నువ్వా... నేనా తేల్చేసుకుందాం... ఫైట్ చేసేద్దాం అనే టైపులో విలన్లకు సవాల్ విసిరి, రంగంలోకి దిగాడు శంకరవరప్రసాద్. అందర్నీ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’కి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు.
ఓ కీలక పాత్రలో హీరో వెంకటేశ్, హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, ఫైటర్స్ పాల్గొనగా ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ‘‘ఈ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విజువల్‌గా అద్భుతంగా ఉంటుంది. ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.


