‌బాల్ టోర్నమెంటు సోమవారం సాయంత్రం ముగిసింది. ఫైనల్ పోరులో చైన్నె మాసి మహిళల జట్టుపై 1–0 గోల్స్‌తో అనంతపురం ఆర్డీటీ జట్టు విజేతగా నిలిచి కప్పు కై వసం చేసుకుంది. మూడవ పట్టణ సీఐ శేషయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా శాంతి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు రూ.20 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పీడీ శ్రీనివాస రెడ్డి, టోర్నీ ఆర్గనైజేషన్ కార్యదర్శి బ్రహ్మకుమార్ పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రసారాన్ని కనిపెట్టేస్తుంది!
● విద్యుత్ కంచెల నుంచి రక్షణకు అటవీశాఖ వినియోగం ఆత్మకూరురూరల్: అటవీ సమీప గ్రామాల్లోని రైతులు అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు తమ పొలాలకు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తారు. కొన్ని సార్లు ఈ కంచెకు పెద్దపులిలాంటి ముఖ్య సంరక్షిత జంతువులు కూడా బలయ్యే అవకాశముండటంతో వాటిని అధికారులు నిషేధించారు. అయినప్పటికీ నల్లమల అటవీ సమీప గ్రామాల్లోని రైతులు కొందరు గుట్టుగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించి వాటిని తొలగించేందుకు అటవీ సిబ్బంది పొలాల్లో తచ్చాడుతుంటారు. ఈ క్రమంలో వెలుగోడు వెస్ట్ బీట్‌లో విద్యుత్ కంచె తగిలి లక్షణ నాయక్ అనే ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ ప్రసారాన్ని కొద్ది దూరం నుంచే గుర్తించి హెచ్చరించే ( లైవ్ వైర్ డిటెక్టర్) పరికరాన్ని అటవీశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో అటవీ రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఇలాంటి పరికరాలను నాలుగు చొప్పున కేటాయించారు. ఈ పరికరాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక అటవీ అధికారి తయారు చేసినట్టు తెలిసింది. ఈ పరికరం ద్వారా కరెంటు ప్రవాహమున్న తీగలు కంటికి కనిపించకున్నా కొన్ని అడుగుల ముందే గుర్తించవచ్చు. ఫుట్ పెట్రోలింగ్ చేసే సిబ్బందికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ పరికరాన్ని డీడీ విగ్నేష్ అపావ్ సోమవారం పరిశీలించి, ఆపరికరం పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. -
కుక్ పోస్టులకు ‘ఉన్నత’ దరఖాస్తులు
కర్నూలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో కుక్ పోస్టులకు ఉన్నత విద్యావంతులు (పీజీ చదివిన వారు) సైతం పోటీ పడుతున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనే టీడీపీ అధినేత హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్క జ్యాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇటీవల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూళ్లలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 77 పోస్టులు ఉంటే 8,982 దరఖాస్తులు వచ్చాయి. కుక్ పోస్టులకు పీజీ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. ఉన్నత విద్యావంతులు అధికం జిల్లాలో 26 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 16 ఏపీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 16 కేజీబీవీల్లో అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్ పోస్టులు 32 ఉన్నాయి. ఈ పోస్టులన్నీ మండల స్ధాయిలో భర్తీ చేస్తారు. ఇందులో ఎక్కడైతే కేజీబీవీ ఉంటుందో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తరువాత ఆ స్కూల్‌కి సమీపంలోని గ్రామానికి చెందిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇందులో అనుభవం ఉన్న వారినే ఎంపిక చేస్తారు. కేజీబీవీల్లో వొకేషన్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 3, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 12, ఏఎన్ఎం 8 పోస్టులు భర్తీ చేయనుండగా..ఈ పోస్టులు జిల్లా స్ధాయిలో భర్తీ చేయనున్నారు. ఏపీ మోడల్ స్కూళ్లలో నాలుగు వార్డెన్ పోస్టులు, తొమ్మిది పార్ట్‌టైం టీచర్ పోస్టులు, తొమ్మిది కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులు మండల స్థాయిలోనే భర్తీ చేయనున్నారు. కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులకు ఉన్నత విద్య (పీజీ) అభ్యసించిన యువతీ, యువకులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దళారులుగా మారిన టీడీపీ నాయకులు మండల స్థాయిలో భర్తీ చేసే పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో టీడీపీ నేతల సిఫారసులు సైతం ఈ పోస్టులకు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగుల అవసరాలను పసిగట్టిన టీడీపీ నాయకలు దళారులుగా మారారు. నిరుద్యోగుల వద్ద భారీగా డబ్బులు తీసుకుని సిఫారసు లేఖలు తీసుకొచ్చారు. వీటిని సమగ్ర శిక్ష కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తామేమీ చేయలేమని మెరిట్లో ఉన్న వారికే పోస్టులు వస్తాయని అధికారులు తిరస్కరిస్తున్నారు. అయితే ‘టీడీపీ నాయకులు అంటే మీకు లెక్కలేదా’ అంటూ పరోక్షంగా అధికారులను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ నెల 3న మొదలైన దరఖాస్తు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టులకు ఇప్పటి వరకు 8982 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారు ఎవరూ దళారులను నమ్మొద్దు. ఎలాంటి సిఫారసులకు ఉద్యోగాలు ఆరవు. అర్హత, మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేస్తాం. – డా.ఎన్.బి లోకరాజు, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ 77 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొత్తం 8,982 నిరుద్యోగుల దరఖాస్తు సిఫారసుల లేఖల కోసం ప్రదక్షిణలు దళారులుగా మారిన టీడీపీ నాయకులు -
జాతీయ స్థాయి పోటీలకు వర్షిత
కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల వర్షిత జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. డిసెంబర్ 29న కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అసోషియేషన్ రగ్బీ పోటీల్లో ప్రతిభ కనపరచడంతో జాతీయస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 13 నుంచి భువనేశ్వర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో వర్షిత పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే స్కూల్ గేమ్స్‌లో కూడా జాతీయస్థాయికి ఈ బాలిక ఎంపిక అయ్యారని, పోటీలు ఈ నెల చివరల్లో జరుగుతాయని చెప్పారు. విద్యార్థిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ సుప్రియను ఆమె అభినందించారు. -
57 రోజుకు చేరిన రిలే దీక్షలు
ఆదోని టౌన్: ఆదోని జిల్లాను సాధించుకునేంతవరకు ఐక్యంగా పోరాడుదామని జేఏసీ నాయకులు రఘురామయ్య, కుంకనూరు వీరేష్, దస్తగిరి నాయుడు పేర్కొన్నారు. జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 57వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షల్లో ఆదోని జిల్లా జేఏసీ నాయకులు కమతం వెంకటేష్, వై.వెంకోబ, సి.వీరేష్, నరేంద్రయాదవ్, కుమార్, రామలింగయ్య, వెంకటేష్, నరసింహా, మల్లికార్జున, అశోక్ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 తెలియజేయాలని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం కర్నూలు (టౌన్): సంక్రాంతి వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను డీఐజీ, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కేవలం సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు, పేకాట, జూదం, గుండాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై డయల్ 112, డయల్ 100కు లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మాత దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారి మహమ్మద్ ఆదివారం తెలిపారు. మార్కాపురం జిల్లా నెక్కంటి పరిధిలోని ఇష్టకామేశ్వరి మాత అమ్మవారి ఆలయ పరిసరాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు వాహనాలను నిలుపుదల చేసి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు గమనించి ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం వాయిదా వేసుకోవాలని సూచించారు. అటవీ శాఖలో డ్రోన్ పైలట్లు ఆత్మకూరురూరల్: అటవీ సంరక్షణలో డ్రోన్ల వినియోగం కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్‌కు చెందిన ఆరుగురు అధికారులు డ్రోన్ పైలట్లుగా శిక్షణకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆత్మకూరు డివిజన్ ప్రాజెక్ట్ టైగర్ డీడీ విగ్నేష్ అపావ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డ్రోన్ అకాడమిలో శిక్షణ కోసం ఆరుగురు అధికారులను ఎంపిక చేసి పంపామని, వారు డ్రోన్ అకాడమి డైరెక్టర్ వద్ద ఆదివారం రిపోర్ట్ చేశారన్నారు. కెపాసిటి బిల్డింగ్‌లో భాగంగా డివిజన్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఓలు మహబూబ్ బాషా, రాజశేఖరరెడ్డి, ఎఫ్‌బీవోలు పీరా సయ్యద్, ఇస్మాయిల్, రజాక్ సాహెబ్, శ్రీనివాసులు శిక్షణ పొందడం కోసం వెళ్లారని వివరించారు. 31న ఎంపీపీపై అవిశ్వాసం జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లా మండల ఎంపీపీ సువర్ణమ్మపై ఈనెల 31వ తేదీన మండల సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ఎంపీటీసీ సభ్యులకు ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి నోటీసులు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన ఎంపీపీ సువర్ణమ్మను ఎంపీపీ పీఠం నుంచి దించేందుకు గాను మండలంలోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ మేరకు వినతిపత్రాన్ని పరిశీలించి అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెట్టేందుకు ఈనెల 31వ తేదీని ఆర్డీఓ నిర్ణయించారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అ భ్యర్థులు గెలుపొందగా తాటిపాడు, పారుమంచాల గ్రామాల్లో ఇండిపెండెంట్లు ఉన్నారు. -
యువ శక్తి.. విజయ కీర్తి
● వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతున్న యువత విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న వైనం ● నేడు స్వామి వివేకానంద జయంతిదేశ రక్షణలో భాగస్వామి కావాలని.. చిత్రంలో ఉన్నది దూది మనీషా. ఆళ్లగడ్డ మండలం రామతీర్థం గ్రామానికి చెందిన దూది లక్ష్మమ్మ, దూది చిన్నమద్దిలేటి దంపతుల కుమార్తె. రామతీర్థం జెడ్పీహెచ్ఎస్లో పాఠశాల విద్య, నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్‌వైవీసీపీ కళాశాలలో ఇంటర్ చదివారు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొంది దేశ సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్సీసీలో చేశారు. గత ఏడాది మేలో నంద్యాలలో 9 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరం–1, 2లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అనంతపురంలో 6వ ఆంధ్రా పటాలం ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరం–1లో పాల్గొని బంగారు పతకం సాధించారు. ఆగస్టు 21 నుంచి 30వ తేదీ వరకు అనంతపురంలోనే జరిగిన తల్ సైనిక్ తుది శిబిరంలో కూడా రాణించి బంగారు పతకం అందుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో పాల్గొని బంగారు పతకాలు సాధించి అభినందనలు అందుకున్నారు. ‘తల్లిదండ్రులు సహకారం, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎన్సీసీ ఆఫీసర్ అనూషల మార్గదర్శనంలో ఎన్సీసీలో రాణించడం ఆనందంగా ఉంది. ఆర్మీలో చేరి దేశ సేవ చేయడమే లక్ష్యం ’ అని దూది మనీషా చెబుతున్నారు. జాతి ఖ్యాతి పతాకను విశ్వ వేదికపై రెపరెపలాడించిన స్వామి వివేకానంద ఎందరికో ఆదర్శం. తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో యువతను చైతన్య పరిచారు. నిరుత్సాహం ..నిస్తేజం.. నిరాశ, నిస్పృహ, మానసిక రుగ్మతలు, అసమానతలు వదలి.. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ఆత్మ వికాసం పెంపొందించుకొని ముందుకు పయనించాలన్నదే వివేకానందుని ప్రభోదనల అంతరార్థం. స్వశక్తిపై ఆధారపడి ఇతరులకు సాయపడేలా మనం నేర్చుకున్న విద్య ఉపయోగ పడాలని వివేకానందుడు బోధించారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల విజయాల మనోగతం ఇలా.. – కర్నూలు కల్చరల్చిత్రంలో ఉన్నది ఎం.డి.నాగరాజు. కృష్ణగిరి మండల కేంద్రానికి చెందిన పార్వతమ్మ, సంజీవయ్యల దగ్గర (జేజీ, జేజినాన్నలు పెంచారు) పెరిగిన ఇతను కృష్ణగిరి ఏపీ మోడల్ స్కూల్లో పాఠశాల విద్య, కళా శాల విద్యను అభ్యసించాడు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలో ని కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బీకాం చివరి చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొందితే అన్నిరంగాలో రాణించడంతో పాటు క్రమశిక్షణతో పాటు దేశ భక్తి అలవుడుతుందని ఇందులో చేరినట్లు నాగరాజు చెబుతున్నాడు. గత ఏడాది మేలో కర్నూలు నగరం సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రా బెటాలియన్–1 ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరంలో పాల్గొని రైఫిల్ షూటింగ్లో మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం 6వ ఆంధ్రా బెటాలియన్ వార్షిక శిక్షణ శిబిరంలో కర్నూలు గ్రూప్ తరుఫున పాల్గొని బంగారు పతకం గెలుపొందారు. అనంతపురంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో రజతం, కాకినాడలో ఆంధ్రా బెటాలియన్ –3 ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో 7వ స్థానం, ఆగస్టులో అనంతపురంలో జరిగిన తల్‌సైనిక్ తుది శిబిరంలో రైఫిల్ షూటింగ్లో 5వ స్థానంలో నిలిచారు. సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో కర్నూలు గ్రూప్‌నకు ప్రాతినిథ్యం వహించి బంగారు పతకం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉండి రక్షణ విభాగానికి ప్రాతినిథ్యం వహించాలన్నది తన లక్ష్యమని, కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి, ఎన్సీసీ ఆఫీసర్ కమ్లినాయక్ ప్రోత్సాహంతోనే ఉన్నతంగా రాణిస్తున్నామని నాగరాజు చెబుతున్నారు. -
యాదవులను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం
● అఖిల భారత యాదవ మహాసభ నేతలుకర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం యాదవులను గుర్తించకపోవడం దారుణమని అఖిల భారత యాదవ మహాసభ నేతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక శకుంతల కళ్యాణ మండపం ఆవరణలో నందికొట్కూ రు, బనగానపల్లె నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘాలు ముద్రించిన 2026 సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహాసభ రాయలసీమ కన్వీనర్ టీ శేషఫణి యాదవ్, నాయకు లు సదానందం యాదవ్, ఓంకార్ యాదవ్, బాల చెన్నయ్య యాదవ్, మల్లికార్జున యాదవ్, దేవశంకర్యాదవ్, రాముడు యాదవ్ తదితరులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి చెందిన కాటమరాజు ముత్తుకూరు గౌడప్ప యాదవ్, గోసాయి వెంగన్నయాదవ్ వంటి మహోన్నత వ్యక్తులు అనేక ఉద్యమాలు చేశారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర పండుగల జాబితాలో ఒక్క యాదవ రాజుకు కూడా స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఇదే వైఖరితో వ్యవహరిస్తే భవిష్యత్తులో యాదవుల శక్తిని ఈ ప్రభుత్వానికి చూపిస్తామన్నారు.యాదవ నేతలు విజయభాస్కర్‌యాదవ్, శ్రీనివాసులు యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా గోపాలదాస మధ్యారాధన
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని శ్రీ మంగరాయ ఆంజనేయస్వామి సన్నిధిలో గోపాలదాసుల మధ్యారాధన వేడుకలు ఆదివారం వైభవంగా సాగాయి. మంగరాయ ఆంజనేయస్వామికి, గోపాలదాసులకి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం గోపాలదాస వారి చిత్రపటంతో పల్లకీసేవ నిర్వహించారు. మంగరాయ ఆంజనేయస్వామి చుట్టూ ఆలయ ప్రాంగణంలో రథోత్సవం చేశారు. బ్రాహ్మణసేవా సంఘం అధ్యక్షుడు నకాతే శ్రీధర్, పండితుడు గరుడాద్రి దత్తాత్రేయశర్మ సమక్షంలో చిన్నారులకు వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. బ్రాహ్మణసేవా సంఘం ప్రధాన కార్యదర్శి మఠం రామచంద్రశర్మ, ఆరాధనకర్త వినోద్, భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
గాయపడిన యువకుడి మృతి
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన చాకలి మహేంద్ర(21), కురువ భరత్ కర్నూలు ఫర్మెన్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. భరత్‌కు సంబంధించిన కూరగాయలను మార్కెట్లో అమ్ముకునేందుకు శనివారం సాయంత్రం ఆటోలో పంపారు. భరత్ తన మోటారు సైకిల్‌పై స్నేహితుడు మహేంద్రతో కర్నూలుకు బయలుదేరారు. కూరగాయలు అమ్ముకొని రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద బైక్ అదుపుకాకపోవడంతో వెనకాల కూర్చున్న మహేంద్ర కింద పడి తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మహేంద్ర మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి మద్దికెర: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందాడు. ఈ ప్రమాదం మద్దికెర– పత్తికొండ రోడ్డులో బురుజుల గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ట్రాక్టర్ మట్టి తీసుకుని వచ్చే నిమిత్తం పత్తికొండకు వెళ్తూ అదుపుతప్పింది. తగ్గులో ఉన్న పొలాల్లోకి వెళ్లి వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన దొడ్ల బోయకిష్టప్ప (64) అనే వ్యక్తిపై ట్రాలీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్లో ఉన్న గుంతకల్లుకు చెందిన శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని 108లో గుంతకల్లుకు తరలించారు. విషయం తెలుసుకున్న మద్దికెర ఎస్ఐ హరిత పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకులకు తప్పిన ప్రమాదం మహానంది: నంద్యాల పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆదివారం మహానందికి వచ్చారు. మహానందీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ముగ్గురు యువకులు నంద్యాలకు వెళ్తుండగా పర్యావరణ కేంద్రం దాటిన తర్వాత వారి ముందు ఓ బైక్ వెళ్తుండటంతో తగులుతుందేమోనని సడన్ బ్రేక్ వేశారు. దీంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వస్తుండటం, ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. బైకును కాల్చిన దుండగులు మహానంది: గోపవరం గ్రామంలో బైకుకు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం మల్లికార్జున తన ఇంటి ముందు బైకును పెట్టి నిద్రించారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు బైకుకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో తాము నిద్రిస్తున్నామని, కాలిన వాసన, మంటలతో కూడిన శబ్ధం రావడంతో బయటికి వచ్చే సరికి బైక్ కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి మహానంది: ప్రమాదవశాత్తూ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విజయ్‌కుమార్(13) ఈ నెల 6న పాఠశాల ఆవరణలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఇనుప కడ్డీలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూ లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కోలు కోలేక ఆదివారం ఉదయం మృతి చెందినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సాంబవరం గ్రామానికి చెందిన ప్రతాప్ దంపతులకు ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు విజయ్‌కుమార్, మరో కుమార్తె ఉన్నారు. 13 ఏళ్లకే కుమారుడికి నిండు నూరేళ్లు నిండటంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. పాఠశాల ప్రాంగణంలో పర్యవేక్షణ లేక పోవడంతో విద్యార్థుల ప్రాణాలకు భద్రత కరువైందని స్థాని కులు విమర్శిస్తున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారు లు ఇప్పటికైనా స్పందించి పాఠశాలలో కొన్నేళ్లు గా పని చేస్తున్న వారిని మార్చి, కొత్తవారిని నియమించి, విద్యార్థులు క్రమశిక్షణగా మెలిగేలా చూడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నారు. -
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వేళాయే!
