హీరోయిన్‌ ఎవరు? | Upcoming Movies Update in Tollywood: female actres lead opposite popular tollywood actres | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ ఎవరు?

Feb 25 2026 1:33 AM | Updated on Feb 25 2026 1:33 AM

Upcoming Movies Update in Tollywood: female actres lead opposite popular tollywood actres

టాలీవుడ్‌లో కొత్త జోడీలు షురూ

టాలీవుడ్‌లో ప్రజెంట్‌ కథనాయికల కోసం సెర్చ్‌ జరుగుతోంది. అనౌన్స్‌ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ కథానాయకుల సరసన నటించే కథానాయికలు ఎవరు? అనే విషయాలపై స్పష్టత రావడం లేదు. కానీ ఫలానా హీరో సినిమాలో ఫలానా హీరోయిన్‌ ‘ఇన్‌’ అయ్యారనే వార్తలు  గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్‌ వేయండి.

తండ్రీ కూతుళ్ల అనుబంధం 
అన్నదమ్ముల అనుబంధం కథాంశంగా చిరంజీవి హీరోగా నటించి, బాబీ దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 2023 సంక్రాంతికి విడుదలై, హిట్‌గా నిలిచింది. మళ్లీ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా రానుంది. కేవీఎన్‌ప్రోడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. మార్చి మొదటి వారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ ఏడాది మేలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయ్యేలా షూట్‌ ప్లాన్‌ చేస్తున్నారట దర్శకుడు బాబీ. 

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అలాగే నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారట బాబీ. ఈ సినిమా కథాంశం ప్రధానంగా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్‌  పాత్రకు ప్రియమణిని ఎంపిక చేశారట మేకర్స్‌. అలాగే చిరంజీవి కుమార్తె  పాత్ర కోసం సారా అర్జున్, కృతీశెట్టి, అనస్వరా రాజన్, ప్రీతీ ముకుందన్‌ వంటి యువ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రీతీ ముకుందన్‌ ముందు వరసలో ఉన్నారట. మరి... ఈ చిత్రంలో చిరంజీవి భార్యామణిగా ప్రియమణి, ఆయన కుమార్తెగా ప్రీతీ ముకుందన్‌ పేర్లు ఖరారు అవుతాయా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

నాలుగోసారి... 
‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేనిల కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. బాలకృష్ణ కెరీర్‌లోని 111వ సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ఓ భారీ హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ కథ అనుకున్నారు. ఇందులో నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ హిస్టారికల్‌ కథను కాస్త పక్కన పెట్టి, ఓ పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమా కథను ఫైనలైజ్‌ చేశారట. 

త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలోని హీరోయిన్‌  పాత్రకు మాత్రం నయనతారనే ఫిక్స్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే  ప్రకటన రానుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా’ వంటి చిత్రాల తర్వాత బాలకృష్ణ–నయనతార జోడీ నాలుగోసారి రిపీట్‌ అవుతుందా? వేచి చూడాలి.

వెంకీ సరసన కీర్తి ?
సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చి, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకుంటున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవితో అనిల్‌ రావిపూడి చేసిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌ జోష్‌లో తన తర్వాతి సినిమా రిలీజ్‌ను సంక్రాంతికే ఫిక్స్‌ చేశారు అనిల్‌ రావిపూడి.

 వరుస హిట్స్‌ సాధిస్తుండటంతో అనిల్‌ రావిపూడి తర్వాతి సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాల తర్వాత వెంకటేశ్‌తో అనిల్‌ రావిపూడి మరో సినిమా చేయనున్నారని, ఈ సినిమాయే 2027 సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘బామ్మర్ది బాల్‌రెడ్డి’ అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటితో  పాటు ఈ చిత్రంలో కీర్తీ సురేష్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించనున్నారనే టాక్‌ వినిపించింది. మరి... వెంకటేశ్‌ సరసన కీర్తీ సురేష్‌ తొలిసారి హీరోయిన్‌గా కనిపిస్తారా? వేచి చూడాలి.  

దీపిక ప్లేస్‌లో సాయి పల్లవి? 
హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూ పోందుతున్న సైంటిఫిక్‌ అండ్‌ మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా వచ్చిన తొలి భాగం ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటించగా, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. 2024 జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్‌ చేసి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ‘కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా ‘కల్కి 2’ (కల్కి 2898 ఏడీ 2) సినిమా రానుంది.

ఈ మూవీ చిత్రీకరణ మొదలైంది. అమితాబ్‌ బచ్చన్‌–కమల్‌ హాసన్‌  పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల ప్రభాస్‌ కూడా ఈ షూట్‌లో  పాల్గొంటారు. అయితే దీపికా పదుకోన్‌ మాత్రం ఇక ఈ ‘కల్కి2898 ఏడీ’ సినిమా ఫ్రాంచైజీలో కనిపించరు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో దీపిక నటించడం లేదని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘కల్కి2898 ఏడీ’ సినిమాలో దీపిక పోషించిన సుమతి  పాత్రను ఎవరు చేస్తారనే చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. దీపిక ప్లేస్‌లో సాయిపల్లవి ఫైనలైజ్‌ అయ్యారని సమాచారం. త్వరలోనే ఈ  విషయంపై అధికారిక ప్రకటన రానుందని టాక్‌.

