సంక్రాంతి రేసులో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాల సందడి ఉంది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంపుతో పాటు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే ప్రశ్నలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశం గురించి ఆ చిత్ర నిర్మాతలు వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు ఇలా అన్నారు. 'ఈ చిత్ర టికెట్స్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్ షోల గురించి రెండు ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం రాగానే ప్లాన్ చేస్తాం. దాదాపు తెలంగాణలో కూడా ప్రీమియర్స్ ఉంటాయి.' అని పేర్కొన్నారు.