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల ఆలయం మస్తాబు అయింది. సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంగా సోమవారం ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. అలాగే మహాగణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనం జరిపిస్తారు. బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు, కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, ఽ7గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
యాగంటీశ్వరుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి ప్రవీణ్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, ఈఓ పాండు రంగారెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తి కుటుంబసభ్యులను సన్మానించి ఉమామహేశ్వరస్వామి చిత్ర పటాన్ని,తీర్థప్రసాదాన్ని అందజేశారు. నాలుగు తులాల బంగారం అప్పగింత ఆదోని అర్బన్: ఆటోలో మరిచిపోయిన నాలుగుతులాల బంగారాన్ని గుర్తించి బాధితురాలికి పోలీసులు అప్పగించారు. వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు..అనంతపురం పట్టణానికి చెందిన విజయలక్ష్మి భర్తతో కలిసి శనివారం ఆదోనికి వచ్చారు. బస్టాండ్‌లో బస్సు దిగిన తర్వాత ఆటో ఎక్కి పట్టణంలోని అమ్మ ఇంటికి వెళ్లారు. ఆటోలో హ్యాండ్ బ్యాగు మరిచిపోయారు. అందులో రూ.5 లక్షలు విలువచేసే నాలుగు తులాల బంగారం, ఒక ఫోన్ ఉంది. కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ లేదని గుర్తించిన విజయలక్ష్మి వెంటనే వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బ్యాగ్‌లో ఉన్న ఫోన్ నంబర్ తీసుకుని లొకేషన్ ద్వారా ఆటో ఎక్కడ ఉందో గుర్తించి సమాచారం అందించారు. డ్రైవర్ విద్యాసాగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను బాధిత మహిళకు అందించారు. దీంతో ఆటో డ్రైవర్ విద్యాసాగర్‌ను సీఐ శాలువా కప్పి సన్మానించారు. వెనుక సీటులో ఉన్న బ్యాగును తాను ముందే చూసి ఉంటే వెంటనే ఇచ్చేవాడినని డ్రైవర్ ఈ సందర్భంగా తెలిపారు. మంత్రాలయం రూరల్ : 1990–91 బ్యాచ్‌కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆశీస్సులతో గురువుల చేత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చనిపోయిన గురువులు, పూర్వ విద్యార్థులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. గురువులను పూలమాలతో సన్మానించారు. అనంతరం రుచికరమైన వంటకాలతో కలసి కట్టుగా భోజనం చేశారు. కార్యక్రమంలో గురువులు, పూర్వ విద్యార్థులు శంకరయ్య, మాబు, బసప్ప, సరోజ, సూర్యనారయణ, శ్రీకాంత్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికర్నూలు(సెంట్రల్): సాయుధ పోరాట వీరుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటు కోసం వడ్డెరులు కొన్ని ప్రదేశాలను సూచించారని, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, వడ్డ్డెర సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైనాధ్యక్షుడిగా వడ్డె ఓబన్న అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు. కొండారెడ్డి బురుజు నుంచి అలంపూర్ వరకు ఉన్న టన్నెల్(సొరంగం) అభివృద్ధి చేయాలని కొందరు వడ్డెరులు కోరారని, దీనిని పరిశీలిస్తామన్నారు. అంతకముందు బీసీ భవన్లో వడ్డె ఓబన్న చిత్ర పటానికి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కె.ప్రసూన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వడ్డ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంతం, మహిళా అధ్యక్షురాలు చంద్రిక, సంస్కృత భాష ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు, జైపాల్బాబు తిరుపాల్‌బాబు, వెంకటస్వామి, సత్యనారాయణ, జానకీ రామ్, శివుడు పాల్గొన్నారు. -
దామోదరం జయంతిని ‘సాధికారత’గా నిర్వహించాలి
కర్నూలు(సెంట్రల్): దేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14 లేదా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11వ తేదీని సామాజిక సాధికారత దినంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో దామోదరం సంజీవయ్య తొలి దళిత సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర కల్కూర, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, మానవశక్తి పరిశోధన కేంద్ర వ్యవస్థాపకుడు ఎస్ఏ రెహమాన్, కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం.హర్ష తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దామోదరం సంజీవయ్య ఎన్నో విప్లవాత్మక, సామాజిక మార్పులు తెచ్చారన్నారు. ఆయన అన్ని వర్గాల ప్రజల సాధికారతకు కృషి చేసిన నేపథ్యంలో దామోదరం సంజీవయ్యకు గౌరవంగా సాధికారత బహుమానం ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈమేరకు సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొనియాడి సాధికారత దినోత్సవం కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
కళ్లల్లో కారం చల్లి.. కత్తులతో నరికి!
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులపై హత్యాయత్నం ● హాలహర్విలో దారుణం ఆలూరు/హాలహర్వి: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు కత్తులు దూశారు. కళ్లల్లో కారం చల్లి హత్యాయత్నం చేశారు. ఆదివారం మధ్యాహ్నం హాలహర్విలో ఈ దారుణం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలకు గురైన బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్సీపీలో కార్యకర్తలుగా హాలహర్వి గ్రామానికి చెందిన బల్లూరు కురుబ వీరేశప్ప(60), అతని భార్య పార్వతి, కుమారులు బల్లూరు కురుబ గాదిలింగప్ప, సోదరుడు బల్లూరు కురుబ సురేష్ ఉన్నారు. వీరికి ఇంటికి సమీపంలో టీడీపీ నాయకులు కురుబ లక్ష్మన్న, అతని కుమారులు కురుబ గాదిలింగప్ప, కురుబ నాగప్ప, కురుబ రమేష్ తదితరులు ఉన్నారు. అధికారంలో ఉండటంతో చిన్న విషయమై ఆదివారం వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారు. కళ్లలోకి కారం చల్లి కత్తులతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. కురుబ గాదిలింగప్పను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు బల్లూరు కురుబ వీరేశప్ప, అతని భార్య పార్వతి, కుమారులు బల్లూరు గాదిలింగప్ప, బల్లూరు కురుబ సురేష్‌ను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు, వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ ఆలూరు మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్సీపీ బీసీసెల్ కార్యదర్శి భాస్కర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మల్లయ్య తదితరులు ఉన్నారు. దాడి వెనుక ఎంపీ స్థాయిలో ఉన్న టీడీపీ నేత ఉన్నారని ఆరోపించారు. -
నీళ్లు లేవు.. పండుగకు పిలువం!
● పండుగ వేళ భయపెడుతున్న నీటి సమస్య ● బంధుమిత్రులను పండుగకు ఆహ్వానించలేకపోతున్న వైనం ప్యాపిలి: కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాల్సిన ఆ రెండు గ్రామాల ప్రజలు నీటి సమస్యతో భయపడుతున్నారు. పండుగ పూట ఇంటికొచ్చిన వారికి నీటి కష్టాలు చెప్పలేమని, పండుగకు ఎవరినీ పిలుచుకోవడం లేదని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్య తలెత్తి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నల్లమేకలపల్లి గ్రామంలో 2 వేల మంది నివసిస్తున్నారు. గ్రామంలో రెండు మంచినీటి బోర్లు ఉండగా ఒక బోరు మాత్రమే సక్రమంగా పని చేస్తోంది. అయితే ఈ బోరు నుంచి గ్రామంలోని ట్యాంకులకు సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు. పలువురు తమ తోటలకు, ఇళ్లకు నేరుగా నీళ్లు వచ్చేలా కనెక్షన్లు ఇచ్చు కోవడంతో ట్యాంక్‌లోకి నీటి సరఫరా జరగడం లేదు. దీంతో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా గ్రామంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సంధ్య గ్రామ పంచాయతీ తరపున ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇదే పంచాయతీ పరిధిలోని డి. రంగాపురం గ్రామంలోనూ పది రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటర్ పని చేయకపోవడంతో నీటి సమస్య తలెత్తిందని గ్రామస్తులు తెలిపారు. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ శివారు ప్రాంతంలో తోటలకు వెళ్లి ద్విచక్రవాహనాలు, ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుండటంతో గ్రామస్తులను నీటి సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పండుగకు తమ ఇంటికి వచ్చే బంధువులను సైతం నీటి సమస్య కారణంగా రావొద్దని చెప్పాల్సిన పరి స్థితి నెలకొందని ఓబులమ్మ, ఉషారాణి, సావిత్రి, నాగమ్మ తెలిపారు. అధికారులు స్పందించి బోర్లు, మోటర్లకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
యువతిని వేధిస్తున్నాడని చంపేశారు!
పాణ్యం: గడివేముల మండలంలో సంచల నంగా మారిన యువకుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన ఓ యువతిని వేధిస్తున్నాడని యువకుడిని దారుణంగా చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు పాల్పడిన యువతితోపాటు ఓ యువకుడు, ఇద్దరు మైనర్లను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాణ్యం సర్కిల్ కార్యాలయంలో నంద్యాల ఎస్డీపీఓ మందజావళి విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను మీడియాకు వివరించారు. గడివేముల పట్టణానికి చెందిన వినోద్‌కుమార్(19) డీఎంఎల్టీ కోర్సు చేస్తున్నాడు. కాగా రేవనూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైంది. అయితే ఆమెను నిత్యం ఫోన్లో వేధిస్తుండటంతో వినోద్ కుమార్‌ను హత్య చేయాలని కుట్ర పన్నింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర బర్మశాల వద్ద ఉంటున్న తేల్కర్ మణికంఠ సహాయంతో పథకం రూపొందించింది. గత ఏడాది ఆగస్టు 31వ తేదీన నంద్యాలకు చెందిన ఇద్దరు మైనర్లును తోడు తీసుకుని ఆటోలో గడివేములకు వెళ్లారు. వినోద్‌కుమార్‌కు ఫోన్ చేసి ఇంటి నుంచి బొల్లవరం రస్తాలోని మద్దిలేరు వాగు వద్దకు రప్పించారు. బైక్‌పై వచ్చిన వినోద్‌కుమార్‌ను జన సంచారం లేని చోటుకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి పాణ్యం మండలం పిన్నాపురం రస్తాలోని గాలేరు నగరి కాల్వలో పడేశారు. ఆ సమీపంలోనే బైక్‌ను కూడా నీటిలో వేసేశారు. కాగా తమ కుమారుడు కనిపించడం లేదని వినోద్‌కుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు కేసు ఛేధించి హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్డీపీఓ మందజావళి తెలిపారు. హత్యకు పాల్పడిన తేల్కర్ మణికంఠ, యువతితో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశామన్నారు. కేసును ఛేదించిన గడివేముల ఎస్ఐ నాగార్జునరెడ్డి, పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు. నాలుగు నెలల క్రితం యువకుడి హత్య మృతదేహాన్ని గాలేరు నగరిలో పడేసిన వైనం కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు మైనర్లు, యువతి, యువకుడు అరెస్ట్ -
పిల్లల బుర్రల్లో ‘సెల్’చల్!
ప్రపంచం అరచేతిలో ఇమిడిపోవడంతో మారుమూల పల్లెల్లోనూ సాంకేతిక వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ ఆకర్షణలో బాల్యం మసిబారుతోంది. చందమామ కథలు వినిపించే ఓపిక లేకపోవడం.. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితం కావడంతో పిల్లల ఏడుపు మాన్పించేందుకు ‘సెల్’లో బందీ చేయడం సాధారణమైంది. తమ పని సాఫీగా సాగేందుకు, పిల్లలు అడ్డుకాకుండా ఉండేందుకు చేతిలో సెల్‌ఫోన్ పెట్టేస్తున్నారు. చిన్నారులు ‘నెట్టింట్లో’కి దూరిపోయి తమను తామే మైమరచిపోతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆడుకోవాల్సిన పసి మనసులు.. మొబైల్ ఫోన్ విరజిమ్మే వెలుగులకు కళ్లు ఉబ్బిపోతున్నా ఓ మూలన కూర్చుండిపోతున్నారు. మట్టి వాసన తెలియకుండానే, పైరు గాలి పీల్చకుండానే.. బంధుత్వాలను తెలుసుకోకుండానే.. ఆటలతో స్నేహితులను తోడు చేసుకోకుండా.. వీడియో గేమ్స్‌తో ‘సెల్’చల్ చేస్తున్నారు. చుట్టూ ఎవరున్నారో చూసుకోకుండా, తిన్నామా లేదా అనే ధ్యాస లేకుండా సమయం కల్పించుకొని మరీ సెల్‌తో గడిపేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. -
మరి కొద్దిరోజులు ఎల్లెల్సీకి నీటి సరఫరా
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు మరి కొద్ది రోజులు నీటి సరఫరా కొనసాగే అవకాశా లు కనిపిస్తున్నాయి. జలాశయం క్రస్ట్‌గేట్ల ఏర్పాటులో భాగంగా ఖరీఫ్ పంటకు మాత్రమే నీరిచ్చి రబీ పంట కు నీరివ్వలేమని టీబీ బోర్డు అధికారులు ముందుగా నే ప్రకటించారు. జనవరి 10నుంచి నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. అయితే డ్యాంలో ఇంకా 29 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో కర్ణాటక పరిధిలో ఇంకా సాగులో ఉన్న పంటలకు నీటిని అందించేందుకు మరి కొద్ది రోజులు అంటే ఈనెల 20 వరకు సరఫరా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని 18వ నంబరు గేటును కొత్తగా బిగించారు. మే చివరి నాటికి మొత్తం 33 క్రస్టు గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1605 అడుగులతో 29 టీఎంిసీల నీరు నిల్వ ఉండగ ఇన్‌ఫ్లో జీరో ఉండి ఔట్‌ఫ్లో రూపంలో 7,886 క్యూసెక్కుల నీరు వివిధ కాలువలకు వదులుతున్నారు. శనివారం ఆంధ్ర కాలువ ప్రారంభ (హన్వాళ్ సెక్షన్) 250 కి.మీ వద్ద 635 క్యూసెక్కుల నీటి సరఫరా జరిగింది. -
కిలో చికెన్ రూ.300
● కోళ్ల కొరతతో అమాంతం పెరిగిన ధరలుకర్నూలు(అగ్రికల్చర్): సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాంసం ధరలు షాక్ కొడుతున్నాయి. కోళ్ల కొరతతో కోడి మాంసం ధర అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పొట్టేలు మాంసం కిలో ధర రూ.900 నుంచి రూ.1000 పలుకుతోంది. ఈ నేపథ్యంలో కోడి కూరతోనైనా సరిపెట్టుకుందామంటే అది కూడా కొండెక్కి కూర్చుంటోంది. కర్నూలు నగరంలో నెల రోజుల క్రితం వరకు రూ.260 పలికిన చికెన్ ధర నేడు రూ.300 చేరుకోవడం గమనార్హం. బ్రాయిలర్ కోళ్ల చికెన్ వ్యాపారులకు తెలంగాణ రాష్ట్రమే ఆధారం. ఉమ్మడి కర్నూలు జిల్లా డిమాండ్‌లో 70 శాతం అక్కడి నుంచే దిగుమతి అవుతున్నాయి. 25 శాతం కోళ్లు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 5 శాతం కోళ్లు మాత్రమే జిల్లాలో ఉత్పత్తి అవుతున్నాయి. గత డిసెంబర్ నుంచి చికెన్‌కు డిమాండ్ పెరిగింది. క్రిస్మస్ పండుగ, ఆ తర్వాత నూతన సంవత్సరం వేడుకలతో పాటు చలి తీవ్రత అధికంగా ఉండటంతో చికెన్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విధంగా కోళ్ల సరఫరా లేకపోవడంతో ధర ఆకాశాన్నంటుతోంది. రానున్న రోజుల్లో సంక్రాంతి పండుగ, ఆ తర్వాత కనుము ఉండటంతో చికెన్ ధర మరింత అవకాశం లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. -
పాలుట్లలో అభివృద్ధి మంత్రం
● వైఎస్సార్సీపీ హయాంలో రూ.1.10 కోట్లు మంజూరు ● త్వరలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం వెల్దుర్తి: పాలుట్ల రంగస్వామి ఆలయ అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అప్ప టి ప్రభుత్వంలో ప్రారంభించిన పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ శనివారం సమీక్ష చేపట్టారు. ఆలయానికి చేరుకు న్న ఈఓ మద్దిలేటి, ఇంజినీర్ రవికుమార్, స్థపతి సుబ్రహ్మణ్యం, కాంట్రాక్టర్ పుల్లయ్య చేపట్టబోయే పనులపై చర్ఛించారు. రామళ్లకోట మంచి రెడ్డి శశి, శ్రీరంగాపురం గ్రామ పెద్దలు ఉన్నారు. పాలుట్ల రంగస్వామి క్షేత్రం అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే బాటలు పడ్డాయి. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆలయ అభివృద్ధి ప్రారంభించి రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మించారు. అనంతరం బేతంచెర్ల మండలం గూటుపల్లె నుంచి రూ.6.5 కోట్లతో 3 కి.మీల మేర రహదారి పనులు మొదలు పెట్టారు. ఆలయ అభివృద్ధికి రూ.1.10 కోట్ల్ల కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు మంజూరయ్యాయి. 2024 మార్చి 8న అభివృద్ధి పనులకు బుగ్గన, శ్రీదేవి భూమి పూజ చేశారు. ఆలయానికి రాజగోపురం, ముఖద్వారం, 250 మీటర్ల మేర మెట్లు, ధ్వజ స్తంభం, స్వామి వారి ఆళ్వార్లకు ఆలయ నిర్మాణం ఈ నిధులతో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు ● 15వ తేదీన మకర సంక్రాంతి రోజున స్వామిఅమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం ● ఈ నెల 17న ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ ● బ్రహ్మోత్సవాల్లో చివరిరోజై 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు.. 12న సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణ, 13న భృంగివాహనసేవ, 14న కై లాసవాహనసేవ, 15న నందివాహనసేవ, బ్రహ్మోత్సవ కల్యాణం, 16న రావణవాహనసేవ, 17న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 18న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్జితసేవల నిలుపుదల.. ఉత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామికల్యాణం, స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవ, ఉదయాస్తమానసేవ, ప్రదోషకాలసేవ, ప్రాతఃకాలసేవలు నిలుపుదల చేశారు. శ్రీశైలంలో రేపటి నుంచి ఏడు రోజుల పాటు నిర్వహణ ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు, వాహనసేవలు -
అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడాపోటీలు
పాణ్యం: ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను జేఎన్టీయూఏ ఉపలకులపతి డాక్టర్ హెచ్ సుదర్శన్‌రావు, చెర్మన్ శాంతిరాముడు ప్రారంభించారు. 40 కళాశాలల నుంచి సుమారు 2,200 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. రగ్బీ, ఫుట్‌బాల్, త్రోబాల్, బ్యాట్మింటన్, బాస్కెల్బాల్, వాలీబాల్ తదితర క్రీడలు జరగనున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని చెప్పారు. జేఎన్టీయూఏ క్రీడ మండలి కార్యదర్శి నారాయణరెడ్డి విశ్వవిద్యాలయాలరిధిలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. విద్యతో పాటు క్రీడలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెర్మన్ శాంతిరాముడు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్, ఎండీ శివరామ్, డీన్ అశోక్‌కుమార్, కో–ఆర్డినేటర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
● మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు
వైఎస్సార్ హయాంలో ఒక మోడల్‌గా ఉపాధి హామీ పథకం కర్నూలు(అర్బన్): ఏపీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గొప్పగా అమలు చేసిన చరిత్ర దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. వైఎస్సార్ హయాంలో ఏపీలో ఉపాధి హామీ పథకం ఒక మోడల్‌గా అమలు చేశారన్నారు. శనివారం కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్జీఎస్ను రద్దు చేయరాదనే డిమాండ్‌పై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బీకేఎంయూ పతాకాన్ని సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు భీమలింగప్ప ఆవిష్కరించారు. కొప్పుల రాజు మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు ఒక కుట్ర దాగి ఉందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మాట్లాడుతూ ‘పనైనా చూపండి–తిండైనా పెట్టండి’ అనే నినాదంతో చేసిన పోరాట ఫలితమే ఈ చట్టం అన్నారు. ఈ నెల 14న భోగి మంటల్లో కొత్త పథకం ప్రతులను దగ్ధం చేయాలని, 30న సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. -
సాక్షి సినిమాలు
ఎస్వీసీ కాంప్లెక్స్: ది రాజాసాబ్ వి మెగా ఆనంద్ సినీ కాంప్లెక్ : ది రాజాసాబ్ వెంకటేష్ సినీ కాంప్లెక్స్ : ది రాజాసాబ్ శ్రీరామ : బిజినెస్ మేన్ (2012) రాజ్ : ఆంధ్రా కింగ్ తాలూకా భరత్ కాంప్లెక్స్ : ది రాజాసాబ్ విజయ : ది రాజాసాబ్ విక్టరీ : దురంధర్ -
విద్యాశాఖ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి
కర్నూలు సిటీ: విద్యాశాఖలో పని చేస్తున్న సర్వీస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యాశాఖ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు స్వాములు, రాష్ట్ర అధ్యక్షుడు పద్మావతి పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాఠశాల విద్యాశాఖ సర్వీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం శనివారం కర్నూలు డీఈఓ ఆఫీస్ మీటింగ్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగులపై పని భారం తగ్గించాలన్నారు. ఆ తరువాత జిల్లా పాఠశాల విద్యాశాఖ సర్వీస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నుకునేందుకు ఏపీ ఎన్జీవోల సంఘం కర్నూలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలకు అధికారిగా బలరాం రెడ్డి వ్యవహారించారు. సమావేశంలో నూతన కార్యవర్గ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పి.లక్ష్మీ నర్సయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి, ప్రధాన కార్యదర్శిగా సి.రఘు, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, కోశాధికారిగా నవీన్ రెడ్డిని ఏగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈకార్యక్రమంలో ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్, సెక్రటరీ కాశన్న తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం
కర్నూలు (సిటీ): నగర శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఆ స్కూల్ అధినేత కేజే రెడ్డి, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కేఎన్వీ రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ కరస్పాండెంట్ శేషన్న, శ్రీలక్ష్మి విద్యాసంస్థల కరస్పాండెంట్ దీక్షిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అమలులో ఉన్న విద్యా ప్రణాళిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అమలు చేస్తున్నారన్నారు. ఈ విద్యాబోధన భవిష్యత్తులో విద్యార్థులు రాణించేందుకు చక్కగా దోహదపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ
ఎమ్మిగనూరు రూరల్: గుండెపోటు బాధితులకు స్టెమీ ( సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారాక్షన్ ) ఇంజెక్షన్ పనిచేస్తుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి గుండెపోటుతో వచ్చిన నాసిర్, భాగ్యమ్మకు స్టెమీ ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాదు. ఈ సదర్భంగా డాక్టర్ ఆదినాగేష్ మాట్లాడుతూ గుండె పోటు వచ్చిన వారికి అత్యవసరంగా స్టెమీ ఇంజెక్షన్ ఇస్తే కంట్రోల్ చేయవచ్చునని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ. 45 వేలు ఉంటుందని, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వేస్తున్నామని తెలిపారు. ఆగని ఇసుక దందా గోనెగండ్ల: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. మండలంలో గంజిహళ్లి హంద్రీనది నుంచి రాత్రీ పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.3నుంచి రూ.5వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక పథకం ఎక్కడా కనిపించడం లేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దందా జరుగుతుంది. పట్టించుకోవాల్సిన మైనింగ్ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం మండలంలో 20 గ్రామ పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండలంలో గంజిహళ్లి, హెచ్. కై రవాడి, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు గ్రామాల మీదుగా వెళ్లే హంద్రీనదిలో మాత్రమే ఇసుక దొరుకుతుంది. ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం హంద్రీనది సమీపంలో బోర్లు వేశారు. ప్రతి రోజు ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రానున్న వేసవి కాలంలో తమకు తాగునీటి సమస్య ఎదురువుతుందని హంద్రీతీర గ్రామా ల ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గంజిహళ్లి గ్రామం హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక రవాణా విషయం తమ దృష్టికి రాలేద ని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గోనెగండ్ల సీఐ చంద్రబాబు పేర్కొన్నారు. రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలి కర్నూలు కల్చరల్: రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించేలా ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రముఖ కవి జి.ఉమామహేశ్వర్ రచించిన ‘అహానికి ఆవల’ కథల పుస్తకావిష్కరణ శనివారం మద్దూరు నగర్‌లోని పింగళి సూరన తెలుగు తోటలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత్రి వి. ప్రతిమ, కథా రచయితలు వెంకట కృష్ణ, మారుతి, డాక్టర్ ఎం. హరికిషన్, డాక్టర్ వి.పోతన్న, ఇనాయతుల్లా, సుభాషణి పాల్గొని మాట్లాడారు. ఉమామహేశ్వర్ రాసిన అహానికి ఆవల కథలు సమాజంలో మార్పును కోరుకుంటాయని, మధ్యతరగతి కుటుంబాల్లో సాగే సున్నితమైన మానవ సంబంధాలు విలువలు ఈ కథల్లో ఉంటాయన్నారు. మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయన్నారు. కళ్లముందు కనిపించే జీవితాన్ని కథల్లోకి ఎక్కించే జీవన దృశ్యాల్లాగా మలిచాడన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు ఎస్‌డీవీ అజీజ్, వెంకటేష్, డాక్టర్ అవిజ వెంకటేశ్వర రెడ్డి, విరసం నాయకులు పాణి, తెలుగు భాషా వికాస ఉద్యం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ, ఆవుల చక్రపాణి యాదవ్ పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీ ఉద్యోగి ఇంట్లో చోరీ
కోవెలకుంట్ల: పట్టణంలోని బనగానపల్లెకు వెళ్లే రహదారిలోని డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. స్థానిక ఎస్సార్బీసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయరామిరెడ్డి రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా బెంగుళూరులో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటికి తాళం వేయడంతో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 20 వేలు నగదు అపహరించుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికొచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకివెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు క్లూస్‌టీం రంగప్రవేశం చేసి దొంగతనానికి సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నగదు అపహరణ -
నల్లమలలో ఎర్రమట్టి తవ్వకాలు!
మహానంది: దర్జాగా ప్రకృతి వనరులు కొల్లగొడుతున్న తెలుగు తమ్ముళ్లపై ప్రజలు కన్నెర్ర చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తుండటంతో అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల – గిద్దలూరు రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని మహదేవపురం గ్రామ సమీపంలోని పోలేరమ్మ రస్తా ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 15 టిప్పర్లు, జేసీబీతో యథేచ్ఛగా తవ్వేస్తుండటంతో మహదేవపురం ప్రజలు అడ్డుకున్నారు. ఎర్రమట్టిని తరలిస్తూ పొలం రస్తాలను ధ్వంసం చేస్తే ఎలా వెళ్లాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. అర్ధరాత్రి చలిని సైతం లెక్క చేయకుండా తవ్వకాలను అడ్డుకున్నారు. పొలాలకు, సర్వనరసింహస్వామి ఆలయానికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉన్న రస్తా మట్టి అక్రమార్కుల జేసీబీల కారణంతో ధ్వంసమవుతుందన్నారు. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమకు సంబంధం లేదంటూ దాటవేస్తున్నారని గ్రా మస్తులు ఆరోపించారు. అయితే టిప్పర్లను అడ్డు కునేందుకు వెళ్లిన వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు బౌన్సర్లను పంపుతూ బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా బేఖాతర్.. పోలేరమ్మ రస్తాలో జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలపై రెండు వారాల క్రితం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను కలిసి వినతిపత్రం అందించారు. దీంతో స్పందించిన అధికారులు నామమాత్రంగా దాడులు నిర్వహించి కేవలం రెండు ఎర్రమట్టి టిప్పర్లను మాత్రమే సీజ్ చేసి అధికార భక్తిని చాటుకున్నారు. అనుమతులు ఉంటే అర్ధరాత్రి మట్టి తవ్వకాలు ఎందుకు జరపాలంటూ పలువురు విమర్శిస్తున్నారు. మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవని మండల అధికారులే చెబుతున్నారన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి పూర్వం నుంచి ఉన్న పోలేరమ్మ రస్తాను ధ్వంసం చేయడం తగదన్నారు. అర్ధరాత్రి అడ్డుకున్న మహదేవపురం ప్రజలు -
క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం
కర్నూలు (టౌన్) : క్రీడ ల్లో పాల్గొనడం వల్ల ఉ ద్యోగుల్లో మానసిక ఒత్తి డి తగ్గి ఉల్లాసంగా ఉంటారని నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ అన్నా రు. శనివారం స్థానిక ఎగ్జిబిషన్, కౌన్సిల్ హాల్, ఔట్‌డోర్ స్టేడియం,ఇండోర్ స్టేడియం లలో మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పురుష ఉద్యోగులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారెమ్స్, చెస్ క్రీడలు, మహిళా ఉద్యోగులకు త్రోబాల్, బ్యా డ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించారు. క్రీడలను ప్రారంభించిన కమిషనర్ మాట్లాడుతూ శని, ఆదివారం రెండు రోజులు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు,కార్యదర్శి నాగరాజు, ఎస్ ఈ రమణమూర్తి, ఎంఈ మనోహార్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ పాల్గొన్నారు. -
అందుబాటులో కందుల కొనుగోలు కేంద్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని, రైతులు మద్దతు ధరతో అమ్ముకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ రాజు తెలిపారు. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల ద్వారా సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 5,379 మంది రైతులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. తేమ 12 శాతం లోపున్న కందులను మద్దతు ధర రూ.8వేలతో కొంటామన్నారు. కాటా వేయడం, లోడింగ్ వరకు అన్ని ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందన్నారు. బస్తా 50 కిలోల ప్రకారం కొంటామని, గన్నీ సంచికి అదనంగా 700 గ్రాములు ఇవ్వాలన్నారు. మార్కెట్‌కు తగ్గిన కందుల తాకిడి కర్నూలు మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా మారి ధరల పెరుగుదలను నిరోధిస్తున్నార నే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో శనివారం మార్కెట్‌కు కందుల తాకిడి తగ్గింది. ఈ నెల 9న మార్కెట్‌కు 4,254 క్వింటాలు వచ్చింది. ధరలు అతి తక్కువగా లభించడంతో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం మార్కెట్‌కు 2,650 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2000, గరిష్ట ధర రూ.6,979 లభించింది. మద్దతు ధర మాత్రం రూ.8000 ఉండటం గమనార్హం. వేరుశనగ ధర కాస్త పెరిగింది. మార్కెట్‌కు 165 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కనిష్ట ధర రూ.5,998, గరిష్ట ధర రూ.9009 లభించింది. మిర్చికి అంతంతమాత్రం ధరలే లభించాయి. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram.ap. gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన సరస్వతి క్షేత్రమైన కొలనుభారతిలో ఈనెల 23న వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆర్డీఓ నాగజ్యోతి కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొలనుభారతి ఆలయం శ్రీశైల దేవస్థానంలో కలిసిన తర్వాత జరుగుతున్న తొలి వసంత పంచమి కావడంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాగునీరు, క్యూ లైన్లు, మహిళలకు ప్రత్యేక గదులు, చిన్నారులకు అక్షరాభ్యాస ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆలయ చైర్మన్ వెంకటనాయుడు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీడీఓ మేరి, తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు. నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం నంద్యాల: పట్టణంలోని శ్రీనివాస సెంటర్లోని జేబీ ఎలాక్ట్రానిక్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో నుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు కాలిపోయాయి. దుకాణ మేనేజర్ రాజ్‌పురోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విజయ డెయిరీ అధికారులపై అక్రమ కేసులు తగదు
● డీఐజీని కలసిన నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ నేతలుకర్నూలు: నంద్యాల విజయ డెయిరీ డైరెక్టర్, అధికారులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ముఖ్య నేతలు అన్నారు. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. కర్నూలు బి.క్యాంప్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో డీఐజీని కలసి విజయ డెయిరీలో అక్రమ కేసులు, వేధింపులపై సరైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పాల డెయిరీలో అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్న పరిణామాలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కోరగా అందుకు డీఐజీ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. -
జిల్లా పోలీసు శాఖకు జాతీయస్థాయి అవార్డు
● రాష్ట్రంలోనే అత్యుత్తమ పీఎస్ పెద్దకడుబూరుకర్నూలు: జిల్లా పోలీసు శాఖకు జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. నేరాల అదుపు, నేర నియంత్రణ, సీసీ కెమెరాల నిఘాతో కేసుల ఛేదన, దర్యాప్తు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేసింది. దేశంలో పది పోలీస్స్టేషన్లు ఈ అవార్డుకు ఎంపిక కాగా రాష్ట్రం నుంచి పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌కు ఆ ఘనత దక్కింది. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా చేతుల మీదుగా శుక్రవారం జిల్లా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డితో కలసి ఈ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని విక్రాంత్ పాటిల్ తెలిపారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యం
● కలెక్టరేట్ ఎదుట ఉరితాళ్లతో ప్రదర్శన ● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విద్యార్థి, యువజన సంఘాల నేతల ఆగ్రహం కర్నూలు(సెంట్రల్): ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాలైనా ఇవ్వాలని, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదని విద్యార్థి, యువజన సంఘాల వేదిక నాయకులు వినూత్నంగా నిరసనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట సామూహికంగా తాళ్లతో ఉరి వేసుకొని ప్రదర్శన నిర్వహించారు.. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సోమన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, రాష్ట్ర నాయకుడు గౌతం, ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు హనోక్ హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించిందన్నా రు. అధికారంలోకి వచ్చి 19 నెలలు అయినా ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఒక్కరికీ రూ.3 వేల భృతి ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ఏదీ? జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి మరోవైపు మంత్రి నారా లోకేష్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్ర తి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1న వస్తుంద ని చెప్పినా ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగులు మాత్రం ఇబ్బంది పడుతున్నారన్నారు. సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తోందన్నారు. ప్రశ్నిస్తే రౌడీషీట్, పీడీ యాక్ట్లా? ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాలు భర్తీకావాలని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ప్రశ్నించిన విశాఖపట్నం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, పీడీ యాక్ట్ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై కక్ష పూరితగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ఐక్య ఉద్యమాలు చేస్తామన్నారు. నాయకులు దుర్గ, నాగరాజు, శరత్‌కుమార్, అభి, అశోక్ పాల్గొన్నారు. -
అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్
