‘‘నటనకు స్కోప్ ఉన్నపాత్రలే చేయాలనుకుంటున్నాను. ‘గం గం గణేశా, ఆయ్, క’ వంటి చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేశాను. నయన్... నటించిందంటే ఆ సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అనుకోవాలన్నదే నా లక్ష్యం. దర్శకుడు రాజమౌళిగారి సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా చేయాలన్నది నా డ్రీమ్’’ అని చెప్పారు హీరోయిన్ నయన్ సారిక. శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యధునాథ్ మారుతీరావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నయన్ సారిక మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం మహారాష్ట్ర. నాకు చిన్నప్పట్నుంచి నటి కావాలని ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత యాక్టర్ అయ్యాను. ఒకవేళ నేను యాక్టర్‌ను కాకపోయి ఉంటే లాయర్‌ని అయ్యేదాన్ని. ఇక ‘విష్ణు విన్యాసం’ సినిమా విషయానికొస్తే... ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న మనీషా క్యారెక్టర్‌లో నటించాను.
ఇద్దరు లెక్చరర్స్ మధ్య జరిగే ప్రేమకథతో ఈ సినిమా మొదలవుతుంది. మనీషా తన జీవితంలో ఎన్నో బాధలు ఎదుర్కొన్న అమ్మాయి.. హాయిగా బతకాలని ఆశపడే అమ్మాయి. మరి... మనీషా సమస్యలు ఏంటి? ఆమె కోరుకున్నది ఆమెకు లభించిందా? లేదా అనేది మాత్రం థియేటర్స్‌లో చూడాల్సిందే. రెయిన్ సీక్వెన్స్‌లో నటించడం సవాలుగా అనిపించింది. ఈ చిత్రదర్శకుడు మంచి క్లారిటీ ఉన్న ఫిల్మ్‌మేకర్. సినిమాకు కావాల్సిన ప్రతిదీ నిర్మాత సమకూర్చారు. నేను నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. కన్నడ యాక్టర్ గణేష్‌తో ఓ సినిమా చేస్తున్నాను’’ అని తెలిపారు.


