బాఫ్టా అవార్డ్స్‌-2026.. తొలిసారి భారత్‌ సినిమాకు అవార్డ్‌ | Manipuri Film Boong Wins Best Childrens and Family Film in BAFTA 2026 | Sakshi
Sakshi News home page

బాఫ్టా అవార్డ్స్‌-2026.. తొలిసారి భారత్‌ సినిమాకు అవార్డ్‌

Feb 23 2026 8:43 AM | Updated on Feb 23 2026 9:42 AM

Manipuri Film Boong Wins Best Childrens and Family Film in BAFTA 2026

సినీ ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటిగా భావించే బాఫ్టా (బ్రిటిష్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌)లో భారత్‌ సత్తా చాటింది. లండన్‌లో జరిగిన 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA)లో మణిపురి చిత్రం బూంగ్ (Boong)  ఉత్తమ బాలల, కుటుంబ చిత్రంగా అవార్డును దక్కించుకుంది. దీంతో  భారతదేశం గర్వపడేలా చేసింది. బ్రిటిష్‌ సినిమాలతోపాటు అంతర్జాతీయ చిత్రాలకు ఈ అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే.

లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో జరిగిన బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవంలో భారత్‌ తొలిసారి అవార్డ్‌ అందుకుంది. గతంలో నామినేషన​్‌ వరకు మాత్రమే పరిమితమైన భారత చిత్రాలు ఇప్పుడు తొలిసారి మణిపురి చిత్రం బూంగ్ అవార్డ్‌ దక్కించుకుని రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అర్కో, లిలో అండ్‌ స్టిచ్, జూట్రోపొలిస్‌ 2 వంటి టాప్‌ చిత్రాలను అధిగమించి  బెస్ట్‌ చిల్డ్రన్స్‌ అండ్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌ విభాగంలో అవార్డ్‌ అందుకుంది.

‘బూంగ్‌’ చిత్రాన్ని లక్ష్మీప్రియ దేవి తెరకెక్కించగా.. బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మాతగా ఉన్నారు. టైటిల్‌ పాత్రలో గుగున్‌ కిప్జెన్‌ ప్రేక్షకులను మెప్పించారు. 2025 సెప్టెంబర్‌లో మణిపురిలో విడుదలైన ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డ్స్‌ను అందుకుంది. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌తో పాటు, ఇంటర్నేషనల్‌ సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ వంటి వేదికలపై అనేక విభాగాల్లో అవార్డ్స్‌ దక్కించుకుంది.

 ‘బూంగ్‌’ కథ ఏంటి..?
2024లో మణిపురి భాషలో లక్ష్మీప్రియాదేవి తెరకెక్కించిన చిత్రం ‘బూంగ్‌’. ఇది బూంగ్‌ అనే స్కూల్‌ పిల్లాడి కథ. ఆ పిల్లవాడు తప్పిపోయిన తన తండ్రి జాయ్‌కుమార్‌ని, తన తల్లి మందాకినిని తిరిగి కలపడం కోసం తన స్వస్థలం నుండి మయన్మార్‌ సరిహద్దు సమీపంలోని మోరే వరకు ప్రయాణించడమే ఇందులోని కథ. బూంగ్‌ తండ్రి బతికే ఉన్నాడా, అతనికి ఏమైంది, ఈ ప్రయాణంలో బూంగ్‌కు ఎదురైన అనుభవాలేమిటనేది లక్ష్మీప్రియదేవి ఆసక్తికరంగా, గుండె చలించేలా చిత్రించారు.

ఇది ఒక రకంగా లక్ష్మీప్రియదేవికి బాగా తెలిసిన కథ. తన బాల్యంలో చుట్టూ ఉన్న పరిస్థితులే బూంగ్‌ కథకు అంకురార్పణ చేశాయని అంటారు లక్ష్మీప్రియదేవి. ఈ చిత్రం తన మణిపుర్‌ జ్ఞాపకాలలోని తీపి చేదు సమ్మేళనంలాంటిది అంటారు. పరాయివారి పట్ల ద్వేషం, మతవిద్వేషం, వేర్పాటువాదం వంటి అనేక సమస్యలను ‘బూంగ్‌’ కథలో స్పృశించారు. ఇందులోని మెయిటీ బాలుడి పాత్రను కుకీ–జో వర్గానికి చెందిన గుగున్‌ కిప్జెన్‌ పోషించాడు.

మణిపూర్‌లో శాంతి తిరిగి రావాలి.. దర్శకురాలు ఎమోషనల్‌
అవార్డు గెలుచుకున్న తర్వాత దర్శకురాలు దేవి తన ప్రసంగంలో ఎమోషనల్‌ అయ్యారు. తాము తెరకెక్కించిన బూంగ్‌ మూవీ ఇంతటి కీర్తిని తీసుకొస్తుందని ఊహించలేదని తెలిపారు. 'మా  చిన్న చిత్రానికి ఇంత పెద్ద ప్రేమను అందించినందుకు జ్యూరీ సభ్యులకు,  BAFTAకి ధన్యవాదాలు. భారతదేశంలో, నా మాతృభూమి  మణిపూర్‌లో చాలా సమస్యాత్మకమైన అంశాలు ఉన్నాయి. వాటిని అధిగమించి సినిమాను తీశాం.  ప్రాతినిధ్యం లేని ప్రదేశంలో పాతుకుపోయిన చిత్రం బూంగ్‌. మణిపూర్‌లో శాంతి తిరిగి రావాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. సినిమాలోని బాల నటులతో సహా మా మణిపూర్‌ పిల్లలందరూ తమ ఆనందాన్ని, వారి కలలను తిరిగి పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. కాబట్టి, BAFTA, మాకు అవార్డును మాత్రమే కాకుండా, మా ఆశను వ్యక్తీకరించడానికి ఈ వేదికను ఇచ్చినందుకు ధన్యవాదాలు.' అంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement