సంక్రాంతి సినిమాలకు ఓవర్సీస్‌లో అనుకున్నంత రేంజ్‌లో బజ్ లేదని తెలుస్తోంది. చాలా సినిమాలు రేసులో ఉన్నప్పటికీ ప్రీబుకింగ్స్‌లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, జన నాయకన్ ప్రీమియర్స్ అడ్వాన్స్ టికెట్‌లు ఓపెన్ చేశారు. కానీ, ట్రేడ్ వర్గాలు అంచనా వేసినంత రేంజ్‌లో ముందస్తు బుకింగ్స్ జరగడం లేదు.
జనవరి 8న ది రాజా సాబ్‌తో పాటు జన నాయకన్ ప్రీమియర్‌లలో విడుదల కానుంది. ఆపై జనవరి 11న మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్స్‌లోకి రానున్నాడు. వీటిలో ది రాజా సాబ్ 342 ప్రదేశాలలో 1,021 స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. అయితే, ఇప్పటికీ కూడా కేవలం 3లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, ప్రభాస్ నటించిన మునుపటి చిత్రాలు కల్కి, సలార్ చిత్రాలు వరుసగా 4 మిలియన్లు, 2.5 మిలియన్ల కలెక్షన్స్ ప్రీమియర్ బుకింగ్‌ల ద్వారానే వచ్చాయి. కానీ, రాజా సాబ్‌కు అలాంటి పరిస్థితి లేదు. విడుదలకు మరో ఆరురోజులు మాత్రమే వుంది.
దీంతో కనీసం 1 మిలియన్ మార్క్ వరకు చేరుకోవడమే కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓవర్సీస్‌లో 119 ప్రదేశాలలో 423 స్క్రీన్స్‌లకు సంబంధించిన టికెట్లు ఓపెన్ అయ్యాయి. అయితే, ఇప్పటికి లక్ష డాలర్లు మాత్రమే వసూలు చేసి.. 4వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో జన నాయగన్ మూవీతో విజయ్ దూసుకుపోతున్నాడు. తన నటించే చివరి సినిమా కావడంతో ఓవర్సీస్‌లో ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటింది.
కారణాలు ఇవే..
సంక్రాంతి సినిమాల అమెరికా ప్రీమియర్ ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణాలు సినిమాలపై మిశ్రమ అంచనాలు ఉండటమేనని చెబుతున్నారు. ఆపై టికెట్ ధరలు పెరగడం, ప్రమోషన్లలో పెద్దగా జోరు చూపించకపోవడం ఆపై పెద్ద స్టార్ సినిమాలు ఉన్నప్పటికీ, ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులను బలంగా ఆకర్షించలేకపోయాయి. ఒక్కో టికెట్ ధర 30 డాలర్లకు (2,700) మించే ఉండటంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వెనుకడుగు వేస్తున్నారు. మొత్తం మీద, అమెరికాలో సంక్రాంతి సినిమాల ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి మార్కెట్ పరిస్థితులతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా ప్రభావం చూపాయి.


