‘అన్నయ్య’ రెండు..‘అబ్బాయ్’ ఒకటి.. మెగా ఫ్యాన్స్‌కి పండగే
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. చివరిగా వచ్చిన భోళాశంకర్ (2023) కూడా డిజాస్టర్ అయింది. దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాకు లోనయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ‘అన్నయ్య’ నుంచి సినిమా రాకున్నా పర్లేదు..‘అబ్బాయ్’ నుంచి వస్తుంది కదా అనుకొని ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇలా ఈ ఏడాది అటు చిరు..ఇటు చరణ్ తమ అభిమానులను డిసప్పాయింట్ చేశారు. కానీ వచ్చే ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్‌కి పండగ అనే చెప్పాలి. 2026లో చరణ్ ఒక చిత్రంతో పలకరిస్తే.. మెగాస్టార్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పండగకి వచ్చేస్తున్నాడుమెగాస్టార్ చిరంజీవి ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయింది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చిరు స్థాయికి తగ్గ విజయమే లేదు. అందుకే 2026వ సంవత్సరాన్ని పక్కా ప్లాన్‌తో సెట్ చేసుకున్నాడు. సంక్రాంతి నుంచే అభిమానులను అలరించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అదిరిపోయే స్పందన వచ్చింది. చిరంజీవి నుంచి పుల్ ఫన్ మూవీ వచ్చి చాలా కాలమైంది. అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడీ కచ్చితంగా ఉండాల్సింది. ఇందులో కూడా చిరుతో కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. పండగ వేళ వస్తున్న చిత్రం... కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యతను మెగా అభిమానులు తీసుకోవడం గ్యారెంటీ. సమ్మర్ స్పెషల్ఇక ఇదే ఏడాది చిరంజీవి నుంచి మరో సినిమా రాబోతుంది. అదే విశ్వంభర. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రమిది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. అయితే గతంలో విడుదైన టీజర్‌లోని వీఎఫెక్స్ సీన్లపై విమర్శలు రావడంతో రిలీజ్‌ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తో అబ్బాయ్.. ఇక 2026లో మెగా ఫ్యాన్స్‌కి ‘అబ్బాయ్’(రామ్ చరణ్) కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌తో భారీ అపజయాన్ని అందుకున్న చరణ్.. ‘పెద్ది’తో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇదొక పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇలా వచ్చే ఏడాది చిరంజీవి రెండు, చరణ్ ఒక చిత్రంలో ఫ్యాన్స్‌ని అలరించబోతున్నారు.