ఇప్పుడు తెలుగు ప్రేక్షక సమూహం హుషారుగా హుక్ స్టెప్పులేస్తోంది. మెగా నృత్యాల హోరును అనుసరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు గా తమని పలకరించేందుకు హుక్ స్టెప్పులు వేసుకుంటూ వస్తుండడంతో తెలుగు నాట హుక్ స్టెప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మరి ఇంతకీ ఈ హుక్ స్టెప్ ఏమిటి? దీనికి మన దేశంలో పాప్యులారిటీ ఎలా పెరిగింది?
‘హుక్ స్టెప్ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే ఓ నృత్యం.. సులభంగా కనిపించాలి. అందరూ నేర్చుకునేలా ప్రేరేపించాలి ‘ అని బాలీవుడ్‌లో తౌబా తౌబా అనే పాటకు నృత్యంతో వైరల్ అయి సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ చెబుతున్నాడు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నర్తించిన బ్యాడ్ న్యూజ్‌లోని తౌబా తౌబా పాట స్టెప్స్ ‘ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేస్తారు. ఆ పాట హిట్‌తో‘ హుక్ స్టెప్‌ను కొరియోగ్రాఫ్ చేయడం ఇప్పుడు తన నృత్య ప్రక్రియలో ఒక భాగమైందని ఆయన చెప్పాడు.
పెరిగిన కొరియోగ్రాఫర్ ప్రాధాన్యత...
‘హుక్ స్టెప్ కు పెరుగుతున్న ప్రజాదరణ కొరియోగ్రాఫర్‌లను మరింత పాప్యులర్ చేసింది. హుక్ స్టెప్ గొప్పతనం ఏమిటంటే దాని చుట్టూ అల్లుకునే సందడిలో స్టార్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తారని అది తమకు చాలా ఉపయుక్తమైన అంశమని కొరియోగ్రాఫర్లు అంటున్నారు. నృత్యం అత్యంత ప్రజాదరణ పొందాడానికి దోహదపడేది సౌలభ్యం మాత్రమే ‘ప్రతి వ్యక్తి పుట్టుకతోనే డ్యాన్సర్ కాదు. మైఖేల్ జాక్సన్ లేదా ప్రభుదేవా లాగా అందరూ నృత్యం చేయలేరు. అవి ప్రజలు చూసి బాగున్నాయంటారు. కానీ అవి సులభమైనవైతే అవి మరింత హిట్ కావడం తధ్యం ఎందుకంటే వాటిని అనుసరించడం సులభం అని వారు భావిస్తారు అలాంటివే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి
‘‘ నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు, ప్రభుదేవా లాంటి డ్యాన్స్‌లు అందివ్వాలని అనుకున్నా కానీ ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారాయని బోస్కో చెప్పాడు. ‘నువ్వు ఎందుకు అంత కష్టతరమైన పని చేయమని చెబుతున్నావు? దానికన్నా సులభమైన స్టెప్పులు ఎందుకు చేయించకూడదు‘ అని చాలా మంది తనతో అన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.
హుక్...హిస్టరీ...
దీని గురించి బాలీవుడ్ మరో కొరియోగ్రాఫర్ ముదస్సర్ ఖాన్ మాట్లాడుతూ, హుక్ స్టెప్పు ప్రజాదరణ ‘సల్మాన్ ఖాన్, గోవింద మాధురీ దీక్షిత్ వంటి నటులతో ప్రారంభమైందన్నాడు. వారికి వారికంటూ స్వంత ప్రత్యేకమైన నృత్య శైలులు ఉన్నాయి‘ అని చెప్పారు. వారి నృత్యాలు పాప్యులర్ అవడానికి కారణం గుర్తించిన దగ్గర నుంచీ తాను తన కొరియోగ్రఫీ వర్క్‌లో హుక్ స్టెప్పును కూడా చేర్చుకున్నానని ఖాన్ చెప్పాడు.
