దేవుడ్ని మొక్కేటోళ్లు రోజూ చెప్పుకునే మంత్రాలు కొన్నుంటాయి. వోటిని నిత్యపారాయణం అంటారు. ఆ పెకారం జూసినప్పుడు.. ఏడాదికి రెండుమార్లు చెప్పుకునే మంత్రాలను ఏటనుకోవాల? అట్టాంటివి మామూలు పెజానీకానికి అలవాటు లేదు గాబట్టి.. ఆ పనిజేసే చంద్రబాబుగోరే ఆటికి పేరు గూడా పెట్టాల! ఎందుకంటే ఆయన తనకి పిల్లనిచ్చి పెళ్లిజేసిన మావగార్ని తలుసుకుంటా.. ఒకే మంత్రాన్ని ఏడాదికి రెండుసార్లు జపిస్తావుంటాడు గాబట్టి. అదేనండీ.. పాపం అల్లుడే తనకు గొయ్యి తవ్వగలడనే మర్మం తెలీకుండా చేరదీసిన పెద్దాయన ఎన్టీవోడి పుట్టిన్రోజు, కండ్లుమూసిన్రోజూ వచ్చినప్పుడెల్లా బాబుగారు పాట పాడతావుంటారు.
అబ్బెబ్బే.. బాబు గారు పాట పాడతారనగానే.. చీటీపాటో.. టెండరు పాటో.. పీపీపీ పాటో.. అమరావతి పాటో అనుకోబాకండి సార్లూ. యిది యింకో పాటూ. ఎన్టీవోడికి బారతరత్న యిప్పించేస్తా అని కల్లమాటలు అల్లిన పాట!. బాబుగారంతటి పెద్దాయన, భీష్ముడి మాదిర్తో అంతలావు పెతిగ్న జేసింతర్వాత.. వోటిని కల్లమాటలంటావా? అని కోపగించుకోకండి సార్లూ. శానా మంది సెవులు గొరుక్కుంటా వుండే మాటలు యిన్నాక అట్టా అనిపించింది. సెప్పినానంతే. యింతకీ సెవులు గొరుక్కునే మాటేటంటారా? సెంద్రబాబు గోరి అత్తమ్మ.. అదేనండీ.. పిల్లనిచ్చిన మాంగోరు తాళిగట్టిన యిల్లాలు.. జీవించి ఉండగా, భారతరత్నాన్ని సెంట్రల్ గవుర్మెంటోళ్లు, ఎన్టీవోడి మీద పేమతో బతిమాలి యిచ్చినా గూడా.. సెంద్రబోబుగారు ‘ఠాట్’ అని అడ్డం పడతారేమో అనేది గుసగుసగా యినిపిస్తాందాండీ.
సెంద్రబోబు గారు.. యెప్పుడు జూసినా నేను ఢిల్లీలో సెక్రం తిప్పినా, సెక్రం తిప్పతా.. అని సెప్తా వుంటారు గదండీ. సెక్రం గుర్తుండే పార్టీలోళ్లు గూడా అన్ని సార్లు సెక్రం తిప్పడం గురించి మాటాడరండీ బాబో! మరట్టాంటి సెక్రధారి సెంద్రబాబు గోరు.. సిటికేస్తే సాలు.. భారతరత్న ఏంది.. యింకేదైనా రత్నముండినా గూడా సటుక్కున వొచ్చేయాలి గదా!. మరి ఆపాటి పరపతి ఆయనకు వుండాలి గదా అనేది వొక డవుటు. అయినా, వొక్క సెంద్రబాబు గారిదేవుండాది లెండి. ఎన్టీవోడు కన్న పిలకాయిలేవైనా తక్కవోల్లా. ఎవురికి వారు రాజకీయాల్లో కొమ్ములు వంకర్లు దిరిగినోళ్లే గదా. సిన్నమ్మ అని అందురూ పిలుసుకుని ఆయన కూతురు పురందరేశ్వరమ్మ ఏవైనా తక్కవా? సెంటర్లో రాజ్యంజేసే పార్టీలో ఆమె శానాశానా పెద్ద పోస్టుల్లో వుండాది గదా? ఆమె గట్టిగా అడిగుంటే యీపాటికి యెప్పుడో యిచ్చేసేటోళ్లుగదా..!
అయినా సార్లూ.. నాకో సంగతి తెలవక అడగతా. ఎన్టీవోడికి భారతరత్న అనిపించుకునే లెవిలు వుండాదో లేదో సెంటర్లో రాజ్జెంజేసేటోల్లకి తెలవదా అంట! ఆయనకి ఆ అవార్డు యిస్తే తమ పరపతే పెరిగిపోతాదని వోల్లకి తెలవదా అంట? యీనోటా ఆనోటా యినబడతా వుండేదేంటంటే.. గవుర్మెంటోల్లు యియ్యాలనుకున్నా గూడా.. బాబుగోరు అండ్ కో, అనగా ఎన్టీవోడి కన్నపిల్లలూ సైందవుల మాదిర్తో అడ్డం పడతా వుండారని గదా!. యీ యవ్వారం యెనకాల వుండేదేనండీ అసలు మతలబు! అవార్డే గనక వొస్తే.. ఢిల్లీకి బొయ్యి రాష్ట్రపతి చేతుల్లోంచి తీస్కోవాల్సింది యెవురు? కట్టుకున్న భార్య వుండగా.. ఎవురైనా సరే.. ఆమెనే గదా తొలీత పిలిసేది. ఆమెకే గదా ఆ మరేద దక్కేది. కడుపున బుట్టినోళ్లెవ్వరూ ఎన్టీవోడిని గెమనించుకోకుండా వొదిలేసినప్పుడు.. విలవిల్లాడిపోయిన పెద్దాయన యిష్టపడి కట్టుకున్నాడు గదబ్బా.. లక్ష్మిం పార్వతిని! సెంద్రబాబుకి ఆమె వరసకి అత్తమ్మే గదా కాబోతాది!!
అక్కడే వుండాది అసలు పితలాటకం. సెంద్రబాబు సహా.. ఎన్టీవోడి పిలకాయిలంతా ఆమె మాటొస్తే సాలు అగ్గి మీద గుగ్గిలాల్లాగా ఎగిరెగిరి పడతా వుంటారు గదా. మరట్టంటాటిది.. ఆమె ఢిల్లీకి బొయ్యి భారతరత్న ఆమె చేతుల్తో అందుకుంటే యీల్లు తట్టుకుంటారా? అనేదే అసలు పెశ్న. అయినా సెక్రం దిప్పి.. ఎన్టీవోడికి భారతరత్న వొచ్చేలా చెయ్యడానికి సెంద్రబాబు పరపతి ఉపయోపడతాదో లేదో గానీ.. సెంట్రలు గవుర్మెంటోళ్లు పెద్దాయన మీద భక్తితో, ప్రేమతో యియ్యాలనుకున్నా గూడా.. సెంద్రబాబు సెక్రం అడ్డమేసి ఆపేయడం మాత్రం గ్యారంటీ అని అంతా అంటాండారు. కాబట్టి పైనలుగా అందరిలోనూ కొడతావుండే డౌటేందంటే.. అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?
-రాజేశ్వరి.