కర్నూలు: సంక్రాంతి పండుగ సందర్భంగా ‘స్పెషల్’ పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఎస్.శాంతకుమారి హెచ్చరించారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామ శివారులోని ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కాంట్రాక్టు క్యారేజి, టూరిస్ట్ బస్సు ఓనర్లతో డీటీసీ సమావేశం నిర్వహించారు. ప్రతి బస్సుకు రెండో డ్రైవర్ విధిగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్ 9281607001ను ప్రతి బస్సులో డిస్ప్లే చేయాలన్నారు. మోటర్ వాహనాల తనిఖీ అధికారులు రవీంద్ర కుమార్, నాగరాజు నాయక్, సుధాకర్ రెడ్డి, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 29, 30 తేదీల్లో విశాఖలో ఉప లోకాయుక్త క్యాంపు సిట్టింగ్ కర్నూలు(సెంట్రల్): ఈనెల 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో క్యాంపు సిట్టింగ్ చేయనున్నట్లు ఉపలోకాయుక్త జస్టిస్ పి.రజనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాల ప్రజలు ఆ రెండు రోజుల్లో ఫిర్యాదులను ఇవ్వవచ్చన్నారు. అంతేకాక ఆ జిల్లాలకు సంబంధించిన పెండింగ్ కేసులను కూడా విచారణ చేస్తామన్నారు.డీఈఓ కార్యాలయంలో సరైన ఏర్పాట్లు చే యకపోవడంతో దరఖాస్తుల అందజేతకు అభ్యర్థుల అవస్థలు కలెక్టరేట్ ప్రాంగణం జాతరను తలపిస్తోంది. ఎక్కడ చెట్ల కింద చూసినా మహిళలు దరఖాస్తులు భర్తీ చేస్తూ కనిపిస్తారు. రోడ్లకు ఇరువైపులా చంటి పిల్లలతో ఇబ్బంది పడుతూ.. సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను సరిచూసుకుంటూ.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్లు పోస్టుల భర్తీ చేపట్టకపోగా.. అరకొర పోస్టులు అభ్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది 111 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే నాలుగు అంకెలను చేరుకోవడం.. మరో రెండు రోజుల సమయమే ఉండటంతో పోటీ ఏస్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసాలకోర్చి అభ్యర్థులు వస్తున్నా.. పోస్టులు దక్కడం అనుమానమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తే.. మెరిట్‌ను పరిశీలించుకునే అవకాశం ఉంటుంది, పారదర్శకత అనుమానాలను నివృత్తి చేస్తుంది. అలాకాకుండా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో నాయకులు చెప్పిన వాళ్లకే పోస్టులు దక్కుతాయనే చర్చకు తావిస్తోంది. ప్రతిభ ఆధారంగా 1ః1 నిష్పత్తిలో మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తుండటంతో పోస్టుల భర్తీలో ‘రాజకీయం’ తప్పదని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గరపడుతున్నా జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండాపోయింది. నిరుద్యోగ భృతి ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఇలాంటి చిన్న పోస్టులనైనా దక్కించుకుందామంటే ఇందులోనూ ‘పచ్చ’పాతం తప్పదని తెలిసి అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సిఫారసు లెటర్లకు భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోస్టులు ‘నోటు’మాటకు.. దరఖాస్తులు చెత్తబుట్టకనే చర్చ జరుగుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఫిబ్రవరి 8 నుంచి ఇరుముడి స్వాములకు స్పర్శదర్శనం
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే ప్రతి భక్తుడికి ఆహ్లదకరమైన వాతావరణంలో సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 8 నుంచి 12వ తేది వరకు ఇరుముడి కలిగిన శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని.. 8 నుంచి 18వ తేదీ వరకు సామాన్య భక్తులకు అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధ్యక్షతన కర్నూలు, నంద్యాల, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా అన్ని శాఖల అధికారులతో మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే 20శాతం మంది భక్తులు అదనంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాదయాత్రగా భక్తులను దృష్టిలో ఉంచుకొని అటవీమార్గంలో మెడికల్ క్యాంప్‌లు, అంబులెన్స్‌లు, డస్ట్బిన్లు, టాయిలెట్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. ఈలోగా మరో రెండు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు 3వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ పటిష్ట చర్యలు చేపడతామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నెష్ అప్పావ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ తేది నుంచి అటవీప్రాంతంలో పాదయాత్రకు అనుమతిస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా బ్రహ్మోత్సవాల్లో 2లీటర్లు, 5లీటర్ల వాటర్ బాటిల్స్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. -
నాణ్యత బాగున్నా ధర తగ్గింది
మేము 10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాం. ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. అధిక వర్షాల వల్ల పంట దిగు బడి తగ్గింది. మామూలుగా అ యితే ఎకరాకు 5 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. అయితే 3 క్వింటాళ్లు మించలేదు. మార్కెట్‌కు 32 క్వింటాళ్లు తెచ్చాం. తేమ శాతం 17 మాత్రమే ఉంది. వ్యాపారులు రూ.6,350 ధర మా త్రమే వేశారు. అడిగితే ఇష్టమైతే అమ్ముకో.. లేదంటే వెనక్కి తీసుకుపొమ్మన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను అడ్డగోలుగా తగ్గిస్తున్నారు. – నాగరాజు, బొల్లవానిపల్లి, తుగ్గలి మండలం -
ధరల్లో తేడా
ఆదోని అర్బన్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వేరుశనగకాయల ధరల్లో తేడా కనిపిస్తోంది. కర్నూలు మార్కెట్‌యార్డులో క్వింటా గరిష్ట ధర రూ.8,800 ఉండగా ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డులో రూ.8,600 లభించింది. ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులకు కేవలం రూ.7,629 వచ్చింది. ఇక్కడ నలుగురు వ్యాపారుల ప్రభావంతో రైతులు నష్టపోతున్నట్లు కమీషన్ ఏజెంట్లు, చిన్న వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇలానే ధరలో కోతలు కోస్తే ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగకాయ మార్కెట్ నడిపించడం కష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వేలల్లో వేరుశనగ సంచులు వచ్చేవి. ప్రస్తుతం వందల్లో వస్తున్నాయి. -
కంది రైతు గగ్గోలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో దళారీలు క్వింటా రూ.7వేల పైగా ధరతో కొంటున్నారు. కర్నూలు మార్కెట్‌కు తీసుకుపోతే మరింత మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. మార్కెట్‌కు శుక్రవారం 590 మంది రైతులు 4,254 క్వింటాళ్ల కందులు తెచ్చారు. 24 శాతం తేమ ఉన్న చిన్న కందుల లాట్‌కు రూ.7,300 ధర వేశారు. ఇదే అత్యదికం. 17 శాతం మాత్రమే తేమ ఉన్న లాట్‌కు రూ.6,350 ధర వేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను పూర్తిగా తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ విషయమై మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి మాట్లాడుతూ మార్కెట్‌కు కందులు ఎక్కువగా వస్తున్నాయని, రైతులకు అన్యాయం జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. -
సంక్రాంతి ఆఫర్ల పేరిట సైబర్ మోసాలు
కర్నూలు: సంక్రాంతి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ/ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆఫర్ల పేరుతో ఆకర్షణీయమైన సందేశాలతో మభ్యపెట్టి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. ఆన్లైన్ లక్కీ డ్రా కూపన్లు, ఉచిత బహుమతుల పేరుతో లింకులు పంపి మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యేలా చేసి డేటా దోపిడీ చేస్తారన్నారు. దీనివల్ల ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం, సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ ద్వారా కానీ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని తెలిపారు. గ్యాస్ డెలివరీకి అదనపు వసూళ్లు వద్దు కర్నూలు(సెంట్రల్): గ్యాస్ సిలిండర్ల డెలివరీలో వినియోగదారుల నుంచి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవని సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ గోవిందరావు ఏజెన్సీలను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో దీపం–2 పథకం అమలు, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ బాయ్స్ డబ్బులు వసూలు చేస్తున్నారని, వారి ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ వస్తోందన్నారు. ఈ అంశంపై ఏజెన్సీలు డెలివరీ బాయ్స్‌కు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. నిబంధల ప్రకారం 15 కిలోమీటర్ల లోపే గ్యాస్ సిలిండర్ల సరఫరా జరగాలని, ఒకవేళ అదనపు దూరం ఉంటే ఆ భారాన్ని డిస్ట్రిబ్యూటర్లు భరించాలన్నారు. సిలిండర్ డెలివరీకి ప్రభుత్వం ఏజెన్సీలకు రూ.73.08 చొప్పున చెల్లిస్తుందని, ఇందులో డెలివరీ చార్జీలు రూ.33.34, ఎస్టాబ్లిస్‌మెంట్ చార్జీలు రూ. 39.65 ఉంటాయన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, డీఎస్ఓ ఎం.రాజారఘువీర్ పాల్గొన్నారు. ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకోం ● జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కొలిమిగుండ్ల: సరైన పర్యవేక్షణ లేక కొలిమిగుండ్ల మండలంలో తొమ్మిది పాఠశాలలు విలీనానికి సిద్ధంగా ఉన్నాయని, ఒక్క పాఠశాల మూత పడ్డా ఒప్పుకునేది లేదని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్ష్యతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రెండు సమావేశాలకు గైర్హాజర్ కావడంపై జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య శాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపాలని ఎంపీడీఓ దస్తగిరిబాబును ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి చెందిన మినరల్ వాటర్ గ్రామాలకు కాకుండా అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలో ఎందుకు అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి కర్నూలు(సెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఎంపీడీఓలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయకపోతే జీతాలు చెల్లించవద్దని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా, గౌరవంగా ప్రవర్తించాలన్నారు. తప్పనిసరిగా ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
కార్మికుల ప్రాణం కంటే.. ‘అల్కాలీస్’ ప్రయోజనం ముఖ్యమా?
● కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన సీఐటీయూ నాయకులుకర్నూలు(సెంట్రల్): టీజీవీ గ్రూపునకు చెందిన అల్కాలీస్ ఫ్యాక్టరీలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికుల వివరాలను బహిర్గతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలను కాపాడడం కంటే ఫ్యాక్టరీ ప్రయోజనాలను కాపాడేందుకే అధికారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జనవరి 5న ఐదు గంటల సమయంలో ఫ్యాక్టరీలో క్లోరిన్ లీకై 22 మంది కార్మికులు అస్వస్థతకు గురై ఊపిరి పీల్చుకోలేక స్పృహ కోల్పోయి ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. అయితే అధికారులు.. ప్రమాదంలో ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? వారికి ఎక్కడ వైద్యం అందించారన్న వివరాలను చెప్పలేదన్నారు. క్లోరిన్ పైపు లీకేజీతో విషవాయువు గొందిపర్ల, ఈ.తాండ్రపాడులను చుట్టుముట్టడంతో ఆయా గ్రామాల్లో అనేక మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, వారికి యాజమాన్యమే సరైన వైద్యం అందించాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. క్లోరిన్ గ్యాస్ లీకేజీపై పీసీబీ, ఫ్యాక్టరీస్ ఆఫ్ఇన్స్పెక్టర్, లేబర్ అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. యాజమాన్యం చెప్పినట్లు చేయడం అధికారులకు తగదన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించాలన్నారు. ధర్నాలో నాయకులు ఎం.గోపాల్. వై.నగేష్, షరీఫ్, రాఘవేంద్ర, హుస్సేనయ్య, తాండ్రపాడు సర్పంచ్ బాలపీరా పాల్గొన్నారు. -
● కేసీ కెనాల్లో దూకిన యువరైతు
అప్పుల బాధతో.. పాములపాడు: పంటలకు ధర లేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ యువరైతు మనస్థాపం చెంది కేసీ కెనాల్లో దూకాడు. ఈనెల 6వ తేది రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని జూటూరు గ్రామ పంచాయతీ మజరా కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన యువరైతు వంశీ(21) తండ్రి చంద్రపాల్, తల్లి నాగమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. రెండేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రావడం లేదు.దీనికితోడు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, మినుము పండిస్తే సరైన ధర లభించలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో చేసిన అప్పులపై ఇంట్లో కుటుంబసభ్యులతో మదనపడ్డాడు. తర్వాత ఇంటికి గొళ్లెం పెట్టి పరుగెత్తుకుంటూ సమీపంలోని కేసీ కెనాల్లో దూకాడు. ఈత కూడా రాకపోవడంతో క్షణాల్లో మునిగిపోయాడు. రాత్రి కావడంతో ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపాలు సిబ్బందితో పాటు, బంధువులు కేసీ కెనాల్ వెంట గాలింపు చేపట్టారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి కర్నూలు(సెంట్రల్) : జాతీయ స్థాయిలో ఓబీసీ కులగణన నిర్వహించడంతో పాటు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను కల్పించాలని బామ్సెఫ్ జాతీయ కమిటీ సభ్యుడు డాక్టర్ కె.హరిప్రసాదు డిమాండ్ చేశారు. ఓబీసీ హక్కుల సాధన కోసం ఓడిశా రాష్ట్రంలోని కథక్‌లో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని బుధవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒడిశా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కలెక్టర్లకు వినతిపత్రాలు, 15వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 22వ తేదీన ర్యాలీలు, ఫిబ్రవరి 22వ తేదీన నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.ఇందులో భాగంగా బుధ వారం ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో బామ్సెఫ్ ఉద్యమ కార్యచరణకు సంబంధించిన వినతిపత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. -
‘మధ్యాహ్న మెనూ’ విస్మరించడంపై ఆగ్రహం
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సక్రమంగా లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రెండో రోజు ఆయన జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లు, ఎంఎల్ఎస్ పాయింట్లు, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. వెల్దుర్తి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర), కల్లూరు మండలం పెద్దటేకూరు ఐసీడీఎస్ సెంటర్లో నిర్దేశించిన దానికంటే కోడిగుడ్లు అధికంగా ఉండటం, వంటశాల శుభ్రంగా లేకపోవడం, స్టాక్ రిజిస్టర్ మెయింటెయిన్ చేయకపోవడంతో మెమో, షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కర్నూలు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో 56 బియ్యం బ్యాగులు అధికంగా ఉండటం, మెనూ పాటించకపోవడంతో వార్డెన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్లో సాంబారు తయారీలో శనగపిండి వాడటం, ఆహార పదార్థాలు రుచిగా లేకపోవడంతో అధికారులకు మెమో జారీ చేయించారు. కర్నూలులోని ఎంఎల్ఎస్ పాయింట్, వెల్దుర్తి కేజీబీవీ పాఠశాలలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్ఓ ఎం.రాజారఘువీర్, డీఎం వెంకటరాముడు, ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్, అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
సార్..మమ్మల్ని ఆదుకోండి
● ఉల్లి మద్దతు ధర ఇప్పించాలని జిల్లా ఉద్యాన అధికారికి రైతుల మొర కర్నూలు(అగ్రికల్చర్): ‘ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోనే 4 నెలల క్రితం ఉల్లి గడ్డలు అమ్ముకున్నాం.. ఇంతవరకు మాకు మద్దతు సొమ్ము దక్కలేదు. చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉల్లి రైతులు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి ఎదుట మొరపెట్టుకున్నారు. బుధవారం ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు మద్దతు సొమ్ము కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని కలిసేందుకు వచ్చారు. ఆమో అందుబాటులో లేకపోవడంతో జిల్లా ఉద్యాన అధికారిని కలిసి తమ గోడు వినిపించారు. 2025 సెప్టెంబరు నెల 20వ తేదీ లోపు ఒక్కో రైతు 50 నుంచి 200 క్వింటాళ్లు వరకు ఉల్లిగడ్డలు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముకున్నారు. మద్దతు ధర రూ.1200 ఉండగా.. వ్యాపారులు కొన్న ధరను మినహాయించి వ్యత్యాసం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నెలల గడచిపోతున్నా ఇప్పటికి రూ.7.53 కోట్లు పెండింగ్‌లో ఉంది. కలెక్టరేట్‌కు వచ్చిన రైతుల్లో ఒక్కో రైతుది ఒక్కో బాధతో ఉండటం గమనార్హం. మద్దతు ధర మాకు సంబంధం లేదని, మార్క్‌ఫెడ్ అధికారులను కలవాలని జిల్లా ఉద్యాన అధికారి రైతులకు సూచించారు. అనంతరం రైతులు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జి.రాజును కలిశారు. -
దేవరకు వెళ్లి వస్తుండగా..
కౌతాళం: మండలంలోని ఎరిగేరి గ్రామంలో బంగారమ్మ దేవరకు వెళ్లి వస్తుండగా ఆటో ఢీకొని తల్లి కొడుకు దుర్మరణం చెందారు. తుంగభద్ర దిగువ కాలువ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎరిగేరి గ్రామంలో బుధవారం బంగారమ్మ దేవర జరుగుతుంది. కౌతాళం గ్రామానికి చెందిన రాము..భార్య మహదేవి, కుమారుడు నాగిరెడ్డి, మనవడు అభిరాంతో కలిసి ఆ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. దేవర ముగించుకుని సాయంత్రం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. కౌతాళం నుంచి ఎరిగేరి వైపు ఎదురు వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లి బలంగా ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే మహదేవి (48), నాగిరెడ్డి (28) మృతి చెందారు. మహదేవి చేతిలో ఉన్న మనవడు అభిరాంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగిరెడ్డి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నాగిరెడ్డికి భార్య శాంతితో పాటు ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. ● తుంగభద్ర దిగువ కాలువ సమీపంలో ఘటన -
నాటుసారాను సమూలంగా నిర్మూలించాలి
కర్నూలు : జిల్లాలో నాటుసారా ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నవోదయం 2.0లో భాగంగా నాటుసారా నిర్మూలన చేసిన గ్రామాల్లో సారా పునరుత్పత్తి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు సుధీర్ బాబు, రవికుమార్‌లతో కలసి కర్నూలులోని ఎకై ్సజ్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అధికారులతో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 141, నంద్యాల జిల్లాలో 129 నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి నవోదయం 2.0 అమలులో భాగంగా ఆయా గ్రామాల్లో నిర్మూలించినప్పటికీ పునరుత్పత్తి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎకై ్సజ్ పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేసిన వెంటనే చార్జ్షీట్లు వేయకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని సీఐలకు హెచ్చరించారు. పర్మిట్ రూముల లైసెన్స్‌లు జారీ పూర్తి చేయండి... మద్యం షాపులకు అనుబంధంగా వ్యాపారులు లైసెన్స్ తీసుకోకుండానే పర్మిట్ రూములు నడుపుతున్నారని స్టేషన్ల వారీగా వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్ జారీ ప్రక్రియ పూర్తి చేసి ఈఎస్‌లకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి వచ్చే అవకాశమున్నందున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైడ్స్ నిర్వహించాలన్నారు. నాటుసారా తయారీ, వ్యాపారం మానుకున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి, అక్రమ మద్యం అరికట్టడం, అనధికారిక మద్యాన్ని నిర్మూలించడం, సురక్ష యాప్ ద్వారా స్కానింగ్, ఎకై ్సజ్ యాప్ ద్వారా పర్యవేక్షణ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రాముడు, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ గౌడ్‌తో పాటు అన్ని స్టేషన్ల సీఐలు సమీక్షలో పాల్గొన్నారు. ఎకై ్సజ్ నోడల్ డీసీ ఆదేశం -
శివభక్తి..దీక్షతో ముక్తి!
