చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్‌.. ప్రభాస్‌కు నో.. కారణం ఇదేనా? | Why Telangana Govt Ticket Hike For Only Chiranjeevi Movie? | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ కలవలేదని కావాలనే ఇబ్బంది పెట్టారా.?

Jan 10 2026 5:42 PM | Updated on Jan 10 2026 6:11 PM

Why Telangana Govt Ticket Hike For Only Chiranjeevi Movie?

సంక్రాంతి పండగ సందర్భంగా  'మన శంకర వరప్రసాద్‌గారు, ది రాజా సాబ్‌' చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ప్రభాస్‌ రాజాసాబ్ సినిమాకు ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ప్రీమియర్స్ లేకుండానే సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. బయ్యర్లకు చుక్కలు కనిపించాయి. అయితే, కొన్ని గంటల్లోనే చిరంజీవి సినిమాకు ప్రీమియర్స్‌ షోలతో పాటు టికెట్‌ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీఓ విడుదల చేశారు. ఈ అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రభాస్‌ సినిమాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

నాకు సంబంధం లేదు: మంత్రి
తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశానని చెప్పారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకి రాలేదని పేర్కొన్నారు. నాకు తెలియకుండానే  జీవోలు ఇచ్చారని సంచలన కామెంట్‌ చేశారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవసరం లేని నిందలు తనపై వేయకండి అంటూ ఆవేదన చెందారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు 2 రోజుల ముందే తెలంగాణ నుంచి ప్రత్యేక జీవో వచ్చేసింది. 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ వేసుకునేందుకు తెలంగాణ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టికెట్‌ ధర రూ. 600 రూపాయలుగా నిర్ణయించింది. ఆపై నైజాంలో ఎన్ని ప్రీమియర్స్‌ షోలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా సానుకూలంగా అవకాశం కల్పించింది. అయితే,రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్‌కు రాత్రి 10.30 దాటినా ప్రత్యేక జీవో రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు.

ప్రభాస్‌ ఫోన్‌ కాల్‌ చేయకపోవడంతో..
ప్రభాస్‌, చిరంజీవి సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభత్వం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి.

  • టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ GO జారీ వెనుకున్న కీలక అధికారి రాజా సాబ్‌ గురించి కలత చెందాడట. ప్రభాస్ తనను నేరుగా సంప్రదించకపోవడంతో ఆయన బాధపడ్డారని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ మొదటి నుంచి రాజకీయ విషయాలకు దూరంగా ఉంటారని తెలిసిందే.., కానీ ఆ అధికారి అతని నుండి నేరుగా కాల్ వస్తుందని ఆశించారని.. దీని కారణంగానే జీఓ విషయంలో ఆలస్యం అయిందని ఒక వర్గం ప్రచారం చేస్తుంది.

  • రాజా సాబ్‌ నష్టం వెనుక నిర్మాత దిల్ రాజు ఉండవచ్చని కూడా కొందరు పేర్కొంటున్నారు. అతని వ్యాపార ప్రత్యర్థి నైజాం ఏరియాలో రాజా సాబ్‌ సినిమా పంపిణీదారుడిగా ఉన్నారట. అతన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, అతను ప్రభుత్వంలోని తనకు తెలిసిన సన్నిహితులతో గేమ్‌ ప్లాన్‌ చేశారని మరికొందరు ఆరోపించారు.

  • ఈ విషయంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కూడా విమర్శలు ఉన్నాయి. పలు రాజకీయ కారణాలతో జీఓను విడుదలను ఆలస్యం చేస్తూ వచ్చారని, పదేపదే మరో ఐదు నిమిషాలు అంటూ కాలక్షేపం చేశారని అంటున్నారు. అయితే, రాత్రి 10 తర్వాత ప్రభాస్‌ ఫ్యాన్స్‌ థియేటర్స్‌ వద్ద రచ్చ చేయడంతో వారిని కంట్రోల్‌ చేయడంలో పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చివరి నిమిషంలో జీఓ విడుదల చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో, అబద్ధమో తేలాల్సి ఉంది.

చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్‌.. కారణం ఇదేనా..?
టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు విడుదలౌతుందటే.. వారిని వేర్వేరుగా చూడటం ఏంటి అంటూ ఇతర హీరోల అభిమానులు కూడా మండి పడుతున్నారు. అయితే, మన శంకర వర ప్రసాద్‌గారికి బెనిఫిట్స్‌ దొరకడం వెనుక నిర్మాత సాహు గారపాటి పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో​  ఆయనకు స్నేహం ఉందట. చాలా కాలంగా ఇరు కుటుంబాలు స్నేహంగా ఉండటం వల్లనే సకాలంలో జీఓను ఆయన తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు రకాలుగా రాజా సాబ్‌ అంశంలో వైరల్‌ అవుతుంది.

మంత్రికి చెప్పకుండా జీఓ ఎవరిచ్చారు..?
రాజా సాబ్‌, చిరంజీవి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరల పెంపు విషయంలో జీఓ ఎవరిచ్చారో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా  ఆయన ఇవ్వాల్సిన అనుమతులు ఎవరిచ్చారనేది రాజకీయ వర్గల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు. ఆయన సన్నిహితుడు రోహిన్ రెడ్డి  అనఫీషియల్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారంటూ ప్రచారం ఉంది. ఆయన నేతృత్వంలో ఇదంతా జరిగిందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement