యంగ్ హీరో సుహాస్‌కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టే పడలేదు. వరుస సినిమా చేస్తున్నప్పటికీ..ఏ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని అందించలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘హే బల్‌వంత్’(హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్‌కి జోడీగా నటించిన శివానీ నాగారం.. ఇందులోనూ హీరోయిన్‌గా చేసింది. సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై బన్నీవాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రంతో అయిన సుహాస్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే...
తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్‌వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్‌వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది.
చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్‌వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
పేరుకు ఇది కామెడీ చిత్రం కానీ ఇందులో చాలా సెన్సిబుల్ టాపిక్‌ని చర్చించారు. సమాజం మొత్తం ఛీ కొట్టే ఓ వృత్తిలో మహిళలు ఎదుర్కొనే అవమానాలు, బాధలను చూపిస్తూ.. చట్టవిరుద్ధమైన ఓ వ్యాపారానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పాటు తండ్రి-కొడుకుల అనుబంధాన్ని, చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు. అయితే ఈ విషయాలన్నీ సీరియస్‌గా చెప్పకుండా లైటర్ వేలో కామెడీగా చూపించి..చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు.
వినోదంతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీటవేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌లో చూపించినట్లుగా ఈ సినిమా కథ మొత్తం హీరో తండ్రి చేసే బిజినెస్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఆ వ్యాపారం ఏంటో చూపించారు. అది తెలిశాక హీరో ఎలా రియాక్ట్ అవుతాడా అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇక హీరో ఆ బిజినెస్‌ని తన చేతుల్లోకి తీసుకున్నాక అసలు కథ ప్రారంభం అవుతుంది. ప్రియురాలికి ఆ వ్యాపారం గురించి తెలియకుండా హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి.
ప్రకృతి వైద్యం ఎపిసోడ్‌లో వెన్నెల కిశోర్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం ఓ శవం చుట్టూనే కథనం తిరుగుతుంది. ఆ శవాన్ని తిసుకురావడానికి హీరో గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఒకవైపు.. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వెన్నెల కిశోర్ చేసే హంగామా మరోవైపు.. ఇలా ద్వితియార్థం కొనసాగుతుంది.
ఇక ప్రీక్లైమాక్స్‌లో బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను అనుకరిస్తూ నరేశ్ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం నెమ్మదిగా సాగుతుంది. కాస్త బుర్రపెట్టి చూస్తే..ట్విస్టులతో పాటు తర్వాత ఏం జరుగుతుందనేది కూడా ఊహించొచ్చు. క్లైమాక్స్‌లో నరేశ్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ బావోధ్వేగానికి గురి చేస్తుంది. లాజిక్స్ వెతక్కుండా సినిమా చూస్తే మరి పగలబడి కాకపోయినా.. సరదాగా నవ్వుకోవచ్చు.
ఎవరెలా చేశారంటే..
కృష్ణ పాత్రకు సుహాస్ న్యాయం చేశాడు. ఎప్పటిమాదిరే తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు సుహాస్‌తో పాటు మరో హీరో నరేశ్ అని చెప్పొచ్చు. రావు బల్‌వంత్ పాత్రలో జీవించేశాడు. సినిమా మొత్తం నవ్విస్తూనే చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశాడు. మహేశ్ బాబు ‘పోకిరీ’ సీన్‌తో పాటు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను ఇమిటేట్ చేస్తూ చెప్పే డైలాగుకు పడి పడి నవ్వుతారు. మిత్ర పాత్రకి శివాని న్యాయం చేసింది. హీరో స్నేహితుడిగా సుదర్శన్ వేసే పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. యాంకర్ స్రవంతి పోషించిన చంప పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. అయితే డబ్బింగ్ విషయంలో ఆమె ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అన్నపూర్ణమ్మ, హర్షవర్దన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


