మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు.
'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.
గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.
సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్ ఛేంజర్ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.


