ప్రజాస్వామ్యానికి పౌరులే కీలకం
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(సెంట్రల్): ప్రజాస్వామ్యంలో పౌరులే కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాలను విద్యార్థినులు ఆలపించారు. వేడుకలకు హాజరైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్‌కుమార్ వీడియో సందేశాన్ని వినిపించారు. ‘నా భారతదేశం – నా ఓటు’ అన్న సందేశంతో అధికారులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు ప్రతిజ్ఞ చేశారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. సీనియర్, జూనియర్ ఓటర్లకు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, ఏఓ శివరాముడు,ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.


