ప్రతిసారి సంక్రాంతి బరిలో రెండో మూడో సినిమాలు వస్తుండేవి. ఈసారి మాత్రం డబ్బింగ్‌లతో కలిపి ఏకంగా ఏడు మూవీస్ బరిలో ఉన్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుందోనని హీరోల కంటే అభిమానులకే చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా తగ్గేదే లే అంటున్నారు. వీళ్లే కాదు దాదాపు 12 మంది హీరోయిన్లు కూడా ఈ పండక్కే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. వీళ్లందరికీ హిట్ చాలా కీలకం.
(ఇదీ చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?)
మొదటగా ప్రభాస్ 'రాజాసాబ్'.. ఈ శుక్రవారం(జనవరి 09) థియేటర్లలోకి రానుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. నిధి విషయానికొస్తే తెలుగులో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తోంది గానీ 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే చెప్పుకోదగ్గ హిట్ లేదు. గతేడాది వచ్చిన 'హరిహర వీరమల్లు'పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ అన్నీ అడియాశలయ్యాయి. చేతిలో ఇది తప్పితే మరొక ప్రాజెక్ట్ అయితే లేదు. హిట్ అయితేనే కెరీర్ పరంగా కాస్త ఫుష్ ఉంటుంది లేదంటే కష్టాలు మళ్లీ మొదటికొస్తాయి. మాళవిక విషయానికొస్తే.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇందులో అందచందాలు చూపించేందుకు అస్సలు మొహమాట పడలేదు. ఇది హిట్ అయితే టాలీవుడ్‌లో మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడుతోంది. రిద్ధి కుమార్ విషయానికొస్తే.. గతంలో ప్రభాస్ చేసిన 'రాధేశ్యామ్'లో చిన్న పాత్ర చేసింది. ఇప్పుడు హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకుబోతోంది. తెలుగులో ఈమెకు మరో ఛాన్స్ రావాలంటే ఈ చిత్రం హిట్ అవ్వాల్సిందే.

రాబోయే సోమవారం(జనవరి 12) చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ఈమె అడపాదడపా తెలుగులో మూవీస్ చేస్తోంది. రీసెంట్ టైంలో టాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. బాలకృష్ణ కొత్త మూవీ కోసం ఈమెని తీసుకున్నారని ప్రకటించారు గానీ ఇప్పుడు బడ్జెట్, కథ మార్పు వల్ల బదులుగా మరో హీరోయిన్‌ని పెట్టే ఆలోచనలో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. నయన్ టాలీవుడ్ కెరీర్‌కి ప్లస్ అవ్వాలంటే చిరు మూవీ హిట్ కావాలి.
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)
13వ తేదీన రానున్న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్. ఆషిక విషయానికొస్తే కన్నడ అమ్మాయి. కల్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ఫ్లాప్. కానీ నాగార్జున 'నా సామి రంగ'లో అవకాశమొచ్చింది. హిట్ అందుకుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో ఇప్పుడీ మూవీతో వస్తోంది. ఈమె నటించిన మరో తెలుగు చిత్రం 'విశ్వంభర' కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ రెండు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. డింపుల్ విషయానికొస్తే.. గత ఎనిమిదేళ్లలో తెలుగులో ఆరు మూవీస్ చేసింది. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది హిట్ అయితే మరో ఛాన్స్ వస్తుంది. లేదంటే అంతే సంగతి!

14న రానున్న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి హీరోయిన్. తెలుగులోనే ఈమె హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరింత ప్లస్ అయ్యే అవకాశముంది. ఇదే రోజున శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' కూడా రిలీజ్ కానుంది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. సంయుక్త కూడా తెలుగులో సర్, బింబిసార, విరూపాక్ష చిత్రాలతో హిట్ అందుకుంది. కానీ డెవిల్, అఖండ 2తో ఫెయిల్యూర్స్ చవిచూసింది. ఈ మూవీ హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' చిత్రాలతో ఫ్లాప్స్ అందుకున్న సాక్షి వైద్యకు కూడా ఈ చిత్రం సక్సెస్ కావడం ముఖ్యమే.
డబ్బింగ్ మూవీస్ విషయానికొస్తే.. 9వ తేదీన వచ్చే 'జన నాయకుడు'లో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె తెలుగు తెరకి దూరమై చాలా రోజులైంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో అవకాశాలు రావొచ్చు. అలానే తెలుగు దర్శకుల దృష్టిలోనూ పడొచ్చు. ఇదే మూవీలో మమిత బైజు కీలక పాత్ర చేసింది. ఈ చిత్రంతో హిట్ అందుకుంటే ఈమెకు దక్షిణాదిలో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ. 10వ తేదీన రానున్న 'పరాశక్తి'లో శ్రీలీల హీరోయిన్. ఈమె కూడా తెలుగులో వరస సినిమాలు చేసింది గానీ ఒకటో రెండో మాత్రమే హిట్ అయ్యాయి. ఈ మూవీ హిట్ అయితే కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే కాస్త కష్టమవ్వొచ్చు!
(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్)


