‘సినీ ప్రేక్షకులు మారిపోయారు. కేజీయఫ్, బాహుబలి, పుష్ప లాంటి భారీ యాక్షన్, ఎలివేషన్ ఉన్న సినిమాలకు తప్ప.. మిగతావాటిని చూసేందుకు థియేటర్స్‌కు రావడం లేదు’ అని మొన్నటిదాకా మన దర్శకనిర్మాతలు చెప్పిన మాటలివి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఈ సంకాంత్రికి తెలుగు ఆడియన్స్ తేల్చేశారు.
కొట్టడాలు.. నరకడాలు లేకున్నా.. స్వచ్ఛమైన వినోదాన్ని అందించేలా సినిమా తీస్తే.. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వస్తామని మరోసారి నిరూపించారు. ఈ సంక్రాంతికి తెలుగులో వరుసగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మూడు సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. మిగతా రెండు సినిమాలకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా .. మంచి వసూళ్లను రాబడుతున్నాయి.
ముందుగా హిట్ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ప్రీమియర్ షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న చిత్రం ‘మనశంకర వరప్రసాద్’. ఈ నెల 12న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన అనగనగ ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా విజయాల బాట పడ్డాయి.
ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే..ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పుకోవడానికి ఈ మూడింట్లోనూ గొప్ప కథేలేం లేవు. నిజం చెప్పాలంటే.. అసలు కథే లేదు. అయినా కూడా ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈ సినిమాల్లో కథ లేకున్నా..రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చునేలా చేసే స్వచ్ఛమైన వినోదం ఉంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి తరలి వెళ్తున్నారు.
చిరంజీవి కాబట్టి మన శంకరవరప్రసాద్ హిట్ అయిందని అనుకుంటే.. మిగతా రెండు సినిమాల్లోని హీరోలకు అంతపెద్ద ఫ్యాన్ ఫాలోయింగే లేదు. సినిమాలోని వినోదమే వారిని కాపాడింది. ఇక స్టార్ హీరో ఉంటేనే థియేటర్స్‌కి జనాలు వస్తారు అనుకుంటే ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ అతిపెద్ద విజయం సాధించాలి. కానీ అది జరగలేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో వినోదం ఉన్నా..ప్రేక్షకులను ఆ డోస్ సరిపోలేదు. అందుకే బాక్సాఫీస్ రేసులో కాస్త వెనకబడింది. సంక్రాంతి కాబట్టే ఈ సినిమాలు ఆడుతున్నాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కామెడీ చిత్రాలు ఏ సీజన్‌లో వచ్చినా చూస్తారు. పండగక్కి వస్తే.. ఇంకాస్త ఎక్కువ మంది చూస్తారు.
అయితే ప్రతిసారి యాక్షన్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామాలు కూడా వస్తే.. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సంక్రాంతి సినిమాలతో అర్థమైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించే దమ్ము ఫ్యామిలీ డ్రామాల్లోనే ఉంది. అందుకే ఇక నుంచి మనవాళ్లు యాక్షన్‌తో పాటు వినోదాత్మక కథలపై కూడా దృష్టిపెడితే మంచిది.