‘నేను సల్మాన్ ఖాన్కు మొదటిసారి కొరియోగ్రఫీ సీక్వెన్స్ చూపించడానికి వెళ్ళినప్పుడు, ఆయన కష్టమైన నృత్యాలను ఇష్టపడతాడని అనుకున్నాను. కానీ ఆయనకు హుక్ స్టెప్పు అన్నింటికంటే నచ్చింది.‘ అంటూ గుర్తు చేసుకున్నారాయన. ఒక సన్నివేశాన్ని కొరియోగ్రఫీ చేయడంతో పాటు వైరల్‌గా మార్చడం కూడా ఇప్పుడు తమ పనిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఖాన్ అన్నారు. హుక్ స్టెప్‌ను రూపొందించడానికి ఏదైనా ఫార్ములా ఉందా అని అడిగితే.... ‘‘ తల గోకడం నుంచీ షూలేసులు కట్టుకోవడం దాకా బెల్ట్ బిగించడం నుంచి కర్టెన్లు సరిచేయడం దాకా...ప్రజలు తమ దైనందిన జీవితంలో చేసే రొటీన్ పనులనే సంగీతంతో కూడిన నృత్యంగా మార్చగలిగితే అదే హుక్ స్టెప్’’ అన్నారాయన. ‘‘సంగీతం కూడా హుక్ స్టెప్ కు థీటుగా ఆకర్షణీయంగా ఉండాలి. సంగీతం యావరేజ్‌గా ఉంటే, ఎంత మంచి హుక్ స్టెప్ వేసినా, అది ఆకర్షణీయంగా మారదు. సంగీతం కొరియోగ్రఫీతో కలిసిపోవడం వల్లనే హుక్ స్టెప్ ప్రజాదరణ పొందుతుంది అని అభిప్రాయపడ్డారు.
హుక్ స్టెప్‌లు దశాబ్దాల క్రితమే ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇప్పుడు వాటి శైలి, అవసరం చాలా మారిపోయిందని కొరియోగ్రాఫర్ పునీత్ జె పాఠక్ చెప్పారు. ‘‘గతంలో పెద్దా చిన్నా తేడా లేకుండా వేడుకలలో నృత్యం చేయగలిగే లాంటి హుక్ స్టెప్‌ను తయారు చేయండి’ అని అడిగేవారు అయితే ఇప్పుడు ఇన్ స్ట్రాగామ్‌లో, రీల్స్‌లో ఉంచే హుక్ స్టెప్‌ను తయారు చేసి దానిని వైరల్ చేయడం ముఖ్యంగా మారిందని అన్నారాయన. గతంలో ఇది ప్రేక్షకుల ఇళ్లకు చేరుకోవడం గురించిన ఆలోచన ఉండేది అయితే ఇప్పుడు వారి ఫోన్‌లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటూ పేర్కొన్నారు.
అయితే రీల్స్ ఆధారిత హుక్ స్టెప్స్ డ్యాన్స్ సీక్వెన్స్ల వైరల్‌లో ఉన్న సమస్య వైరల్ అనేది స్వల్ప కాలానికే పరిమితం కావడం అని పాథక్ అన్నారు. ‘గతంలో ’తౌబా తౌబా’ వైరల్ అయింది. దానికి వారం క్రితం ఇంకేదో వైరలైంది. అయితే స్టెప్స్ వైరల్ అవుతున్నాయి కానీ ఐకానిక్‌గా ఉండడం లేదు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘హుక్ స్టెప్ సవాళ్లలో పాల్గొనడానికి ఇష్టపడతాను అవి సరదాగా ఉంటాయి, అవి నా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి నాకు సహాయపడతాయి నా డ్యాన్స్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాయి. ‘అంతేకాకుండా, అవి నాకు ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, తాజా సోషల్ మీడియా సందడిలో నన్ను భాగంగా మారుస్తాయి’’ అని కంటెంట్ క్రియేటర్ వృషికా మెహతా చెప్పింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్‌గా, తాను ఈ హుక్ స్టెప్‌లను ప్రదర్శించడం ద్వారా సినిమాలను ప్రమోట్ చేస్తాననీ వాటిని నా ప్రేక్షకులతో పంచుకుని వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహిస్తానని ఆమె వివరించింది.
ఇటీవలి కాలంలో కొన్ని హుక్ హిట్స్...
ఈ మధ్య కాలంలో వైరల్ అయిన హుక్ స్టెప్స్‌లో జాదు‘ (జ్యుయల్ థీఫ్) పాటలో జైదీప్ అహ్లావత్ చేసిన నృత్యం, అలాగే ‘తౌబా తౌబా‘ (బాడ్ న్యూజ్): విక్కీ కౌశల్ మూవ్ మెంట్స్ , ‘జనాబ్–ఎ–ఆలీ‘ (వార్ 2) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో హృతిక్ రోషన్ వేసిన స్టెప్పులు అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే ‘పెహ్లా తు దుజా తు‘ ( సన్ ఆఫ్ సర్దార్ 2) పాటలో అజయ్ దేవగన్ స్టైల్ వైరల్ కాగా,‘ఝూమ్ షరాబీ‘ (దే దే ప్యార్ దే 2)లో కూడా అజయ్ దేవగన్ మళ్లీ గ్లాస్‌తో వైరల్ స్టెప్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో ‘హుక్ స్టెప్‘ (మన శంకర వరప్రసాద్ గారు): చిరంజీవి స్టెప్స్ తోడయ్యాయి.


