రాకపోక.. నరకయాతన
● చంద్రబాబు ప్రభుత్వంలో
బాగుపడని రోడ్లు
● అడుగడుగునా గుంతలు.. తేలిన రాళ్లు
● ప్రయాణమంటే భయపడుతున్న ప్రజలు
గూడూరు–కర్నూలు రహదారి దుస్థితి
వాహనదారుల అగచాట్లు
ఎమ్మిగనూరురూరల్: ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వ కారణం..అంతా గతుకుల మయం.. రాళ్లు రప్పలు, దుమ్ముధూళి.. రోడ్డుపైకి రావాలంటనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోడ్లపై గుంతలన్నీ పూడ్చేశామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసినా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఊరూరా ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని దుస్థితిలో రోడ్లు కనిపిస్తున్నాయి.
అధ్వానంగా..
నిత్యం రద్దీగా వాహనాలు తిరిగే గూడూరు–కర్నూలు రోడ్డు అధ్వానంగా మారింది. మొత్తం 12 కిలో మీటర్ల మేర ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని ప్రజలు సి.బెళగల్, గూడూరుకు ఈ రోడ్డు నుంచే వెళ్లాలి. జిల్లా కేంద్రమైన కర్నూలుకు వెళ్లేందుకు ఇది ప్రత్యామ్నాయ రహదారి. తెలంగాణ రాష్ట్రంలోని ఐజ, సుంకేశ్వరి ప్రాజెక్ట్ సందర్శకులు ఈ రోడ్డుమీదనే వెళ్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపే దారి మధ్యలోనే గర్భిణులు ప్రసవం అయిన సందర్భాలున్నాయి. భారీ వర్షం కురిస్తే ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు ముందుకు కూడా కదల్లేవు.
రాళ్లు తేలి..
రాళ్లు తేలిన గూడూరు–కర్నూలు రోడ్డు చూసిన ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీ నేతలు గ్రామాలకు ప్రచారాలకు వెళ్లే సమయంలో ఈ రహదారి దుస్థితి కనిపించటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా బెండకాయ పొలానికి దుమ్ము పడకూడదని కలుగొట్ల గ్రామానికి చెందిన కౌలు రైతు నీరుగంటి రాముడు రోడ్డు పొడవునా చీరలు కట్టాడు. అయినా ప్రయోజం లేకుండా పోయింది. రోడ్డు పక్కన ఉన్న పత్తి, జొన్న పొలాలకు కూడా దుమ్ము బెడద తప్పటం లేదు. దుమ్ము పంటపై ఉండటంతో పిచికారీ చేసిన రసాయన మందులు పనిచేయటం లేదని రైతులు వాపోతున్నారు.
రాకపోక.. నరకయాతన
రాకపోక.. నరకయాతన