శ్రీశైలంటెంపుల్: భక్తి మార్గంలో ఒక ముఖ్యమైన సాధనం శివదీక్ష. ఈ దీక్ష ద్వారా శివుడి అనుగ్రహం పొందడంతో పాటు సకల పాపాలు హరించబడతాయని భక్తుల విశ్వాసం. దీంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వరుడి భక్తులు శివదీక్ష చేపడుతారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈదీక్షను ఉభయ తెలుగురాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు స్వీకరిస్తారు. అత్యంత నియమ నిష్టలతో ఈ దీక్షలు సాగుతాయి. 1994సంవత్సరంలో అప్పటి శ్రీశైల దేవస్థాన ఈఓ వంగాల శివరామిరెడ్డి శివదీక్షను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. మొట్టమొదటిసారిగా ఆయనే స్వయంగా ఈ దీక్షను స్వీకరించారు. తర్వాత దీక్ష ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో క్రమంగా దీక్షపరులు పెరుగుతూ వచ్చారు. నేడు ఈ సంఖ్య 5లక్షలకు పైగా చేరిందని శ్రీశైలదేవస్థానం అధికారులు తెలిపారు. 41రోజుల పాటు దీక్ష శివదీక్షను 41రోజుల పాటు మండలం, 21రోజుల పాటు అర్ధ మండలం దీక్షను స్వీకరిస్తారు. గురువారం నుంచి శివదీక్షలు ప్రారంభం కానున్నాయి. మండల (41రోజుల)దీక్షను స్వీకరించే భక్తులు గురువారం నుంచి, జనవరి 28న అర్థమండల (21రోజుల)దీక్షను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 17న శివదీక్షను విరమిస్తారు. కొంత మంది భక్తులు ప్రస్తుతం 11రోజుల పాటు కూడా దీక్షను స్వీకరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినానికి 41 రోజులు పూర్తయ్యేలా దీక్షను స్వీకరిస్తారు. అలాగే కార్తీకమాసం నుంచి 108 రోజుల పాటు అఖండదీక్ష స్వీకరిస్తారు. 41రోజుల పాటు దీక్ష పూర్తయిన తరువాత ఇరుముడి సమర్పిస్తారు. ఇరుముడి సమర్పణ శివదీక్ష పూర్తయ్యే రోజున ఇరుముడితో శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరుకుంటారు. ఎక్కువ మంది శివస్వాములు పాదయాత్రగా వెళ్తుంటారు. గోధుమ వర్ణం సంచిలో స్వామి అమ్మవారికి నివేధించేందుకు పూజా సామగ్రి, నైవేద్యం ఇరుముడిగా తీసుకువెళతారు. స్వామివారికి ఇరుముడి సమర్పించిన తరువాత మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజలు అనంతరం శివదీక్షను విరమిస్తారు. శివస్వాములకు దేవస్థానం సహకారం శివమాల ధరించి శ్రీశైలం చేరుకున్న శివస్వాములకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సహకారాలు అందిస్తుంది. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి శివరాత్రి రెండు రోజుల ముందు వరకు మల్లన్న లింగ (స్పర్శ) దర్శనం కల్పిస్తుంది. అలాగే శివమాల విరమణకు శివదీక్షశిబిరాల వద్ద ప్రత్యేకంగా అర్చకులను ఏర్పాటు చేసి, హోమగుండాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా శివదీక్ష భక్తులకు తాగునీరు, భోజనం, స్నానాదికాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నియమ నిష్టలు శివదీక్ష చేపట్టే భక్తులు నియమ నిష్టలను పాటించాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందిన తరువాత గురుస్వామి ద్వారా దీక్షను స్వీకరిస్తారు. రుద్రాక్షమాలను ధరించి, భస్మంతో అలంకరించుకుని, గోధుమరంగు దుస్తులను ధరిస్తారు. రోజు సూర్యోదయం పూర్వం, సంధ్యాసమయాన చల్లనీటి స్నానం ఆచరిస్తారు. శవ దర్శనం జరిగినప్పుడు కూడా స్నానం ఆచరించాలి. అనంతరం శివయ్య దర్శనం, పూజాదికాలు నిర్వహించాలి. ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటిస్తారు. కటిక నేలపైనే నిద్రిస్తారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారాలకు దూరంగా ఉంటారు. కోపతాపాలకు దూరంగా ఉండి ఎవరినీ విమర్శించకుండా, నిరాడంబంరంగా జీవిస్తారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నిత్యం శివపంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ, ఎదుటి వారిని శివ నామంతో పలకరిస్తారు. వెల్లిపాయ, గోంగూర, ఉల్లిపాయ లేని ఆహారాన్ని స్వీకరిస్తారు. -
హోం వర్క్ చేయలేదని విద్యార్థిపై టీచర్ దాడి
బేతంచెర్ల: హోంవర్క్ చేయలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. గోరుమానుకొండ ఏపీ రెసిడెన్సియల్ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. డోన్ ఉడుములపాడు గ్రామానికి చెందిన కుల్లాయి కొడుకు హర్షవర్ధన్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3వ తేదీన విద్యార్థి హోం వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు బెత్తంతో తలపై కొట్టడంతో రక్త గాయమైంది. మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి 4వ తేదీన ఉదయం ఎవరికీ చెప్పకుండా పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని టీచర్లు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆందోళనకు గురైన వారు ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అదే రోజు రాత్రి కుమారుడు ఇంటికి రావడంతో టీచర్ తలపై కొట్టిన విషయం తెలిసింది. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బుధవారం డోన్ ఆర్డీఓ నరసింహులు ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసు కుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు (టౌన్): క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు అన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల క్రీడా మైదానంలో వర్సిటీ అంతర్ కళాశాలల బాల్‌బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. పోటీలకు అతిథిగా హాజరైన వైస్‌చాన్స్‌లర్ క్రీడాకారులను పరిచ యం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ చాటితే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వస్తాయన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్‌కుమార్ నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ శివకిషోర్, ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ అజ్రా జావేద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ సమీయుద్దీన్ ముజమిల్ పాల్గొన్నారు. హత్యకోణంలో విచారణ గడివేముల: మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన ఓ యువకుడి అదృశ్యం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. వినోద్ (21) గత ఏడాది ఆగస్టు 31 వ తేదీన నంద్యాలలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తండ్రి రాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగుచూశాయి. వినోద్ బైక్‌ను బొల్లవరం రస్తాలోని ఎస్సార్బీసీ బ్రిడ్జి నుంచి కిందకు పడేసినట్లు అనుమానితులు చెప్పడంతో బుధవారం అక్కడికి వెళ్లి పరిశీలించగా బైకు కనిపించింది. దీంతో ఈ కేసును పోలీసులు హత్యకోణంలో విచారిస్తున్నారు. నేడు మంత్రాలయానికి పారిశ్రామికవేత్త అదానీ కర్నూలు(సెంట్రల్): రాఘవేంద్రస్వామి దర్శనార్థం ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం మంత్రాలయం రానున్నారు. గుజరాత్‌లోని అహ్మద్‌బాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రాలయం వెళతారు. దర్శనానంతరం తిరిగి అదే హెలికాప్టర్లోనే కర్నూలు ఎయిర్‌పోర్టు చేరుకొని అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులా? కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే విశాఖపట్నంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులపై రౌడీషీట్, పీడీ యాక్ట్ ఓపెన్ చేశారని, ఇది చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం సీఆర్ భవన్లో ఐక్య విద్యార్థి, యువజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు కె.శ్రీనివాసులు, సోమన్న, కె.భాస్కర్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, హనోక్ హాజరై మాట్లాడారు. విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, పీడీ యాక్ట్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని కోరిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై కక్షపూరితగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. దీన్ని ఖండిస్తూ ఈనెల 9న విద్యార్థి, యు వజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నాయకులు దుర్గ, నాగరాజు, శరత్‌కుమార్, అభి, అశోక్ పాల్గొన్నారు. హ్యాకథాన్‌లో ప్రతిభ కర్నూలు సిటీ: వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బూట్ క్యాంపు, హ్యాకథాన్, అల్డీనేట్ 2.0 విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 400 మంది విద్యార్థులకుపైగా పాల్గొన్నారు. బూట్ క్యాంపులో 15 కాలేజీలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనగా ప్రతిభ చూపిన వారిని హ్యాకథాన్‌కు ఎంపిక చేశారు. పరిశ్రమలకు అవసరమైన వనరుల నమూనాను విద్యార్థులు ఐఏని ఉపయోగించి అద్భుతంగా తయారు చేశారని వక్తలు ప్రసంశించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు, ప్రశంసా పత్రాలను అందజేశారు. వీక్యూబ్ సీఓఓ నాగేంద్ర రెడ్డి, ఎం.అంకాలరావు, ఎన్.వి.గణపతిరాజు, కృష్ణయ్య, ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరెడ్డి,తదితరులు పాల్గొన్నారు. బాబువి చీకటి ఒప్పందాలు జూపాడుబంగ్లా: సీఎం చంద్రబాబు చీక టి ఒప్పందాలు చేసుకుంటారని, అందులో భాగమే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేత అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్‌బాబు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు నేడు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వ రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు తదితరులు రానున్నట్లు బుధవారం విలేకరులకు తెలిపారు. -
టీడీపీ నాయకుడి హల్చల్
సంజామల: పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమాయకులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.తాజాగా బతుకుదేరువు కోసం వచ్చిన బిహార్ కూలీలపట్ల సంజామల మండలం పేరుసోముల గ్రామ టీడీపీ నాయకుడు సురేష్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసివారి ట్రాక్టర్స్, బైక్,డీజల్ డ్రమ్ములను ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు.. పేరుసోముల గ్రామ శివారు పెద్దమ్మ గుడి వద్ద టర్నింగ్లో టవర్ వర్క్ పనుల నిమిత్త వచ్చిన బిహార్ కూలీలు నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో టీడీపీ నాయకుడు సురేష్‌రెడ్డి కోవెలకుంట్ల నుంచి వస్తున్నాడు. పేరుసోముల పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్ అడ్డుగా ఉందని బిహార్ కూలీలతో దురుసుగా వ్యవహరిస్తూ వాగ్వాదం దిగాడు. వారు ప్రతిఘటించడంతో గ్రామానికి వెళ్లి అనుచరులను వెంటేసుకుని కూలీల నివాసం దగ్గరికి వచ్చాడు. టీడీపీ కార్యకర్తలు కొట్టాడానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బిహార్ కూలీలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఇళ్ల వద్ద ట్రాక్టర్స్, బైక్, డీజల్ డ్రమ్ములు ఉండటంతో వాటిని ధ్వంసం చేసి హల్చల్ చేశారు. కూలీలపై దాడి విద్యుత్ టవర్ కాంట్రాక్టర్ ను బయపెట్టడానికా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బిహార్ కూలీలపై దౌర్జన్యం అనుచరులతో కలిసి ట్రాక్టర్లు, బైక్, డీజల్ డ్రమ్ములు ధ్వంసం -
అభివృద్ధికి మారుపేరు ఎస్వీ సుబ్బారెడ్డి
పత్తికొండ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం పత్తికొండ పట్టణంలో పులికొండ గ్రామానికి చెందిన ఎస్వీ అభిమానులు ఎస్వీ సుబ్బారెడ్డి 95 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగాగా 95 కేజీల కేక్‌తో ఎస్వీ కుటుంబం అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు నివాసానికి ఊరేగింపుగా చేరుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, విజయ మనోహరి దంపతులు తదితరులు ఎస్వీ సుబ్బారెడ్డితో కేక్ కట్ చేయించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డిని పూలమాల, శాలువా తో సత్కరించి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
డోన్/ప్యాపిలి: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్రెడ్డి గురువారం డోన్, ప్యాపిలి ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లను పంపిణీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు అందజేసిన కానుకలను బుగ్గన ఆదేశాల మేరకు విద్యార్థులకు అందజేశారు. డోన్‌లోని జ్యోతిరావ్‌పూలే ఆశ్రమ పాఠశాల, ఐటీఐ, బాలికల వసతి గృహాలతో పాటు ప్యాపిలిలోని కేజీబీవీ విద్యార్థులకు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, వైఎస్ చర్మన్ జాకీర్ హుసేన్, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజ్‌కుమార్, పార్టీ నాయకులు శ్రీరాములు, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
జంట హత్యల కేసులో 12 మంది నిందితుల అరెస్ట్
ఎమ్మిగనూరు రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన బోయ పరమేష్, బోయ వెంకటేష్ జంట హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ ఎన్. భార్గవి మర్రివాడ వెల్లడించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదే శాల మేరకు.. రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, రూరల్ ఎస్ఐ కె.శ్రీనివాసులు, హెచ్‌సీలు విక్టర్‌బాబు, బీరప్ప, కృష్ణ, చంద్ర, కానిస్టేబుళ్లు వెంకటాపురం తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వరరెడ్డి, అశోక్‌కుమార్, మల్లయ్య, జి. తిప్పన్న బృందంగా ఏర్పడి హత్య కేసులో నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వెంకటగిరి గ్రామ శివారు లోని ఇటుకల బట్టీ వద్ద నిందితులు ఉన్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసులో 20 మంది నిందితులు ఉండగా 12 మందిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి హత్యలకు ఉపయోగించిన మారణాయుధాలు, రెండు బైక్‌లు, టాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్లో బిక్కి సీతారాముడు, బిక్కి రాముడు, బిక్కి వెంకటేష్, బిక్కి కేశవ, బిక్కి దుబ్బ నరసింహుడు, బిక్క. శంకరన్న, బిక్కి శ్రీహరి, బిక్కి విష్ణువర్దన్, బిక్కి హరిబాబు, బిక్కి అశోక్, బోయ బిక్కి మల్లేష్, బిక్కి అంజినప్ప ఉన్నారన్నారు. మరో ఎనిమిది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. వీధి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ హత్యల దాకా వచ్చిందన్నారు. రెండేళ్ల క్రితం బోయ బిక్కి తునకల రవి, బోయ బిక్కి తునకల నరసింహులను బోయ గోవిందు కుటుంబీలు దాడి చేసి చంపేశారన్నారు. హతుల కుమారులు కక్ష పెంచుకుని బోయ గోవిందు కుటుంబంపై ఈనెల 5వ తేదీ దాడి చేయడంతో గోవిందు సోదరులు పరమేష్, వెంకటేష్ హత్యకు గురయ్యారు. గోవిందు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నిందితుల అరెస్ట్‌లో ప్రతిభ చూపిన సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
వామ్మో చిరుత
రోడ్డు పక్కన ఉన్న చిరుత కొలిమిగుండ్ల: కోర్నపల్లె సమీపంలోని గుండం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఆదానీ సిమెంట్ మైనింగ్ పరిసరాల వద్ద గురువారం తెల్లవారు జామున చిరుత కనిపించింది. సిమెంట్ ఫ్యాక్టరీలో ముగ్గురు ఉద్యోగులు డ్యూటీ ముగించుకొని కారులో తిమ్మనాయినిపేటకు వెళ్తున్న సమయంలో మైనింగ్ పరిసరాల్లోకి చేరుకొనే సరికి రోడ్డును క్రాస్ చేయడా న్ని గమనించారు. కారు లైటింగ్‌కు కొద్ది సేపు చిరుత ఆగడంతో అందులో ఉన్న సిబ్బంది సెల్ఫోన్లో ఫొటోలు తీశారు. దెయ్యాల చెరువు వైపు చిరుత వెళ్లిపోవడాన్ని గమనించారు. చిరుత సంచారం విషయం తెలియడంతో అబ్దులాపురం, కోర్నపల్లె గ్రామాల రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లరాదని ఫ్యాక్టరీ సిబ్బంది సూచించారు. మరో వైపు అనంతపురం జిల్లా తాడిపత్రి అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రదేశాన్ని తిలకించి పాద ముద్రలు సేకరించారు. దాదాపు ఏడు నెలల క్రితం తిమ్మనాయినిపేట సమీపంలో చిరుత దారిన పోయే వాహనదారులకు కనిపించింది. ఇప్పుడు కోర్నపల్లె కనిపించిన చిరుత రెండు ఒక్కటే ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రిన్సిపాల్, పీఈటీ మాకొద్దు