రామ్‌చరణ్‌కు జోడీగా... 
‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సుకుమార్‌ అండ్‌ టీమ్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమా కథ గురించి హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ మూవీ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించాలని సుకుమార్‌ అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్‌  పాత్రలో నటించనున్నారంటూ సమంత, రష్మికా మందన్నా వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి.

తాజాగా హీరోయిన్‌ కృతీ సనన్‌ పేరు ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్‌ బాబు ‘వన్‌: నేనొక్కడినే’ తో తెలుగుకి పరిచయం అయిన కృతీ సనన్, ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్‌’, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ వంటి సినిమాల్లో నటించారు. మరి... రామ్‌చరణ్‌ సరసన కూడా ఈ బ్యూటీ కనిపిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

రోమియో కోసం యానిమల్‌ బ్యూటీ 
నాని హీరోగా సుజిత్‌ డైరెక్షన్‌లో రానున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘బ్లడీ రోమియో’. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత నానీతో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్‌  పాత్రలో ఇంకా ఎవరూ అఫీషియల్‌గా కన్ఫార్మ్‌ కాలేదు. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్‌ వంటి హీరోయిన్ల పేర్లు ఇటీవల వినిపించాయి. కానీ తాజాగా ‘యానిమల్‌’ మూవీ ఫేమ్‌ త్రిప్తి దిమ్రి పేరు తెరపైకి వచ్చింది. 

‘బ్లడీ రోమియో’ టీమ్‌ త్రిప్తితో సంప్రదింపులు జరుపుతోందని, ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా కన్ఫార్మ్‌ కావొచ్చని తెలిసింది. నాని–త్రిప్తి జోడీగా ఇప్పటివరకు కలిసి నటించలేదనే విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం నాని ‘ది ΄్యారడైజ్‌’ సినిమా చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ఈ సినిమా రూ పోందుతోంది. మోహన్‌బాబు, సంపూర్ణేష్‌బాబు, రాఘవ్‌ జూయల్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్‌  పాత్రలో కయాదు లోహర్‌ నటిస్తున్నారని తెలిసింది. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్‌ కానుంది.

శర్వా సరసన.. 
ఇటీవలే ‘నారీ నారీ నడుమ మురారీ’తో సూపర్‌హిట్‌ అందుకున్నారు శర్వానంద్‌. ప్రస్తుతం ‘భోగి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు శర్వా. అలాగే దర్శకుడు శ్రీను వైట్లతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ చేయనున్నారు శర్వా. ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఈ సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్‌  పాత్రకు ఆషికా రంగనాథ్‌ను ఎంపిక చేశారట మేకర్స్‌. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

గ్రీన్‌ సిగ్నల్‌? 
హీరోగా కార్తీ తెలుగులో ఓ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించనున్నారట. ‘మ్యాడ్, మ్యాడ్‌ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ స్టోరీని రెడీ చేశారట. ఈ కథ కార్తీకి నచ్చిందని, దీంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని టాక్‌. అంతేకాదు... ఈ సినిమాలోని హీరోయిన్‌  పాత్రకు మేకర్స్‌ మీనాక్షీ చౌదరిని సంప్రదించారని భోగట్టా. సితార సంస్థ నుంచి వచ్చిన ‘లక్కీ భాస్కర్, అనగనగ ఒకరాజు’ వంటి హిట్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు మీనాక్షీ చౌదరి. ఇప్పుడు ఈ సంస్థ కార్తీతో నిర్మించాలనుకుంటున్న సినిమాలో మీనాక్షి భాగమవుతారా? వేచి చూడాల్సిందే. ఇలా ఫలానా హీరో సినిమాలో ఫలానా హీరోయిన్‌ నటించనున్నారంటూ వార్తల్లో ఉన్న కాంబినేషన్స్‌ మరికొన్ని ఉన్నాయి.

ఫలనా సినిమాలో ఫలనా హీరోయిన్‌ చేయనున్నారనే వార్తలు కోలీవుడ్‌లోనూ గట్టిగానే వినిపిస్తున్నాయి. రజనీకాంత్‌ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్‌హాసన్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని హీరోయిన్‌  పాత్ర కోసం మేకర్స్‌ పూజా హెగ్డే, ప్రియాంకా అరుల్‌ మోహన్‌ వంటి తారల పేర్లను పరిశీలిస్తున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. 

ఇక ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ అనంతరం హీరో అజిత్‌– దర్శకుడు రవి కె. చంద్రన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. శింబు కొత్త సినిమా ‘అరసన్‌’లో హీరోయిన్‌గా సమంత, కయాదు లోహర్‌ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకా దర్శక–నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు కథనాయికలకు చోటు ఉందట. శ్రీలీల, మీనాక్షీ చౌదరి ఈ సినిమాలో నటించనున్నారనే పుకార్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement