ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే వెల్లడించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెరిట్స్ ఉంటే సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని చెబుతూ అప్పీల్‌లో విచారణ ముగించారు.
(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)
రీసెంట్‌గా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజులు ముందే ఉండాలని మధ్యంతర ఉత్తర్వులివ్వడంతోపాటు షైన్ స్క్రీన్ ఇండియా ఎల్‌ఎల్‌పీకి నోటీసులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత షైన్ స్క్రీన్ ఇండియా ఎల్‌ఎల్‌పీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం.. మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. ఆ పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతున్నందున అక్కడే వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ ఎదురైంది.
(ఇదీ చదవండి: అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!సాయిపల్లవితో ప్రభాస్)


