చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ 'మన శంకరవరప్రసాద్‌గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే రాబట్టింది. ఇందులో చిరంజీవి కూతురు నిక్కీ పాత్రలో బాలనటి ఖుషి నటించింది. చిరు కూతురుగా తను చాలా చక్కగా నటించి ప్రశంసలు కూడా అందుకుంటుంది. నయనతార, చిరు వంటి స్టార్స్‌తో ఖుషి కూడా తన స్థాయికి మించి నటించి మెప్పించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకుంది.

చిరంజీవి కూతురుగా నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఖుషి పేర్కొంది. అయితే, తనకు నాన్నలేరని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ, తన తండ్రికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. రాజస్థాన్‌కు చెందిన తమ కుటుంబం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పింది. ఇక్కడే 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపింది. తన మదర్ కూడా అదే స్కూల్‌లో పనిచేస్తున్నారని పేర్కొంది.

తనకొక బ్రదర్ కూడా ఉన్నాడని తమ సంరక్షణ అమ్మ మాత్రమే చూసుకుంటుందని ఖుషి చెప్పుకొచ్చింది. సినిమా సెట్స్‌లో చిరంజీవి గారిని నాన్న అని పిలిచినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యేదానినని ఒక్కోసారి కన్నీళ్లు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. తనకు కూడా అలాంటి నాన్న ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయ పడింది. చిరు సార్‌తో చాలా మెమరీస్ ఉన్నాయని ఖుషి పంచుకుంది. చిరు సార్‌ను కలిసిన ప్రతిసారి కేక్స్, చాక్‌లెట్స్ ఇచ్చేవారని తెలిపింది. మెగాస్టార్‌తో గారితో మరో సినిమా ఛాన్స్ రావాలని ఆశపడుతున్నానని కోరుకుంది. నయనతారతో కూడా మంచి బాండింగ్ ఏర్పడిందని ఖుషి చెప్పింది. అయితే, నయన్‌ను అక్క అని పిలుస్తానని, తను చాలా యంగ్‌గా కనిపిస్తారని తెలిపింది. నయన్ గారు దుస్తులు కొనిచ్చారని చెబుతూ.. 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా తనకు చాలా ఇచ్చిందని ఖుషి పేర్కొంది.