గోస్పాడు: గోస్పాడు మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ ఖాజాహుసేన్, పీఈటీ గీతావాణిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, విద్యార్థులను గ్రూపులుగా విభజించి విబేధాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. పాఠశాలలో వారు పనిచేస్తే తాము పాఠశాలకు రాలేమని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. పాఠశాలలో వారితో కాకుండా ఇతర ఉపాధ్యాయులతో మాట్లాడినా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను చుట్టుముట్టడంతో ఉద్రిక్తతత నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి పాఠశాలలో రాలేదని ఇప్పుడెందుకు వస్తుందని నిలదీశారు. సమాచారం అందుకున్న ఎంఈఓలు అబ్దుల్ కరీం, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీ గీతావాణి సెలవులో వెళ్లారని ఎంఈఓ తెలిపారు. డీఈఓ విచారణ: మోడల్ స్కూల్లో విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న డీఈవో జనార్దన్‌రెడ్డి గురువారం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడారు. నివేదిక తయారు చేసి పంపాలని ఎంఈఓను ఆదేశించారు. -
కాటసాని శివ దీక్ష స్వీకరణ
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి క్షేత్రంలో గురువారం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శివదీక్ష స్వీకరించారు. కాటసాని ఈ దీక్ష స్వీకరించడం 35వ సారి కావడం విశేషం. శివదీక్ష సందర్భంగా కాటసానితో పాటు ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి ఆలయంలోని ఉమామహేశ్వరులను దర్శించుకున్నారు. నందీశ్వరుడికి కూడా పూజలు నిర్వహించారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు సుమారు 200 మంది శివదీక్ష స్వీకరించారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్.కొత్తపల్లె గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన నరేష్ ఆచారి (39) బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలోని మహా సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పదేళ్లుగా పని చేస్తూ బనగానపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సొంతూరులో పొలం పని చూసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఆర్ కొత్తపల్లె – ఆర్ఎస్ రంగాపురం గ్రామాల మధ్య రహదారి పక్కన్న నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ప్రమాదవశాత్తూ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేష్ ఆచారిని వాహనదారులు బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య జ్యోతితో పాటు కుమార్తె కోమలి, కుమారుడు అఖిరానందన్ ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు గురువారం తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని.. గోనెగండ్ల: పని చేయకుండా ఖాళీగా ఉంటే ఎట్లా అని..తల్లిదండ్రులు మందలించడంతో కుమారు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన ఎరుకల రంగముని, దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు స్టీల్ సామాన్లు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు సతీష్‌కు వివాహమైంది. చిన్న కుమారుడు వీరేంద్ర (19) ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా తిరుగుతు న్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరేంద్ర స్నేహితులతో కలిసి మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. సమీపంలో ఉన్న సోదరుడి ఇంటికెళ్లి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి అన్న సతీష్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు గోనెగండ్ల: అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను రాయలసీమ జోనల్ మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లు(ఏడీ విజిలెన్స్), జిల్లా రాయల్టీ ఇన్స్‌స్పెక్టర్ శివ పార్వతి ఆదేశించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘హంద్రీలో ఇసుక తోడేళ్లు’ అనే శీర్షికన ప్రచురితమైన ఈ కథనానికి మైనింగ్ అధికారులు స్పందించారు. తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామాల సమీపంలోని హంద్రీనదులను పరిశీలించారు. హంద్రీనదిలో తవ్విన గుంతలు, ఇసుకను పరిశీలించారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
క్యూఆర్ కోడ్‌తో
● ప్రతి ఔషధంపై క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి ● స్కాన్ చేస్తే కళ్ల ముందు మందుల వివరాలు మందుల గుట్టురట్టు కర్నూలు(హాస్పిటల్): ప్రస్తుతం మందుల మాయాజాలం నడుస్తోంది. ఏది అసలో, ఏది నకిలీ మందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏది మంచి మందో, ఏది సరైనది కాదో అర్థంకాని స్థితిలో మార్కెట్ ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్‌ను తీసుకొచ్చింది. ప్రతి ఔషధంపై దాని మందుల తాలూకు వివరాలు ఉండేలా దానిని రూపొందించింది. ఈ మేరకు ఇకపై తయారయ్యే మందులపై తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,800 రిటైల్ మెడికల్‌షాపులు, వెయ్యి దాకా హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులు, పోటీ కారణంగా అనేక రకాల నకిలీ మందులు అచ్చు బ్రాండెడ్ మందుల రూపంలో పుట్టుకొస్తున్నాయి. దీనికితోడు ఊరు, పేరు లేని మందుల కంపెనీలు తయారు చేసే మందులూ మార్కెట్లో కొల్లలుగా ఉన్నాయి. లాభాలు అధికంగా ఉండటంతో అధిక శాతం వైద్యులు వారికి తక్కువ ధరకు లభించే ఎక్కువ లాభాలను ఇచ్చే ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మందులను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏ మందులో ఎంత మోతాదులో మందు ఉంది, అసలు మందు ఉందా లేదా, ఏది నకిలీ, ఏది అసలు తెలుసుకోవాలంటే కష్టంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో క్యూ ఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. ఇటీవల కాలంలో అధికంగా విక్రయాలు జరిగే బీపీ, షుగర్, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్, అలర్జీ, దగ్గు, జలుబు, జ్వరం తదితర వ్యాధులను తగ్గించే మందులపై ఆయా కంపెనీలు క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు మాత్రమే వీటికి ప్రాధాన్యత ఇస్తుండగా త్వరలో ఇతర కంపెనీలు కూడా క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత గడువులోగా దేశంలోని అన్ని ఫార్మాకంపెనీలు అవి తయారు చేసే మందులపై తప్పనిసరిగా క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించి వివరాలు నమోదు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత చేకూరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూ ఆర్ కోడ్ విధానం వల్ల ఆయా మందుల వివరాలు అందులో తెలుస్తాయి. ఏ ఔషధం దేనికి పనిచేస్తుంది, అది ఎక్కడ తయారైంది, ఆ ప్రాంతం వివరాలు ఉంటాయి. ఔషధంలో మందు ఎంత మోతాదులో ఉంది, ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ఇది రోగి ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. – హరిహరతేజ, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
గజ వాహనంపై దివ్య తేజం
మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో గురువారం రాత్రి గజవాహనంపై ప్రహ్లాదరాయలు ఊరేగారు. ‘పూజ్యాయ రాఘవేంద్రాయ..సత్యధర్మ వ్రతాయచా’ అంటూ భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. గ్రామ దేవత మంచాలమ్మకు అభిషేకం, కుంకుమ ఆర్చన, నైవేద్యం సమర్పించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. మధ్వ కారిడార్, కల్పతరు క్యూలైన్లో భక్తుల రద్దీ కొనసాగింది. -
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
కర్నూలు: ప్రేమ పేరుతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరంలో నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఎన్‌హెచ్–40 రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుటుంబంతో పాణ్యంలో నివాసముంటున్న పఠాన్ రహంతుల్లా పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వారింట్లోని ఓ మైనర్ బాలిక(16)తో చనువుగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఒంటరిగా ఉన్న సమయంలో మైనర్ బాలికను శారీరకంగా దగ్గరయ్యాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని, త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 2020 నవంబర్ 2న తనకు గర్భం వచ్చిందని బాలిక చెప్పగా తన మోటర్ సైకిల్‌పై బాలికను నెల్లూరుకు తీసుకెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత మీ ఇంట్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని పాణ్యంకు పిలిచుకువచ్చి హోటల్ ముందు బాలికను దించి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లితో కలసి పాణ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పఠాన్ రహంతుల్లాపై కిడ్నాప్, అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడిపై మోపిన అభియోగాలు నిరూపణ కాగా 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
‘దారి’తప్పిన తమ్ముళ్లు!
కర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రహదారుల నిర్వహణపై ఒంటి కాలిపై లేచిన కూటమి నేతలు నేడు రహదారుల నిర్మాణాలు పూర్తికాకుండా ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. నంద్యాల జిల్లాలోని గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ వర్క్ కింద రూ.3 కోట్ల అంచనాతో 7.95 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు గత ఏడాది జూలై 4న అగ్రిమెంట్ చేసుకున్నారు. నాబార్డు ఆర్‌ఐఎఫ్‌డీ–30 నిధులతో చేపట్టిన పనులను ఈ ఏడాది జూన్ 3 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి రోడ్లకు ఇరువైపులా జంగిల్‌ను క్లియరెన్స్ చేయించి, డబ్ల్యూఎంఎం పనులు కూడా పూర్తి చేశారు. దాదాపు 70 శాతం మేర పూర్తయిన పనులకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంబుక్ రికార్డు చేయాల్సి ఉంది. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సంబంధిత పీఆర్ ఇంజనీర్లు ఈ రోడ్డు పనులను నేటి వరకు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఎంబుక్ రికార్డు చేసిన అనంతరం క్వాలిటీ కంట్రోల్ అధికారులు చేసిన పనులపై క్వాలిటీని చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయాల్సి ఉంది. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రాంట్ల కింద చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికల్లో ఈ రోడ్డు పనులు దాదాపు 70 శాతం పూర్తయినా జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేసినట్లు నమోదు చేయడం చూస్తే అధికార పార్టీ ఒత్తిళ్లు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. 15 కి.మీలు తగ్గనున్న దూరం ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మండల కేంద్రమైన గోస్పాడు నుంచి తిరుపతి జాతీయ రహదారికి వెళ్లేందుకు 15 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లికి 8 కిలోమీటర్లు, కామినేనిపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని గోవిందపల్లి మీదుగా కర్నూలు – తిరుపతి జాతీయ రహదారికి చేరుకోవచ్చు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ప్రస్తుతం గోస్పాడు నుంచి నంద్యాల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాల్సి వస్తోంది. ఎంబుక్ రికార్డు చేయకుండా అధికారులపై ఒత్తిళ్లు గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రోడ్డు నిర్మించేందుకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించి (జంగిల్ క్లియరెన్స్) డబ్ల్యూఎంఎం పనులు పూర్తి చేశారు. అయితే స్థానిక తెలుగుదేశం నేతలు జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనులకు అనుగుణంగా ఎంబుక్ రికార్డు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎంబుక్ రికార్డు చేయకపోవడం, క్యూసీ చెక్ చేయకపోవడంతో డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయలేని పరిస్థితి ఏర్పడింది. 7.95 కిలోమీటర్ల మేర డబ్ల్యూఎంఎం వేసి వదలేయడంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎంబుక్ రికార్డు చేయకపోవడంపై కాంట్రాక్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. గోస్పాడు–కామినేనిపల్లి రోడ్డుకు రాజకీయ గ్రహణం -
నేడు ఎపీఎన్‌జీజీవోస్ జిల్లా శాఖ ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్):ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, రమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలనే తాత్కాలికంగా అడ్హాక్ కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఎట్టకేలకు రెండు గ్రూపుల మధ్య రాష్ట్ర నాయకత్వం రాజీ కుదర్చడంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. అధ్యక్షుడిగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కార్యాలయంలో ఆఫీసు మేనేజర్ గా పనిచేస్తున్న జవహర్లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవసాయ శాఖ కర్నూలు ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంసీ కాశన్నలను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఏర్పడింది. పోటీ అనివార్యమైతే ఈనెల 16న జిల్లా కోర్టు ఎదుటనున్న జిల్లా ఎన్జీవో హోంలో శుక్రవారం ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు. ఫిబ్రవరి 7న నవోదయ ప్రవేశ పరీక్ష ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 7న నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్‌గా పుట్టిన తేదిన ఉపయోగించి హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 9వ తరగతికి https://cbseitms.nic.in/2025/ nvsix, 11వ తరగతికి https://cbseitms.nic.in/ 2025/nvsxi వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సందేహాలుంటే 085212 –294545ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘చిన్న’బోతున్న అంగన్వాడీ గుడ్లు వెల్దుర్తి: అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్ల సై జు పూర్తిగా తగ్గిపోయింది. నాణ్యత, పరిమా ణంలో స్పష్టమైన నిబంధనలున్నా వెల్దుర్తి మండలంలోని అంగన్వాడీ సెంటర్లకు కాంట్రాక్టర్లు సరఫరా చేసే గుడ్ల సైజు పిట్ట గుడ్లను తలపిస్తున్నాయి. ఒక్కో గుడ్డు 30 గ్రాములను కూడా మించని పరిస్థితి. ఈ కారణంగా పిల్లలకు, గర్భిణీలకు నాణ్యమైన, పోషకాలున్న ఆహారం అందించాలన్న అంగన్వాడీల లక్ష్యం నీరుగారుతోంది. ఈ విషయంపై సీడీపీఓ లూక్‌ను వివరణ కోరగా తన దృష్టికి కూడా వచ్చిందని, ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. తలసీమియా రక్తమార్పిడి కేంద్రం ఏర్పాటు కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆవరణలో గురువారం తలసీమియా బాధితులకు రక్తమార్పిడి కేంద్రం ప్రారంభమైంది. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం రక్తమార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి నెలా వంద మందికి పైగా తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తీసుకున్న రక్తాన్ని ప్రభుత్వ, ఇతర ఆసుపత్రుల్లో ఎక్కించేవారన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా రెడ్‌క్రాస్ సొసైటీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలోనే రక్తం ఎక్కించే ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, కాట్స్ దాత డాక్టర్ తిరుపాల్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ ట్రెజరర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. క్వింటా పత్తి రూ. 8,149 ఆదోని అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం పత్తి ధర రూ.39కి పెరిగింది. క్వింటాకు సీసీఐ గిట్టుబాటు ధర రూ.8110 ఉండగా మార్కెట్లో రూ.8149 పలికింది. అమ్మకానికి 2,097 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.8,149, మధ్య ధర రూ.7,469, కనిష్ట ధర రూ.4,279గా నమోదయ్యింది. -
ఈ మూడు సంఘటనలే కాదు... జిల్లాలో రోజుకు సగటున రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడుతున్నారు.
కర్నూలు: ప్రమాదాలతో ఎక్కువ మంది మృతిచెందినట్లు గత ఏడాది చివరలో పోలీసు శాఖ విడుదల చేసిన నేర నివేదికలో తేలింది. మృతుల్లో యువత అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్లుగా పరిశీలిస్తే ఏడాది పొడవునా జరిగిన ఘటనలతో పోల్చితే డిసెంబర్, జనవరి నెలల్లో అంటే పండుగలు, కొత్త ఏడాది సమయాల్లో జరిగిన ప్రమాదాలే అధికంగా ఉంటున్నాయి. గత ఏడాది జనవరిలో 74 ప్రమాదాలు, డిసెంబర్లో 89 ప్రమాదాలు చోటు చేసుకోవడం వాటి తీవ్రతకు నిదర్శనంగా చెప్పవచ్చు. హెల్మెట్ ధరించకుండా ముగ్గురు, నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై కంటికి కనిపించనంత వేగంగా వెళ్లిపోతున్నారు. స్నేక్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. మద్యంమత్తే కారణం జరుగుతున్న ప్రమాదాలకు మద్యం మత్తు ప్రధాన భూమిక పోషిస్తోంది. కర్నూలులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు, తుంగభద్ర బ్రిడ్జికి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు, చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాద సంఘటనకు ముందు ద్విచక్ర వాహనదారుడు మృతికి మద్యం మత్తే కారణమని పోలీసులు తేల్చారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఆదోని మండలం ఇస్వి పోలీసులకు పట్టుబడగా అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు జైలు శిక్ష విధించారు. గత రెండేళ్లుగా నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2024లో 1,613 కేసులు నమోదు కాగా, 2025లో ఏకంగా 9,196 కేసులు నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది. కనిపించని మార్పు జాతీయ రహదారిపై 80 కి.మీ వేగానికి మించి వెళ్లకూడదు. కానీ వాహనదారులు 100 నుంచి 140 కి.మీ వేగం కంటే అధికంగా దూసుకెళ్తున్నారు. స్పీడ్ గన్ల ద్వారా భారీ వాహనాలకు తనిఖీల ద్వారా, నిఘా కెమెరాల ద్వారా ద్విచక్ర వాహనదారులకు చలానాలు విధిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. కూడళ్ల వద్ద 40 కి.మీ వేగం కంటే అధికంగా వెళ్లొద్దు. దారి పొడవునా కూడళ్ల వద్ద అండర్ పాసులు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైవేల్లో ఎక్కువ ప్రమాదాలు జిల్లాలో ప్రధానంగా ఎన్‌హెచ్–40, ఎన్‌హెచ్–44, ఎన్‌హెచ్–167, ఎన్‌హెచ్–340సితో పాటు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కువ మంది ప్రయాణికులతో తిరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్లే 44 నంబర్ జాతీయ రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశంలో సంచలనంగా మారింది. జాతీయ రహదారుల పొడవునా ఏదో చోట రక్తం చిందని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రమాదాల కూడళ్లు హైవేపై ఎక్కువగా కూడళ్ల వద్దే ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిని దాటే సమయంలో పాదచారులు ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు విడుస్తున్నారు. నేరుగా వెళ్లే లైట్ మోటార్, భారీ వాహనాలు కూడళ్ల వద్ద కూడా అధిక వేగంతో వెళ్తుండటమే ప్రమాదాలకు కారణం. కొన్నిసార్లు ఢీకొట్టిన వాహనాలు ఆచూకీ దొరకడం లేదు. వాటిని గుర్తించేందుకు హైవేపై సరిగా సీసీ కెమెరాలు కూడా లేవు. కర్నూలు బాలాజీ నగర్, రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా, రింగ్ రోడ్డు సమీపం, వెల్దుర్తి శివారులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్దపాటి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాం. అవగాహన కార్యక్రమాలు మాసానికే పరిమితం కాకుండా పోలీసు శాఖ కూడా ఏడాదంతా నిర్వహిస్తోంది. – శాంతకుమారి, డీటీసీ సంవత్సరం ప్రమాదాలు మృతులు అందులో క్షతగాత్రులు డ్రంకెన్ డ్రైవ్ యువకులు కేసులు 2024 547 300 247 653 1613 2025 666 307 209 731 9196 మొత్తం 1213 607 456 1384 10809 -
టీడీపీ నాయకుల దౌర్జన్యంతో మా పొలాలు బీళ్లుగా మారాయి
వెల్దుర్తి: గ్రామ టీడీపీ నాయకుల దౌర్జన్యంతో దాదాపు 250 ఎకరాల పంట పొలాలు రెండేళ్లుగా బీళ్లుగా మారాయని, తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని, జీవనోపాధి కోల్పోయి దుర్భర జీవనం గడుపుతున్నామని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామ రైతులైన వైఎస్సార్సీపీ నాయకులు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో కలిసి వారు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, గ్రామ నాయకులు బొమ్మిరెడ్డిపల్లెలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 19 నెలలుగా పొలాల్లోకి వెళితే చాలు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటూ, తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా తమపై కక్ష గట్టి పొలాలు బీళ్లు చేశారన్నారు. ఏకంగా పార్టీ సానుభూతి పరుల గడ్డి వాములు తగలబెడుతూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. గ్రామంలోకి వెళ్లేలా, ప్రజాస్వామ్య బద్ధంగా ఉండేలా కోర్టు ఆదేశాలున్నా భయభ్రాంతులు సృష్టించి మరీ పంటలు వేయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ సందర్భంగా మాజీ సీఎం స్పందిస్తూ అన్నివిధాల అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బొమ్మిరెడ్డిపల్లె గ్రామ నాయకులు మధుసూధన్ రెడ్డి, చక్రపాణిరెడ్డి, ఆనంద పద్మనాభ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రంగయ్య చౌదరి, జగదీశ్వరరెడ్డి, సూర్యనారాయణ చౌదరి, వెంకటేశ్ చౌదరి, సంజీవరెడ్డి, భాస్కర్ నాయుడు ఉన్నారు. అధికార దుర్వినియోగంతో గ్రామంలో అప్రజాస్వామిక పరిస్థితులు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన బొమ్మిరెడ్డిపల్లె గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు -
పంట నమోదుపై ఎస్ఎంఎస్ సమాచారం
కర్నూలు(అగ్రికల్చర్): ఈ–పంట సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో రైతుల ఆధార్ లింక్ మొబైల్‌కు సమాచారం వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై రైతులు ఈ–పంట వివరాలను ఆన్లైన్లో స్వయంగా ధృవీకరించుకునే అవకాశం ఉందన్నారు. ఏవైనా తప్పులు ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. www.karshak.ap.gov.in/ecrop, www.agricluture.ap.gov.in వెబ్సైట్ల ద్వారా పంటల నమోదు వివరాలను చెక్ చేసుకోవచ్చన్నారు. సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త కర్నూలు: సంక్రాంతి పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డీఐజీ/ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊళ్లకు వెళ్తుంటారని, ఇదే అదునుగా దొంగలు చోరీలు పాల్పడే అవకాశం ఉందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పండుగకు ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఇంట్లో ఎవరూ లేరని తెలియకుండా ఉండేందుకు రాత్రివేళ లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ల కాలనీ వాసులు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే భద్రత ఉంటుందన్నారు. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, పానీయాలను తిరస్కరించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే 112 కానీ, డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ
కర్నూలు: ఓ వ్యక్తిని అరెస్టు చేయకుండా నోటీసులతో సరి పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్ఐ దండగల కిరణ్ బాబు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన పి.శివనాగిరెడ్డికి భారతితో 2017లో వివాహమైంది. కొంతకాలం తరువాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన భర్త అదనంగా కట్నం కోసం వేధిస్తున్నాడని గత ఏడాది నవంబర్ 24న భారతి మహి ళా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ కిరణ్ కుమార్ భార్యాభర్తలకు రెండు విడతలుగా కౌన్సెలింగ్ చేశారు. అయి నప్పటికీ తన భర్తలో మార్పు రావడం లేదని భారతి పోలీసులకు చెప్ప డంతో శివనాగిరెడ్డిపై వేధింపుల కేసు నమోదైంది. అయితే కేసులో లేని హత్యాయత్నం 307 సెక్షన్‌ను తొలగించేందుకు రూ. 60 వేలు ఇవ్వాల ని శివనాగిరెడ్డిని ఎస్ఐ కిరణ్ బాబు బెదిరించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు సోమవారం (5వ తేదీ) కర్నూలు ఎ.క్యాంప్‌లోని ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సోమన్నను సంప్రదించాడు. ఈ మేరకు శివనాగిరెడ్డితో ఎస్ఐకి ఫోన్ చేయించి వారి సంభాషణను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. రూ.30 వేలు లంచం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని మంగళవారం మధ్యాహ్నం గుత్తి రోడ్డులోని ఎస్ఐ కిరణ్ బాబు ఇంటికి వెళ్లి బాధితుడు శివనాగిరెడ్డి రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మహిళా పీఎస్ కు తరలించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి మహిళా పీఎస్ ఎస్ఐగా కిరణ్ పని చేస్తున్నారు. కేసులో లేని 307 సెక్షన్ పేరిట బాధితున్ని బెదిరించి లంచం తీసుకుంటున్న ఎస్ఐ కిరణ్‌ను వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజాప్రభాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వార్డెన్లు పని చేసే చోటే నివాసం ఉండాలి
● బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ కర్నూలు(సెంట్రల్): సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండి విద్యార్థుల బాగోగులు చూసుకోవాలని బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల హెచ్‌డబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూలు, డీబీసీడబ్ల్యూఈఓలు, ఎంజేపీఏపీబీసీ డబ్ల్యూర్ ఈఐఎస్ ప్రిన్సిపాళ్లతో బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు చక్కటి ఆరోగ్యం, విద్యను అందించాలన్నారు. మెనూపై శ్రద్ధపెట్టి మంచి పౌష్టికాహారా న్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత కోసం ప్రతి రోజూ స్టడీ అవర్స్‌ను నిర్వహించాలన్నారు. ప్రభు త్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికను హాస్టళ్లలో సక్రమంగా అమలు చేయాలని సూచించారు. తరచూ పేరెంట్, టీచర్స్‌తో పిల్లల చదువు అంశాలపై సమీక్షించాలన్నారు. పనిచేసే ప్రదేశంలో ఉండకపోతే సిబ్బందిపై వేటు వేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ హాస్టల్ సెక్రటరీ మాధవీలత, జేడీ శ్రీధర్‌రెడ్డి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాల బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ప్రసూన, కుస్బూ కొఠారి, జగ్గనయ్య, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలుతో ప్రత్యేకానుబంధం... బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి హోదాలో కర్నూలుకు రావడంతో ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనతో స్నేహంగా ఉన్న పలువురు అధికారులను గుర్తు చేసుకున్నారు. -
824 మంది ఉల్లి రైతులకు అందని పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 824 మంది ఉల్లి రైతులకు పరిహారం విడుదల కాలేదని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో 31,352 మంది ఉల్లి రైతులకు ఎకరాకు 20 వేల ప్రకారం విడుదల అయిందని తెలిపారు. ఇందులో 30,528 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు జమ అయిందని తెలిపారు. 824 మంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండటం వల్ల జమ కాలేదని తెలిపారు. ఈ రైతుల వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు పంపామని రైతులు చెక్ చేసుకొని బ్యాంకు ఖాతాలను యాక్టివ్ చేసుకోవడం, ఆధార్ లింక్ చేసుకోవడం చేసుకోవాలని సూచించారు. క్యాష్‌బ్యాక్, నష్టపరిహారం చెల్లించాలి కర్నూలు (అర్బన్): బైక్ కొనుగోలు సమయంలో ఇచ్చిన క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారుని ఖాతాలో జమ చేయకపోవడంపై ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌కు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. 2024 జులై 28న కల్లూరు మండలం పందిపాడు గ్రామానికి చెందిన వ్యక్తి రూ.1,32,212కు ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఆసమయంలో రూ.10 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పది రోజుల్లో జమ చేస్తామని హామీ ఇచ్చి చెల్లించలేదు. దీనిపై వినియోగదారుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కమిషన్ ఓలా ఎలక్ట్రికల్ బైక్స్‌కు పలుమార్లు లీగల్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో కమిషన్ విచారణ జరిపి సేవల లోపం, అన్యాయ వ్యాపార విధానమని తేల్చింది. ఫిర్యాదుదారులకు రూ.10 వేల క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో పాటు మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారం, న్యాయ వ్యయాల కోసం రూ.5 వేలను 45 రోజుల్లోపు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఆదేశాలను కమిషన్ ప్రెసిడెంట్ కరణం కిషోర్ కుమార్, సభ్యులు ఎన్.నారాయణ రెడ్డి, ఎస్.నజీమా కౌసర్ జారీ చేశారు. కర్నూలు(అర్బన్): ప్రజలకు మెరుగైన సేవలను వేగవంతంగా అందించేందుకే ప్రభుత్వం ఈ – గవర్నెన్స్ సిస్టమ్‌ను తీసుకొచ్చిందని డీపీఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంజులవాణి అన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన జూనియర్ సహాయకులు, పరిపాలనాధికారులకు ఈ – గవర్నెన్స్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్ఐఆర్డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకే వేదిక నుంచే ఆన్లైన్ అప్లికేషన్లను అన్ని శాఖల సమన్వయంతో ఈ గవర్నెన్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీల హాజరును ఖచ్చితత్వంతో జీయోట్యాగ్తో నమోదు చేయవచ్చునన్నారు. శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, సీనియర్ సహాయకులు వేణుగోపాల్, టీఓటీలు ఆస్రఫ్బాష, పి. జగన్నాథం, ఖలీలుల్లా, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పాలనలో పారదర్శకతకు పెద్దపీట
● రూ.387.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ ● ఉమ్మడి జిల్లాలోని 695 జనవాసాలకు సురక్షిత మంచి నీటి సరఫరాకు ప్రాధాన్యత ● జెడ్పీ సాధారణ నిధులు రూ.12.03 కోట్లతో 266 పనులు ● కారుణ్య నియామకాల కింద 154 మందికి ఉద్యోగాలు ● నాలుగేళ్ల పాలనపై జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఈ నెల 4వ తేదీకి జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఆయన జెడ్పీలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ... పెద్దగా ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్‌కు ఆర్థిక జవసత్వాలు తీసుకువచ్చేందుకు అందరి సహకారంతో పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా జెడ్పీ స్థిరాస్తులకు సంబంధించిన, స్టాంప్ డ్యూటీ, సీనరేజి గ్రాంట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతరత్రా వనరులతో జెడ్పీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీలు, జెడ్పీ అధికారులు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారన్నారు. రూ.382.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.382.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 695 జనవాసాలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ పథకాల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2021–22 నుంచి 2024–25 వరకు రూ. 297.15 కోట్లు వెచ్చించామని, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.90.57 కోట్లు వెచ్చించేందుకు పరిపాలనా ఆమోదం జారీ చేశామన్నారు. అలాగే గడచిన నాలుగేళ్లలో 110 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 77 పనులు పూర్తి అయ్యాయని, ఇందుకు రూ.41,34,45,165 వెచ్చించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.41.52 కోట్ల అంచనాతో 990 పనులు చేపట్టామని, ఇందులో రూ.22.61 కోట్ల ఖర్చుతో 649 పనులు పూర్తి చేశామన్నారు. అలాగే నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఎస్సీ కార్పొరేన్కు రూ.2.81 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.1.11 కోట్లను విడుదల చేశామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు రూ.12.03 కోట్ల అంచనాతో 266 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.8.79 కోట్ల వ్యయంతో 204 పనులు పూర్తి కాగా, ఇంకా 62 పనులు వివిధ దశల్లో ఉన్నాయని చైర్మన్ వివరించారు. వేసవిలో తాగునీటి నివారణకు ప్రాధాన్యత వేసవిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని నిధులను విడుదల చేసినట్లు చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రూ.6.13 కోట్ల అంచనాతో 188 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల వ్యయంతో 157 పనులు పూర్తి చేశామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. సున్నిపెంటకు ప్రత్యేకంగా రూ.72 లక్షలు సున్నిపెంట గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనందున 15వ ఆర్థిక సంఘం నిధులు అందని పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే సుండిపెంట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణకు జెడ్పీ 4 శాతం నిధుల కింద రూ.72.10 లక్షలను విడుదల చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. నాలుగేళ్ల పాలనలో జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో కారుణ్య నియామకాల కింద 154 మందికి వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పించామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్లు 43, టైపిస్టులు 42, ఆఫీసు సబార్డినేట్లు 66, స్వీపర్లు 03 మంది ఉన్నారన్నారు. అలాగే వివిధ కేడర్లలో 378 మంది ఉద్యోగులు పదోన్నతులు పొందారన్నారు. -
టీజీవీ ఆల్కాలీస్లో గ్యాస్ లీక్!
సాక్షి, టాస్క్ఫోర్సు: టీజీవీ గ్రూపునకు చెందిన రాయలసీమ అల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనపై అంతటా గోప్యత పాటిస్తున్నారు. ప్రమాద వివరాలు చెప్పేందుకు అటు జిల్లా యంత్రాంగంగానీ, యాజమాన్యంకానీ ముందుకు రావడంలేదు. అంతేకాదు అస్వస్థతకు గురైన వారి వివరాలు తెలియనీయకుండా పెట్టడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల సమీపంలోని టీజీవీ గ్రూపు అల్కాలీస్ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ పైపును శుభ్రం చేస్తుండగా దానిపై ఇటుకలు పడడంతో పైపు పగిలినట్లు సమాచారం. దీంతో క్లోరిన్ వాయువు రూపంలో అలుముకోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు, సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడే ప్రథమ చికిత్స చేయగా ఐదుగురు కోలుకోవడంతో మిగతా వారిని నగరంలోని గౌరీ గోపాల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇందులో సోమవారం రాత్రే కొందరు కోలుకోగా.. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గొందిపర్ల, ఈ.తాండ్రపాడుపై ప్రభావం ఆల్కాలీస్ ఫ్యాక్టరీకి గొందిపర్ల, ఈ. తాండ్రపాడులు అతి సమీపంగా ఉంటారు. ఫ్యాక్టరీ, ఆ గ్రామాలకు మధ్య 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో క్లోరిన్ వాయువు గ్రామాలను చుట్టమట్టడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఆయా గ్రామాల్లో దాదాపు 10 మంది శ్వాస తప్పి పడిపోయినట్లు సమాచారం. వారిలో ముగ్గురిని గ్రామస్తులు రాత్రే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లు సమాచారం. క్లోరిన్ గ్యాస్ పైప్‌పై ఇటుకలు పడటంతో ప్రమాదం పలువురికి అస్వస్థత.. గౌరీ గోపాల్‌కు తరలింపు గోప్యత పాటిస్తున్న అధికార యంత్రాంగం, యాజమాన్యం -
పెట్రోల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట
● జిల్లా సరిహద్దులో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు ● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు (సెంట్రల్): సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి అక్రమంగా పెట్రోలియం రవాణా కాకుండా కట్టడి చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో అక్రమ పెట్రోలియం రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ ప్రొటెక్షన్ కమిటీతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా, అనుమతి లేకండా పెట్రోలియంను తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. కర్ణాటకలో ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారని, దీని వల్ల రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గడమే కాకుండా సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. దీనిని అరికట్టడానికి సివిల్ సప్లయిస్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత కమిటీలో రవాణా శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖ, సివిల్ సప్లయిస్ శాఖ, కమర్షియల్ టాక్స్ శాఖలు నాలుగు విభాగాలుగా కలసి పనిచేస్తాయన్నారు. సమావేశంలో డీటీసీ శాంతకుమారి, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆయిల్ కంపెనీ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా మద్దమాంబ దేవర
మద్దికెర: మండల కేంద్రమైన మద్దికెరలో ప్రసిద్ధి చెందిన శ్రీ మద్దమాంబ అమ్మవారి దేవర మహోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. కవిరెడ్డి వీధి ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంభాలతో గ్రామ పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి భక్తులు చలువ కుండలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజలకు విచ్చేసిన ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. కుంభాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు -
పత్తి కొనుగోళ్లలో టీడీపీ నేతల పెత్తనం
కర్నూలు(అగ్రికల్చర్): ఎంతో కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకుందామనుకున్నా అధికార పార్టీ నేతలు అడ్డొస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద టీడీపీ నేతల హవా నడుస్తోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదోనిలో 10, ఎమ్మిగనూరులో 4, గూడూరు మండలం పెంచికలపాడులో ఒకటి, మంత్రాలయం మండలంలో ఒకటి ప్రకారం 16 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. ఆ కేంద్రాలపై టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తుండటం గమనార్హం. తమ వాళ్లు తెచ్చిన పత్తిని నాణ్యత ప్రమాణాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాల్సిందేనని, ఇతరులు తెచ్చిన పత్తి ఎంత నాణ్యతతో ఉన్నప్పటికీ తిరస్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. అధికార పార్టీ నేతలు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర తమ ప్రతినిధులను పెట్టి వారు సూచించిన పత్తినే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసుకున్నా రు. ప్రధానంగా గూడూరు మండలం పెంచికలపాడు దగ్గర ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో ప్రతి నిత్యం టీడీపీ నేతల తరుఫున ఒక వ్యక్తి తిష్ట వేసి ఆయన చెప్పిన వాహనాలను లోపలికి పంపుతూ మిగిలిన వాటిలో నాణ్యత లేదనే కారణంతో వెనక్కి పంపుతుండటం గమనార్హం. నాణ్యత బాగున్నా.. వెనక్కే... తేమ శాతం 10 శాతం వరకే ఉన్నా.. నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రతి రోజు 6 నుంచి 10 వాహనాలను వెనక్కి పంపుతున్నారంటే ఈ ప్రభావం టీడీపీ నేతలదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తమ పెద్దసార్ తనను ఇక్కడే ఉండమన్నారని, వారి చెప్పిన వాహనాల్లోని పత్తిని మాత్రమే కొనాలని, మిగిలినవి తిరస్కరించాల్సిందేనని సీసీఐ అధికారులకు తేల్చి చెబుతుండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పత్తికొనుగోలు కేంద్రాల దగ్గర టీడీపీ నేతలు ఏ స్థాయిలో హల్చల్ చేస్తున్నారో తెలుస్తోంది. నాణ్యత బాగున్నా.. తేమ శాతం 8–10 వరకే ఉన్నా.. తిరస్కరిస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రానికి సమీపంలోనే ఉంటున్న దళారీలకు రూ.6,000 – 6,800 లోపే అమ్ముకుంటున్నారు. అదే పత్తిని దళారీలు క్వింటాకు రూ.8 వేల ధరతో అదే రైతుల పేర్లతో అమ్ముకుంటున్నారంటే దళారీలకు, సీసీఐ అధికారుల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయే తెలుస్తోంది. దళారీలు దాదాపు 50 వేల క్వింటాళ్ల పత్తిని తక్కువ ధరకు కొని మద్దతు ధరతో అమ్ముకుంటున్నారు. రైతుల నోళ్లలో మట్టి ఎంతలా అక్రమార్జన సాగిస్తున్నారో స్పష్టమవుతోంది. కొనుగోలు కేంద్రాల దగ్గర టీడీపీ నేతల హవా, దళారీల ప్రభావం లేకుండా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీఐ అధికారులతో దళారుల కుమ్మక్కు అండగా నిలిచిన అధికార పార్టీ నాయకులు సిఫారసులో ఉంటే వాహనం లోపలికి లేకపోతే నాణ్యత బాగున్నా వెనక్కే -
ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): టీజీవీ గ్రూప్‌నకు చెందిన శ్రీ రాయలసీమ అల్యూమినియం అండ్ అలయన్స్ కెమికల్స్ పరిశ్రమలో గ్యాస్ లీకు ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పీఎస్ రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు వై.నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం కార్మికులు పనిచేస్తున్న సమయంలో పైప్ లీకై క్లోరిన్ విడుదల కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారి వివరాలను యాజమాన్యం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కార్మిక, కర్షక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ విస్తరణ పనులు జరుగుతుండగా గ్యాస్ లీకై ందని, ఆ వాసనను పీల్చడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారికి ఎక్కడ చికిత్స చేయిస్తున్నారో యాజమాన్యం చెప్పడం లేదన్నారు. మరోవైపు గొందిపర్ల వాసులు కూడా క్లోరిన్ వాయువు వాసన పీల్చడంతో కళ్లలో మంటలు, శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడ్డారని, వారిని ఫ్యాక్టరీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని గౌరీగోపాల్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు రహస్యంగా తరలించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి అంబులెన్స్‌లో రోగులను తీసుకెళ్తున్న ఫొటోలను విడుదల చేశారు. ఈ ప్రమాద సంఘటనపై కలెక్టర్, ఇత ర అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. -
మంచు మాటున కాటేసిన మృత్యువు
● పొగ మంచు కారణంగా రహదారిపై కనిపించని వాహనాలు ● ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆటో ● ఇద్దరు దుర్మరణంప్యాపిలి: పొగ మంచు మాటున దాగిన మృత్యువు ఇద్దరిని మింగేసింది. ఎన్. రంగాపురం సమీపంలో మంగళవారం ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎన్ రంగాపురం గ్రామానికి చెందిన ఎలుకపెంట్ల రాజశేఖర్ (24), కొప్పుల సురేంద్ర (26) డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. విధినిర్వహణకు వారు ప్రతి రోజూ బైక్‌పై ఫ్యాక్టరీకి వెళ్లివచ్చేవారు. రోజు లాగే మంగళవారం వేకువజామునే దిచక్రవాహనంపై ఉడుములపాడుకు బయలుదేరారు. అయితే కొద్ది దూరం ప్రయాణించగానే ఎదురుగా ప్యాపిలి వైపు వస్తున్న ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దట్టంగా కమ్ము కున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న బైక్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సురేంద్రకు భార్య కల్యాణి, ఏడాది వయస్సుగల కుమారుడు ఉండగా ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. మృతుడు రాజశేఖర్ తండ్రి రాముడు కొద్ది సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతి చెందగా.. కెమికల్ ఫ్యాక్టరీలో పని చేస్తూ తల్లి మాధవిని పోషించుకుంటున్నాడు. ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కాగా ఇదే ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో యువకుడు తలారి సురేంద్రకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డిపార్టుమెంటల్ పరీక్ష కేంద్రం తనిఖీ
కర్నూలు(సెంట్రల్): దూపాడులోని అయాన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డిపార్టుమెంటల్ పరీక్ష కేంద్రాన్ని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులకు సంబంధించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాన్ని సందర్శించిన ఆమె అభ్యర్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలకు సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్పీఎస్ఐల పదోన్నతికి ప్రతిపాదనలు కర్నూలు: పోలీసు శాఖ నాలుగో జోన్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న 15 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ర్యాంక్ ప్రమోటీ ఎస్ఐలుగా (ఆర్పీఎస్ఐ) పదోన్నతి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఒకరికి, నంద్యాల జిల్లాలో ఒకరికి, అనంతపురం జిల్లాలో ముగ్గురికి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో ఒక్కొక్కరికి, వైఎస్సార్ కడప జిల్లాలో 8 మందికి ర్యాంక్ ప్రమోటీ ఎస్ఐలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వారిపై ఉన్న ఫిర్యా దులు, ఇతరత్రా విషయాలపై నివేదికలు పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జంట హత్యల కేసులో 20 మందిపై కేసు ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని కందనాతి గ్రామంలో సోమవారం జరిగిన జంట హత్యల కేసులో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన బోయ వెంకటేష్, బోయ పరమేష్‌లను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందేనన్నారు. పరమేష్ భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు సీతారాముడు, శంకర్, రాముడు, వెంకీ, ధర్మా, సుమ, కేశవ, బిక్కిదుబ్బ నరసింహుడు, బిక్కి శంకర్, అద్దాల హరీష్, విష్ణు, వెంకటేష్, కొండయ్య కుమారుడు కేశవ్, మహేంద్ర, హరిబాబు, అశోక్, నరసింహుడు, మల్లేష్, అంజినప్ప, మారెన్నలపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలాఉంటే పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో పరిస్థితిని డీఎస్పీ ఎంఎన్. భార్గవి, రూరల్ సీఐ చిరంజీవి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్ కర్నూలు: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ముందస్తు తనిఖీలతో పాటు రహదారి భద్రతపై కూడా వాహనదారులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిషేధిత వస్తువులు, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని వాహనదారులకు సూచించా రు. ముఖ్యంగా సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిని తీవ్రంగా మందలించి కేసులు నమోదు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటోలను ఆపి కేసులను నమోదు చేశారు. ప్రజల భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే స్థానిక పోలీసులు, డయల్ 112, 100కు సమాచారమివ్వాలని తనిఖీల సందర్భంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. -
పేకాట రాయుళ్లపై కేసు నమోదు
కౌతాళం: మండల కేంద్రం కౌతాళంలో నలుగురు పేకటరాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. స్థానిక బీరప్ప దేవాలయం పక్కన పబ్లిక్ స్థలంలో ఉసేన్‌సాబ్, దస్తగిరి, వెంకటేష్, అశోక్ పేకాట ఆడుతుండగా అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ.5725 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడినా, అక్రమంగా సారా వ్యాపారం చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు. బాలిక అదృశ్యం మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని చెట్నెహళ్లి గ్రామానికి చెందిన నాగవేణి(17) అనే బాలిక అదృశ్యమైనట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. గ్రామానికి చెందిన బి.శారదమ్మ, రామాంజినేయులు కుమార్తె బి.నాగవేణి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంట్లో కనపడలేదు. కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికినా, బందువులను ఆరా తీసినా జాడ తెలియక పోవడంతో తల్లి శారదమ్మ మంగళవారం మంత్రాలయం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నాగవేణి ఇంటి దగ్గరే టైలరింగ్ నేర్చుకునేది. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. యువకులకు గాయాలు పాములపాడు: మండలకేంద్రం పాములపాడులోని పాలడెయిరీ వద్ద కారు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరు చెందిన మురహరి వినోద్‌కుమార్, కిరణ్‌లు ఆత్మకూరుకు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో పాల డెయిరీ వద్ద యూ టర్న్‌లో బైక్ తిప్పుకుంటుండగా వేగంగా ఆత్మకూరు వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కర్ణాటకకు చెందిన కారు ఢీ కొట్టి వెళ్లి పోయింది. గాయపడిన ఇద్దరిని స్థాణికులు 108 వాహనంలో ఆత్మకూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనూమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామ సమీపంలో వడ్దె బెల్లం వెంకట్రాముడు(55) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.బోడబండకు చెందిన వెంకట్రాముడు నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు తిరిగి అతడే వస్తాడులే అనుకుని ఉన్నారు. అయితే, గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన పొలంలో నుంచి దుర్వాసన వస్తుండగా మంగళవారం అటుగా వెళ్తున్న వారు దగ్గరకు వెళ్లి చూడగా మృతదేహాం కనిపించింది. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పరిశీలించి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయింటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ మోటర్ కేబుల్ వైర్లు చోరీ హొళగుంద: మండల పరిధిలోని హొన్నూరు క్యాంపునకు వెళ్లే దారిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విలువైన విద్యుత్ మోటర్ కేబుల్ వైర్లు చోరీకి పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో ఎల్లెల్సీ కింద ఎక్కువగా వరిసాగు చేస్తారు. కాలువకు నీటి విడుదల లేకపోవడంతో రబీ సాగు లేక రైతులు పొలాల వైపు వెళ్లడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న దుండగులు పొలాల్లోని మోటర్ నుంచి స్టార్టర్ బాక్స్‌ల వరకు వెళ్లిన విలువైన కేబుల్ వైర్లను కత్తిరించుకుని వెళ్లారు. ఇలా రమేష్, సత్యప్ప, చిన్న మల్లేశ్, అడ్లిగి బసవరాజు, మల్లయ్య, గౌరవప్ప తదితర 20 మంది రైతులకు చెందిన మోటర్ల వైర్లను ఎత్తుకెళ్లారు. ఈ కేబుల్ వైర్ మీటర్ రూ.వందకు పైగ ధర ఉంటుందని ఒక్కో బోరు వద్ద 20 మీటర్లకు పైగ వైర్లను కత్తిరించారని రైతులు తెలిపారు. ఈ దొంగతనాలను అరికట్టాలని తుంగభద్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కృషయ్య కోరారు. చోరీ విషయాన్ని హొళగుంద పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు విలేకరులకు తెలిపారు. -
కూటమి సర్కారుపై ప్రజా వ్యతిరేకత
కర్నూలు (టౌన్): చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయ కర్త, మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుకా అన్నారు. మంగళవారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని ఏపీఎస్పీ క్యాంపు వద్ద ఉన్న కార్యాలయంలో గంజిహాల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికి బుట్టా రేణుకా తో పాటు జిల్లా యాక్టివిటీ కార్యదర్శి నాగేష్ నాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డి. నజీర్ అహమ్మద్ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కారని విమర్శించారు. రెండేళ్లు అవుతున్న ఇంకెప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తారని ప్రశ్నించారు. గోనెగండ్ల మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గంజిహాల్లి ముల్ల రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి స్వామిదాసు, ఏసన్న మత్తయ్య, యాకోబ్, సల్మాన్ రాజ్, ఆనంద్, రాజు, విజయ్, డేవిడ్, సుధాకర్, కిషోర్, మల్లిఖార్జున, చిన్న మునిస్వామి, రమేష్, బాస్కర్లతో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాద్, ఎమ్మిగనూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు బనవాసి బసిరెడ్డి, ఎమ్మిగనూరు పట్టణ 15 వ వార్డు ఇన్చార్జీ సయ్యద్ ఫయాజ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు షరీఫ్, పూర్ణ నాయుడు, నరసింహ ఆచారి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకా గంజిహాల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక -
కారులో రూ.5 లక్షలు చోరీ
ఆదోని అర్బన్: కారు అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో ఉన్న రూ.5 లక్షలు నగదును దొంగలించి పరారైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకులో తీసుకున్న రుణాన్ని కట్టేందుకు బసాపురం గ్రామానికి చెందిన రైతు రమేష్, ఆయన కుమారుడు రఘు ఆదోని పట్టణానికి వచ్చారు. రుణాన్ని కట్టేందుకు వారి బంధువు అయిన చంద్రప్ప వద్ద రూ.5 లక్షలు అడిగారు. చంద్రప్ప స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో డ్రా చేసి కారులో కూర్చొని వారికి రూ.5 లక్షలు అందజేశారు. డబ్బును ముందు సీటులో ఉన్న క్యాష్ బోర్డులో పెట్టారు. లోన్ కట్టేందుకు మరో రూ.50 వేలు తక్కువగా ఉండడంతో వెంటనే శేఖర్ అనే వ్యక్తిని అడిగారు. శేఖర్ ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న మారుతి వైన్స్ దగ్గర వస్తే ఇస్తానని చెప్పడంతో వెంటనే తండ్రి, కుమారుడు కారులో అక్కడికి చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్‌లో కారును ఉంచి శేఖర్ దగ్గరకు వెళ్లి రూ.50 వేలు డబ్బు ఇప్పించుకుని తిరిగి వచ్చారు. కారుకు ముందు ఎడమ డోర్ అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో పెట్టిన రూ.5 లక్షలు నగదు అపహరణ కావడంతో తండ్రి, కుమారుడు అవాక్కయ్యారు. దీంతో వెంటనే త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తండ్రి, కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎవరైనా వెంబడించారా అనే కోణంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తామని సీఐ తెలిపారు. -
కేసీ కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం
కర్నూలు: కర్నూ లు మండలం పడిదెంపాడు గ్రామ పొలిమేరలో కేసీ కెనాల్లో నీటిలో కొట్టుకుపోతున్న గుర్తు తెలియని పురుష మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. కర్నూలు గడ్డా వీధికి చెందిన షేక్ ఉమర్ ఫరూక్ వ్యక్తిగత పనిమీద పడిదెంపాడు వైపు కేసీ కెనాల్‌పై వెళ్తుండగా నీటిపై మృతదేహం తేలినట్లు కనిపించింది. దీంతో షేక్ ఉమర్ ఫరూక్ స్పందించి మృతదేహాన్ని పక్కకు లాగి అక్కడే ఉన్న దుప్పటి సహాయంతో పక్కనున్న రాయికి కట్టి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాలూకా పీఎస్ ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీయించారు. మృతదేహం కుడిచేతిపై షేకున్ అని ఇంగ్లిషులో పచ్చబొట్టు, ఎడమ మెడ వద్ద గుండ్రని పచ్చబొట్టు ఉంది. నల్లని టీషర్టు ధరించాడు. సుమారు 28 సంవత్సరాలు వయస్సు ఉంటుంది. ఆచూకీ తెలిసినవారు తాలూకా పోలీసులను సంప్రదించి సమాచారమివ్వాలని ఎస్ఐ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు. వివాహిత ఆత్మహత్య బేతంచెర్ల: గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామా నికి చెందిన దూదేకుల ఇమాం సాహెబ్ కూతురు ఆశాబీ (27)కి కొన్నేళ్ల క్రితం మద్దూరుకు చెందిన కమాల్‌తో వివాహమైంది. కమాల్ ఇల్లరికం అల్లుడిగా వచ్చి గోర్లగుట్టలోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు కాగా రెండవ కుమారుడు ఉస్సేన్వలి నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆశాబీ తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంది. మరో కుమారుడు ఉసేన్ బాషా బేతంచెర్ల పట్టణంలో డ్యాన్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. దీంతో ప్రతి రోజు కుమారుడిని వెంట తీసుకోని పట్టణానికి వచ్చేది. ఈ క్రమంలో సోమవారం కుమారునితో డ్యాన్స్ కోచింగ్ సెంటర్ వచ్చిన ఆమె బాత్ రూంలోకి వెళ్లి రసాయన పౌడర్ నీటిలో కలుపుకుని తాగి ఆపస్మారక స్థితిలో పడి పోయింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ నబీ సంఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇమాంసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కోడుమూరు రూరల్: కోడుమూరులోని షణ్ముఖరెడ్డి నగర్‌కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లలోపు వయస్సు ఉన్న తన ఇద్దరు కుమారులతో పాటు కన్పించడం లేదు. పోలీసులు తెలిపిన మే రకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మార్కె ట్లో గుమస్తాగా పనిచేసే సుధాకర్ ఆదివారం తన కుమారులు భరత్‌కుమార్, మాన్విత్ కుమార్ ను పిలుచుకుని భార్య పుట్టినిల్లు అయిన దేవనకొండకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే సుధాకర్ దేవనకొండకు వెళ్లకపోవడంతో పాటు, కోడుమూరుకు తిరిగి రాకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో ఆందోళన చెందిన భార్య అనురాధ సోమవారం సాయంత్రం కోడుమూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేర కు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం పగిడ్యాల: పడమర ప్రాతకోట ఎస్సీ కాలనీలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పక్కా ఇల్లు దగ్ధమైంది. కాలనీకి చెందిన ఇస్కాల జేమ్స్ అలియాస్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా రోళ్లపాడు గ్రామంలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఇంట్లో నుంచి పొగలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరాను బంద్ చేయించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు అదుపు కాకపోవడంతో కర్నూలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారంతో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్, రెండు బీరువాలు, టీవీ, బియ్యం, బట్టలు, ఫర్నిచర్ కాలిపోయాయి. ఆస్తి నష్టంపై తహసీల్దార్‌కు నివేదిక పంపుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
శ్రీ మఠం పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: శ్రీ మఠం పీఠాధపతి సుబుధేంద్ర తీర్థులుకు వివిధ రకాల డ్రైఫ్రూట్స్‌తో సోమవారం తులాభారం చేసి జ్ఞాపికను అందజేశారు. తమ పాదయాత్ర 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భగా సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం వారు శ్రీ మఠం పీఠాధిపతిని సన్మానించారు. శ్రీ రాఘవేంద్ర సర్కిల్ నుంచి ప్రత్యేక ఆలంకరించిన వాహనంలో వాయిద్యాల నడుమ ఊరేగించారు. శ్రీ మఠంలోని యోగీంద్ర కళామండంపంలో ముత్యాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మట్లాడుతూ..సిరుగప్ప ఆర్యవైశ్య సంఘం 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనీయమన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వాముల ఆశీర్వాదం భక్తులకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు హెచ్.జి హనుమంతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 900 మంది పాల్గొన్నారు.


