టాలీవుడ్‌లో నటి లయపై నిర్మాత వ్యాఖ్యల దుమారం | Producer Vamsi Nandipati Controversial Remarks on Actress Laya | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో నటి లయపై నిర్మాత వ్యాఖ్యల దుమారం

Feb 24 2026 11:59 PM | Updated on Feb 25 2026 10:20 AM

Producer Vamsi Nandipati Controversial Remarks on Actress Laya

లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల నిర్మాత వంశీ నందిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్రయూనిట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో నటి లయ గురించి మాట్లాడుతూ వంశీ నందిపాటి..‘నందులను పందుల్లా పెంచింది’అని  వ్యాఖ్యానించారు.

ఈ మాటలు అక్కడే ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేయగా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి గురించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం నిర్మాతకు తగదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా భావించే నంది అవార్డులను తక్కువ చేసి మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమా ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తాయని, వాటిని అవమానించేలా వ్యాఖ్యానించడం సరైనది కాదని సినీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.

వంశీ నందిపాటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆయనపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. కొందరు ఆయనను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వంశీ ఉద్దేశం అంతకంటే వేరుగా ఉండవచ్చని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement